విశ్వభాషలందు తెలుగు లెస్స | special story to telugu mahasabhalu | Sakshi
Sakshi News home page

విశ్వభాషలందు తెలుగు లెస్స

Published Wed, Dec 20 2017 1:13 AM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM

special  story to telugu mahasabhalu - Sakshi

‘‘మన తెలంగాణ ఓ రాష్ట్రంగా ఏర్పడటం ఆనందమే, కానీ సముద్రం లేని లోటు కలిచివేస్తోంది. తెలంగాణ తల్లీ.. మేం సముద్రాన్ని ఈ గడ్డ మీద చూడలేమా..?’  ఓ సగటు తెలంగాణ వ్యక్తి ఆవేదన. ఇంతలో కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతిలో తెలంగాణ తల్లి సరస్వతీ దేవి రుపంలో ప్రత్యక్షమైంది. ఈ నేల ఘన చరిత్ర తెలియక ఇలా చింతించటం తగదు. ఓసారి వాస్తవాన్ని గుర్తించు. ప్రపంచ సాహిత్యానికి అమూల్య సేవలందిస్తున్న నీ తేనెలూరు తెలుగు భాష ఔన్నత్యం గ్రహించు. మరే భాషలో లేని సాహితీ ప్రక్రియలకు నెలవైన ఆ మధురభాషకు నీ గడ్డే నెలవు. పద్యం, గద్యం, ప్రబంధం, వచనం, అవధానం, కావ్యం, గ్రంథం... ఇలా తెలుగు తొలి ప్రక్రియ పురుడుపోసుకుంది తెలంగాణ గడ్డమీదే. ఇంత గొప్ప సాహితీసంద్రం ఉండగా సముద్రం వెలితి కనిపిస్తోందా’ అనేసరికి ఆ భాషాభిమానిలో అవధులు లేని ఆనందం...’ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ గా«థ తెలంగాణ తెలుగు వైభవాన్ని చాటింది. ‘మీది అసలైన తెలుగు కాదు, అంతా సంక్రమణే...’ అన్న ఈసడింపులు చెవుల్లో మార్మోగుతుండగా... అసలు తెలుగు, అచ్చమైన తెలుగు పురుడు పోసుకున్నది ఈ మట్టిలోనే అన్న నిజం ఆధారసహితంగా అక్షరమే చాటింపువేసి చూపింది.

మధ్యలో నిజాం నిరంకుశపాలనలో తెలుగు కాస్త మసకబారిందంతే. దానికే మాకు తెలుగు తెలియదంటారా... ఇప్పుడు చూడండి, అసలైన తెలుగు వైభవం పరిఢవిల్లిందిక్కడే అనటానికి సాక్ష్యాలివిగో... సగటు తెలంగాణ తెలుగు భాషాభిమాని ఆనందభరిత తాండవం. ఇంత అద్భుత చరిత్ర ఉన్న ఈ భాషనా అంతరించే తావులో ఉంది... అదెలా సాధ్యం. ఇప్పటి వరకు మేం ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని పాడుకున్నాం, నినాదంగా వాడుకున్నాం. కానీ... ఇదిగో ఇప్పుడే చెప్తున్నాం ఈ ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ లెక్క.... ఇక ‘విశ్వభాషలందు తెలుగు లెస్స’ ఇది భాగ్యనగర వీధిలో ఎక్కడ చూసినా వినిపించిన, కనిపించిన తెలుగు పండగ తెచ్చిన కొత్త ఉత్సాహం. ఐదు వేదికలపై అద్భుత సాహిత్య ఝరి జాలువారింది. ఎటు చూసినా వర్ణమాల అక్షరాలు తీరొక్క రకంగా నర్తించాయి. సాహితీ సభలు, అవధానాలు, కవి సమ్మేళనాలు, బాల, మహిళా ప్రత్యేక భాషా గోష్టులు, సాంస్కృతిక విన్యాసాలు. దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది నోట పలికేది మా భాషనే, ఇప్పటికే ఖండాంతరాలు దాటి తన ప్రాభవానికి ఎల్లలే లేవని నిరూపించిన తెలుగు భాష ఇక విశ్వవిపణిలో కొత్త వెల్లువై ఎగిసి పడుతుందని ఊరుఊరంతా నినదించింది. గతంలో ఎన్నడూ లేని తరహాలో ప్రపంచ తెలుగు మహాసభలు అత్యద్భుతంగా జరిగాయి. ఐదు రోజులపాటు గడపగడపా పండగే తరహాలో సాహితీ వేడుక కొనసాగింది. కేవలం ఉత్సవంలా నిర్వహించుకోవటానికే పరిమితం కాకుండా, వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ మధుర భాష మరికొన్ని తరాలపాటు తెలుగు వారింట నాట్యం చేసే దిశగా అడుగులు పడ్డాయి. సభల నిర్వహణకు కొద్ది రోజుల ముందే... ఒకటి నుంచి పన్నెండు తరగతుల వరకు తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పుడు ప్రతి ఏటా రెండు రోజుల పాటు తెలుగు మహాసభలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. వందల సంఖ్యలో సూచనలు అందినందున వాటిపై భాషావేత్తలతో చర్చించి జనవరిలో విధాన నిర్ణయాలు ప్రకటì స్తాన ని వెల్లడించారు. వెరసి భవిష్యత్తులో ఈ భాషకు తిరుగుండదనే శుభ సంకేతాలు వెలువడటంతో భాషాభిమానులంతా ఉత్సాహంతో సభలకు ముగింపు పలికారు.                                    
– గౌరీభట్ల నరసింహమూర్తి 

►16 వేల మంది ప్రతినిధులు సభలకు హాజరయ్యారు. 1500 మంది కవులు, 500 మంది రచయితలు ఐదురోజుల పండగలో భాగస్వాములయ్యారు.
►100 సదస్సులు జరిగాయి. 20 సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి. 250 కొత్త పుస్తకాలు, భాషలోని వివిధ అంశాలకు సంబంధించి 10 సీడీలు ,
►10 సంచికలు ఆవిష్కరించారు. 

అక్షరాలు అక్కరకొచ్చాయ్‌!

1975 తొలి ప్రపంచ తెలుగు మహాసభలు.. ఎల్బీ స్టేడియం వేదిక.. నిర్మల్‌ సమీపంలోని దిలావర్‌పూర్‌కు చెందిన ఐదో తరగతి విద్యార్థి వీరాభిమన్యు ఏకపాత్రాభినయానికి సిద్ధమయ్యాడు. పద్యాలు రాగయుక్తంగా కంఠస్తం పట్టాడు. కానీ ఆ కార్యక్రమం రద్దు కావటంతో నిరుత్సాహానికి గురయ్యాడు. 2017.. తెలంగాణలో తొలి ప్రపంచ మహాసభలు.. అదే ఎల్బీ స్టేడియం.. పోతన వేదిక.. పాల్కురికి ఖ్యాతి, పోతన భాగవతంలో తేట తెలుగు ప్రయోగం, సుద్దాల హన్మంతు పల్లె సాహిత్యం, గోరటి వెంకన్న దుమ్మురేపే పాటలు.. ఒకటేమిటి భాషను తన నాలికపై ఆడిస్తున్న ఆయన తీరుకు ప్రేక్షకులు, అతిథులు మంత్రముగ్ధులయ్యారు!
అప్పుడు ఏకపాత్రాభినయం చేయలేక ఢీలా పడ్డ ఆ బాలుడే ఇప్పుడు అదే వేదికపై తన భాషా ప్రాభవాన్ని సగర్వంగా ఆవిష్కరించాడు. ఆయనే మడిపల్లి దక్షిణామూర్తి! ఎక్కడ సాహితీ గోష్టి జరిగినా, ప్రభుత్వం నిర్వహించే సభలైనా, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ వేడుకలైనా ఆయన గొంతు వినిపించాల్సిందే. ఆ సభలను తనదైన వ్యాఖ్యానంతో రక్తి కట్టించటం ఆయన ప్రత్యేకత. ప్రస్తుతం ఆయన ఆకాశవాణిలో సీనియర్‌ వ్యాఖ్యాతగా ఉన్నారు. భాషపై అంత పట్టు ఎలా సాధించారో ఆయన మాటల్లోనే...

సాహితీ అభిలాషే గుర్తింపు తెచ్చింది: చిన్నప్పట్నుంచి తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకుని కొంత అవగాహన తెచ్చుకున్నా. మూడో తరగతి నుంచే ఏకపాత్రాభినయం, పుస్తక పఠనం.. ఇలా భాషపై మమకారం పెంచుకున్నా. సహజ కవి అయిన మా తండ్రిగారు, కవి అయిన మా అన్నయ్య, మేనమామల ప్రభావంతో భాషా సాంగత్యం అబ్బింది. సైన్స్‌ విద్యార్థిగా చదువు పూర్తి చేసినా తెలుగు భాషపై అభిమానాన్ని వదులుకోలేదు. వీలైనన్ని పుస్తకాలు, పద్యాలు చదవటంతో తెలుగులో అనర్గళంగా మాట్లాడటం, తప్పుల్లేకుండా చెప్పగలగటం, ఆశువుగా వివిధ అంశాలను వివరించటం అబ్బింది. అందుకే  ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఆకాశవాణి వైపు మళ్లాను. ఓసారి అమెరికాలో ఆటా సభల్లో ఉన్నా. ఇంతలో సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వస్తున్నందున వ్యాఖ్యాతగా మీరే రావాలి’ అని ఆ ఫోన్‌ సారాంశం. దీంతో అమెరికా నుంచి మధ్యలోనే వచ్చేశా. ఇప్పుడు తెలుగు మహాసభల్లో కూడా స్వయంగా సీఎం నా పేరు సూచించారని అధికారులు చెప్పటం సంతోషమనిపించింది.
మడిపల్లి దక్షిణామూర్తి

ప్రపంచ తెలుగు మహాసభల తళుకులు
ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా సాగిన  ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారం ఎల్బీస్టేడియంలో కన్నుల పండువగా ముగిశాయి. సాయంత్రం 6.45 గంటలకు సభ ప్రారంభమైనా  సకాలంలోనే వేడుకలను ముగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. అయితే ఈ మహాసభల ముగింపు సందర్భంగా ఎలాంటి తీర్మానాలు చేయకపోవడం సాహితీప్రియులను ఒకింత అసంతృప్తికి గురి చేసింది. ఇక నుంచి ఏటా ప్రతి డిసెంబర్‌లో రెండు రోజుల పాటు తెలుగు మహాసభలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం కొంత మేరకు ఊరట కలిగించింది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ప్రసంగంలో అక్కడక్కడా దొర్లిన తెలుగు పదాలు, తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించిన మాటలు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగం ఉత్సాహంగా సాగింది. నవ్వులపై  వినిపించిన పద్యం హాయిగా నవ్వించింది.

ఇదీ ముగింపు సభ తీరు
►సాయంత్రం వరకే ఎల్బీస్టేడియం జనంతో నిండిపోయింది. అన్ని వైపులా గ్యాలరీలు, ప్రధాన ఆడిటోరియం కిక్కిరిసిపోయాయి.  
►సాయంత్రం 5.11 గంటల నుంచి 5.28 వరకు దీపికారెడ్డి బృందం ‘తెలంగాణ వైభవం’ నృత్యప్రదర్శన సాగింది. జనం మంత్రముగ్ధులయ్యారు. 
►అనంతరం దీపికారెడ్డితో పాటు, ప్రధాన వేదిక, తోరణాలు రూపొందించిన ప్రముఖ చిత్రకారుడు అంబాజీని, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణలో 1700 కిలోమీటర్‌ల సైకిల్‌ యాత్ర చేసిన నాగరాజును, వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తిని సత్కరించారు.
►సాయంత్రం 5.45 గంటల నుంచి లఘుచిత్రాల ప్రదర్శన ప్రారంభమైంది.  
►సాయంత్రం  6.11 గంటలకు మంగళవాయిద్యాలు, వేదమంత్రో చ్ఛారణలు, పూర్ణకుంభంతో రాష్ట్రపతిని ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్‌ నరసింహన్‌ సాదరంగా వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు.
ఆకట్టుకున్న కేసీఆర్‌ పద్యం...
►సీఎం కేసీఆర్‌ నవ్వుపై వినిపించిన పద్యం సభలో నవ్వుల పువ్వులు పూయించింది.
►‘నవ్వవు జంతువుల్‌... నరుడు నవ్వున్‌.. నవ్వులు చిత్తవృత్తికిన్‌ దివ్వెలు... కొన్ని నవ్వులెటూ  తేలవు...కొన్ని విషపూరితముల్‌..’ అంటూ  పద్యంతో ప్రసంగం ముగించారు. 
► రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ’సోదర సోదరీమణులారా..’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ మహామహులను ఆయన గుర్తుచేసినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. కేరింతలు వేశారు.
►హైదరాబాద్‌ పేరు వినగానే బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి సినిమా గుర్తుకు వస్తాయని రాష్ట్రపతి చెప్పగానే అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. 

తేట తెలుగుల వెలుగు
అమ్మభాషను ఎలుగెత్తి చాటిన బృహత్‌ కవి సమ్మేళనం నాదో తీరని కోరిక..  తీరిక లేని లోకంలో నాదో తీరని కోరిక.. అంతు తెలియని అన్వేషణలో నాదో తీరని కోరికనాతోనే నువ్వు ఉండాలని.. నేనే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాలని... ప్రపంచాన్ని శాసించే నువ్వే డబ్బువై, డాలర్‌వై నాతోనే ఉండాలి నాదో తీరని కోరిక... .. డబ్బుపై మనిషికున్న అంతులేని ఆశ.. డాలర్‌ కోసం జనం వెంపర్లాడుతున్న తీరుకు అక్షర రూపం ఇస్తూ సంతోష్‌రెడ్డి అనే యువ కవి రాసిన ఈ కవిత సభికులను ఆకర్షించింది. నాలుగు రోజుల తెలుగు భాష పండుగలో వచన కవులు జనం  ఇష్టాలను, కష్టాలను, కన్నీళ్లను, అమ్మ భాషలోని మాధుర్యాన్ని కవితలుగా మలిచి వినిపించారు. మంగళవారం ఐదోరోజు ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్‌ కవి సమ్మేళన సమావేశాలు ముగిశాయి. ఐదు రోజులపాటు సాగిన  ఈ  సమావేశాల్లో 31 సదస్సులు జరిగాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 700 మంది వచన కవితా పండితులు తమ  రచనలు వినిపించారు. వానమామలై వేదికపై పప్పుల రాజిరెడ్డి అధ్యక్షతన మొదలైన తొలి సమావేశం సాయంత్రం బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగిన చివరి సమావేశంతో ముగిసింది.
  
‘హృదయంతో చూడగలిన రాజు తప్పిపోయిన సూర్యున్ని నట్ట నడివాకిట్లో నిలబెట్టిండు... గంగానదిలో ప్రవహిస్తున్న ఆర్వత్వాన్ని హిందూ నదిలోకి మలిపిండు... పాత పునాదులపై కొత్త దేశాన్ని నిర్మించిండు.. ఒక్క సూర్యున్ని అడ్డగిస్తే వేల సూర్యుళ్లు పుడతారని నిరూపించిండు’ అంటూ అశోక చక్రవర్తి గొప్పతనాన్ని వివరించారో కవి.  ‘తరతరాల సిరితత్వ వేద వేదిది నా తెలుగు భాష... స్వరంబు సురిచిరంబును సుందరబింబంబిది నా తెలుగు భాష... గడియార గమనాల గమకంమిది కనమిది కందాల అందాల సంపదల... సదస్సులకు ఉషస్సిది నా తెలుగు భాష’ అంటూ అమ్మభాషలోని పద విన్యాస మాధుర్య రుచిని సభికులకు చూపించాడు మరో కవి! ‘అమ్మ భాష కమ్మనైన భాష .. తెలుగు భాషను బతికిద్దాం’ అని వానమామలై వేదిక సాక్షిగా వందలాది మంది కవులు ప్రతినపూనారు.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు

నక్షత్రాల్లో ఒదిగిన విందు భోజనం
ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఏర్పాటైన జి.ఎం.రామశర్మ శతావధాన కార్యక్రమంలో చివరిరోజున అవధాని ముందుగా దత్తపదులను ధారణ చేశారు. పెరుంబుదూరు శ్రీరంగాచార్యులు సంధానకర్తగానూ, కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షులుగానూ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి హాజరయ్యారు. సరస్వతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. దత్తపదులలో అధిక భాగం తెలుగు వైభవాన్ని కీర్తించేవి ఉన్నాయి. షడ్రసోపేతమైన విందు భోజనాన్ని హస్త చిత్త స్వాతి మూల పదాలు ఒదిగిపోయేలా అందంగా పూరించారిలా. సుమధుర హస్త భోజనము సూరి వరేణ్యుల పద్యమట్లుగన్‌/ సురసుమ చిత్తవంతులకు శుభ్ర రుచులు పచరించుచుండగా/ అమరిన స్వాతి ముత్యమనునట్టి మన్సున నిచ్చు విందులే/ అమృతము కన్న మిన్న యగునాత్మకు మూలకారణ శక్తికిన్‌. అన్నము పప్పు కూర చారు పదాలను ఉపయోగించి రామాయణం వివరించమని అడిగినప్పుడు– అన్న ముందర నేనెంత చిన్నవాడ/ పప్పురుద్దగా రాముడు వలపునడిగె/ చుప్పనాతిని నిను చూసి ఒప్పుకోడ/ చారు రూపంబు నీదయ్యె సరసుడెవడే అంటూ అన్నము అనే పదాన్ని విడదీసి అన్న ముందర అని చెప్పడంతో ప్రేక్షకుల చప్పట్లతో సభ మార్మోగింది. మరో పృచ్ఛకుడు జింక లంక ఢంక బింక పదాలతో భారతార్థం వచ్చేలా పూరించమన్నారు. అందుకు అవధాని, రామాయణంలోని ‘లంకను, జింకను’ భారతంలోకి తీసుకురావాలి అని చమత్కరించి, సుయోధనుడి గురించి వివరించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరి గౌరీ శంకర్‌ నలుపు తెలుపు మలుపు గెలుపు పదాలు ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని భారత కథతో అనుసంధానించమని అడిగారు. నలుపు మనసుల కౌరవుల్‌ బలము గలిగి/ యుద్ధ వీరత తెలుపుట యోగ్యమగునె/  తెలుపు మనసుల పాండవుల్‌ ధీరులైరి/ గెలుపు ధర్మనికయ్యె ఓ మలుపు తిరిగె అని ఆఖరి దత్తపదిని పూరించారు అవధాని. ఇక్కడ గెలుపు ధర్మనికయ్యె అనే మాట దత్తపదులు విజయవంతంగా పూరించిన అవధానికి కూడా వర్తిస్తుందని కసిరెడ్డి వెంకటరెడ్డి హాస్యపు జల్లులు కురిపించారు.
– డా. వైజయంతి

గెలుపు ధర్మానికై... మలుపు తిరిగె!
ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌ సభాభవనం, మరిగంటి  సింగరాచార్యుల ప్రాంగణం, శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపై నిరాçఘాటంగా సాగిన శతావధానం మంగళవారం ముగిసింది. వందమంది పృచ్ఛకులు అడిగిన దత్తపది, సమస్య, వర్ణం, ఆశువులకు సరైన రీతిలో శతావధాని డాక్టర్‌ జీఎం రామశర్మ సమాధానం ఇచ్చి అందర్నీ పులకింపజేశారు.  తెలంగాణ ఉద్యమాన్ని భారతంలోని యుద్ధపర్వంగా పొలుస్తూ ... నలుపు, తెలుపు, గెలుపు, మలుపు పదాలతో వర్ణించమని సభలో పాల్గొన్న బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరి గౌరీశంకర్‌ కోరారు. దత్తపది శైలిలో శతావధానికి డాక్టర్‌ జీఎం రామశర్మ స్పందిస్తూ.. ‘నలుపు మనసుల కౌరవుల్‌ బలము కల్గి ‘‘ యుద్ధ వీరట తెలుపునట యోగ్యమగునే, తెలుపు మనస్సుల పాండవుల్‌ ధీరులైరి ‘‘  గెలుపు ధర్మానికై ఓ మలుపు తిరిగె’’. అంటూ పద్యం చెప్పి సభలో నవ్వులు పూయించారు.  కౌరవులు అజ్ఞానంతో వ్యవహరించారని రామశర్మ అన్నారు. అక్కడ గెలుపు ధర్మానికై ములుపు తిరిగినట్లుగా .. ఇక్కడ కేసీఆర్‌ సారథ్యంలో సకలజనులతో గెలుపు ధర్మం వైపు మలుపు తిరిగిందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పృచ్ఛకులు డాక్టర్‌ కె.బాలస్వామి తెలంగాణ సాహిత్య వైభవం వర్ణించమని రామశర్మని కోరారు.
‘‘ పద్యముల్‌ గేయములున్‌ ‘‘ సద్యోవచనైక గేయ సాహిత్యంబున్,విద్యాగంథమ యంబై ‘‘ విద్యా నైవేద్యమయ్యె విస్ఫూర్తియయెన్‌’’అని కందపద్యం రూపంలో రామశర్మ సమాధానం చెప్పారు. అనంతరం శతావధాని డాక్టర్‌ గౌరీభట్ల మెట్టు రామశర్మను పృచ్ఛకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందినీ సిధారెడ్డి, డాక్టర్‌ పెరుంబుదూరు శ్రీరంగాచార్య, డాక్టర్‌ కసిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం కేసీఆర్‌ గురువు వేలేటి మృత్యుంజయశర్మ తదితరులు పాల్గొన్నారు.
– కోన సుధాకర్‌ రెడ్డి

తెలంగాణ పదపదాన పదనిసలు
తెలంగాణ పదపదాన పదనిసలు దాగి ఉన్నాయని, శ్రామిక గేయాల్లో భాషా సౌందర్యం ఒదిగిపోయిందని వక్తలు కొనియాడారు. బతుకమ్మ, పల్లెపదం, సంస్కృతి అద్భుతమన్నారు. మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం బిరుదరాజు రామరాజు ప్రాంగణంలో ఆచార్య లక్ష్మణ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా ఆచార్య ఆర్‌.వి.ఎస్‌.సుందరం, ప్రముఖ పండితులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య పాల్గొన్నారు. ఐదు రోజులపాటు కావ్య, కథా, నవలా, కవితా లోకాలను తరచిచూసిన సామలసదాశివ వేదిక తెలుగు భాషపై విçస్తృతంగా చర్చించింది. ఈ సభలు తెలంగాణకు నూతనోత్తేజాన్ని ఇచ్చాయని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ తెలుగు భాషా వైశిష్ట్యంపై డాక్టర్‌.కె.ముత్యం మాట్లాడుతూ.. పల్లె ప్రజలు ఉపయోగించే వ్యావహారిక భాషలో అంతులేని సంగీత సౌందర్యం ఉందన్నారు. లయబద్ధమైన తెలంగాణ పదాలు అర్థవంతంగా ముగుస్తాయనీ, ఆత్మీయ సంబంధాల గుండెతడిని వ్యక్తీకరిస్తాయని తెలిపారు. సామల రమేశ్‌ బాబు భాష–వర్తమాన స్థితిపై మాట్లాడుతూ.. తెలుగు అభివృద్ధికి చంద్రబాబు దోహదపడతారన్న నమ్మకం పోయిందనీ, కేసీఆర్‌పైనే విశ్వాసం ఉంచామని అన్నారు. ఇంటర్‌ వరకు తెలుగుని తప్పనిసరి భాషగా బోధించే నిర్ణయాన్ని కొనసాగిస్తూనే,  మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన ఉండేలా చూడాలని సూచించారు. తెలుగుకు ప్రామాణిక గ్రంథం, భాషాభివృద్ధికి కొత్త నిఘంటువులు తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. శ్రామిక గేయాలు మొదలు విప్లవ, జానపద గేయాలన్నింటా శ్రామికజన ఘోష ఉందని మాష్టార్జీ  చెప్పారు. ‘నేనేమి సేతు, నా సేనెట్ల గాతు’, ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండిస్తే ఎన్నడూ మెతుకెరుగరన్న, నేను గంజిలో మెతుకెరుగ రన్న’, ‘పాలబుగ్గలా జీతగాడా’ వంటి పాటలన్నీ అలాంటి కోవలోనివేనన్నారు. జానపద సాహిత్యాన్ని పరిపూర్ణం చేసింది పాటేనని బండారు సుజాత శేఖర్‌ చెప్పారు.    – అత్తలూరి అరుణ

చరిత్రను కొత్తగా రాసుకుందాం!
‘ఒక సమాజం అర్థం కావాలంటే అక్కడి సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సాహిత్యం జన జీవితం నుంచి వచ్చి ఉండాలి. అలాకాకుండా రజాకార్ల ఉద్యమం, సాయుధ పోరాటం ఆధారంగా మాత్రమే చరిత్రను అల్లుకుంటే కచ్చితమైన స్వరూపం రాదు. తెలంగాణలో చరిత్రను తిరిగి రాసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. ఆయన అధ్యక్షతన ‘తెలంగాణ చరిత్ర’ సదస్సు మంగళవారం రవీంద్రభారతిలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, గౌరవ అతిథిగా పురాతత్వ పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నాణేల గురించి డాక్టర్‌ రాజారెడ్డి, అసఫ్‌జాహీల కాలంలో తెలుగు భాష మీద అడపా సత్యనారాయణ, తెలంగాణలో బౌద్ధం అంశాన్ని మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ సంస్థానాల చరిత్రను ద్యావనపల్లి సత్యనారాయణ, ఆధునిక చరిత్ర గురించి కుర్రా జితేంద్రబాబు ప్రసంగించారు. వాటి సారాంశం క్లుప్తంగా... కాస్మోపాలిటన్‌ సంస్కృతి: తెలంగాణ మూలాలెక్కడ? అని శోధిస్తే ఇక్కడి తెలుగువారిని నైజాం ఆంధ్రులు అని వ్యవహరించిన ఆధారాలు కనిపిస్తాయి. షోడశమహాజనపథాలలో అస్మైక జనపథం మనదే. కోసల నుంచి అస్మైక జనపథానికి జరిగిన రాకపోకల వివరాలున్నాయి. ఉర్దూ అధికార భాష అయినా...: అసఫ్‌జాహీల కాలంలో అధికార భాష ఉర్దూ. అయినప్పటికీ భాగ్యరెడ్డి వర్మ వంటి దళిత ఉద్యమ పితామహుడు స్థాపించి ఆర్థిక సమస్యలతో కొనసాగించలేకపోయిన దాదాపు నలభై పాఠశాలలను ప్రభుత్వం దత్తత తీసుకుంది. ఐదవ శతాబ్దంలోనే!: ఐదవ శతాబ్ది నాటికే తెలంగాణలో మాత్రాచంధస్సుతో గ్రంథాలున్నాయి. సింధునాగరికతలో బయటపడిన పశుపతి శివుడి రూపమే రాచకొండ పెయింటింగ్స్‌లో కనిపిస్తుంది. 
– వాకా మంజులారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement