చిగురించే శుభలేఖ.. మీ ఇంటికి వచ్చిన తులసి.. ఆరోగ్యదాయిని! | Doctor saranya Environment Friendly wedding Cards | Sakshi
Sakshi News home page

చిగురించే శుభలేఖ.. మీ ఇంటికి వచ్చిన తులసి.. ఆరోగ్యదాయిని!

Published Sat, Feb 18 2023 1:08 AM | Last Updated on Sat, Feb 18 2023 9:54 AM

Doctor saranya Environment Friendly wedding Cards - Sakshi

ఒకప్పడు శుభలేఖ అంటే... పసుపు సుగంధాలతో అందే ఆహ్వానం. డిజిటల్‌ యుగంలో వాట్సాప్‌లోనే ఆహ్వానం. పెళ్లయ్యాక డిలీట్‌ చేయకపోతే మెమరీ చాలదు. ఆ తర్వాత ఆ పత్రిక మన మెమరీలోనూ ఉండదు. కానీ... ఈ శుభలేఖ ఎప్పటికీ నిలిచి ఉండే ఓ జ్ఞాపకం. 

మంచాల వారి పరిణయ ఆహ్వానం... ఏటా మనింటికి ఎన్నో పెళ్లిపత్రికలు వస్తూ ఉంటాయి. ‘అరె! నా పెళ్లిలో పట్టుపరికిణితో బుట్టబొమ్మలా తిరిగిన ఆ చిన్నమ్మాయికి పెళ్లా! కాలం ఎంత వేగంగా పరుగులు తీస్తోందో? అనుకుంటూ పెళ్లి కార్డును మురిపెంగా చూస్తాం. పెళ్లయిన తర్వాత ఆ కార్డునుపాత పేపర్లలో వేసేయడానికి మనసొప్పదు. శుభలేఖను గౌరవించాలి, ఆ జంట వైవాహిక జీవితం కలకాలం లక్షణంగా సాగాలంటే పెళ్లికార్డును అగౌరవపరచకూడదనే సెంటిమెంట్‌ మనది.

ఈ సెంటిమెంట్‌కు కొత్త నిర్వచనం చెప్తోంది డాక్టర్‌ శరణ్య. ఆహ్వాన పత్రిక ముద్రించిన పేపర్‌ను తులసి గింజలను కలిపి తయారు చేయించింది. ‘‘నా పెళ్లి తర్వాత ఈ కార్డును మట్టి కుండీలో వేసి నీరు పోయండి. నాలుగు రోజుల్లో కార్డు కరిగిపోతుంది, మరో నాలుగు రోజులకు పచ్చగా జీవం పోసుకున్న తులసి మొక్క మనల్ని పలకరిస్తుంది. మీ ఇంటికి వచ్చిన తులసి, మీ ఇంటి ఆరోగ్యదాయిని. భూమాతకు కొత్త ఊపిరినిచ్చే ఆరోగ్యలక్ష్మిని చూస్తూ మీ ముఖంలో విరిసే చిరునవ్వే మాకు మీరిచ్చే ఆశీర్వాదం’’ అంటోంది. 

శుక్రవారమే పెళ్లి! 
డాక్టర్‌ శరణ్యది తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్‌. ఎంఎస్‌ ఆఫ్తాల్మాలజీ చేస్తోంది. ఈ నెల 24వ తేదీన పెళ్లి పీటల మీద కూర్చోనున్న శరణ్య తన వివాహాన్ని ఇలా పర్యావరణహితంగా మార్చేసింది. ఆ వివరాలను సాక్షితో పంచుకుంది. ‘‘నేచర్‌ ఫ్రెండ్లీ లైఫ్‌ స్టయిల్‌ నాకిష్టం. నా పెళ్లి కూడా అలాగే జరిగితే బావుణ్ణనిపించి అదే మాట నాన్నతో చెప్పాను. పెళ్లి వేదిక అలంకరణ నుంచి భోజనాల వరకు మొత్తం ప్లాస్టిక్‌ రహితంగా ఉండాలని కూడా అనుకున్నాం. అది పెద్ద కష్టం కాలేదు. ప్రతిదానికీ ప్రత్యామ్నాయం దొరికింది. కార్డుల కోసం చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది.

‘ఎన్విరాన్‌మెంట్‌ ఫ్రెండ్లీ కార్డ్స్‌’ కోసం నేను ఇంటర్నెట్‌లో, నాన్న తన బిజినెస్‌ కాంటాక్ట్స్‌తో ప్రయత్నించాం. నాన్నకు తెలిసిన వాళ్ల ద్వారా అహ్మదాబాద్‌లో హ్యాండ్‌మేడ్‌ పేపర్‌ తయారీతో పాటు మనం కోరిన స్పెసిఫికేషన్‌లన్నీ వచ్చేటట్లు కస్టమైజ్‌డ్‌గా ప్రింట్‌ చేసిస్తారని తెలిసింది. మూడు నెలల ముందుగా ఆర్డర్‌ చేయాలి, ఈ ఎకో ఫ్రెండ్లీ ఆహ్వానపత్రికల ఆలోచన తెలిసి మా అత్తగారింట్లో కూడా అందరూ సంతోషించారు.

భూమాత పరిరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు నా పెళ్లికార్డుతో ఇంతమందికి తెలిశాయి. దీనికి మూలకారణం మా నాన్నే. ప్లాస్టిక్‌ ఫ్రీ సొసైటీ కోసం చైతన్య సదస్సులు నిర్వహిస్తారు. మా చెల్లికి పక్షులంటే ఇష్టం. వేసవిలో పక్షుల కోసం ఒకపాత్రలో నీరు, గింజలు పెడుతుండేది. పక్షుల సంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో రెండు వేల బర్డ్‌ ఫీడర్‌ బాక్సులు పంచింది. మా ముత్తాత రాజేశం గారు ఫ్రీడమ్‌ ఫైటర్‌. మా తాత శంకరయ్య కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. అదే వారసత్వంతో నాన్న కూడా వేసవిలో నగరంలో వాటర్‌ ట్యాంకులతో నీటి పంపిణీ వంటి అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

బతుకమ్మ వేడుక కోసం గునుగుపువ్వు సేకరించి శుద్ధి చేసి పంచడం కూడా చాలా ఇష్టంగా చేస్తాం. మనం మన సంస్కృతికి వారసులం మాత్రమే కాదు వారధులం కూడా. ప్రతి సంప్రదాయాన్నీ ఇలా సృజనాత్మకంగా మలుచుకోగలిగితే మనం చేసిన పని మనకు ప్రత్యేకతను ఇస్తుంది. సాంస్కృతిక వారధులుగా సంతోషమూ కలుగుతుంది. పెళ్లి పత్రిక మీద దేవుడి బొమ్మలు, వధూవరుల ఫొటోలు ఉంటాయి. వాటినిపారేయలేక ఇంట్లోనే పెట్టుకుంటే దొంతర పెరిగిపోతూ ఉంటుంది. మా పెళ్లి పత్రిక మాత్రం తులసి మొక్కగా మీ కళ్ల ముందు ఉంటుంది, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ’’ అని సంతోషంగా వివరించింది డాక్టర్‌ శరణ్య. 

– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement