శాంభవి చౌదరి
న్యూస్‌మేకర్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిహార్ నుంచి 25 ఏళ్ల శాంభవి చౌదరి ఎన్నికల్లో పోటీ చేయనుంది. దేశంలో అతి చిన్నవయసు మహిళా దళిత అభ్యర్థిగా శాంభవి వార్తల్లో నిలిచింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా తాను వేయదగ్గ ముద్ర... తనదైన దృష్టికోణం ఉన్నాయంటున్నది శాంభవి.
‘నేను పనిచేసే చోట స్త్రీలు, యువతే నా లక్ష్యం. వీరికి ఆర్థిక స్వావలంబన, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తే అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది’ అంటోంది శాంభవి చౌదరి. 25 ఏళ్ల 9 నెలల వయసు వున్న ఈ డాక్టరెట్ స్టూడెంట్ బిహార్‌లోని ‘సమస్తిపూర్’ పార్లమెంట్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తరఫున పోటీ చేయనుంది. ఇది రిజర్వ్‌డ్ స్థానం. బహుశా శాంభవి దేశంలోనే అత్యంత చిన్న వయసు కలిగిన దళిత మహిళా అభ్యర్థి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. అందుకే అందరూ ఆమెవైపు ఆసక్తిగా చూస్తున్నారు.
రాజకీయ కుటుంబం నుంచి
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎం.ఏ. సోషియాలజీ చేసి ఇప్పుడు ‘బిహార్ రాజకీయాల్లో కులం, జెండర్ ప్రాధాన్యత’ అనే అంశం మీద పీహెచ్‌డీ చేస్తున్న శాంభవి రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి అశోక్ కుమార్ చౌదరి జెడి (యు)లో మంత్రి. తాత మహదేవ్ చౌదరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేశారు.
శాంభవి భర్త సాయన్ కునాల్ సామాజిక రంగంలో ఉన్నాడు. ఈమె మామగారు మాజీ ఐ.పి.ఎస్ అధికారి ఆచార్య కిశోర్ కునాల్ దళితుల కోసం చాలా పోరాటాలే చేశాడు. చాలా గుడులలో దళిత పురోహితులను ఆయన నియమించాడు. వీరందరి మధ్యలో చదువు మీద దృష్టి పెట్టి, పరిశోధన కొనసాగిస్తున్న శాంభవి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో దిగింది.
నాకంటూ వ్యక్తిత్వం ఉంది
శాంభవి పోటీ చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఎన్‌డిఏ కూటమిలో ఉంది. బిజెపి కుటుంబ వారసత్వం గురించి అభ్యంతరం చెప్పడం తెలిసిందే. ‘మీ నాన్నగారు మంత్రి. మరి మీకు సీటిచ్చారు’ అనే ప్రశ్నకు ‘నిజమే. కాని నాకు సీటు రావడంలో ఆయన ప్రమేయం మాత్రం లేదు. చిన్నప్పటి నుంచి నేను మా తాత, నాన్న పేదవాళ్ల సమస్యలు వింటూ వారి కోసం పనిచేయడం చూస్తూ పెరిగాను. అది నామీద ఎక్కడో ప్రభావం చూపింది.
దళితుల్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా, చదువుకున్న మహిళగా దళితుల పట్ల నాకు అవగాహన ఉంది. రాజకీయ కుటుంబం నుంచి రావడం వల్ల ప్రజలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు. ఎలక్షన్లు సమీపించేవరకూ నేను నిలబడాలని అనుకోలేదు. కాని సమీపించాక లోక్ జనశక్తి చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌తో చెప్పాను. ఆయన నా భర్తను సొంత తమ్ముడిలా చూస్తారు. అంతేకాదు, బిహార్ రాజకీయాలలో యువత రాణించాలని భావిస్తారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయన్న కారణం రీత్యానే సీట్ ఇచ్చారు’ అని తెలిపిందామె.
అత్తగారి ఊరు
పట్నాలో పుట్టి పెరిగిన శాంభవి తన అత్తగారి ఊరైన సమస్తిపూర్‌లో గెలవడానికి సిద్ధమవుతోంది. ‘ఆ ఊరి గురించి నిజం చెప్పాలంటే నాకేమీ తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మొదట అక్కడ ఒక ఇల్లు కొని అక్కడే ఉంటానన్న భరోసా కల్పించాలి. ఆ ఊరి యువతతో ఇప్పటికే కాంటాక్ట్‌లోకి వెళ్లాను. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపిస్తారు. అవి వమ్ము చేయకుండా ఉండటమే నా ప్రథమ లక్ష్యం’ అంటున్న శాంభవి రాజకీయ జీవితాన్ని త్వరలో ఓటర్లు నిర్ణయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment