బాలికకు పుస్తకాలు, సైకిల్ అందిస్తున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ఏలూరు(మెట్రో): ఫేస్‌బుక్ ద్వారా కలెక్టర్‌కి వచ్చిన సమాచారం మేరకు బాల్య వివాహం నుంచి ఓ బాలికకు విముక్తి కలిగింది. స్థానిక చెంచుల కాలనీలో బాల్యవివాహానికి పెద్దలు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు వెంటనే స్పందించిన కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ చర్యలు చేపట్టారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీహెచ్ సూర్య చక్రవేణి చైల్డ్ హెల్ప్‌లైన్ బృందం సమన్వయంతో అంగన్‌వాడీ వర్కర్ సహకారంతో బాలిక ఇంటికి చేరుకొని విచారణ చేశారు. బాలిక తండ్రి 12 ఏళ్ల క్రితం చనిపోగా, తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.
అప్పటినుంచి బాలిక తన అక్క, అన్నతో కలిసి నానమ్మ ఇంటి వద్ద ఆశ్రయం పొందుతోంది. కూలీ పని చేసుకొనే నానమ్మ, తాతయ్య ఆమెకు వివాహం చేయాలని భావించి ఓ అబ్బాయితో నిశ్చితార్థం చేయించారు. మరో నాలుగు రోజుల్లో వివాహ తేదీని నిర్ణయిస్తారని తెలిసిన బాలిక తనకు తెలిసిన వారి ద్వారా విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై స్పందించిన కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. బాలిక నానమ్మ, తాతయ్యలకు కౌన్సెలింగ్ నిర్వహించి, బాల్యవివాహా ప్రక్రియను రద్దు చేయాలని డీపీపీఓను ఆదేశించారు.
అలాగే బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లి ఆమెకు అడ్మిషన్ ఇప్పించడంతో పాటు చదువుకు కావాల్సిన అవసరాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే సొంత ఖర్చులతో ఆ బాలికకు సైకిల్, బ్యాగ్, పుస్తకాలు, యూనిఫాం మొదలైనవి కలెక్టర్ సమకూర్చారు. బాలికకు ధైర్యం చెప్పి జీవితంలో ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. డీసీపీవో సీహెచ్ సూర్యచక్రవేణి, సిబ్బంది రాజేష్, శ్రీకాంత్, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది రాజు, ప్రసాద్, సునీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment