
వన్ ప్లస్ వన్ ఆఫర్ గురించి మనందరికీ తెలుసు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకటి కొంటే ఒకటి ఉచితమని వ్యాపార సంస్థలు ఆఫర్లు ఇస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో ఇలాంటి వింత ‘ఆఫర్’ను సోషల్ మీడియా వెలుగులోకి తెచ్చింది. అయితే ఇది వస్తువులకు సంబంధించిన ఆఫర్ కాదు. మనుషుల పెళ్లికి సంబంధించిన ఆఫర్! ఇద్దరు మైనర్ బాలికలను ఒకే ముహూర్తానికి ఒకే వేదికపై పెళ్లాడటానికి రెడీ అయ్యాడో ప్రబుద్ధుడు. విషయం అధికారులకు తెలియడంతో పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
వరుడు ఒక్కడే.. వధువులిద్దరు!
పెళ్లికి వధువు దొరకక ఎందరో యువకులు నిరాశతో జీవనం సాగిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరు మైనర్ బాలికలను వివాహం (Wedding) చేసుకునేందుకు రెడీ అయిన ఉదంతం శ్రీసత్యసాయి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన యువకుడు, కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను ఈనెల 10న పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. 16 ఏళ్ల తన అక్క కూతురిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే చిన్న మేనకోడలు (15) కూడా మేనమామనే పెళ్లి చేసుకుంటానని, అలా చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని మొండికేసింది. దీంతో ఇద్దరు అమ్మాయిలనూ అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని బంధువులు నిర్ణయించారు.
అధికారుల వార్నింగ్
గోరంట్లలోని రంగమహల్ ఫంక్షన్ హాల్‌లో ఈనెల 10న పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లి శుభలేఖ (Wedding Card) వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలిసింది. వెంటనే స్పందించిన అధికారులు మంగళవారం ఇరువర్గాల తల్లిదండ్రులు, బంధువులతో పాటు ఫంక్షన్ హాల్ నిర్వహకుడిని గోరంట్ల పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టాన్ని అతిక్రమించి పెళ్లి చేస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రజిత, సీఐ శేఖర్ వార్నింగ్ ఇచ్చారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించారు.
కేసు నమోదు
పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, కనీసం ఒక అమ్మాయితోనైనా పెళ్లి జరిపిస్తామని వధువు, వరుడు (Groom) తరపువారు అధికారులను వేడుకున్నారు. మైనర్ బాలికకు పెళ్లి చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు గట్టిగా హెచ్చరించడంతో వారు వెనక్కు తగ్గారు. కాగా, చివరిలో ఇరువర్గాలు మాట వినకపోవడంతో ఐసీడీఎస్ (ICDS) సూపర్‌వైజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ శేఖర్ తెలిపారు. మరి రేపు ఉదయం ముహుర్తం సమయానికి పెళ్లి జరుగుతుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
చదవండి: ఆంధ్రా అబ్బాయి.. అమెరికా అమ్మాయి లవ్‌స్టోరీ
బాల్య వివాహాలు వద్దు
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వ్యవహారంపై జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చిన్నవయసులో పెళ్లి చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. బాల్యవివాహాలను అడ్డుకునే విషయంలో అధికారులు సమర్థవంతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం యంత్రాంగం పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు.