Child Marriage Act
-
పాపను మాతో పంపించండన్నా.. వినని పోలీసు అధికారి..!
సాక్షి, వరంగల్: మైనర్‌ను పెళ్లి చేసుకుని భద్రత కోసం వచ్చిన ఓ వ్యక్తికి వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు అనుకూలంగా వ్యవహరించడం సంచలనంగా మారింది. పుట్టిన తేదీకి ఆధార్ కార్డు ఆధారం కాదంటూ సుప్రీంకోర్టు చెప్పినా అదే ఆధార్ కార్డును ఆసరా చేసుకుని సదురు బాలికను మేజర్‌గా గుర్తించి మరీ అతడి వెంట పంపడం పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. మహిళల భద్రత విషయంలో ఎక్కడా తగ్గేదే లేదని ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే.. అందుకు విభిన్నంగా చెన్నారావుపేట పోలీసులు అది కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ వ్యవహరిస్తున్నారు. కనీసం బాధితురాలి తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకపోవడం తెరవెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ జోరుగా జరుగుతోంది. పాపను తమ వెంట పంపకుండా.. ఎక్కడ భద్రత కల్పిస్తారంటే సదరు ఎస్సై కనీస సమాధానం ఇవ్వకపోవడంతో మంగళవారం రాత్రంతా ఆ తల్లిదండ్రులకు జాగారం చేస్తూ బోరున విలపించారు. అన్ని ధ్రువపత్రాలు సమర్పించినా ససేమిరా.. దాదాపు 30 ఏళ్లున్న వ్యక్తితో బాలికకు వివాహం జరిగితే వాస్తవం తెలుసుకోకుండా సదరు పోలీసు అధికారి ఏకపక్షంగా వ్యవహరించడంతో బాలికల భద్రత చట్టం సరిగా అమలు అవుతుందా? లేదా అనే చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక(15)కు 30 ఏళ్ల వ్యక్తి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాలని కోరారు. ఆ వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందడంతో ఠాణాకు వెళ్లి తమ పాప బాలికనని తెలిపారు. దీనికి ఆధారంగా ఆధార్ కార్డు చూపించినా అదీ చెల్లదన్నారు. బాలిక పుట్టిన తేదీ, బాలిక జన్మించినప్పటి దవాఖాన డిశ్చార్జ్ కార్డు చూపించినా సదరు అధికారి తిరస్కరించారు. బాలిక చదివిన పాఠశాలలో స్టడీ సర్టిఫికెట్ తీసుకురమ్మని చెప్పగా ‘రాత్రి అయిందా కదా సార్ రేపు తీసుకొస్తాం. పాపను మాతో పంపించండన్నా’ స్పందించలేదు. ఆ తర్వాత తల్లిదండ్రులను అక్కడి నుంచి పంపిన అనంతరం బాలికను ఆ వ్యక్తితోనే పంపించారు. మంగళవారం సాయంత్రం వరకూ బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిబంధనలు ఏంటీ.. బాలల న్యాయ చట్ట ప్రకారం.. 18 సంవత్సరాలు లోపు బాలల విషయాలు పోలీసుల దృష్టికి వస్తే వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ హెల్ప్ లైన్, బాలల సంరక్షణ విభాగాలకు సమాచారం అందించాలి. సదరు అధికారులు బాలుడు లేదా బాలిక స్థితిగతులు తెలుసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి వారి ఆదేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. పోలీసులు ఏకంగా పెళ్లి చేసుకున్న వ్యక్తి వెంట సదరు బాలికను పంపించడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సీడబ్ల్యూసీ ముందుకువస్తే ఆ బాలికతో మాట్లాడి సఖి కేంద్రానికి పంపి కౌన్సెలింగ్ ఇస్తారు. లేదంటే తల్లిదండ్రులతోని వెళ్తానంటే పంపిస్తారు. అయితే ఇక్కడ అవేమీ జరగకుండా పోలీసులు నిర్ణయం తీసుకుని బాలికను ఆ వ్యక్తితో పంపడంతో ఆమె పరిస్థితి ఎలా ఉందనే టెన్షన్ తల్లిదండ్రుల్లో నెలకొని ఉంది. విచారణ చేపట్టిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ.. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు పోలీసులను కలిసి వచ్చిన అనంతరం మండల స్థాయి ఐసీడీఎస్ అధికారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. సదరు బాలికకు 15 సంవత్సరాలు మాత్రమే ఉండగా, చట్ట విరుద్ధంగా వ్యక్తి పెళ్లి చేసుకున్నాడని, బాలిక ఆచూకీ సైతం లేదని సీడబ్ల్యూసీ కమిటీని ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. కాగా, బాలల న్యాయ చట్టాలను ఉల్లంఘించిన సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాలల హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. -
బాల్య వివాహం నుంచి బాలికకు విముక్తి
ఏలూరు(మెట్రో): ఫేస్బుక్ ద్వారా కలెక్టర్‌కి వచ్చిన సమాచారం మేరకు బాల్య వివాహం నుంచి ఓ బాలికకు విముక్తి కలిగింది. స్థానిక చెంచుల కాలనీలో బాల్యవివాహానికి పెద్దలు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు వెంటనే స్పందించిన కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ చర్యలు చేపట్టారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీహెచ్ సూర్య చక్రవేణి చైల్డ్ హెల్ప్‌లైన్ బృందం సమన్వయంతో అంగన్వాడీ వర్కర్ సహకారంతో బాలిక ఇంటికి చేరుకొని విచారణ చేశారు. బాలిక తండ్రి 12 ఏళ్ల క్రితం చనిపోగా, తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటినుంచి బాలిక తన అక్క, అన్నతో కలిసి నానమ్మ ఇంటి వద్ద ఆశ్రయం పొందుతోంది. కూలీ పని చేసుకొనే నానమ్మ, తాతయ్య ఆమెకు వివాహం చేయాలని భావించి ఓ అబ్బాయితో నిశ్చితార్థం చేయించారు. మరో నాలుగు రోజుల్లో వివాహ తేదీని నిర్ణయిస్తారని తెలిసిన బాలిక తనకు తెలిసిన వారి ద్వారా విషయాన్ని ఫేస్బుక్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై స్పందించిన కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. బాలిక నానమ్మ, తాతయ్యలకు కౌన్సెలింగ్ నిర్వహించి, బాల్యవివాహా ప్రక్రియను రద్దు చేయాలని డీపీపీఓను ఆదేశించారు. అలాగే బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లి ఆమెకు అడ్మిషన్ ఇప్పించడంతో పాటు చదువుకు కావాల్సిన అవసరాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే సొంత ఖర్చులతో ఆ బాలికకు సైకిల్, బ్యాగ్, పుస్తకాలు, యూనిఫాం మొదలైనవి కలెక్టర్ సమకూర్చారు. బాలికకు ధైర్యం చెప్పి జీవితంలో ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. డీసీపీవో సీహెచ్ సూర్యచక్రవేణి, సిబ్బంది రాజేష్, శ్రీకాంత్, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది రాజు, ప్రసాద్, సునీత తదితరులు పాల్గొన్నారు. -
బాలికను బలవంతపు పెళ్లి చేసుకున్న విద్యార్ధి
తూర్పుగోదావరి ,అల్లవరం: ఓ బాలికను యువకుడు బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు అల్లవరం పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో రామచంద్రపురానికి చెందిన పోలినాటి మణితేజ చదువుతున్నాడు. ఇదిలా ఉంటే ఓ బాలిక తల్లి జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. దీంతో ఆమె ఓడలరేవులోని అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. బీవీసీలో ఇంజినీరింగ్ చదువుతున్న మణితేజ ఆ బాలిక అమ్మమ్మ ఇంట్లోకి అద్దెకు వచ్చాడు. ఈ సమయంలో బాలికతో పరిచయం పెంచుకున్నారు. అక్కడితో ఆగకుండా పరిచయాన్ని కాస్తా పెళ్లి వరకు తీసుకొచ్చాడు. బాలికకు పెళ్లి ఇష్టం లేకపోయినా గత నెల 29న తన స్నేహితులతో బలవంతంగా తీసుకొచ్చి బెండమూర్లంక వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అక్కడి నుంచి రామచంద్రపురానికి తీసుకెళ్లాడు. అక్కడేం జరిగిందో బలవంతంగా పెళ్లి చేసుకున్న మణితేజ నుంచి తప్పించుకుని శనివారం అల్లవరం పోలీస్ స్టేషన్లో బాలిక ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఎస్సై బి.ప్రభాకరరావు కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ మాసూమ్ బాషా దర్యాప్తు చేపట్టారు. -
ఎగ ‘తాళి’
సాక్షి, బెంగళూరు : హైస్కూల్లో చదువుకోవాల్సిన వయసులో పెళ్లిపీటలు ఎక్కడం, పీయూసీకి వెళ్లాల్సిన సమయంలో చంకలో బిడ్డతో చాకిరీ చేయడం.. ఇదీ రాష్ట్రంలో దుస్థితి. బాల్య వివాహాలకు రాష్ట్రం కేరాఫ్‌గా మారింది. చదువుకుని వృద్ధిలోకి రావాల్సిన ఎంతోమంది బాలలు సంసార చక్రబంధంలో నలిగిపోతుండడం విషాదం. ఆడుతూ పాడుతూ అందంగా సాగిపోవాల్సిన బాల్యం వివాహ భారంతో తల్లడిల్లుతోంది. వివాహాలు బాల్యానికి గుదిబండగా మారుతున్నాయి. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండకముందే పెళ్లిళ్లు చేస్తే నేరమని చట్టాలు చెబుతున్నా బాల్య వివాహాలు రాష్ట్రంలో ఎక్కడా తగ్గడం లేదు. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 అమల్లోకి వచ్చినప్పటికీ ఫలితం ఉండడం లేదు. మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, పేదరికం తదితరాల కారణంగా రాష్ట్రంలో ఆ జాఢ్యం నాటుకుపోయింది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో మొత్తం 453 బాల్య వివాహాలు జరిగాయి. నిర్వాహకులపై 276 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. కాగా, 5,860 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగలిగారు. అయితే వెలుగులోకి రాకుండా జరిగిపోతున్న బాల్య వివాహాలు వేలల్లో ఉంటాయని అంచనా. కల్యాణ కర్ణాటకలోనే అధికం.. కల్యాణ (ఉత్తర) కర్ణాటక ప్రాంతంలోని కొప్పళ జిల్లాలో 2019 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లో 259 బాల్య వివాహాలను మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారులు, చైల్డ్‌లైన్, వివిధ ఎన్జీవోలు అడ్డుకున్నాయి. ఇక మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శశికళా జొల్లే సొంత జిల్లా బెళగావిలో ఐదేళ్లలో 26 బాల్య వివాహాలు జరగ్గా, 576 వివాహాలను అడ్డుకోగలిగారు. మిగిలిన జిల్లాల కంటే ఈ బెళగావి జిల్లాలోనే అత్యధిక బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగలిగారు. ఇక కల్యాణ కర్ణాటక ప్రాంతంలో బాల్య వివాహాల్లో కొప్పళ, కలబురిగి తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అగ్రస్థానంలో మండ్య ►2015 నుంచి 2019 డిసెంబర్ వరకు మొత్తం 5,860 బాల్య వివాహాలను వివిధ సంస్థలు, పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. ►ఇందులో 1,799 బాల్య వివాహాలు ఉత్తర కర్ణాటకలోనివి కావడం విశేషం. ►ఐదేళ్లలో మండ్య జిల్లా ఒక్కదాంట్లోనే ఏకంగా 74 వివాహాలు జరిగి మొదటి స్థానంలో నిలిచింది. అత్యల్పంగా ఉడుపిలో నాలుగు, దక్షిణ కన్నడ జిల్లా 3 చొప్పున జరిగాయి. ►కొప్పళ జిల్లాలో 2012–13లో జరిగిన బాల్య వివాహం కేసులో వరునికి రెండేళ్లు జైలు, రూ. 30 వేలు జరిమానా విధించారు. ఒక వధువు తల్లి, పిన్నమ్మకి రెండేళ్ల జైలు, చెరో రూ. 10 వేల జరిమానా విధించారు. చిక్కబళ్లాపుర జిల్లాలో 2015లో జరిగిన బాల్య వివాహం కేసులో తల్లిందండ్రులకు రూ. 45 వేలు జరిమానా విధించారు. అయితే శిక్షలు పడుతున్న కేసులు ఒకటీ అరా మాత్రమే. కమిటీలతో నిలిచిపోతాయా? మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ వివిధ రీతుల్లో అవగాహన కల్పిస్తున్నా బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడడం లేదు. బాల్య వివాహాలను నివారించేందుకు గ్రామ, తాలూకా, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కమిటీలను ప్రభుత్వం వేసింది. గ్రామ పంచాయతీల్లో రెండు నెలలకొకసారి, తాలూకా, జిల్లాస్థాయిలో మూడునెలల కొకసారి, రాష్ట్రస్థాయిలో ప్రతి ఆరు నెలలకొకసారి సదరు కమిటీ సమావేశాలు నిర్వహించి బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని ఆదేశించింది. -
తొమ్మిదేళ్ల చిన్నారికి పెళ్లి!
ఔరంగాబాద్: డబ్బుకు ఆశపడి తొమ్మిదేళ్ల చిన్నారికి పెళ్లి చేయాలని చూసిన ఓ మహిళను ఔరంగాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా మజల్గావ్లో చోటు చేసుకుంది. ఆశామతి గోలప్ అనే మహిళ రూ. 30 వేల కోసం తన బిడ్డను, మిత్రురాలి కొడుక్కిచ్చి బాల్యవివాహం చేయడానికి నిశ్చయించింది. ఆదివారానికి పెళ్లి ముహూర్తం పెట్టుకోగా, స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు పెళ్లి వేదికకు చేరుకుని ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితులపై బాల్య వివాహాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆ చట్టం ముస్లింలకూ వర్తిస్తుంది
అహ్మదాబాద్: గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాల్యవివాహ నిరోధక చట్టం అన్ని మతాలవారికీ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. గుజరాత్‌కు చెందిన యూనుస్ షేక్ అనే ముస్లిం దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. బాల్యవివాహ నిరోధక చట్టం ప్రత్యేక చట్టమని, కనుక ముస్లింలకు కూడా ఇది సమానంగా వర్తిస్తుందని తీర్పు వెలువరించింది. ముస్లిం, హిందూ లేదా ఇతర మతాల వ్యక్తిగత చట్టాల్లోని కొన్ని అంశాలను సైతం తోసిపుచ్చుతుందని జస్టిస్ జెబి పర్దివాలా స్పష్టం చేశారు. ఆయా పర్సనల్ లా లోని అంశాలకు అతీతంగా బాల్య వివాహ నిరోధక చట్టం పని చేస్తుందన్నారు. దీంతోపాటు మార్పులు, చేర్పులకు అనుమతించని ముస్లిం పర్సనల్ లా చట్టం వల్ల ముస్లింలకు తీరని నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. గుజరాత్లో యూనుస్ షేర్ అనే వ్యక్తి 16 ఏళ్ల బాలికను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. తాను ముస్లింననీ, ముస్లిం పర్సనల్ లా ప్రకారం బాల్య వివాహ నిరోధక చట్టం తనకు వర్తించదని వాదిస్తూ పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే యూనుస్ వాదనలను హైకోర్టు తిరస్కరించింది. చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.