తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో... ‘ఇన్నాళ్లుగా త్యాగాల గూర్చి విన్నా! చూడలేదు సర్వస్వం త్యజిస్తున్నారంటే విన్నా! చూడలేదు అన్నా! ఎండీ గోపాలపురం వెళ్లాక త్యాగమంటేమిటో తెల్సిందన్నా
అన్నా అనే పదానికి అర్థం నువ్వు త్యాగానికి పర్యాయ పదం నువ్వు నీ అమరత్వం ప్రజల వారసత్వం నీ అమరత్వం విప్లవ వారసత్వం నీ త్యాగానికి సప్త సముద్రాలు నీ ఊళ్లో తాళ్ల వాగై పారుతుంటే ఆ త్యాగం నన్ను స్పందింపజేసింది...’ అంటూ మావోయిస్టు ఓరుగంటి సుదర్శన్ అమరత్వాన్ని యాది చేసుకున్నారు. ‘తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో/ తడిగొంతులారిపోయో తుమ్మెదాలో/ రాక రాక నల్లల్లొస్తే ఒక్క బిందే నిండదాయో/ కుండలెనుకా కుండలాయో కోసు పొడుగు లైనులాయే’ అంటూ బెల్లి లలితను గుర్తు చేశారు.
ఈ అమరులను స్మరించింది సామాన్య కవైతే విశేషం లేకపోవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నోటి నుంచి ఆ పలుకులు రావడంతో సభికులు చప్పట్లతో మద్దతు పలికారు. మొదటిది తాను జర్నలిస్టుగా ఉన్న రోజుల్లో రాసింది కాగా, రెండోది బెల్లి లలిత హత్యకు ముందు దుబ్బాకలో ఆమె వినిపించిన చివరి గానం అని చెప్పడంతో సభికులు నిలబడి అభినందించారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలోని బృహత్ కవి సమ్మేళనంలోని 8వ సమావేశంలో రామలింగారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘ఎగసాయం ఎక్కిరించినా ఫలసాయం గేలిచేసినా/ సేద్యాన్ని భుజానికి మూటగట్టుకొని మనిషి మనిషికి పంచుకుంటూ పోతాడో రైతు’ అంటూ సాగిన కవితతో ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం మొదలైంది. ‘మండే ఎండలు కొరికే చలి తడిపే వాన అతనికెప్పుడూ వచ్చిపోయే చుట్టాలే. వెలిగే మెరుపు జడిసే ఉరుము జోరు పిడుగు అతినిపై ప్రకృతి చేసే దండయాత్రలే’ అంటూ రైతన్న గురించి కవులు చెప్పిన కవిత్వాలకు ఆడిటోరియం దద్దరిల్లింది.
‘ద్రవిడ భాష నుంచి ద్రవింపబడి/ శాతవాహనుల కాలంలో శోధింపబడి/ పదకొండవ శతాబ్దంలో సాహిత్య శిఖరాలు అధిరోహించిన ఉద్ధండ భాష/ ఆదికవి నుండి సినారె వరకు సాహితీ సౌరభాలు వెదజల్లుతున్న విశిష్ట వైభవ భాష మన తెలుగు భాష’ అంటూ షేక్ నశీమా బేగం తెలుగు పుట్టుకను వినిపించారు. ‘మోచేతి నీళ్ళు తాగి మొక్క మొలవదు/ ఆధిపత్యం క్రింద అక్షరం మెరవదు/ ఒత్తిడి చేస్తే పక్షి ఎగరదు నదీ పారదు/’ అంటూ సమయం ఆసన్నమైనప్పుడు నిగ్గు తేల్చే వాడే కవి అని తేల్చిన చంద్రశేఖర్ కవిత్వం సభికులను ఆకట్టుకుంది.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు
శతావధానం... జనసంద్రం..!
ప్రపంచ తెలుగు మహాసభలల్లో భాగంగా నిర్వహిస్తున్న శతావధానం కార్యక్రమం జనసంద్రమైంది. నగరంలోని తెలంగాణ సారస్వత పరిషత్ సభాభవనం, మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం, శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికకు జనం క్యూ కట్టారు. సోమవారం సమస్యా పురాణంపై సాగిన ఈ అవధానానికి అపూర్వ స్పందన కనిపించింది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించగా, డాక్టర్ పెరుంబుదూరు శ్రీరంగాచార్య అధ్యక్షత వహించారు. శతావధాని డాక్టర్ గౌరీభట్ల మెట్టు రామశర్మ శతావధానం నిర్వహించారు. అప్రస్తు ప్రసంగంలో కూర్చున్నవారు అద్భుతమైన ప్రశ్నలు అడిగి రంజింపజేశారు. ‘రామాయణం రంకు .. భారతం బొంకు’ అంటారు.. మీరు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారని ఓ పృచ్ఛకుడు ప్రశ్నించారు. దీనికి అవధాని రామశర్మ సమా«ధానమిస్తూ.. రామాయణంలో రంకువు ప్రధానం అని, జీవితంలో తప్పని పరిస్థితిల్లో బొంకాల్సిందేనని తెలిపారు. కానీ జీవితంలో అబద్ధాలు ఆడకూడదన్నారు. పలువురు శక్తి కోసం రాత్రుళ్లు ఏవేవో పుచ్చుకొంటారు... మీరు ధారణ, ధారా కోసం రాత్రుళ్లు ఏమి పుచ్చుకుంటారని శతావధానిని మరో çపృచ్ఛకుడు ప్రశ్నించటంతో సభికులందరూ ఘోల్లున నవ్వారు. దీనికి శతావధాని రామశర్మ మాట్లాడుతూ.. తాను రాత్రుళ్లు ధారణ, ధారా కోసం శారదా పాదరసం పుచ్చుకొంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పృచ్ఛకులుగా గంటి క్రిష్ణమూర్తి, దుద్దిళ్ల ఆంజనేయులు, పైడి హరినాథరావు, గుండు మధుసూదన్, ఎం.పవన్‌కుమార్, సామ లక్ష్మారెడ్డి, కంది శంకరయ్య, వడ్లూరి ఆంజనేయరాజు పాల్గొన్నారు.
– కోన సుధాకర్ రెడ్డి
అంతఃపురం గోడల నుంచి... ఆత్మాభిమానం గోడల వరకు
కథలు చెప్పడంలో ఆద్యులు ఆడవాళ్లే. బిడ్డకు మాటలు నేర్పుతూ లోకాన్ని తెలియచేసేది తల్లే. అందుకే ప్రతి తల్లీ ఒక రచయిత్రి. తన పిల్లలతోనే సరిపుచ్చుకోకుండా సమాజానికి మంచిచెడుల విచక్షణను నేర్పించే ప్రయత్నం చేసి తన భావాలను అక్షరబద్ధం చేసిన తల్లులు మరెందరో. ప్రాచీన కవిత్వంలో మహిళలు, వచన సాహిత్యంలో మహిళలు, వచన కవిత్వంలో మహిళలు, స్త్రీల కథాసాహిత్యం అంశాలుగా తెలుగు నేలన వికసించిన కవయిత్రులను రవీంద్ర భారతి వేదికగా స్మరించుకోవడం జరిగింది. కథాఝరులు!: మొల్ల వ్యక్తీకరించిన లలితమైన భావాలలో గుహుని సన్నివేశాన్ని ముదిగంటి సుజాతారెడ్డి వర్ణించారు. ‘శ్రీరాముడు పడవలో అడుగుపెట్టబోతున్నప్పుడు గుహుడు రాముడిని ఆపి, నీ పాదం సోకితే రాతి నాతి అవుతుందట, పాదం మోపితే నా పడవ ఏమవుతుందో రామయతండ్రీ’ అంటూ రాముడి పాదాలను కడుగుతాడు. మహిళలు అలవోకగా రాయగలరు అని నిరూపించిన కవయిత్రి మొల్ల అని సుజాతారెడ్డి అన్నారు. తాళ్లపాక తిమ్మక్క, కుప్పాంబిక, కాకతీయుల కాలంలో గంగాదేవి ప్రముఖ కవయిత్రులు. గంగాదేవి కంపరాయలును పెళ్లాడి విజయనగర సామ్రాజ్యంలో స్థిరపడింది. తర్వాతి కాలంలో చెప్పుకోవాల్సిన రచయిత్రి భండారు అచ్చమాంబ. ‘ధన త్రయోదశి’తో మొదలు పెట్టి పదికి పైగా కథలను రాసింది.
తొలితరం పాదముద్రలు!: రచయిత్రులను ఒక వేదిక మీదకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని మొదట గోల్కొండ పత్రిక చేసింది. గోల్కొండ కవుల సంచికలో పదిమంది కవయిత్రులు సాహిత్యలోకానికి పరిచయమయ్యారు. జ్ఞాన మాంబ, లక్ష్మీ నరసమ్మ, లక్ష్మీబాయి, రత్నమ్మ, ఇందుమతీబాయి, ఆండాళ్లమ్మ, లక్ష్మీదేవమ్మ వాళ్లలో కొందరు. ఒకరు అంతఃపురం గోడల మాటున దాగిన కన్నీళ్లను బయటకు తెచ్చారు. తండ్రిపోయిన దుఃఖంలో ఆ ఆవేదనను స్మృతిపద్యాల రూపంలో వెలిబుచ్చిన వారొకరు. దేశభక్తి రచనలు, స్త్రీవిద్య ఆవశ్యకతను తెలియచేసే కథలు రాసిన వారొకరు. ఇలా సమాజంలో మహిళకు ఎదురయ్యే ప్రతి కోణాన్నీ తమ రచనలలో స్పృశించారు నాటి కథయి త్రులు. కథారచయిత్రి అనే పదాన్ని మరింతగా సరళీకరించి ‘కథయిత్రి’ అనే ప్రయోగం చేసిన సినారెను గుర్తు చేసుకుంటూ అదే పదాన్ని కొనసాగిద్దామని గుర్తు చేశారు కొండపల్లి నీహారిణి. మహిళలం మహిళలం... మనం రాణిరుద్రమ వారసులం అంటూ ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో సభల్లో పాల్గొన్న కథయిత్రులు తమకు బాటలు వేసిన మాదిరెడ్డి సులోచన, బొమ్ము హేమాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి, వీణారెడ్డి, సుందరీబాయి, సుమిత్రాబా యిలను గుర్తు చేసుకున్నారు. మహిళలు కార్టూన్లు వేయగలరని నిరూపించిన తొలి తెలుగు మహిళా కార్టూనిస్టు నెల్లుట్ల రమాదేవిని ప్రత్యేకంగా అభినందించారు. ఆధునిక సాహిత్యంలో సొన్నాయిల కృష్ణవేణి ఆత్మాభిమానాన్ని కానుకిస్తావా అంటూ ఇంట్లో టాయిలెట్ కట్టమని కోరడం, అయ్యయ్యో దమ్మక్క అంటూ జూపాక సుభద్ర మహిళల స్థితిగతులను కళ్లకు కట్టడం వంటివన్నీ వక్తలు ప్రస్తావించారు.
– వాకా మంజులారెడ్డి
పత్రికలూ పూనుకోవాలి
ప్రజలు తమ దైనందిన జీవితంలో వినియోగించే వాడుకభాషలోని పదజాలంతో ఓ ప్రామాణికమైన పదకోశం రూపొందించాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం సమర్థ్ధవంతమైన వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా రవీంద్ర భారతిలోని గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ ప్రాంగణం, డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై ‘పత్రికలు, ప్రసారమాధ్యమాల్లో తెలుగు’ అంశంపై సదస్సు జరిగింది. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ కే కేశవరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు, జీఎస్ వరదాచారి, కె.శ్రీనివాస్, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, సీనియర్ పాత్రికేయులు సుమనస్పతి, ఉడయవర్లు, వనం జ్వాలా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కేశవరావు మాట్లాడుతూ.. తెలుగు దినపత్రికల్లో భిన్న రకాలుగా తెలుగు కనిపిస్తోందన్నారు. ప్రతి 70 కిలోమీటర్లకు భాష, యాసల్లో తేడాలుంటాయని, వీటిని పత్రికల్లో రాయడం సాధ్యం కాదన్నారు. పత్రికలన్నీ ఓ ప్రామాణికమైన పదకోశాన్ని అనుసరించడం మంచిదని పేర్కొన్నారు. అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఇప్పటికీ కోస్తాంధ్ర జిల్లాల తెలుగే పత్రికల్లో కనిపిస్తోందని, దాని నుంచి బయటికి రావలసిన అవసరముందని అన్నారు. పత్రికలకు అనువైన పదకోశాన్ని ప్రెస్ అకాడమీ రూపొందిస్తుందని చెప్పారు. వాడుక భాష వినియోగానికి ఒక వ్యవస్థ అవసరమని వరదాచారి చెప్పారు. అన్ని దినపత్రికలు గ్రామీణ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పదాలను సేకరించి పదకోశాలను రూపొందించుకోవాలని పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. గ్రామీణ విలేకరులు స్థానిక భాషల్లోనే రాసేవిధంగా ప్రోత్సహించాలని చెప్పారు. 12వ తరగతి వరకు తెలుగును అమలు చేసినంత మాత్రాన భాష అభివృద్ధి చెందబోదని, శాస్త్ర విజ్ఞాన అంశాల్లోనూ తెలుగు అమలు కావాలని కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. పత్రికల వల్లే తెలుగు బతికి బట్టకడుతోందన్నారు. తెలుగు సమర్థంగా అమలు చేసేందుకు ఒక వ్యవస్థ అవసరమని చెప్పారు. భాషకు హద్దులు ఉండకూడదని, అందరికీ అర్థ్ధమవుతుందా? లేదా? అనేదే ప్రామాణికమని వనం జ్వాలా నరసింహారావు అన్నారు. సమావేశంలో పలువురు సీనియర్ పాత్రికేలు, తెలుగు భాషాభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
– ఆంజనేయులు
మన సాహితీ పూదోట
సుద్దాల అశోక్‌తేజ పదకవితా ఝరిలో శతక, సంకీర్తనా, గేయ సాహిత్య సభ తడిసి మురిసింది. సినారె, దాశరథి మొదలు శ్రీశ్రీ, గద్దర్, గోరటి, గూడ అంజయ్య సినీగీత ప్రవాహంలో సాహితీ అభిమానులు ఓలలాడారు. సోమవారం సారస్వత పరిషత్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సుద్దాల మాట్లాడుతూ.. తేటతెలుగు మకరందానికి పూచిన సినీ సాహిత్యాన్ని ఉత్తమ సాహిత్యం కాదన్న భావం సరికాదన్నారు. సినీగేయాల్ని కావ్యస్థాయిలో నిలిపిన కవితలెన్నో తెలుగు వారి హృదయాన్ని తట్టిలేపేయన్నారు. కోటిరతనాల వీణ నా తెలంగాణ అన్న దాశరథి సినీ గీతాల్లో మీటిన వీణలెన్నో పట్టి చూపారు. సహజంగా 16 వాక్యాలను మించకుండా ఉండాల్సిన సినిమా పాట నియమాన్ని అనుసరించి పాటను మధ్యలోనే తుంచినా అర్థం చెడని నేర్పు మన దాశరథిదన్నారు. అందుకే ‘‘గోదారీ గట్టుందీ.. గట్టుమీనా చెట్టుంది.. వెన్నెల వుందీ–ఎండ వుందీ.. ఏది ఎవ్వరికి ఇవ్వాలో ఇడమరిసే ఆ ఇది వుంది’’ అంటూ వదిలేసారట.
సినారె వెనుక నా పేరుండాలన్న చిరకాల కోరిక ‘ఒసే రాములమ్మ’తో తీరిందన్నారు. దుర్యోధనుడికి డ్యూయెట్ పెట్టాలన్న ఎన్టీఆర్‌తో ‘చిత్రంగా ఉంటుంది’ అని సమాధానమిచ్చిన సినారే అదే పదంతో ప్రారంభించి ‘చిత్రం...భళారే విచిత్రం...’ అంటూ డ్యూయెట్ రాసేసారని సుద్దాల గుర్తుచేశారు. చంద్రబోస్ ‘నేనున్నాననీ’, ‘చీకటితో వెలుగే చెప్పెను’ లాంటి పదప్రయోగాలు సినీగేయాల స్థానాన్ని ఉన్నతికి చేర్చాయన్నారు. గద్దర్ ‘మసక చీకటి వెన్నెలవోలె’ పాటలో ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ వ్యక్తీకరణ మానవ సంబంధాల్లోని ప్రతికోణాన్నీ పట్టిచూపిందన్నారు. గూడ అంజయ్య ‘భద్రం కొడుకో’ పాటలో ‘రిక్షా ఎక్కే కాడ, దిగేకాడ’ పాట బడుగు జీవితాల బతుకువెతల్ని ప్రతిబింబించిందన్నారు. గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట రాబోయే పాతికేళ్లలో కూడా గొప్ప పాటగా నిలిచిపోతుందని చెప్పారు. అందెశ్రీ రాసిన ‘కొయ్య చెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా..’ పాట అజరామరమైనదన్నారు. గేయ రచయితలను పేర్కొంటూ తెలంగాణ గడ్డ ఘనతని పాటలు పాడి వినిపించడంతో సభాప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది.
– అత్తలూరి అరుణ
తీర్పులు తెలుగులో రావాలి
సమాజంలో ప్రతి మనిషి మనుగడతో ముడిపడిన ఉన్న న్యాయస్థానాలు, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో తెలుగును సమర్థంగా అమలు చేయాలని, అప్పుడే ప్రజలకు న్యాయం దక్కుతుందని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సోమవారం రవీంద్రభారతిలోని డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై నిర్వహించిన ‘న్యాయ, పరిపాలన రంగాల్లో తెలుగు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కింది కోర్టుల్లో మాతృభాషల్లోనే తీర్పులు వెలువడుతున్నాయి. ఉత్తరాదిలోని హిందీ వినియోగంలో ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇంగ్లిష్‌లో తీర్పులు ఇస్తున్నారు’’ అని అన్నారు. బాధితుల సమస్యలను ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసే క్రమంలో దొర్లే తప్పుల వల్ల దారుణాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1930ల్లోనే సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్ర మహాస¿¶ ల్లో ప్రజల వాడుక భాష అమలు కోసం తీర్మానం చేశారని గుర్తుచేశారు. న్యాయార్థి ఏ భాషకు చెందిన వాడైతే ఆ భాషలో తీర్పు రావడం సమంజసమన్నారు. పాలనా వ్యవస్థలోనూ జీవోలు, ఉత్తర్వులు సైతం తెలుగులో వెలువడేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో తెలుగు అమలు కోసం నిఘంటువులు, న్యాయమూర్తులకు అవగాహన కార్యక్రమాలు వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రష్యా, జపాన్, ఫ్రెంచ్, జర్మనీ వంటి దేశాల్లో మాతృభాషలోనే అన్ని వ్యవస్థలు పని చేస్తున్నాయని, అదే తరహాలో మన వ్యవస్థలు కూడా తెలుగులో పని చేసినప్పుడే పేదవాళ్లకు న్యాయం జరుగుతుందన్నారు. రిటైర్డ్ జడ్జి చంద్రయ్య మాట్లాడుతూ.. తెలుగులో న్యాయగ్రంథాల ముద్రణ అవసరమన్నారు. తెలుగు న్యాయ పదకోశాలను రూపొందించాలని కోరారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ.. స్థానిక, మండల స్థాయిలో తెలుగు బాగానే అమలవుతోందని, కలెక్టరేట్, సచివాలయం స్థాయిలోనే అమలుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి, రిటైర్డ్ న్యాయమూర్తులు మంగారి రాజేందర్, పీఎస్ నారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
– పగిడిపాల ఆంజనేయులు
మన విమర్శకు 200 ఏళ్లు
పాశ్చాత్య దేశాలతో సమంగా, అదే స్థాయిలో ఉన్న విమర్శకులకు తెలుగులో కొదువలేదని తెలంగాణ విమర్శ–పరిశోధన సదస్సు ఎలుగెత్తి చాటింది. 200 సంవత్సరాల క్రితమే తెలుగు సాహిత్య విమర్శలో తెలంగాణ తనదైన స్థానాన్ని నిలుపుకుందని స్పష్టంచేసింది. మన సాహితీ విమర్శ ప్రాచీనమైనదనడానికి 1829లో కావలి రామస్వామి, వెంకటస్వామి సోదరులు తెలుగు కవులపై రాసిన తొలి పుస్తకాన్ని ఆధారంగా చూపారు. సోమవారం ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అథిగా హాజరయ్యారు. 1899లో తెన్నేటి రామచందర్‌రావు మనుచరిత్ర–వసు చరిత్రలపై తులనాత్మక గ్రంథం రాశారంటూ రాచపాలం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తెన్నేటి గ్రంథంలో ‘లోకములో కావి విమర్శనము బహునిష్టుర పని’ అన్న వాక్యం ఆనాటి నుంచే విమర్శ ఉనికిని చాటుతోందన్నారు. డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘ప్రాచీన సాహితీ విమర్శలో ‘భక్తిరసం’ ప్రస్తావన తెచ్చింది పాల్కురికి. మధురభక్తి అనేది శైవంలో లేదనీ, వైష్ణవంలో ఉందనీ ఆ గ్రంథం చెబుతోంది. 1950–60 ల తర్వాత తెలుగు సాహిత్యాన్ని మొత్తం విమర్శకులే నడిపించారు’ అని అన్నారు. తెలంగాణలో విమర్శ–పరిశోధన రెండు జమిలీగా నడిచాయన్నారు. తెలుగులో కావ్యాల విమర్శ వెలువడుతున్న కాలంలోనే 1940 కన్నా ముందే సంస్కృతం, ఉర్దూ, తెలుగు మూడు భాషలకు సంబంధించిన విమర్శ తెలంగాణలో ఉదయించిందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధనలకు ఖండవల్లి లక్ష్మీరంగరంజనం పునాదులు వేశారని బాలశ్రీనివాస్ అన్నారు. అనుభూతి ప్రధానమైన వ్యాసాన్ని సృజన అనీ, ఆలోచన ప్రధానమైన దాన్ని విమర్శనాత్మకమనీ, రెండూ ఉండేదే ఉత్తమమైన వ్యాసమనీ ఆచార్య తంగెడ కిషన్‌రావు అన్నారు.
– అత్తలూరి అరుణ
ఇలా చేద్దాం...!
సాహిత్యం భాషలో ఓ భాగమే తప్ప సర్వస్వం కాదు. కానీ, భాష ఉద్దేశించిన లక్ష్యాల సాధనలో, భాష మలుబడిలో, మనుగడలో సాహిత్యానిదే కీలకపాత్ర. వేర్వేరు కాలాల ప్రజాజీవితాన్ని చరిత్రగా పలు రూపాల్లో నిక్షిప్తం చేస్తుంది. భాష ఉన్నతిని తూకం వేసేటప్పుడు అందులోని సాహిత్యం స్థాయిని పరిశీలిస్తారు. సమాజంలో సాహిత్యం చేరిన స్థితి, లభించే ఆదరణ, నిర్వహించే పాత్రను బట్టి ఆ భాష విజయాల్ని లెక్కగడతారు. ఆ సాహిత్య ప్రక్రియలెన్నెన్నో! తెలుగు సమృద్ధ సాహితీ సంపద కలిగిన భాషగా ఇదివరకెన్నోమార్లు ధ్రువపడింది. అది ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ రుజువవుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పినట్లు వేడుకలు జరుగుతున్న ఆరు వేదికల వద్ద జనం కిటకిటలాడటమే ఆదరణకు నిదర్శనం! మరి తెలుగు భాషకు పట్టిన నేటి దుర్గతికి కారణం ఏంటి?.. పరిపాలన, న్యాయపాలనలో తెలుగు లేకపోవడం, నిర్బంధ బోధనాభాష చేయకపోవడం, ఇంగ్లిషుతో పోల్చి తెలుగును చిన్నచూపు చూడటం... ఇటువంటివే కారణాలు. పెట్టుబడుల విషయంలో చైనా ‘నమూనా’ స్ఫూర్తిగా తీసుకోవాలన్న సీఎం.. తల్లిభాషాభిమానం విషయంలోనూ చైనానే ప్రస్తావించి ఉంటే బాగుండేది! భాష విషయంలో చైనా విజయాలు అలా ఉన్నాయి. విశ్వాన్ని తొంగి చూడ్డానికి ఇంగ్లి్లషు కిటికీ లాంటిదంటారు. చైనాలో అత్యధికులకు ఇంగ్లిషే రాదు. కానీ, వచ్చిన కొంత మంది అత్యంత నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా వచ్చే కొత్త పదాలు, ఆవిష్కరణలు, జీవనశైలి, సూత్రీకరణలు, సర్వస్వాన్ని వ్యవధి లేకుండా చైనా భాషలోకి మార్చేస్తారు. అట్టడుగు స్థాయి వరకు ఆ విషయాలు చైనా భాషలోనే వెళతాయి. అందుకే ఇంగ్లిషు వాసన లేకుండానే ప్రతి విషయంలోనూ మరే ఇతర అభివృద్ధి చెందిన దేశాలకి తీసిపోకుండా చైనా ప్రగతిపథంలో సాగుతోంది. మనం అందుకు పూర్తి భిన్నం. తెలుగువారిలో ఎక్కువ మందికి తెలుగు వచ్చు. కానీ, రాదు! చదువుకున్న చాలా మందికి ఇంగ్లి్లషు వచ్చు, కానీ రాదు! ఎందులోనూ సంపూర్ణత్వం, సమగ్రత లేదు. మహాసభల ముగింపు రోజైన మంగళవారం భాష విషయంలో కీలకమైన విధాన నిర్ణయాలుం టాయని ముఖ్యమంత్రే ప్రకటించారు. ఆ నిర్ణయాల్ని బట్టి ప్రభుత్వం, విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు, సాహితీ సంఘాలు, పౌరసమాజం ఎవరి స్థాయిలో వారు ఏకకాలంలో జరిపే ఉమ్మడి కృషిపైనే తెలుగు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. – దిలీప్‌రెడ్డి
ఏ దేశమేగినా.. తెలుగు లెస్స!
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న గురజాడ అప్పారావు పంచిన భాషాభిమానం వారి నరనరాన జీర్ణించుకుపోయింది. తల్లి పంచే ప్రేమాప్యాయతలను అమ్మ భాషలో చవిచూస్తూ తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. పరభాష మోజులో కనుమరుగైపోతున్న అమ్మ భాషలోని కమ్మదనాన్ని పరాయి దేశంలోనూ ఆస్వాదిస్తున్నారు. తెలుగును విశ్వవిఖ్యాతం చేసేందుకు కంకణబద్ధులయ్యారు. తల్లిభాషపై పెనవేసుకున్న ప్రేమానుబంధం ప్రపంచ తెలుగు మహాసభలవైపు నడిపించింది. ఇప్పటివరకు సాంçస్కృతిక కార్యక్రమాలకే పరిమితమైన ఆయా దేశాల్లోని తెలుగు సంఘాలు... ఇక మీదట తెలుగు పరిరక్షణకు బాస చేశాయి. పుట్టిన బిడ్డ నుంచి భవిష్యత్తు తరాలకు తేనెలొలికే తెలుగు సెలయేటి ప్రవాహంలా సాగిపోయేలా నిర్ణయాలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకావడం గర్వంగా ఉందంటున్న ఆ ఎన్నారైలు.. ఈ సభల ద్వారా ఎందరో సాహితీవేత్తలు, కవులు, అష్టావధానుల మేధస్సును వీక్షించి తరించారు. మహాసభలు పంచిన అనుభూతులను ఆయా దేశాలకు మోసుకెళ్లి తోటి తెలుగు వారితో పంచుకోనున్నామని స్పష్టం చేశారు. 42 దేశాల నుంచి 450 మంది తెలుగు ప్రతినిధులు మహాసభలకు హాజరయ్యారు. నెల రోజులుగా ఆయా దేశాల ప్రతినిధులను కలసి ప్రపంచ మహాసభలకు ఆహ్వానించేందుకు 13 సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదివారం ఇచ్చిన విందులో హాజరైన ఎన్నారైలు రవీంద్రభారతిలో మంగళవారం జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. 20న గజ్వేల్‌లోని వాటర్‌గ్రిడ్, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు అందించిన మరపురాని జ్ఞాపకాలను వారు ‘సాక్షి’తో పంచుకున్నారు.
అ..ఆ..ఇ..ఈ
∙అమ్మభాషకు పట్టం.. నాలుగో రోజూ అదే ఉత్సాహం ∙ఆకట్టుకున్న ‘తెలంగాణ పాట జీవితం’ ఏడెనిమిది దశాబ్దాల క్రితం.. తెలుగులో మాట్లాడ్డం ఓ పెద్ద నేరం. చదువుకుందామంటే తెలుగు బడులు లేవు. ఉర్దూలో చదివితేనే చదివినట్టు. ప్రపంచానికి అద్భుత సాహితీ ప్రక్రియలను అందించిన విశ్వ భాషల్లో ఎన్నదగిన తెలుగు భాషపై నిజాం ప్రభుత్వ నిరంకుశత్వం రాజ్యమేలింది. ఎక్కడ అణచివేతకు గురైందో ఇప్పుడు అదే నేలపై ఆ భాష రొమ్ము విరుచుకుని తన విశ్వరూపాన్ని చూపుతోంది. పూర్వ వైభవం సంతరించుకుని మరింత విలసిల్లేందుకు బాటలు పరుచుకుంటోంది. దీనికి శ్రీకారం చుడుతూ నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో అ..ఆ... ఇ...ఈ..లు మార్మోగుతున్నాయి. అమ్మ భాషకు పట్టం కట్టేందుకు ప్రపంచం నలుచెరుగుల నుంచి వచ్చిన భాషాభిమానుల కవాతుతో సభల నాలుగోరోజు ఎల్బీ స్టేడియంలోని ప్రధాన వేదిక పాల్కురికి సోమన ప్రాంగణం ప్రతిధ్వనించింది. సోమవారం జరిగిన సాహిత్య సభలో ‘తెలంగాణ పాట జీవితం’ ఆకట్టుకుంది. ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ అధ్యక్షత జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా మంత్రి ఈటల రాజేందర్, గౌరవ అతిథిగా విఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, వక్తలుగా తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షుడు రసమయి బాలకిషన్, కవి జయరాజు, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. చలనచిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేదిక పూర్తిగా నిండిపోయింది. గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని, సినీ నటులు కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, మోహన్‌బాబు, విజయ్ దేవరకొండ, దర్శకులు రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, సుమన్, తనికెళ్లభరణి, కోట శ్రీనివాసరావు, శివాజీ రాజా, రాజేంద్రప్రసాద్, అలనాటి నటి జమున, విజయనిర్మల, జయసుధ.. ఇలా పెద్ద సంఖ్యలో నటులు దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సినారె గీతాలతోపాటు ఇతర పాటలతో సినీ సంగీత విభావరి నిర్వహించారు. కార్యక్రమంలో ఎవరేమన్నారంటే.. పాట.. తెలంగాణ బతుకు: తెలంగాణ నేలపై అద్భుతంగా విలసిల్లిన తెలుగు సాహితీ వైభవంలో పాట ఓ భాగమైంది. తెలంగాణ బతుకు పాటతో ముడిపyì ఉంది. మన జీవనసారం ఆ పాటనే.
– సుద్దాల అశోక్‌తేజ
ఈ నేల తల్లి భాషను కాపాడుకుంది: తెలుగు మాట్లాడ్డమే తప్పు అన్నంత అణచివేతను ఎదుర్కొన్న తెలంగాణ నేల అమ్మ భాషను కాపాడుకుంది. ఇప్పుడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా సుసంపన్నం చేసేలా ఈ మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పాటతో నా ప్రయాణం మొదలుపెట్టాను. నేను పాటగాన్ని, తెలంగాణ వాడిని – సిరివెన్నెల సీతారామశాస్త్రి
మన తెలంగాణము తెలుగు మాగాణము, పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషమూ.. తెలుగు సాహిత్యంలో దాదాపు అన్ని ప్రక్రియలు పురుడుపోసుకున్నది ఈ అద్భుత నేలపైనే. ఇందులో పాటకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
– దేశపతి శ్రీనివాస్
అమ్మభాష మాధుర్యాన్ని మరిచిపోలేం..
ఏ దేశమేగినా ఎందుకాలిడినా అమ్మభాష మాధుర్యాన్ని మరిచిపోలేం. ఏ దేశంలో ఉన్నా అందరినీ ఏకం చేసేది సంస్కృతీ సంప్రదాయాలే. వాటికి మూలం భాష. భాషను కాపాడుకోవడం అంటే తల్లిని కాపాడుకున్నట్లే. విదేశాల్లో పుట్టి పెరుగుతున్న తెలంగాణ భావిపౌరులకు తెలుగులోని కమ్మదనాన్ని అందించేందుకు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ తరఫున ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన చేస్తాం.
– కల్యాణ్, అధ్యక్షుడు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్.
తెలుగు ఔన్నత్యాన్ని చాటుతాం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా నిర్వహించిన తెలుగు మహాసభలకు హాజరుకావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడికి వచ్చాక తెలుగు గొప్పతనం మరింత స్ఫురణకు వచ్చింది. మేం నివసిస్తున్న దేశాల్లో తెలుగు భాషపై సదస్సులు కొనసాగించి అమ్మ భాషను బతికించు కుంటాం. తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించే పుస్తకాలను ఆయా దేశాల్లోని తెలుగువారికి పంపిణీ అయ్యేలా చేస్తాం. కాలిఫోర్నియాలో చాలా పాఠశాలల్లో తెలుగును ఆప్షనల్ సబ్జెక్టుగా బోధిస్తున్నారు. ఈ విధానం అన్నిచోట్ల వచ్చేలా చూస్తాం. తెలుగు ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటుతాం.
– మహేశ్ బిగాల, ప్రపంచ తెలుగు మహాసభల ఎన్నారై కో–ఆర్డినేటర్
అమ్మని విస్మరించడమే..
16 ఏళ్ల నుంచి బెహ్రాన్‌లో ఉంటున్నా. అక్కడ 40,000 మంది తెలుగు వారు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. వారంతా తెలుగు సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకుసాగుతున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళిలను జరుపుకో వడంతో పాటు తెలుగు భాషాభిమానాన్ని చాటుతున్నారు. బెహ్రాన్‌లోని ఇండియన్ స్కూల్‌లో తెలుగును కూడా చేర్చారు. దీని ద్వారా నేటితరం పిల్లలకు తెలుగును నేర్పిస్తున్నాం. పరాయి దేశం వెళ్లిపోయాం కదా... అమ్మభాషను మరవడమంటే తల్లిని విస్మరించడమే అవుతుంది. తెలుగు మహాసభల స్ఫూర్తిగా తెలుగు గొప్పతనాన్ని చాటేలా కార్యక్రమాలు చేపడతాం.
– రాధారపు సతీశ్‌కుమార్, ఎన్నారై టీఆర్‌ఎస్‌ఎల్ అధ్యక్షుడు, బెహ్రాన్
పండుగలా ఉంది..
తెలుగు మహాసభలను చూస్తుంటే ఒక పండుగలా ఉంది. తెలుగు కుటుంబంలో ఒక్కడిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. అమెరికాలోని హోస్టన్‌లో 2016లో ప్రపంచ తెలంగాణ మహా సభలు నిర్వహించాం. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మహాసభలకు హాజరుకావడం మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను అమెరికాలో అమలు చేస్తాం. వచ్చే జూన్ 29 నుంచి మే 1 వరకు ద్వితీయ ప్రపంచ తెలంగాణ మహాసభలు నిర్వíß స్తున్నాం. అన్ని దేశాల తెలుగు ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం. పుట్టిన గడ్డ రుణం కొంతైనా తీర్చుకునేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నాం. – వెంకట్ మంతెన, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఓవర్సీస్ కన్వీనర్
నిర్వహణ అద్భుతం..
తెలుగు మహాసభల నిర్వహణ ఎంతో అద్భుతంగా ఉంది. ఎన్నారైలకు అందించిన ఆతిథ్యం మరువలేనిది. పుట్టిన బిడ్డకు కూడా తెలుగు భాష కమ్మదనాన్ని రుచి చూపించాలి. అది ఇక్కడైనా, విదేశాల్లోనైనా. ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లలను ఇంగ్లి్లష్ మీడియం స్కూల్లో కాకుండా తెలుగు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. థాయ్‌లాండ్‌లో దాదాపు 500 మంది తెలుగు వారు ఉంటారు. మేమంతా పండుగ సమయాల్లో కలుసుకుని తెలుగు çపండుగలను జరుపుకుంటాం. వాటికి మూలమైన అమ్మ భాష పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– రమేశ్ మావిళ్ల, కల్చరల్ సెక్రటరీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ థాయ్‌లాండ్
తెలుగును అందలమెక్కిస్తాయి..
తెలుగు మహాసభలను ఇప్పటి వరకు చూడలేదు. అష్టావధానం, కవి సమ్మేళనం, సాహితీవేత్తల మేధస్సును చూస్తుంటే తెలుగు గొప్పతనం తెలిసింది. కాళోజీ, దాశరథి వంటి గొప్ప కవుల గురించి విన్నాం. వారే కాకుండా 400 మంది కవుల సాహిత్యం ఈ వేదిక ద్వారా బయటకు రావడం ఎంతో స్ఫూర్తిదాయ కం. ఇలాంటి మహా సభలు తెలుగును అందలమెక్కిస్తాయి. యూరోప్ దేశాల్లోని తెలుగు వారిని కలసి తెలుగు వెలుగులను చాటే కార్యక్రమాలు చేపడతాం. ఆయా దేశాల్లోని వర్సిటీల్లో తెలుగు సబ్జెక్టుకు అవ కాశం కల్పించేలా కృషి చేస్తాం.
– సంపత్, అధ్యక్షుడు, తెలంగాణ జాగృతి యూరోప్
Comments
Please login to add a commentAdd a comment