ఆన్‌లైన్ వైద్యంతో ముప్పు
న్యూఢిల్లీ: పక్క మీది నుంచి లేచి లేవగానే ఒంట్లో నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఓ పక్క ముక్కు కారతూ ఉంటోంది. మరోపక్క తలంతా భారంగా ఉంటుంది. ఏం చేయాలో తోచదు. డాక్టర్ దగ్గరికెళ్లాలంటే అబ్బా! అంతదూరం ఏం వెళతాం అంటూ బద్ధకిస్తాం. వెంటనే పక్కనున్న స్మార్ట్ ఫోన్ అందుకుంటాం. అవసరమనుకున్న యాప్ ఓపెన్ చేస్తాం. ఎక్కడోవున్న డాక్టర్ లైన్‌లోకి వస్తాడు. మన బాధంతా చెబుతాం. కొద్ది క్షణాల్లోనే ప్రిస్క్రిప్షన్ మన ఫోన్‌కు మిసేజ్ రూపంలో వస్తుంది. డాక్టర్ నయాపైసా ఫీజు తీసుకోడు. వెంటనే మరో యాప్ ఓపెన్ చేస్తాం. ఆన్‌లైన్ మెడికల్ మార్కెట్‌కు డాక్టరు రాసిన ప్రిస్క్రిప్షన్ పంపిస్తాం. అంతే ఓ అరగంటలో మన ఇంటికి మందులొస్తాయి. ఆహా ఏమీ భాగ్యమూ...సాంకేతిక విప్లవంతో కదలకుండా పనులవుతున్నాయనే సంతోషం. కానీ ఇక్కడే మోసపోతున్నాం.
ఫీజులు తీసుకోకుండా ఎంతోమంది ఆన్‌లైన్ డాక్టర్లు మనకు వైద్య సలహాలు ఇస్తున్నారు. మందులు రాస్తున్నారు. వారేమీ ఫీజు తీసుకోకుండా పనిచేసే సమాజ సేవకులు కాదు. ఆన్‌లైన్‌లో మందులు సరఫరా చేసే ఆసాములు వారికి కావాల్సిన వేతనాలు చెల్లిస్తారు. ఈ ఆన్‌లైన్ మార్కెట్ సంస్థల వద్ద ఏ మందులున్నాయో, ఆ మందులను మాత్రమే సదరు ఆన్‌లైన్ డాక్టర్ సిఫారసు చేస్తారు. అవి మార్కెట్ సంస్థలకు లాభదాయకమైన మందులు కావచ్చు లేదా నాసిరకం మందులు కావచ్చు. అక్కడితో ఈ మోసం ఆగిపోవడం లేదు. ఆన్‌లైన్ మార్కెట్ ద్వారా కుప్పతెప్పలుగా కల్తీ మందులు వచ్చి పడుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. లెసైన్స్ పొందిన మెడికల్ షాపుల్లోనే సరైన మందులను విక్రయిస్తున్నారా లేదా? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి చాలినంత మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు లేరు. అలాంటిది అలాంటిది ఆన్‌లైన్ మార్కెట్ గిడ్డంగులను తరిఖీ చేయడం కష్టం. ప్రస్తుతానికి అలాంటి వ్యవస్థ కూడా లేదని సంబంధిత ఉన్నతాధికారులే చెబుతున్నారు.
ఇటీవల ‘మహారాష్ట్ర పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’కు చెందిన అధికారులు తామే వినియోగదారుల పాత్రలో అన్‌లైన్ డాక్టర్లను, మందుల మార్కెట్‌లను సంప్రదించగా ఇలాంటి అవకతవకలు బయటపడ్డాయి. కేవలం లెసైన్స్ పొందిన మందుల షాపులు మాత్రమే విక్రయించాల్సిన 45 రకాల మందులు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న విషయమూ వెలుగుచూసింది. అంతేకాకుండా వాటిలో నకిలీ మందులు కూడా ఉన్నాయి.
సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా, మందుల నాణ్యత గురించి అవగాహన లేకుండా ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేయడం హానికరమేనని ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్’లో స్కూల్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ స్టడీస్‌లో డీన్‌గా పనిచేస్తున్న డాక్టర్ టి. సుందరరామన్ హెచ్చరిస్తున్నారు. పూర్తిగా మంచంపట్టి లేవలేని రోగులు, వృద్ధాప్యంతో కదలలేని రోగులకు ఉన్నంతలో ఆన్‌లైన్ డాక్టర్లు ఉపయోగపడతారుగానీ మిగతావారికి కాదని ఆయన చెబుతున్నారు. ఎప్పుడైనా డాక్టర్‌ను ముఖాముఖి కలుసుకొని వైద్యం చేయించుకోవడమే ఉచితమని ఆయన సలహా ఇస్తున్నారు. మందుల నాణ్యతతోపాటు ఇతర అంశాలపై ‘భారత ఫార్మాసిస్టుల సంఘం’ ఇప్పటికే పలుసార్లు భారత డ్రగ్ కంట్రోలర్‌కు ఫిర్యాదులు చేసింది. మొత్తంగా ఇప్పటికి కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చి కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఈ ఆన్‌లైన్ వైద్యంపై మార్గదర్శకాలను రూపొందించే కసరత్తులో పడ్డారు. మరి అప్పటివరకు ఈ విధానం ప్రమాదమేకదా!