సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలు నిలిచి పోవడంతో ‘ఫోరం ఫర్ పీపుల్స్ హెల్త్ సంస్థ’ ఆన్‌లైన్‌లో ఉచిత వైద్య సేవలకు శ్రీకారం చుట్టింది. అందుకోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారైనా హెల్ప్‌లైన్ నెంబర్ : 040–48214595కు ఫోన్ చేస్తే సంబంధిత వైద్యులకు కనెక్ట్ చేస్తారు. తమకున్న సమస్యను డాక్టర్లకు వివరిస్తే ఫోన్‌లోనే మందులను సూచిస్తారు. అవసరమైతే మందుల చీటీ రాసిచ్చి వాట్సాప్‌లో పెడతారు.
ఈ సంస్థ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా దాదాపు 140 మంది వివిధ స్పెషలిస్ట్ వైద్యులు సూచనలు అందిస్తారు. ఇది రేయింబవళ్లు అందుబాటులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా దీన్ని ఉపయోగించుకోవాలని సంస్థ తరపున ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తున్న డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ సేవలన్నీ ఉచితం గానే ప్రజలకు చేస్తున్నట్లు ఆయన వివరిం చారు. లాక్‌డౌన్ వల్ల ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజలకు ఇటువంటి సేవలు అందిస్తున్నట్లు ఫోరం తెలిపింది. కొందరు ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఓపీ బంద్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఒక్క రోజులో 275 ఫోన్ కాల్స్...
బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ హెల్ప్‌లైన్‌కు ఒక్కరోజులోనే 275 ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఫోన్ చేసిన బాధితులు, రోగులతో దాదాపు 957 నిమిషాలు డాక్టర్లు మాట్లాడి వారికి సూచనలు ఇచ్చారు. మందులు సూచించారు. కొందరికి వాట్సాప్ ద్వారా మందుల చీటీని పంపించారు. సగటున ఒక్కో కాల్‌కు 4 నిమిషాలు వైద్యులు కేటాయించినట్లు రవీంద్రనాథ్ తెలిపారు. మారుమూల గ్రామం నుండి నగరాలు, పట్టణాల వరకు కూడా ప్రజలు ఫోన్లు చేస్తున్నారన్నారు. ప్రధానంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అధికంగా కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. కొందరు వైద్యులు, సాంకేతిక వృత్తినిపుణులు తదితరులతో కలిసి దీన్ని ఏర్పాటు చేశామని జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment