విజయనగరం, పూసపాటి రాజవంశం అమ్మాయి సంచయిత. గ్రామగ్రామం తిరుగుతోంది. ‘‘ఆడపిల్లల్ని బడికి పంపించండి’’ అని తల్లుల్ని కోరుతోంది. ఆడపిల్లల బాల్యాన్ని, చదువును నీళ్లు మోయడం కోసం బలి చేయవద్దని వేడుకుంటోంది. ‘‘నీళ్లు లేకపోవడం వల్లనే.. కేవలం నీళ్లు మోయడానికే ఆడపిల్లల్ని బడి మాన్పిస్తున్నట్లయితే... ఆ నీళ్లేదో నేనే ఇస్తాను’’ అంటోంది.. అనడమే కాదు స్కూళ్లలో సోలార్ పలకలు అమర్చి, నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ వేసవిలో మరికొన్నింటిని చేయబోతోంది. ఇదంతా ఆడపిల్లల్ని చదివించడానికే. ‘‘బడికి వచ్చి చదువుకోండి. ఇంటికి వెళ్లేటప్పుడు ఈ క్యాన్ నిండా మంచినీటిని మీ ఇంటికి పట్టుకువెళ్లండి’’ అని ఐదు లీటర్ల నీటి క్యాన్‌లను అమ్మాయిల చేతికి ఇస్తున్నారు సంచయిత. రాజు గారమ్మాయి తమ వాడల్లోకి వచ్చి ఇంత ఆపేక్షగా చెబుతుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం అమ్మాయిల్ని బడికి పంపించకుండా ఉండగలరు? ఆమె చూపించిన ఆత్మీయతే ఆడపిల్లల్లో అక్షరాస్యత పెంచాలన్న ఆమె పనిని సులువుగా మార్చేస్తోంది.
ప్యాలెస్‌లో పుట్టినా..!
‘‘నేను ప్యాలెస్‌లో పెరగలేదు, ప్రజల మధ్య పెరిగాను. మా తాత విజయరామ గజపతి రాజుగారు అభ్యుదయవాది. ఆడపిల్లలు చదువుకోవాలని, ప్రజాజీవితంలో క్రియాశీలకంగా ఉండాలని చెప్పేవారు. నా చదువంతా ఢిల్లీలోనే సాగింది. మా అమ్మ లోక్‌సభ సభ్యురాలిగా (రాణి ఉమాగజపతిరాజు) ఉన్నప్పుడు నేను చాలా చిన్నదాన్ని. ఓ సారి నా స్కూల్‌కి నెల రోజులు సెలవు పెట్టించి మరీ తనతోపాటు గ్రామాలన్నీ తిప్పి చూపించింది. ప్యాలెస్‌కి పరిమితం కాకుండా ప్రజా జీవితంలోకి వచ్చి పని చేయాలని అమ్మ చెప్పేది’’ అని చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు సంచయిత. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ ఆనర్స్, తర్వాత లా కోర్సు చేసి ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు సంచయిత. లాయర్‌గా ప్రాక్టీస్ చేయడం ఆమెకంటూ ఒక ఉపాధి కోసం మాత్రమే. చుట్టుపక్కల గ్రామాల్లో బాలికల విద్య కోసం పని చేయడం ఆమెకో సంతృప్తి. ‘ఆస్తులు వస్తుంటాయి, పోతుంటాయి. మనం చదువుకున్న చదువు మనతోపాటే ఉంటుంది. చదువుతోపాటు వచ్చిన జ్ఞానం మనల్ని నడిపిస్తుంది’ అనేవారు అమ్మ. ఆ మాటలనే నేను పని చేస్తున్న విశాఖ జిల్లాలో అమ్మాయిలకు చెప్తున్నాను’’ అన్నారు సంచయిత.
మహిళల సహకారం
‘‘ఇంట్లో ఇల్లాలు సౌకర్యంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. సామాన్య కుటుంబాల్లో అమ్మాయిల చదువు కోసం ఏం చేయాలి? ఎలా మొదలు పెట్టాలి? అనే ప్రశ్న నాలో మొదలైంది. విశాఖ జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లి నా ఆలోచనను చెప్పాను. జిల్లా విద్యాధికారి, మండల అభివృద్ధి అధికారుల ద్వారా స్కూళ్ల వివరాలు, గ్రామాలలో మౌలిక వసతుల లేమి పట్ల స్పష్టత వచ్చింది. మహిళలు సర్పంచ్‌గా ఉన్న గ్రామాలను ఎంపిక చేసుకుని వాళ్లను స్వయంగా కలిశాను. వాళ్ల మాటల్లో కూడా మంచి నీళ్లే మొదటి ప్రాధాన్యంలో ఉన్నాయి. మంచినీటి కోసం నేను ఏర్పాటు చేయాలనుకున్న పనులకు వాళ్ల సహకారం తీసుకున్నాను. వాటర్ ప్లాంట్‌లు, సోలార్ ప్యానల్స్, ఎనర్జీ జనరేషన్ ఎక్విప్‌మెంట్ వంటి వాటిని ఏర్పాటు చేయగలిగాను. ఆ గ్రామాల్లోనే ఉన్న మహిళలకు యంత్రాల నిర్వహణ పనులు నేర్పిస్తే నేర్చుకోగలిగిన వాళ్లకు శిక్షణనిచ్చి సోలార్ ప్లాంట్, వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యత అప్పగించాం. ‘ఒక పనిని బాధ్యతగా చేయడానికి ఆడ–మగ అనే తేడా ఉండదు. అవకాశం వస్తే ప్రతి ఒక్కరూ చేయగలరు’ అని నిరూపించాలనేదే నా ఆశయం. పైగా ఆడవాళ్లయితేనే ప్లాంటును తమ ఇంటిని ఉంచుకున్నంత శుభ్రంగా ఉంచుతారు. అందుకే ఆడవాళ్లనే నియమించమని చెబుతుంటాను’’ అని తెలిపారు ఆమె. ఒక న్యాయవాది దృష్టి సామాజిక స్థితిగతుల మీదకు మళ్లితే సమాజానికి న్యాయం జరుగుతుంది. అదే సామాజిక న్యాయం. స్త్రీ–పురుషుల మధ్య వివక్షను రూపుమాపడానికి ఉద్యమించి విజయం సాధిస్తే అదే సమన్యాయం. సంచయిత శ్రమ... సామాజిక న్యాయం, సమన్యాయ సాధన కోసమే.
విశాఖ అమ్మాయినే
‘‘విజయనగరంలో పుట్టాను. అమ్మమ్మ గారిల్లు మద్రాసు (చెన్నై)తో అనుబంధం పెంచుకున్నాను. అమ్మ సొంతూరు కేరళలోని పాల్ఘాట్. కానీ వాళ్ల కుటుంబం మద్రాసులో సెటిల్ అయింది. అమ్మ చదువు కూడా మద్రాసులోనే, స్టెల్లా మారిస్ స్టూడెంట్ ఆమె. ఢిల్లీలో ఉంటున్నాం. ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రాష్ట్రాలతో మమేకమై సాగుతున్న నా జీవితంలో ప్రథమ స్థానం మాత్రం విశాఖదే’’ అన్నారు సంచయిత.
చురుకైన కొత్త తరం
నేను దత్తత తీసుకున్న స్కూళ్లలో అమ్మాయిలతో మాట్లాడుతూ ‘పెద్దయిన తర్వాత నువ్వు ఏమవుతావు’ అని అడుగుతుంటాను. ఒకమ్మాయి ‘సోలార్ ఇంజనీర్ అవుతా’ అని చెప్పింది. అది విని నాకు చాలా ముచ్చటేసింది. ఇంజనీరింగ్ అంటే అది అబ్బాయిల కోర్సు అనే అపోహ తొలగిపోయినందుకు రిలీఫ్ కలిగింది. అమ్మతో పాటు పాతిక–ముప్పయ్ ఏళ్ల కిందట చూసిన పరిస్థితులు గ్రామాల్లో ఇప్పుడు లేవు. ఎనిమిదేళ్ల కిందట నేను సన (సోషల్ అవేర్‌నెస్ న్యూయర్ ఆల్టర్‌నేటివ్స్) సంస్థ నిర్వహకురాలిగా గ్రామాల్లో అడుగుపెట్టినప్పుడు కూడా మహిళల్లో ఈ మాత్రపు చొరవను చూడలేదు. – సంచయితా గజపతి రాజు
ఇప్పటికి ఇరవై గ్రామాలు
సంచయిత.. 2013లో గూగుల్ గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్ అవార్డు అందుకున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం రంగాల్లో విశిష్ట సేవలందించిన సంస్థకు ఇచ్చే అవార్డు ఇది. ఆ అవార్డుతో వచ్చిన మూడు కోట్ల నగదు తన కార్యాచరణకు ఉపయోగపడుతోందని చెప్పారామె. మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణ, రెన్యూవబుల్ ఎనర్జీ, వ్యవసాయ రంగాల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన సంచయిత ఇప్పటివరకు ఇరవై గ్రామాలు, మరో ఇరవైకి పైగా స్కూళ్లలో మంచినీరు, పారిశుద్ధ్య వసతులు కల్పించారు. ‘సన సూర్య సుజల ధార, హరిత బయో టాయిలెట్స్’ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్టణం జిల్లాలోని చినగందిల మండలం, పరదేశిపాలెంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్, గాజువాక మండలం నెలిముక్కులో ఉన్న సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌లో నిర్మించిన ప్లాంట్‌లను మార్చి మొదటి వారంలో విద్యార్థినులకు అంకితం చేస్తున్నారు. – వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment