నర - నారీ కథ నవ్వులాట కాదు గౌరవానికి స్త్రీకారం
పొల్లాచ్చిలో పుట్టి శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థిరపడిన ఈ ట్రాన్స్ ఉమన్ మన దేశ తొలి ట్రాన్స్ ఉమన్ డైరెక్టర్‌గా చరిత్రకు ఎక్కింది. పురుషుడిగా పుట్టి స్త్రీగా మారడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆ ఘర్షణను ‘నీల నిర సూర్యన్’ పేరుతో సినిమా తీయడమే కాదు ముఖ్యపాత్ర పోషించింది. నేడు ఈ చిత్రం విడుదల సందర్భంగా సంయుక్త పరిచయం.
2016.
తమిళనాడు–తిరుచ్చిలోని సొంత ఇంటికి దీపావళి పండక్కు వచ్చిన సంతోష్ అమెరికాకు తిరిగి వెళుతూ ‘అమ్మా... వచ్చే దీపావళికి నేను అమ్మాయిగా వస్తాను’ అని చెప్పాడు. తల్లి ఉలిక్కి పడలేదు. కన్నీరు కార్చలేదు. ‘నీ ఇష్టంరా. నీకెలా సంతోషంగా ఉంటే అలా చెయ్’ అంది. అమెరికాకు వెళ్లాక సంతోష్ ట్రాన్స్ ఉమన్‌గా మారడానికి అవసరమైన వైద్యం, చికిత్సలు చేయించుకున్నాడు. శనివారం వరకూ అబ్బాయి రూపంలోనే వెళ్లిన సంతోష్ సోమవారం నుంచి ‘సంయుక్త’ గా ఆఫీస్‌లో అడుగు‘పెట్టింది’. అయితే స్నేహితులు ఎటువంటి తేడా చూపించలేదు. అబ్బాయి సంతోష్‌తో ఎంత స్నేహంగా ఉన్నారో అమ్మాయి సంయుక్తతో అంత స్నేహంగా ఉన్నారు. ‘అందరి కథ ఇంత సులువుగా ఉండదు. అందుకే సినిమా తీశాను’ అంటుంది సంయుక్త.
బీటెక్ గ్రాడ్యుయేట్
సంయుక్త తండ్రి టైలర్. తల్లి గృహిణి. ముగ్గురు కుమారుల్లో ఒకడుగా పుట్టాడు సంతోష్. ‘అయితే నా భౌతిక రూపానికి నా మానసిక స్వభావానికి పొంతన కుదరలేదు. నాలోని స్త్రీనే నేను స్వీకరించాను. నా తల్లిదండ్రులు ఇందుకు నన్ను ఇబ్బంది పెట్టకపోయినా బయట నేను సంప్రదాయవాదుల గేలిని, అల్లరిని, అవమానాన్ని భరించాను. ట్రాన్స్‌పర్సన్‌ల జీవితం వెండి తెర మీద రావడం తక్కువ. మగవాళ్లు కొందరు ఆ పాత్రలు ధరించారు. ఇటీవల ‘తాలి’ సినిమాలో సుస్మితా సేన్ బాగా చేసింది. కాని నేను ట్రాన్స్‌ఉమన్‌గా ఉంటూ సినిమా తీయడం వల్ల మేమూ ఇండస్ట్రీలో మా కథలు చెప్పగలం అని నిరూపించదలుచు కున్నాను’ అంటుంది సంయుక్త.
సినిమా అంటే తెలియకపోయినా...
‘మా పొల్లాచ్చిలో రోజూ షూటింగ్‌లే. కాని ఏవీ నేను చూడలేదు. షార్ట్‌ఫిల్మ్‌లు తీయలేదు. అసిస్టెంట్‌గా పని చేయలేదు. 2020లో నేను సినిమా తీయాలనుకున్నప్పుడు స్క్రిప్ట్ ఎలా రాయాలన్న సంగతిని యూట్యూబ్ పాఠాల ద్వారా తెలుసుకున్నాను. వందల వీడియోలు చూసి రెండేళ్ల పాటు స్క్రిప్ట్ రాశాను. నా జీవితాన్ని, నావంటి వారి జీవితంలోని ఘటనలను కలిపి ‘నీల నిర సూర్యన్’ సినిమా తీశాను. అంటే నీలి రంగు సూర్యుడు అని అర్థం. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ది బ్లూ సన్‌షైన్’ పేరుతో ప్రదర్శితమవుతుంది. తమిళ విడుదల కోసం తమిళ పేరు పెట్టాను’ అని తెలిపింది సంయుక్త.
సొంత డబ్బు పెట్టి...
సంయుక్త అమెరికాలో అమేజాన్‌లో ఉన్నత ఉద్యోగంలో ఉంది. తన సంపాదనలోని కొంత భాగాన్ని ఈ సినిమా కోసం ఖర్చు పెట్టింది. ‘సినిమాల్లో థర్డ్ జెండర్‌ని హాస్యానికే వాడి అపచారం చేశారు. ఇక మీదైనా ట్రాన్స్‌పర్సన్‌లను మర్యాదకరమైన రీతిలో ఇన్‌క్లూజివ్‌గా చూపి చేసిన పాపాన్ని కడుక్కోవాలి సినిమావారు. పరిస్థితి ఇంకా చిన్న ఊళ్లలో మారలేదు. ఉదాహరణకు ఒక స్కూల్లో టీచర్‌ని పిల్లలు గౌరవిస్తారు. కాని ఆ టీచర్ ట్రాన్స్ ఉమన్ అయితే తేడా వచ్చేస్తుంది. ఈ పరిస్థితి ΄ోవాలి. నేను తీసిన సినిమా కథ మాలాంటి వాళ్ల అస్తిత్వాన్ని గౌరవించవలసిందిగా అర్థం చేసుకోమని కోరుతుంది’ అందామె.
స్త్రీగా మాత్రమే
సంయుక్త తనను తాను స్త్రీగా తప్ప ట్రాన్స్‌జెండర్‌గా చెప్పడానికి అంగీకరించదు. ‘నేను స్త్రీగా మారదల్చుకున్నాను. మారాను. కనుక నా ఆధార్ కార్డులో స్త్రీ అనే ఉంది. ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాల కోసం ట్రాన్స్‌జెండర్ అనే అస్తిత్వం అవసరమైతే దానిని కొందరు స్వీకరించవచ్చు. కాని నేను పూర్తిగా స్త్రీ అస్తిత్వంతో ఉండాలని కోరుకుంటాను’ అంటుంది సంయుక్త. ఆమె మంచి భరతనాట్య కళాకారిణి. చెన్నయ్‌లో ఆరంగేట్రం చేస్తే చాలామంది మెచ్చుకున్నారు. విస్మరణకు గురైన జీవితాలకు సంబంధించి ఇవాళ అనేక సినిమాలు వస్తున్నాయి. సంయుక్త విజయన్ తీసిన ‘నీల నిర సూర్యన్’ మరో ముఖ్యమైన కథను చెబుతోంది. మరిన్ని కథలు సంయుక్త నుంచి మనం చూడొచ్చు.‘మా కథలు మేము చెప్పుకోవడం ఈ దేశంలో అంత సులువు కాదు’ అంటుంది సంయుక్త విజయన్.
Comments
Please login to add a commentAdd a comment