ఎగ ‘తాళి’ | Karnataka Is Care Of Child Marriages Are More In | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలు అక్కడే అధికంగా ఉన్నాయట!

Published Sun, Feb 23 2020 9:38 AM | Last Updated on Sun, Feb 23 2020 10:12 AM

 Karnataka Is Care Of Child Marriages Are More In - Sakshi

సాక్షి, బెంగళూరు : హైస్కూల్లో చదువుకోవాల్సిన వయసులో పెళ్లిపీటలు ఎక్కడం, పీయూసీకి వెళ్లాల్సిన సమయంలో చంకలో బిడ్డతో చాకిరీ చేయడం.. ఇదీ రాష్ట్రంలో దుస్థితి. బాల్య వివాహాలకు రాష్ట్రం కేరాఫ్‌గా మారింది. చదువుకుని వృద్ధిలోకి రావాల్సిన ఎంతోమంది బాలలు సంసార చక్రబంధంలో నలిగిపోతుండడం విషాదం. ఆడుతూ పాడుతూ అందంగా సాగిపోవాల్సిన బాల్యం వివాహ భారంతో తల్లడిల్లుతోంది. వివాహాలు బాల్యానికి గుదిబండగా మారుతున్నాయి.

అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండకముందే పెళ్లిళ్లు  చేస్తే నేరమని చట్టాలు చెబుతున్నా బాల్య వివాహాలు రాష్ట్రంలో ఎక్కడా తగ్గడం లేదు. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 అమల్లోకి వచ్చినప్పటికీ ఫలితం ఉండడం లేదు. మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, పేదరికం తదితరాల కారణంగా రాష్ట్రంలో ఆ జాఢ్యం నాటుకుపోయింది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో మొత్తం 453 బాల్య వివాహాలు జరిగాయి. నిర్వాహకులపై 276 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. కాగా, 5,860 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగలిగారు. అయితే వెలుగులోకి రాకుండా జరిగిపోతున్న బాల్య వివాహాలు వేలల్లో ఉంటాయని అంచనా.  

కల్యాణ కర్ణాటకలోనే అధికం.. 
కల్యాణ (ఉత్తర) కర్ణాటక ప్రాంతంలోని కొప్పళ జిల్లాలో 2019 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు 9 నెలల్లో 259 బాల్య వివాహాలను మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారులు, చైల్డ్‌లైన్, వివిధ ఎన్‌జీవోలు అడ్డుకున్నాయి. ఇక మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శశికళా జొల్లే సొంత జిల్లా బెళగావిలో ఐదేళ్లలో 26 బాల్య వివాహాలు జరగ్గా, 576 వివాహాలను అడ్డుకోగలిగారు. మిగిలిన జిల్లాల కంటే ఈ బెళగావి జిల్లాలోనే అత్యధిక బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగలిగారు. ఇక కల్యాణ కర్ణాటక ప్రాంతంలో బాల్య వివాహాల్లో కొప్పళ, కలబురిగి తదుపరి స్థానాల్లో ఉన్నాయి.  

అగ్రస్థానంలో మండ్య  
►2015 నుంచి 2019 డిసెంబర్‌ వరకు మొత్తం 5,860 బాల్య వివాహాలను వివిధ సంస్థలు, పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు.  
►ఇందులో 1,799 బాల్య వివాహాలు ఉత్తర కర్ణాటకలోనివి కావడం విశేషం.  
►ఐదేళ్లలో మండ్య జిల్లా ఒక్కదాంట్లోనే ఏకంగా 74 వివాహాలు జరిగి మొదటి స్థానంలో నిలిచింది. అత్యల్పంగా ఉడుపిలో నాలుగు, దక్షిణ కన్నడ జిల్లా 3 చొప్పున జరిగాయి.  
►కొప్పళ జిల్లాలో 2012–13లో జరిగిన బాల్య వివాహం కేసులో వరునికి రెండేళ్లు జైలు, రూ. 30 వేలు జరిమానా విధించారు. ఒక వధువు తల్లి, పిన్నమ్మకి రెండేళ్ల జైలు, చెరో రూ. 10 వేల జరిమానా విధించారు. చిక్కబళ్లాపుర జిల్లాలో 2015లో జరిగిన బాల్య వివాహం కేసులో తల్లిందండ్రులకు రూ. 45 వేలు జరిమానా విధించారు. అయితే శిక్షలు పడుతున్న కేసులు ఒకటీ అరా మాత్రమే.  

కమిటీలతో నిలిచిపోతాయా?  
మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ వివిధ రీతు­ల్లో అవగాహన కల్పిస్తున్నా బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడడం లేదు. బాల్య వివాహాలను నివారించేందుకు గ్రామ, తాలూకా, జిల్లా, రాష్ట్ర­స్థాయిల్లో కమిటీలను ప్రభుత్వం వేసింది. గ్రామ పంచాయతీల్లో రెండు నెలలకొకసారి, తాలూకా, జిల్లాస్థాయిలో మూడునెలల కొకసారి, రాష్ట్రస్థాయిలో ప్రతి ఆరు నెలలకొకసారి సదరు కమిటీ సమావేశాలు నిర్వహించి బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని ఆదేశించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement