
రెండు వేల రూపాయల నోటు తరహాలో పెళ్లి శుభలేఖ అచ్చు వేయించి అందర్నీ ఆశ్చర్యపరిచారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఏడిద వెంకటేష్. తన చిన్న కుమార్తె పెళ్లికి పరిమాణంలో.. రూపంలో అచ్చం రెండు వేల రూపాయల నోటును పోలినట్లుంది పెళ్లి కార్డు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అక్షరాలుండే చోట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లవ్ అనే పదముంది.
‘మేము ఇరువురం వివాహం చేసుకుంటున్నాం.. జీవితపు చివరి శ్వాసవరకూ కలసి ఉంటామని వాగ్దానం చేస్తున్నాం’ అని సింపుల్‌గా సారాంశం ఉంది. నోటుకు మరోవైపు పెళ్లి వివరాలు ముద్రించారు. కొందరికి శుభలేఖ చేతిలో పెడుతుంటే నిజంగా రెండు వేల నోటు అనుకుని నోటు తీసుకునేందుకు మొహమాటపడ్డారు.
శుభలేఖేనని తెలుసుకుని వారి సృజనశైలిని మెచ్చుకున్నారు. కాగా, 2017లో వెంకటేష్ తన పెద్ద కుమార్తె పెళ్లికి ఆహ్వాన పత్రికను బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో ముద్రించి ఆకట్టుకున్నారు. తక్కువ ఖర్చు, సృజనాత్మకత కోసమే తాను ఇలా చేశానని వెంకటేష్ ‘సాక్షి’కి తెలిపారు.
– రాజమహేంద్రవరం సిటీ