గిగిల్స్... లిల్లీపుట్ ల్యాండ్ పేరు పైన రెండు బుజ్జి పాదాలు. లోపలికి వెళ్తే ఓ గదిలో పదకొండు నెలల బాబు విహాస్ పియానో ముందు కూర్చుని కీ బోర్డుని పరీక్షగా చూస్తున్నాడు. ఆ బాబు దృష్టి తన వైపు మరల్చుకోవడానికి ప్రయత్నిస్తోందామె. ఇంగ్లిష్ రైమ్ మొదలు పెట్టగానే బాబు ఆమె వైపే చూడసాగాడు. ఓ అరనిమిషం పాటు అలాగే చూసి నోరంతా తెరిచి నవ్వాడు. అప్పుడు క్లిక్ మన్నది ఆమె చేతిలోని కెమెరా. ఆమె పేరు మానస అల్లాడి.
కెమెరామన్ అనే మాటను సవరిస్తూ కెమెరా పర్సన్ అనే పదాన్ని నిర్ధారించేశారు. అందుకు మహిళలు వేసిన ఓ ముందడుగే కారణం. ఫొటోగ్రాఫర్‌గా మగవాళ్లు మాత్రమే ఉన్న రోజుల్లో నిర్ధారణ అయిన పదానికి జెండర్ స్పెసిఫికేషన్‌ను తుడిచేస్తున్నారు మహిళలు. ఫొటోగ్రాఫర్‌గా మహిళలు అరుదుగానే అయినా కనిపిస్తున్నారు. వాళ్లు కూడా ఫొటో జర్నలిస్టులు. ప్రైవేట్ ఫొటోగ్రాఫర్‌ల విషయానికి వస్తే... ఇంకా మహిళల ప్రస్థానం ఊపందుకోలేదు. అలాంటి సమయంలో ఓ సాహసం చేసింది మానస అల్లాడి.
విహాస్‌ను ఫొటో తీస్తున్న ఉమన్ ఫొటోగ్రాఫర్ మానస
ఫొటోగ్రఫీ మీద ఇష్టంతో కోర్సు చేయడంతోపాటు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఫొటో స్టూడియో పెట్టింది. మరో ఐదుగురు ఫొటోగ్రాఫర్‌లకు, ఐదుగురు ఎడిటర్‌లకు ఉద్యోగం ఇచ్చింది. సొంత స్టూడియో ఆలోచనకు దారి తీసిన కారణం తనలోని తల్లి మనసేనంటోంది. తన పిల్లలను రకరకాల పోజుల్లో చూడాలని ముచ్చటపడింది. డెలివరీ అయిన ఐదో రోజున నిద్రలో నవ్వుతున్న తన బాబుని ఫొటో తీయాలనుకుంది. ఆ క్షణంలో తాను కదల్లేదు. ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్‌లు అందుబాటులో లేరు. అలా ఆ కోరిక తీరకపోవడం వల్ల ఆ పని తానే మొదలు పెట్టింది.
సొంతంగా డిజైన్
కరీంనగర్‌లో పుట్టి పెరిగిన మానస, ఇంజనీరింగ్ వరకు అక్కడే చదివింది. బీటెక్ పట్టాతో హైదరాబాద్‌కి వచ్చి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగంలో చేరింది. ఏడేళ్లు ఉద్యోగం ఇవ్వని సంతృప్తి మూడేళ్ల ఫొటోగ్రఫీ ఇచ్చింది. ఉద్యోగం చేస్తూనే ఒక ప్రైవేట్ ఫొటోగ్రఫీ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి డిప్లమో కోర్సు చేసింది. సీనియర్ దగ్గర మెళకువలు నేర్చుకుంది. అప్పటికి స్టూడియో పెట్టే ఆలోచన లేదు. కేవలం ఇష్టంతో మాత్రమే నేర్చుకున్నది. ‘‘మా అబ్బాయి ఐదు రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఫొటో తీయడానికి బేబీ ఫొటోగ్రఫీ ప్రొఫెషనల్స్ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చాలా నిరుత్సాహం కలిగింది. నేను లేవగలిగినప్పటి నుంచి బాబుకి నేనే ఫొటోలు తీసుకున్నాను.
ప్రతినెలా పుట్టినరోజు చేస్తూ ఒక్కో నెల డ్రెస్‌కి ఒక్కో థీమ్‌తో కుట్టించి మరీ ఫొటోలు తీశాను. రెండవసారి మెటర్నిటీ లీవ్‌లో ఉన్నప్పుడు సీరియెస్‌గా ఆలోచించాను. నేనే స్టూడియో పెడతాను. బేబీ ప్రతి మూమెంట్‌ని, రకరకాల నేపథ్యాలలో కెమెరాలో దాస్తానని ఇంట్లో చెప్పాను. ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పలేదు. ‘ఏ ప్రయోగం చేయాలన్నా ఇదే సరైన వయసు’ అని ప్రోత్సహించారు. ఇక నేను ఏయే థీమ్స్‌తో పిల్లల్ని ఫొటో తీయాలని ముచ్చటపడ్డానో అన్ని సెట్టింగులూ చేయించుకున్నాను. మా స్టూడియోలో ఉన్నవేవీ మార్కెట్‌లో రెడీమేడ్‌గా దొరికేవి కాదు. ప్రతిదీ నేనే డ్రాయింగ్ వేసి కార్పెంటర్‌కి వివరించి చేయించుకున్నాను. మొత్తం ముప్పై నేపథ్యాలతో గదులు సిద్ధమయ్యాయి. అన్నీ త్రీ డైమన్షన్ సెటప్‌లే. ఇండియాలో పెద్ద బేబీ ఫొటో స్టూడియో ఇదే. ఈ ఏడాది మా కరీంనగర్‌లో కూడా ఓ స్టూడియో పెట్టాను.
పిల్లలు మాలిమి అవుతారు
ఉద్యోగం చేసినప్పుడు మిగుల్చుకున్న డబ్బు పదిలక్షలతో 2017లో హైదరాబాద్, బోయిన్‌పల్లిలో స్టూడియో పెట్టాను. అప్పటికి హైదరాబాద్‌లో న్యూ బార్న్ బేబీ స్టూడియో ఉంది. కానీ మహిళలు ఈ ప్రయత్నం చేయలేదు. నాకు అడ్వాంటేజ్ ఏమిటంటే... చిన్న పిల్లలు మగవాళ్ల కంటే ఆడవాళ్లకే త్వరగా మాలిమి అవుతారు. పిల్లలతో ఓ అరగంట గడిపితే ఆ బేబీకి ఏమిష్టమో అర్థమవుతుంది. అదే సమయంలో పిల్లలకు నేను అలవాటవుతాను. ఒక్కో పిల్లలు రైమ్స్ ఇష్టపడతారు, కొందరు బొమ్మలను ఇష్టపడతారు. ఇక షూట్ చేసేటప్పుడు వాళ్లకు ఇష్టమైనవి చేస్తూ ఉండాలన్నమాట. మగవాళ్లకు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. ఏం చేస్తే వాళ్ల ఏడుపును ఆపవచ్చనేది కూడా వెంటనే స్ఫురించదు. కాబట్టి ఈ ప్రొఫెషన్‌లో ముఖ్యంగా బేబీ ఫోటోగ్రఫీలో మహిళలకు మంచి అవకాశాలుంటాయి. హాబీగా నేర్చుకున్న వాళ్లు అక్కడితో ఆగిపోకుండా దీనిని ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చు’’ అన్నది మానస.
ఒక తొలి అడుగు మరికొన్ని అడుగులకు స్ఫూర్తి అవుతుంది. మానస ఇష్టంగా క్లిక్ మనిపించుకున్న జీవిత చిత్రమిది. ఈ దారిలో మరికొంతమంది యువతులు ఫొటోగ్రాఫర్‌లుగా ఎదగాలని ఆశిద్దాం.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు : మోహనాచారి
Comments
Please login to add a commentAdd a comment