విజీ వెంకటేష్
దేశవ్యాప్తంగా క్యాన్సర్‌పై అవగాహన సదస్సులు
కన్నీళ్ల భాష తెలిసిన విజీ వెంకటేష్ కళారంగంలోకి అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్‌పై అవగాహన సదస్సులు నిర్వహించడం నుంచి క్యాన్సర్ బాధితులకు అండగా నిలవడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విజీ వెంకటేష్‌లో నటిగా మరో కోణం పరిచయం అయింది. ఆమెకు నటనలో ఓనమాలు తెలియవు. అయితే ‘తెలియదు’ అనే మాట దగ్గర ఆమె ఎప్పుడూ ఆగిపోలేదు. మలయాళం మాట్లాడడం నేర్చుకుంది. సాధన చేసి నటనలో శభాష్ అనిపించుకుంది. ‘బలమైన సినీ మాధ్యమం ద్వారా ఎన్నో సందేశాలను ప్రజలకు చేరువ చేయవచ్చు’ అంటుంది విజీ వెంకటేష్...
71 ఏళ్ల వయసులో మలయాళ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన విజీ వెంకటేష్ మన దేశంలో క్యాన్సర్ పేషెంట్‌ల కోసం మూడు దశాబ్దాలకు పైగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె స్వచ్ఛంద సంస్థ ‘ది మాక్స్ ఫౌండేషన్’కు ఇండియా, సౌత్ ఏషియా హెడ్‌గా ఉన్నారు.
దిల్లీలో పుట్టి పెరిగిన విజీకి సామాజిక స్పృహకు సంబంధించిన విషయాలపై స్కూల్‌రోజుల్లో నుంచే ఆసక్తిగా ఉండేది. ఆ ఆసక్తికి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. వివాహం తరువాత దిల్లీ నుంచి బాంబేకు వచ్చింది. ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించింది. తన ఆసక్తులకు తగిన వాతావరణం ఇక్కడ కనిపించింది. ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
‘ది మాక్స్ ఫౌండేషన్’ ద్వారా ఉద్యోగ, సేవాప్రస్థానాన్ని ప్రారంభించింది. ‘క్యాన్సర్ పేషెంట్ల గురించి పనిచేయాలనుకోవడానికి కారణం ఏమిటి? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. అయితే కాన్సర్‌పై పోరాటానికి, అవగాహన కలిగించడానికి క్యాన్సర్ పేషెంట్ కానక్కర్లేదు. వారి కష్టాలు మనకు తెలిసుంటే చాలు. ముంబైలో సంస్థలు, వ్యాపారవేత్తల నుంచి క్యాన్సర్ బాధితులకు అవసరమైన నిధుల సేకరణ ్రపారంభిండం ద్వారా నా ప్రస్థానం మొదలైంది’ అంటుంది విజీ.
నిధుల సేకరణ మాత్రమే కాదు పేద క్యాన్సర్ పేషెంట్ల ఇంటికి వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. ధైర్యం చెప్పేది. వీరిలో చాలామందికి పొగాకు నమిలే అలవాటు ఉన్నట్లు గ్రహించింది. ఉద్యోగ ప్రయాణం మొదలైన కొత్తలో బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీకి వెళ్లి క్యాన్సర్‌కు సంబంధించిన ఎన్నో పుస్తకాలను చదివి కొత్త విషయాలను తెలుసుకునేది. అంతేకాదు టాటా మెమోరియల్ హాస్పిటల్‌లోని ఆంకాలజీ డిపార్ట్‌మెంట్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుంది.
ఫ్యాక్టరీలకు వెళ్లి పొగాకు నమలడం ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కార్మికుల కోసం అవగాహన సదస్సులు నిర్వహించేది. ఈ సమావేశాలు పొగాకు నమిలే అలవాటు ఉన్న చాలామందిలో మార్పు తీసుకువచ్చి ప్రమాదం బారిన పడకుండా చూశాయి. అవగాహన సదస్సులతో పాటు పేదల కోసం ఎన్నో చోట్ల క్యాన్సర్‌కు సంబంధించి ఎర్లీ డిటెక్షన్ క్యాంపులు నిర్వహించింది. ఈ క్యాంప్‌లు ఎంతోమందిని కాపాడాయి.
ఫహద్ ఫాజిల్‌తో విజీ వెంకటేష్
అసలు సినిమాల్లో నటించే అవకాశం విజీ వెంకటేష్‌కు ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే... సోషల్ మీడియాలో ఆమె చురుగ్గా ఉంటుంది. మలయాళ డైరెక్టర్ అఖిల్ సత్యన్, అతని టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో విజీ వెంకటేష్ ఫొటోను చూశారు. తమ సినిమా ‘పచ్చుం అబ్బుతావిలక్కుమ్’కు ‘ఉమ్మచ్చి’ క్యారెక్టర్‌కు సరిగ్గా సరిపోయే మహిళ అనుకున్నారు. వెంటనే విజీ వెంకటేష్‌ను సంప్రదించారు.
‘నేను ఫుల్–టైమ్ జాబ్ చేస్తున్నాను. నాకు మలయాళం పెద్దగా రాదు’ అని చెప్పింది. ‘ఈ వయసులో నటన ఏమిటి’ అని కూడా అన్నది. అయితే డైరెక్టర్ పట్టువదలని విక్రమార్కుడు అయ్యాడు. ‘రోల్’ గురించి మరింత వివరంగా చర్చించాడు. అతడి ఆసక్తి, వృత్తిపట్ల అంకిత భావం నచ్చడంతో విజీకి ‘ఓకే’ అనక తప్పలేదు. ఇక అప్పటినుంచి మలయాళం స్పీకింగ్ స్కిల్స్‌పై దృష్టి పెట్టింది. నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో విజీ తల్లి పాత్ర పోషించింది. స్వతంత్ర వ్యక్తిత్వం, పోరాడే ధీరత్వం ఉన్న మహిళ పాత్ర అది. నిజానికి ఈ పాత్రకి సంబంధించిన లక్షణాలు ఆమెలో సహజంగా ఉన్నవే.
ఈ సినిమా నుంచి మరికొన్ని సినిమాల నుంచి ఆఫర్లు వచ్చాయి. ‘వీర’ లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు జయరాజ్ చిత్రం కోసం సైన్ చేసింది. కాటుక, ముక్కు పుడక... ఇలా విజీ వెంకటేష్‌కు తనదైన సిగ్నేచర్ స్టైల్ ఉంది. తన మొదటి సినిమా కోసం ఆ స్టైల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే కొత్త లుక్‌లో కూడా సహజంగా, అందంగా ఉంది విజీ వెంకటేష్.
Comments
Please login to add a commentAdd a comment