యూట్యూబ్‌ ద్వారా ఏడాదికి రూ.8 కోట్లు సంపాదిస్తున్న మహిళ | Investment banker Nischa Shah made Rs 8 crore a year through YouTube | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ ద్వారా ఏడాదికి రూ.8 కోట్లు సంపాదిస్తున్న మహిళ

Published Thu, Aug 8 2024 11:09 AM | Last Updated on Thu, Aug 8 2024 11:45 AM

 Investment banker Nischa Shah made Rs 8 crore a year through YouTube

కొందరంతే.. తాముఅనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. మంచి ఉద్యోగం, చక్కటి సంపాదన, ఆర్థికంగా బాగా ఉన్నా కూడా ఏదో చేయాలనే తపన వారిని స్థిమితంగా ఉండ నీయదు. లండన్‌కు చెందిన నీషా షా  ఈ కోవకు చెందినవారే. లండన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేస్తున్నా,  ఏడాదికి రెండున్నర లక్షలకు డాలర్లకు పైగా జీతం. కానీ  దాంతో సంతృప్తి దక్కలేదు. యూట్యూబర్‌గా  సరికొత్త అడుగులు వేసింది. కట్‌ చేస్తే ఏడాదికి ఎనిమిది కోట్లు  సంపాదిస్తోంది.  నీషా సక్సెస్‌ స్టోరీ తెలుసుకుందాం రండి.

నలుగురి కోసం
ఆరంకెల జీతం వస్తున్నా, బ్యాంకింగ్‌లో చేస్తున్నది కార్పొరేషన్‌లు, సార్వభౌమ ప్రభుత్వాలకు సహాయం చేయడమే కదా, తనకున్న విజ్ఞానం ద్వారా నలుగురి ప్రయోజన కోసం ఏదైనా చేయాలనిపించింది. దీనికి తగ్గట్టు చేస్తున్న పని సంతృప్తి నివ్వలేదు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. 2023 జనవరిలో బ్యాంకింగ్ వృత్తిని వదిలి  పూర్తిగా యూట్యూబ్‌నుకొనసాగించడానికి ధైర్యంగా ముందుకు సాగింది. ఒక్క ఏడాదిలోనే అనూహ్య విజయాన్నందుకుంది.

2021 డిసెంబర్‌లో తన పేరుతోనే ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. తనకు ఆసక్తి , పట్టు ఉన్న పర్సనల్‌ ఫైనాన్స్‌, సెల్ఫ్‌ డెవలప్‌మెంట్‌, బిజినెస్‌కు సంబంధించిన అంశాలపై వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ప్రతి వారం రెండు వీడియోలు పోస్ట్‌ చేసేది.  బిజినెస్‌ విషయాలు కావడం  మొదట్లో ఆశించినంత ఆదరణ లభించలేదు. వెయ్యి మంది సబ్‌స్క్రైబర్ల కోసం దాదాపు సంవత్సరం  వేచి చూడాల్సి వచ్చింది.అయినా పట్టుదలగా ముందుకే  సాగింది. ఈ క్రమంలోనే  2022 సెప్టెంబరులో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా ఆమె అనుభవాలను వివరిస్తూ చేసిన  వీడియో వైరల్ అయింది. 50వేలకు పైగా సబ్‌స్క్రైబర్‌లు వచ్చారు. రూ.3 లక్షలు సంపాదించింది. అందరికంటే భిన్నంగా ఆర్థిక విషయాలపై అవగాహన కల్పింస్తూ తన అభిమానులను ఎడ్యుకేట్‌ చేస్తోంది. పర్సనల్‌ ఫైనాన్స్‌ గురించి సులభంగా, సరళంగా అర్థమయ్యేలా వీడియోలను షేర్‌ చేస్తుంది. ముఖ్యంగా  "మనీ హ్యాబిట్స్ కీపింగ్ యు పూర్" నుండి "మీ తొలిపెట్టుబడి  ఎలా పెట్టాలి" వరకు అంశాలపై సలహాలను అందిస్తోంది.  స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ పెట్టుబడి వ్యూహాలను అందిస్తుంది. ఆమె కంటెంట్ విభిన్నంగా, బిజినెస్‌లో చక్కటి సూచనలు సలహాలతో ఫాలోవర్ల మనసు దోచుకుంది. 

అలా 2024 మే నాటికి ఆమె సంపాదన రూ. 8 కోట్లను దాటేసింది. యూట్యూబ్ మానిటైజేషన్, కోర్సు విక్రయాలు, కార్పొరేట్ స్పీకింగ్ ఎంగేజ్‌మెంట్‌లు, బ్రాండ్స్‌ పార్టనర్‌షిప్ ఇందులో ఉన్నాయి. నచ్చిన పని చేయడంలో సంతోషం, విజయం ఉంటాయని చాటి చెప్పింది. సాధించాలన్న అభిరుచి ,పట్టుదల, టాలెంట్‌ ఉంటో ఆర్థికంగా ఎలా ఉన్నత శిఖరాలకు చేరవచ్చో నీషా స్టోరీ మనకు తెలియజేస్తుంది. లండన్‌కు చెందిన నీషా షా నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌ విభాగంలో డిగ్రీ , ఆ తర్వాత ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ) చదివారు. 

ఆ రోజుల్లో కార్పొరేట్‌ ఉద్యోగాన్ని  వదులుకోవడం అంటే దాదాపు 80 శాతం ఆదాయాన్ని కోల్పోవడమే. కానీ కష్టమైనా ఇష్టమైన నిర్ణయం తీసుకున్నా.  ఇపుడు బ్యాంకింగ్‌ ఉద్యోగంలో పొందిన జీతం కంటే యూట్యూబర్‌గా ఎక్కువ సంపాదిస్తున్నాను. ఇది సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది- నీషా. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement