Ifrah Fatima, Mounika Wadiwala: ఇద్దరు వందయ్యారు | dr Ibrahim Fatima, Osmania, dr Mounika Wadiwala starts online treetnent | Sakshi
Sakshi News home page

Ifrah Fatima, Mounika Wadiwala: ఇద్దరు వందయ్యారు

Published Tue, Jun 8 2021 5:44 AM | Last Updated on Tue, Jun 8 2021 10:30 AM

dr Ibrahim Fatima, Osmania, dr Mounika Wadiwala starts online treetnent - Sakshi

డాక్టర్‌ ఇఫ్రాహ్‌ ఫాతిమా, ఉస్మానియా హాస్పిటల్‌లో ఎంబీబీఎస్‌ చేసింది. ఆమె స్నేహితురాలు డాక్టర్‌ మౌనిక వడియాల. తను కూడా ఎంబీబీఎస్‌ పూర్తి చేసి పీజీ కోసం అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉంది. అప్పుడొచ్చింది కరోనా. ప్రపంచం మొత్తం భయవిహ్వలమై పోయింది. ఒంట్లో ఏ రకమైన నలత వచ్చినా ‘ఇది కరోనా లక్షణమేమో’ లని బెంబేలు పడిపోతున్నారు జనం. మొదటి వేవ్‌ కంటే రెండో వేవ్‌ ఉధృతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫ్యామిలీ డాక్టర్‌ల క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు కిటకిటలాడిపోతున్నాయి. డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ దొరక్క ఒక హాస్పిటల్‌ నుంచి మరో హాస్పిటల్‌కు పరుగులు తీస్తున్నారు పేషెంట్‌లు. తేలికపాటి లక్షణాలున్న పేషెంట్‌లకు నర్సింగ్‌ స్టాఫ్‌తో సర్వీస్‌ ఇప్పిస్తే పేషెంట్‌లకు సంతృప్తి ఉండడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే డాక్టర్లకు ప్రజలకు మధ్య పెద్ద దూరం పెరుగుతుందనిపించింది. ఆ దూరాన్ని తగ్గించడానికి ఒక వారధిగా పనిచేయాలనుకున్నారు. ఈ యువ డాక్టర్లిద్దరికీ అప్పుడు వచ్చిందో ఆలోచన. వెంటనే ఆన్‌లైన్‌ వైద్యానికి శ్రీకారం చుట్టారు.

ఈ వైద్యానికి ఫీజు లేదు!
ఇఫ్రాహ్, మౌనికలు తమ ఆలోచనను స్నేహితులందరికీ చెప్పారు. విన్నవాళ్లలో దాదాపుగా అందరూ కరోనా పేషెంట్‌లకు ఉచితంగా వైద్యం చేయడానికి ముందుకు వచ్చారు. మొదటగా ఏప్రిల్‌ నెలలో 24 మంది డాక్టర్లతో ఒక బృందం తయారైంది. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు సమయాన్ని ఒక్కొక్క స్లాట్‌ రెండు గంటల చొప్పున ఆరు స్లాట్‌లుగా విభజించుకున్నారు. ప్రతి టైమ్‌ స్లాట్‌లో నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉండేటట్లు చూసుకున్నారు. డాక్టర్ల పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఏ సమయంలో ఏ డాక్టర్‌లను సంప్రదించాలి... వంటి వివరాలతో ఒక పట్టిక తయారు చేశారు. ఈ పట్టికను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అనూహ్యమైన స్పందన వచ్చింది.

రెండు గంటల స్లాట్‌లో యాభై నుంచి అరవై ఫోన్‌ కాల్స్‌ మాట్లాడేటంతటి రష్‌. డాక్టర్లు ఇచ్చిన సర్వీస్‌ చాలా సులువైనదే. అయితే హాస్పిటల్‌లో డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ దొరకని క్లిష్టమైన సమయంలో వీరి సేవ పేషెంట్‌లను సేదదీర్చే చల్లని చిరుజల్లయింది. పేషెంట్‌లు చెప్పిన లక్షణాల ఆధారంగా కరోనా తీవ్రతను గ్రహించి అవసరమైన మందులను, ఆహారాన్ని సూచించేవారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పేవారు. తేలికపాటి లక్షణాలకు హాస్పిటల్‌లో అడ్మిట్‌ కావాల్సిన అవసరం లేదని, హోమ్‌ క్వారంటైన్‌ పాటించమని ధైర్యం చెప్పేవారు. అలాగే ఎలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ ను స్వయంగా సంప్రదించాల్సి ఉంటుందో కూడా వివరించారు. ఈ సర్వీస్‌లో కొంతమంది డాక్టర్లు ఫోన్‌లో మాట్లాడితే మరికొంతమంది వాట్సప్‌ చాట్‌ ద్వారా పేషెంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు.

వందమందికి చేరింది!
ఇఫ్రాహ్, మౌనిక ప్రారంభించిన ఫ్రీ మెడికల్‌ సర్వీస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వీళ్ల పోస్టులను ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ, బాలీవుడ్‌ నటి కొంకణాసేన్‌లు కూడా షేర్‌ చేశారు. దేశం నలుమూలల నుంచి ఫోన్‌ కాల్స్‌ రావడం మొదలైంది. దాంతో డాక్టర్ల సంఖ్యను 24 నుంచి యాభైకి, మే ఒకటి నాటికి యాభై నుంచి వందమందికి పెంచుకున్నారు. ఒక్కో స్లాట్‌లో ఎనిమిది నుంచి పది మంది డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. మొత్తంగా ఈ మెడికల్‌ సర్వీస్‌ నెట్‌వర్క్‌లో దేశవిదేశాల్లో ఉన్న డాక్టర్‌ మిత్రులందరినీ భాగస్వాములను చేయగలిగారు ఇఫ్రాహ్, మౌనిక. అలాగే సర్వీస్‌ టైమ్‌ కూడా ఉదయం ఎనిమిది నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు విస్తరించారు. రాను రాను కరోనా భయం శారీరకం నుంచి మానసిక సమస్యలకు దారి తీయడాన్ని గమనించి... హైదరాబాద్, ఎర్రగడ్డ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ డాక్టర్లు కూడా ఈ మెడికల్‌ సర్వీస్‌లో పాలుపంచుకున్నారు. ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల కోసం యూఎస్, జర్మనీ, ఆస్ట్రేలియా, దుబాయ్‌లో ఉంటున్న వాళ్లు కూడా ఫోన్‌ చేస్తున్నారు.

డాక్టర్‌ ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలోనే!
నిజంగా అవసరమైన టెస్టులేవో, అవసరం లేని టెస్టులేవో పేషెంట్‌లకు తెలియదు. కార్పొరేట్‌ హాస్పిటల్‌ సిబ్బంది ఒక లిస్ట్‌ ఇచ్చి ‘ఈ పరీక్షలు చేయించుకుని రండి’ అని మాత్రమే చెప్తారు. మరోమాట మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఒక తుమ్ము వచ్చినా, చిన్నపాటి దగ్గు వచ్చినా, ఒళ్లు వెచ్చబడినా భయంతో వణికిపోవాల్సిన దుస్థితి రాజ్యమేలుతున్న సమయంలో, డాక్టర్ల మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న తరుణంలో ఈ యువ డాక్టర్లు చేస్తున్న మంచిపని వైద్యరంగం మీద గౌరవాన్ని పెంచుతోంది.
 

ఒక్కొక్కరికి రెండు వేల ఫోన్‌ కాల్స్‌!
మాకు రెండు గంటల స్లాట్‌లో యాభై నుంచి అరవై ఫోన్‌ కాల్స్‌ వచ్చేవి. ఈ యాభై రోజుల్లో మా టీమ్‌ డాక్టర్లు సరాసరిన ఒక్కొక్కరు రెండు వేల మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఉంటారు. మా ప్రయత్నంలో ప్రధానమైన ఉద్దేశం మా తోటి వైద్యుల మీద పెరుగుతున్న ఒత్తిడి తగ్గించడానికి మా వంతు సహకారం అందించడం. పేషెంట్‌లతో అనునయంగా మాట్లాడి, ‘ఏం ఫర్వాలేదు, ఈ రోగాన్ని జయించగలం’ అనే ధైర్యాన్ని కల్పించడం. అదేవిధంగా అవసరం ఉన్నా లేకపోయినా హాస్పిటల్‌కు వెళ్లడాన్ని నివారించడం కూడా. తేలికపాటి లక్షణాలున్న పేషెంట్‌లు హాస్పిటల్‌కు వెళ్తే అక్కడ తీవ్ర లక్షణాలున్న పేషెంట్‌లతో మెలగడం ద్వారా వీరిలో కూడా వ్యాధి తీవ్రత పెరిగే ప్రమాదం ఎక్కువ. అలాంటి అనర్థాలను నివారించడానికి మా వంతుగా కృషి చేశాం. ఈ ప్రయత్నంలో కలిసి వచ్చిన డాక్టర్లందరూ తొలిరోజు నుంచి ఇప్పటి వరకు అదే అంకితభావంతో పని చేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞత లు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో మాకు ఫోన్‌ కాల్స్‌ కూడా బాగా తగ్గాయి.
– డాక్టర్‌ ఇఫ్రాహ్‌ ఫాతిమా, డాక్టర్‌ మౌనిక వడియాల

– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement