online treatment
-
Ifrah Fatima, Mounika Wadiwala: ఇద్దరు వందయ్యారు
డాక్టర్ ఇఫ్రాహ్ ఫాతిమా, ఉస్మానియా హాస్పిటల్లో ఎంబీబీఎస్ చేసింది. ఆమె స్నేహితురాలు డాక్టర్ మౌనిక వడియాల. తను కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ కోసం అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉంది. అప్పుడొచ్చింది కరోనా. ప్రపంచం మొత్తం భయవిహ్వలమై పోయింది. ఒంట్లో ఏ రకమైన నలత వచ్చినా ‘ఇది కరోనా లక్షణమేమో’ లని బెంబేలు పడిపోతున్నారు జనం. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ఉధృతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫ్యామిలీ డాక్టర్ల క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు కిటకిటలాడిపోతున్నాయి. డాక్టర్ అపాయింట్మెంట్ దొరక్క ఒక హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్‌కు పరుగులు తీస్తున్నారు పేషెంట్లు. తేలికపాటి లక్షణాలున్న పేషెంట్లకు నర్సింగ్ స్టాఫ్‌తో సర్వీస్ ఇప్పిస్తే పేషెంట్లకు సంతృప్తి ఉండడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే డాక్టర్లకు ప్రజలకు మధ్య పెద్ద దూరం పెరుగుతుందనిపించింది. ఆ దూరాన్ని తగ్గించడానికి ఒక వారధిగా పనిచేయాలనుకున్నారు. ఈ యువ డాక్టర్లిద్దరికీ అప్పుడు వచ్చిందో ఆలోచన. వెంటనే ఆన్లైన్ వైద్యానికి శ్రీకారం చుట్టారు. ఈ వైద్యానికి ఫీజు లేదు! ఇఫ్రాహ్, మౌనికలు తమ ఆలోచనను స్నేహితులందరికీ చెప్పారు. విన్నవాళ్లలో దాదాపుగా అందరూ కరోనా పేషెంట్లకు ఉచితంగా వైద్యం చేయడానికి ముందుకు వచ్చారు. మొదటగా ఏప్రిల్ నెలలో 24 మంది డాక్టర్లతో ఒక బృందం తయారైంది. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు సమయాన్ని ఒక్కొక్క స్లాట్ రెండు గంటల చొప్పున ఆరు స్లాట్లుగా విభజించుకున్నారు. ప్రతి టైమ్ స్లాట్‌లో నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉండేటట్లు చూసుకున్నారు. డాక్టర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఏ సమయంలో ఏ డాక్టర్లను సంప్రదించాలి... వంటి వివరాలతో ఒక పట్టిక తయారు చేశారు. ఈ పట్టికను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. రెండు గంటల స్లాట్‌లో యాభై నుంచి అరవై ఫోన్ కాల్స్ మాట్లాడేటంతటి రష్. డాక్టర్లు ఇచ్చిన సర్వీస్ చాలా సులువైనదే. అయితే హాస్పిటల్లో డాక్టర్ అపాయింట్మెంట్ దొరకని క్లిష్టమైన సమయంలో వీరి సేవ పేషెంట్లను సేదదీర్చే చల్లని చిరుజల్లయింది. పేషెంట్లు చెప్పిన లక్షణాల ఆధారంగా కరోనా తీవ్రతను గ్రహించి అవసరమైన మందులను, ఆహారాన్ని సూచించేవారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పేవారు. తేలికపాటి లక్షణాలకు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదని, హోమ్ క్వారంటైన్ పాటించమని ధైర్యం చెప్పేవారు. అలాగే ఎలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను స్వయంగా సంప్రదించాల్సి ఉంటుందో కూడా వివరించారు. ఈ సర్వీస్‌లో కొంతమంది డాక్టర్లు ఫోన్లో మాట్లాడితే మరికొంతమంది వాట్సప్ చాట్ ద్వారా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. వందమందికి చేరింది! ఇఫ్రాహ్, మౌనిక ప్రారంభించిన ఫ్రీ మెడికల్ సర్వీస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీళ్ల పోస్టులను ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ, బాలీవుడ్ నటి కొంకణాసేన్‌లు కూడా షేర్ చేశారు. దేశం నలుమూలల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. దాంతో డాక్టర్ల సంఖ్యను 24 నుంచి యాభైకి, మే ఒకటి నాటికి యాభై నుంచి వందమందికి పెంచుకున్నారు. ఒక్కో స్లాట్‌లో ఎనిమిది నుంచి పది మంది డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. మొత్తంగా ఈ మెడికల్ సర్వీస్ నెట్‌వర్క్‌లో దేశవిదేశాల్లో ఉన్న డాక్టర్ మిత్రులందరినీ భాగస్వాములను చేయగలిగారు ఇఫ్రాహ్, మౌనిక. అలాగే సర్వీస్ టైమ్ కూడా ఉదయం ఎనిమిది నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు విస్తరించారు. రాను రాను కరోనా భయం శారీరకం నుంచి మానసిక సమస్యలకు దారి తీయడాన్ని గమనించి... హైదరాబాద్, ఎర్రగడ్డ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డాక్టర్లు కూడా ఈ మెడికల్ సర్వీస్‌లో పాలుపంచుకున్నారు. ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల కోసం యూఎస్, జర్మనీ, ఆస్ట్రేలియా, దుబాయ్‌లో ఉంటున్న వాళ్లు కూడా ఫోన్ చేస్తున్నారు. డాక్టర్ ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే! నిజంగా అవసరమైన టెస్టులేవో, అవసరం లేని టెస్టులేవో పేషెంట్లకు తెలియదు. కార్పొరేట్ హాస్పిటల్ సిబ్బంది ఒక లిస్ట్ ఇచ్చి ‘ఈ పరీక్షలు చేయించుకుని రండి’ అని మాత్రమే చెప్తారు. మరోమాట మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఒక తుమ్ము వచ్చినా, చిన్నపాటి దగ్గు వచ్చినా, ఒళ్లు వెచ్చబడినా భయంతో వణికిపోవాల్సిన దుస్థితి రాజ్యమేలుతున్న సమయంలో, డాక్టర్ల మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న తరుణంలో ఈ యువ డాక్టర్లు చేస్తున్న మంచిపని వైద్యరంగం మీద గౌరవాన్ని పెంచుతోంది. ఒక్కొక్కరికి రెండు వేల ఫోన్ కాల్స్! మాకు రెండు గంటల స్లాట్‌లో యాభై నుంచి అరవై ఫోన్ కాల్స్ వచ్చేవి. ఈ యాభై రోజుల్లో మా టీమ్ డాక్టర్లు సరాసరిన ఒక్కొక్కరు రెండు వేల మందికి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటారు. మా ప్రయత్నంలో ప్రధానమైన ఉద్దేశం మా తోటి వైద్యుల మీద పెరుగుతున్న ఒత్తిడి తగ్గించడానికి మా వంతు సహకారం అందించడం. పేషెంట్లతో అనునయంగా మాట్లాడి, ‘ఏం ఫర్వాలేదు, ఈ రోగాన్ని జయించగలం’ అనే ధైర్యాన్ని కల్పించడం. అదేవిధంగా అవసరం ఉన్నా లేకపోయినా హాస్పిటల్‌కు వెళ్లడాన్ని నివారించడం కూడా. తేలికపాటి లక్షణాలున్న పేషెంట్లు హాస్పిటల్‌కు వెళ్తే అక్కడ తీవ్ర లక్షణాలున్న పేషెంట్లతో మెలగడం ద్వారా వీరిలో కూడా వ్యాధి తీవ్రత పెరిగే ప్రమాదం ఎక్కువ. అలాంటి అనర్థాలను నివారించడానికి మా వంతుగా కృషి చేశాం. ఈ ప్రయత్నంలో కలిసి వచ్చిన డాక్టర్లందరూ తొలిరోజు నుంచి ఇప్పటి వరకు అదే అంకితభావంతో పని చేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞత లు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో మాకు ఫోన్ కాల్స్ కూడా బాగా తగ్గాయి. – డాక్టర్ ఇఫ్రాహ్ ఫాతిమా, డాక్టర్ మౌనిక వడియాల – వాకా మంజులారెడ్డి -
Online Doctor Consultation: ఆన్లైన్ వైద్యానికి డిమాండ్
సాక్షి, విజయవాడ: ప్రైవేట్ వైద్యులు ఆన్లైన్ కన్సల్టేషన్ బాటపట్టారు. కోవిడ్, ఇతర రుగ్మతల బారిన పడిన వారికి ఫోన్, వాట్సప్ ద్వారా చికిత్సలను సూచిస్తున్నారు. కొందరు వైద్యులు ఆస్పత్రులు తెరుస్తున్నా రోగుల్ని 6 అడుగుల దూరం నుంచే పరిశీలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కారణంగా చాలామంది రోగులు ఆస్పత్రులకు వెళ్లకుండా ఫోన్ ద్వారానే వైద్యులను సంప్రదించి.. వారు సూచించిన ల్యాబ్ పరీక్షలు చేయించుకుని చికిత్స పొందుతున్నారు. కరోనా స్వల్ప లక్షణాలున్న వారు ఆందోళన చెంది ఆస్పత్రుల్లో బెడ్స్ కోరం తిరగటం కంటే ఆన్లైన్ పద్ధతిలోనే చికిత్స చేయించుకుంటున్నారు. పలువురు వైద్యులు తమ ఫోన్ నంబర్ ఇచ్చి.. డిజిటల్ విధానంలో ఫీజు చెల్లిం చగానే లైన్లోకి వచ్చి రోగికి వైద్య సలహాలు ఇస్తు న్నారు. పరీక్ష నివేదికలను వాట్సప్ ద్వారా రప్పిం చుకుని పరిశీలించి చికిత్స సూచిస్తున్నారు. ఈ విధానం వల్ల వైద్యుడి కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా కన్సల్టేషన్ త్వరగా పూర్తయిపోతోంది. అత్యవసర కేసుల్లో ఈ విధానం పనికిరాదని, అలాంటి వారు ఆన్లైన్ వైద్యం కోసం ప్రయత్నిస్తే ప్రాణాల మీదకు వస్తుందని పలువురు చెబుతున్నారు. లాభాలివీ.. ఆస్పత్రులకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండటం వల్ల పక్క వారికి కరోనా ఉంటే అది మనకు సోకుతుందనే భయం ఉండదు. తేలికపాటి లక్షణాలకే ప్రయాసపడి వెళ్లి వైద్యుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. వైద్యులు రిపోర్టులు చూసి రోగులకు ధైర్యం చెబుతున్నారు. దీనివల్ల తమకు ప్రాణా పాయం లేదనే ధైర్యం రోగుల్లో వస్తోంది. తాము చెప్పదలుచుకున్న విషయాలను ముందుగా రాసుకుని చెప్పడానికి వీలుంటుంది. వైద్యుడు ఫోన్ నంబర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి అత్యవసరమైతే ఫోన్ చేసి సంప్రదించవచ్చు. కరోనా తొలి దశలోనే సాధారణ, మధ్య తరగతి వారికి ఆన్లైన్ వైద్యం అందుబాటులోకి వచ్చింది. అన్ని వేళలా మంచిది కాదు ఆన్లైన్ వైద్యం అన్నివేళలా మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. రోగుల్ని చూసిన తరువాత వైద్యుడు అంచనాకు వచ్చి వైద్యం ప్రారంభించాలి. తొలుత స్వల్ప లక్షణాలు కనిపించినా తరువాత రోగం ముదిరే ప్రమాదం ఉంది. అప్పుడు ఆస్పత్రికి వెళ్లి చేరినా రోగం కంట్రోల్ కాకపోవచ్చు. రోగి తన లక్షణాలన్ని చెప్పలేకపోతే వైద్యడు సరిౖయెన మందు ఇవ్వకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయుక్తం ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ వైద్యం ఉపయుక్తంగా వుంది. అయితే, అన్ని వేళలా ఇది పనిచేయదు. అమెరికాలో టెలీ మెడిసిన్ విధానం ఉంది. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఆన్లైన్ వైద్యంలో అలా జరగడం లేదు. ఈ విధానం ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ మనోజ్‌కుమార్, జనరల్ ఫిజీషియన్, విజయవాడ -
ప్రతీ డాక్టర్‌కు ‘టెలిమెడిసిన్’!
సాక్షి, హైదరాబాద్: వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ఉపక్రమించింది. సాధారణంగా ఆరోగ్య సమస్యలొస్తే డాక్టర్‌ను నేరుగా సంప్రదించి సలహా తీ సుకోవాలి. కానీ డాక్టర్‌ను నేరుగా కలిసే అంశంలో ఎంసీఐ భారీ మార్పులు తీసుకువచ్చింది. డాక్టర్‌తో నేరుగా కాకుండా ఫోన్లో లేదా వీడియో లేదా చాట్ ఆధారంగా ఓపీ సేవలు పొందే వీలు కల్పిస్తోంది. ఈ మేరకు టెలిమెడిసిన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ విధానం ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. పెద్దగా ప్రాచుర్యంలో లేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి డాక్టర్‌కు టెలిమెడిసిన్ సర్టిఫికెట్ కోర్సు ను తప్పనిసరి చేస్తూ ఎంసీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. నీతి ఆయోగ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలను ఎంïసీఐ రూ పొందించగా.. కేంద్రం దీన్ని ఆమోదిస్తూ గెజిట్ విడుదల చేసింది. సులువుగా వైద్య సేవలు.. దేశంలో జనాభా నిష్పత్తికి తగినట్లు వైద్యులు అందుబాటులో లేరు. ఈక్రమంలో వైద్య సేవలను సామాన్యులకు అందించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ కేంద్రం టెలిమెడిసిన్‌ను ప్రవేశపెట్టింది. కరోనా వైరస్ ప్ర భావంతో గత 3 నెలలుగా మెజారిటీ క్లినిక్‌లు మూతపడ్డాయి. కొన్నిచోట్ల డాక్టర్లు ఓపీ చూస్తున్నా.. పరిమితంగా సేవలు అందించడంతో చాలా మంది అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం టెలీమెడిసిన్ విధానాన్ని ప్రతి ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్)కి తప్పనిసరి చేసింది. వైద్య విద్య పూర్తి చేసి ప్రాక్టీస్ పెట్టుకున్న ప్రతి డాక్టర్ ఈ సర్టిఫికెట్ కోర్సు చేయాల్సిందే. ఈ సర్టిఫికెట్ ఆధారంగా రోగితో ఫోన్లో, వీడియోకాల్ ద్వారా లేదా సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ పద్ధతిలో కూడా వైద్య సేవ లు అందించొచ్చు. అలాగే ఆరోగ్య స్థితిని క్రమం తప్ప కుండా ఫాలోఅప్ చేయొచ్చు. ఈ పద్ధ తితో తక్కువ సమ యంలో ఎక్కువ మంది పేషంట్లను చూసే వీలుంటుంది. ఈ టెలిమెడిసిన్ కోర్సుకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ ఇస్తుంది. దాని ఆధారం గా ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహించి అర్హత ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో.. టెలిమెడిసిన్ సర్టిఫికెట్ కోర్సు పర్యవేక్షణకు సంబంధించి ఎంసీఐ ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీ ఏర్పాటుచేసింది. ఆరుగురు సభ్యులు న్న ఈ కమిటీకి డాక్టర్ బీఎన్ గంగాధర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. డాక్టర్ నిఖిల్ థండన్ ఉపాధ్యక్షుడిగా, డాక్టర్ మాధురి కనిత్కర్, డాక్టర్ కేఎస్ శర్మ, డాక్టర్ రాజీవ్ గార్డ్ సభ్యులుగా, డాక్టర్ ఆర్కే వాట్స్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ఈ టెలిమెడిసిన్ కోర్సు అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మరో 12 మంది నిపుణులను కూడా నియమించనుంది. ఈ దిశగా ఎంసీఐ ఆన్లైన్ కోర్సును అభివృద్ధి చేస్తోంది. టెలిమెడిసిన్ చికిత్స, నిర్వహణకు సంబంధించి ఎంసీఐ పలు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నో మార్గాలు.. టెలిమెడిసిన్ విధానంలో రోగులకు సౌకర్యాన్ని బట్టి చికిత్స, సమాచారం ఇవ్వొచ్చని కేంద్ర మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఫోన్, వీడియో, ఆడియో కాల్, వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ హ్యాంగౌట్, స్కైప్, ఈ–మెయిల్ తదితర మాధ్యమాలతో టెలిమెడిసిన్ చికిత్స అందించొచ్చు. టెలిమెడిసిన్ విధానానికి సాధారణ వైద్య సేవలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. -
లాక్డౌన్ వేళ నగరంలోనయా ట్రెండ్..
సాక్షి, సిటీబ్యూరో: ‘హలో డాక్టర్..గత రెండు రోజులుగా నేను..జలుబు తలనొప్పితో బాధపడుతున్నాను. సరైన మందులు సూచించగలరు...ఓ పేషెంట్ వాట్సప్‌టెక్టస్ సందేశం...’‘ఓకే...మీరు రెండురోజుల పాటు ఫలానా యాంటీ బయాటిక్స్ మెడిసిన్స్ వాడండి...అప్పటికీ తగ్గకుంటే..మా క్లినిక్‌కు రండి..డాక్టర్ రిప్లై..’ ఏంటీ చాటింగ్ అనుకుంటున్నారా...? లాక్డౌన్ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఇటీవలి కాలంలో చాటింగ్ ట్రీట్మెంట్ క్రమంగా పెరుగుతోంది. తలనొప్పి..కడుపునొప్పి..మైగ్రేన్...ఒంటినొప్పులు..వైరల్ ఫీవర్..జలుబు తదితర స్వల్పకాలిక అనారోగ్యాలకు మాత్రమే ఇలాంటి ట్రీట్మెంట్ అందుతోంది. ప్రస్తుతం మెజార్టీ సిటీజన్లు ఇళ్లకే పరిమితం కావడంతో ఈ ట్రెండ్ పెరిగింది. ఇందుకోసం నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు సైతం ఫోన్‌కాల్, వాట్సప్, టెలీమెడిసిన్ సేవలు అందించేందుకు ముందుకురావడం విశేషం. అయితే ఇలాంటి వైద్యం నాణ్యతపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ సహా ఇతర మందుల డోసు ఎక్కువైతే ఆరోగ్యానికి బదులు అనారోగ్యాన్ని మూటగట్టుకోక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాటింగ్ ట్రీట్మెంట్ ఇలా... నగర వాసులకు వైద్యసేవలందించేందుకు పలు ఆస్పత్రులు, వైద్యులు, పలువురు ఫిజీషియన్లు, ఇతర స్పెషలిస్ట్ వైద్యులతో ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఐటీ కంపెనీలు సైతం వర్క్‌ఫ్రం హోంకు అనుమతివ్వడంతో ఆయా వైద్యుల నెంబర్లను తమ ఉద్యోగులకు అందజేసి...వారి శారీరక, అనారోగ్య సమస్యలను నేరుగా ఆయా వైద్యులతో చాటింగ్ రూపంలో తెలియజేసే అవకాశం కల్పిస్తున్నారు. నిర్ణీత సమయంలో నిర్ణీత డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇలా చాటింగ్ ట్రీట్మెంట్ అందజేసే వైద్యులకు నెలవారీగా వారి సేవలను బట్టి కంపెనీలు పారితోషికం అందిస్తుండడం విశేషం. పనివేళల్లో స్వల్ప అనారోగ్యానికి గురయ్యే ఉద్యోగి ఆస్పత్రికి వెళ్లి తన పేరు నమోదుచేసుకొని గంటల తరబడి నిరీక్షించి వైద్యున్ని సంప్రదించే సమయం చిక్కనందున ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఇక దీర్ఘకాలిక అనారోగ్యాలు, జీవనశైలి వ్యాధులున్నవారు మాత్రం నేరుగా స్పెషాల్టీ వైద్య సేవల కోసం ఆయా ఆస్పత్రులకు వెళుతున్నట్లు స్పష్టంచేస్తున్నారు. పనిఒత్తిడి అధికమైతే మానసిక వైద్యులను చాటింగ్ ద్వారా సంప్రదించి వత్తిడిని తగ్గించుకునేందుకు అవసరమైన సలహాలు..సూచనలు సైతం తమ ఉద్యోగులు పొందుతున్నట్లు వెల్స్‌ఫార్గో ఐటీ సంస్థ హెచ్ఆర్ విభాగం ప్రతినిధి సత్యలింగం ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం బాగా ఉంటేనే వారి పనిసామర్థ్యం మెరుగుపడుతుందని..కంపెనీ విధించిన టార్గెట్లను ఉద్యోగులు సులభంగా పూర్తిచేసే వీలుంటుందని చెబుతున్నారు. అయితే మరికొన్ని కంపెనీలు విదేశాల్లో ఉన్న వైద్య నిపుణుల సలహాలు, సూచనలను తమ ఉద్యోగులు పొందేందుకు టెలీమెడిసిన్ సేవలను సైతం వినియోగిస్తుండడం గ్రేటర్లో నయా ట్రెండ్‌గా మారింది. కాగా కొందరు ఉద్యోగులకు నేరుగా మెడిసిన్స్ సూచించడం వీలుకానప్పుడు సంబంధిత రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చాటింగ్ ద్వారా సూచిస్తున్నారు. ఆయా రిపోర్టులను సైతం వాట్సప్‌లో వైద్యులకు పంపించిన తరవాత నిర్ణీత మోతాదులో మెడిసిన్స్ సూచిస్తున్నారు. -
అనారోగ్యమా.. అయితే ఫోన్ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలు నిలిచి పోవడంతో ‘ఫోరం ఫర్ పీపుల్స్ హెల్త్ సంస్థ’ ఆన్లైన్లో ఉచిత వైద్య సేవలకు శ్రీకారం చుట్టింది. అందుకోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారైనా హెల్ప్‌లైన్ నెంబర్ : 040–48214595కు ఫోన్ చేస్తే సంబంధిత వైద్యులకు కనెక్ట్ చేస్తారు. తమకున్న సమస్యను డాక్టర్లకు వివరిస్తే ఫోన్లోనే మందులను సూచిస్తారు. అవసరమైతే మందుల చీటీ రాసిచ్చి వాట్సాప్‌లో పెడతారు. ఈ సంస్థ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా దాదాపు 140 మంది వివిధ స్పెషలిస్ట్ వైద్యులు సూచనలు అందిస్తారు. ఇది రేయింబవళ్లు అందుబాటులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా దీన్ని ఉపయోగించుకోవాలని సంస్థ తరపున ఆన్లైన్లో సేవలు అందిస్తున్న డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ సేవలన్నీ ఉచితం గానే ప్రజలకు చేస్తున్నట్లు ఆయన వివరిం చారు. లాక్డౌన్ వల్ల ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజలకు ఇటువంటి సేవలు అందిస్తున్నట్లు ఫోరం తెలిపింది. కొందరు ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఓపీ బంద్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆన్లైన్లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్క రోజులో 275 ఫోన్ కాల్స్... బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ హెల్ప్‌లైన్‌కు ఒక్కరోజులోనే 275 ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఫోన్ చేసిన బాధితులు, రోగులతో దాదాపు 957 నిమిషాలు డాక్టర్లు మాట్లాడి వారికి సూచనలు ఇచ్చారు. మందులు సూచించారు. కొందరికి వాట్సాప్ ద్వారా మందుల చీటీని పంపించారు. సగటున ఒక్కో కాల్‌కు 4 నిమిషాలు వైద్యులు కేటాయించినట్లు రవీంద్రనాథ్ తెలిపారు. మారుమూల గ్రామం నుండి నగరాలు, పట్టణాల వరకు కూడా ప్రజలు ఫోన్లు చేస్తున్నారన్నారు. ప్రధానంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అధికంగా కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. కొందరు వైద్యులు, సాంకేతిక వృత్తినిపుణులు తదితరులతో కలిసి దీన్ని ఏర్పాటు చేశామని జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల ప్రసాద్ తెలిపారు. -
ఆన్లైన్ వైద్యంతో ముప్పు
న్యూఢిల్లీ: పక్క మీది నుంచి లేచి లేవగానే ఒంట్లో నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఓ పక్క ముక్కు కారతూ ఉంటోంది. మరోపక్క తలంతా భారంగా ఉంటుంది. ఏం చేయాలో తోచదు. డాక్టర్ దగ్గరికెళ్లాలంటే అబ్బా! అంతదూరం ఏం వెళతాం అంటూ బద్ధకిస్తాం. వెంటనే పక్కనున్న స్మార్ట్ ఫోన్ అందుకుంటాం. అవసరమనుకున్న యాప్ ఓపెన్ చేస్తాం. ఎక్కడోవున్న డాక్టర్ లైన్లోకి వస్తాడు. మన బాధంతా చెబుతాం. కొద్ది క్షణాల్లోనే ప్రిస్క్రిప్షన్ మన ఫోన్‌కు మిసేజ్ రూపంలో వస్తుంది. డాక్టర్ నయాపైసా ఫీజు తీసుకోడు. వెంటనే మరో యాప్ ఓపెన్ చేస్తాం. ఆన్లైన్ మెడికల్ మార్కెట్‌కు డాక్టరు రాసిన ప్రిస్క్రిప్షన్ పంపిస్తాం. అంతే ఓ అరగంటలో మన ఇంటికి మందులొస్తాయి. ఆహా ఏమీ భాగ్యమూ...సాంకేతిక విప్లవంతో కదలకుండా పనులవుతున్నాయనే సంతోషం. కానీ ఇక్కడే మోసపోతున్నాం. ఫీజులు తీసుకోకుండా ఎంతోమంది ఆన్లైన్ డాక్టర్లు మనకు వైద్య సలహాలు ఇస్తున్నారు. మందులు రాస్తున్నారు. వారేమీ ఫీజు తీసుకోకుండా పనిచేసే సమాజ సేవకులు కాదు. ఆన్లైన్లో మందులు సరఫరా చేసే ఆసాములు వారికి కావాల్సిన వేతనాలు చెల్లిస్తారు. ఈ ఆన్లైన్ మార్కెట్ సంస్థల వద్ద ఏ మందులున్నాయో, ఆ మందులను మాత్రమే సదరు ఆన్లైన్ డాక్టర్ సిఫారసు చేస్తారు. అవి మార్కెట్ సంస్థలకు లాభదాయకమైన మందులు కావచ్చు లేదా నాసిరకం మందులు కావచ్చు. అక్కడితో ఈ మోసం ఆగిపోవడం లేదు. ఆన్లైన్ మార్కెట్ ద్వారా కుప్పతెప్పలుగా కల్తీ మందులు వచ్చి పడుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. లెసైన్స్ పొందిన మెడికల్ షాపుల్లోనే సరైన మందులను విక్రయిస్తున్నారా లేదా? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి చాలినంత మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు లేరు. అలాంటిది అలాంటిది ఆన్లైన్ మార్కెట్ గిడ్డంగులను తరిఖీ చేయడం కష్టం. ప్రస్తుతానికి అలాంటి వ్యవస్థ కూడా లేదని సంబంధిత ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఇటీవల ‘మహారాష్ట్ర పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’కు చెందిన అధికారులు తామే వినియోగదారుల పాత్రలో అన్లైన్ డాక్టర్లను, మందుల మార్కెట్లను సంప్రదించగా ఇలాంటి అవకతవకలు బయటపడ్డాయి. కేవలం లెసైన్స్ పొందిన మందుల షాపులు మాత్రమే విక్రయించాల్సిన 45 రకాల మందులు ఆన్లైన్లో విక్రయిస్తున్న విషయమూ వెలుగుచూసింది. అంతేకాకుండా వాటిలో నకిలీ మందులు కూడా ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా, మందుల నాణ్యత గురించి అవగాహన లేకుండా ఆన్లైన్లో మందులు కొనుగోలు చేయడం హానికరమేనని ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్’లో స్కూల్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ స్టడీస్‌లో డీన్‌గా పనిచేస్తున్న డాక్టర్ టి. సుందరరామన్ హెచ్చరిస్తున్నారు. పూర్తిగా మంచంపట్టి లేవలేని రోగులు, వృద్ధాప్యంతో కదలలేని రోగులకు ఉన్నంతలో ఆన్లైన్ డాక్టర్లు ఉపయోగపడతారుగానీ మిగతావారికి కాదని ఆయన చెబుతున్నారు. ఎప్పుడైనా డాక్టర్‌ను ముఖాముఖి కలుసుకొని వైద్యం చేయించుకోవడమే ఉచితమని ఆయన సలహా ఇస్తున్నారు. మందుల నాణ్యతతోపాటు ఇతర అంశాలపై ‘భారత ఫార్మాసిస్టుల సంఘం’ ఇప్పటికే పలుసార్లు భారత డ్రగ్ కంట్రోలర్‌కు ఫిర్యాదులు చేసింది. మొత్తంగా ఇప్పటికి కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చి కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఈ ఆన్లైన్ వైద్యంపై మార్గదర్శకాలను రూపొందించే కసరత్తులో పడ్డారు. మరి అప్పటివరకు ఈ విధానం ప్రమాదమేకదా!