నేర్చుకోవాలనే తపన ఉంటే... అదే తపస్సు. ఆ తపస్సు ఫలితాలు ఊరకే పోవు. విజయాలకు బలాన్ని ఇస్తాయి. ఎలాంటి డిగ్రీలు, అనుభవం లేకుండానే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది స్నేహిల్ దీక్షిత్ మెహ్రా. వేగంగా నేర్చుకోవాలనే తపన ఆమె బలం. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, రైటర్, కంటెంట్ క్రియేటర్, యాక్టర్, క్రియేటివ్ డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది.
జర్నలిస్ట్ కావాలనుకుంది స్నేహిల్. ‘అదేం కుదరదు. ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాల్సిందే’ అన్నారు తల్లిదండ్రులు. దీంతో భో΄ాల్‌లో ఇంజినీరింగ్ చేసింది. చదువు పూర్తయిన తరువాత ముంబైలోని ఒక ఐటీ సంస్థలో పనిచేసింది. ఉద్యోగం చేస్తున్న మాటేగానీ తన మనసంతా టీవీ రంగంపైనే ఉండేది. ఒక ఫైన్ మార్నింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక చానల్‌లో ట్రైనీగా చేరింది. తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు.‘జర్నలిజంలో ఎలాంటి డిగ్రీ లేకుండా నెగ్గుకు రావడం కష్టం’ అన్నారు.
ఆ తరువాత తల్లి మాత్రం ‘ఫరవాలేదు’ అన్నట్లుగా మాట్లాడింది. అండగా నిలబడింది. ముంబైలో ఉండే సోదరుడుప్రోత్సహించాడు.
కొత్త ప్రయాణంలో స్నేహిల్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ‘ఓటమిని దరి చేరనివ్వవద్దు’ అని బలంగా అనుకునే స్నేహిల్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తూ వెళ్లింది. సవాళ్లను అధిగమించే శక్తి తనకు త్వరగా నేర్చుకునే నైపుణ్యం నుంచి వచ్చింది.
స్టోరీ టెల్లింగ్‌పై ఉన్న ΄ాషన్‌తో టెలివిజన్ నుంచి ఓటీటీకి అక్కడి నుంచి సోషల్ మీడియాకు వచ్చిన స్నేహిల్ ప్రతిచోటా తనను తాను నిరూపించుకుంది. ఎన్నో షోలు చేసి రైటర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ‘అప్‌హరణ్’ వెబ్ సిరీస్‌లో నటించడం ద్వారా నటిగా కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇదంతా ఒక్క ఎత్తయితే ‘హీరామండీ’ కోసం డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ టీమ్‌లో చేరడం మరో ఎత్తు.
రైటింగ్ విభాగంలో పనిచేసిన స్నేహిల్‌కు సంజయ్ లీలా భన్సాలీ కొన్ని సీన్‌లను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు. ఆ సీన్‌లు బాగా చేయడంతో ‘హీరామండీ’ సిరీస్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా ప్రమోట్ అయింది.
‘ఇది పదిహేడు సంవత్సరాల కష్టఫలితం. భన్సాలీతో పని చేయడం వరంలాంటిది. ఫిల్మ్‌మేకర్,ప్రొడ్యూసర్‌గా ఆయనకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయనతో పనిచేయడం అంటే ఫిల్మ్ స్కూల్‌లో చేరి ఎన్నో విషయాలు నేర్చుకోవడంలాంటిది’ అంటుంది స్నేహిల్.
ఇక ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తన అనుభవాన్ని గురించి చెబుతూ...
‘కామెడీ అనేది రిస్క్. కొన్నిసార్లు ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో ఊహించలేము. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నా వీడియోల నుంచి ఇన్‌స్టంట్ ఫీడ్‌బ్యాక్ తెలుసుకునేదాన్ని. ఫలానా వీడియో అభ్యంతరకరంగా, నొప్పించేలా ఉంది అనే కామెంట్స్ కనిపిస్తే వెంటనే ఆ వీడియోను తొలిగించేదాన్ని. ఎవరినీ నొప్పించకుండా అందరూ హాయిగా నవ్వుకునేలా కంటెంట్‌ను రూ΄÷ందించడం అనేది నిజంగా సవాలే’ అంటుంది బహుముఖ ప్రజ్ఞాశాలి స్నేహిల్ దీక్షిత్ మెహ్ర.
కలల దారిలో...
కలలు కనడం అనేది నాకు చిన్నప్పటి నుంచే అలవాటు. కల కనడం గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఉత్సాహం దగ్గర మాత్రమే ఆగిపోకుండా నా కలను సాకారం చేసుకోవడానికి కష్టపడ్డాను. నేర్చుకోవాలనే ఉత్సాహం, నిరంతర కష్టం మనకు విజయాన్ని చేకూరుస్తాయి. – స్నేహిల్ దీక్షిత్ మెహ్ర
Comments
Please login to add a commentAdd a comment