‘‘ఇంట్లో మగ్గం ఉంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. నా గ్రామం నుంచి విదేశాలతో అనుసంధానం కావడానికి ఇవి చాలు. నేను నేసిన చీరను ఈ కామర్స్ వేదికల ద్వారా నేనే మార్కెట్ చేసుకోగలుగుతున్నాను. నా చేతుల్లో తయారైన చీరను ధరించే వారి చేతికి చేర్చే సాంకేతిక మార్గాలను నేర్చుకున్నాను. వందల మంది మహిళలం సంఘటితమయ్యాం. మాలోని నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాం. మేము గౌరవప్రదమైన ఉపాధిని పొందుతున్నాం’’ అంటోంది తమిళనాడుకు చెందిన ముత్తులక్ష్మి. ఆమె మాటలు అక్షరసత్యాలు.
వైవిధ్యతే ఉపాధి..
భాషలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లలో మాత్రమే కాదు మనదేశంలో ఉన్న వైవిధ్యత... కళలు, కళాత్మకతల్లోనూ ఉంది. దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఆ కళాత్మకత ఉంటుంది. స్థానికంగా లభించే వస్తువులతో మహిళల చేతిలో రూపుదిద్దుకునే అనేక వస్తువులు ఇప్పుడు వారికి ఉపాధిమార్గాలవుతున్నాయి. దేశంలో దాదాపుగా ఏడు కోట్ల మంది చేతిలో కళ ఉంది. ఆ చేతుల్లో అందమైన హస్తకళాకృతులు తయారవుతున్నాయి. అందులో సగానికి పైగా మహిళలే.
ఒకప్పుడు ఆ పని తమకు ఉపాధినిస్తుందని, గుర్తింపును తెస్తుందని తెలియదు వాళ్లకు. తెలిసినా సరే, మధ్య దళారుల దోపిడీకి గురవుతూ అరకొరగా లభించే రుసుముతోనే సంతృప్తి చెందేవాళ్లు. ఇప్పుడు మహిళలు చురుగ్గా ఉన్నారు. తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టే మాధ్యమాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. హస్తకళాకృతులు తయారు చేసే కుటుంబాల్లోని మగవారు మెరుగైన ఉపాధి కోసం ఆ వృత్తులను వదిలేస్తున్న తరుణంలో ఆ ఇళ్లలోని మహిళలు తమ వారసత్వ కళను కొనసాగిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గౌరవాన్ని, అదే స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
ముత్తులక్ష్మి ఇంట్లో పవర్‌లూమ్ ఉంది. ఆ మరమగ్గం మీద ఆమె నెలకు పది చీరలను నేయగలుగుతోంది. తమిళనాడులోని అరుపోకోటాయ్ బ్లాక్ చేనేత చీరలకు ప్రసిద్ధి. అక్కడ నేసే చీరలను కూడా అదే పేరుతో అరుప్పుకోటాయ్ చీరలుగానే పిలుస్తారు. ఆమె నేసిన చీరలను ఫొటో తీసి తానే స్వsయంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేస్తుంది. ఉత్పత్తిదారులకు– వినియోగదారులకు మధ్య మరో వ్యక్తి అవసరం లేదని, సాంకేతికతను ఒంటపట్టించుకోవడానికి పెద్ద చదువులు అక్కరలేదని నిరూపిస్తోంది.
సాధికారత సాధించాం!
‘‘ఒక్కో ప్రాంతంలోని మహిళల్లో ఒక్కో కళ ఉంటుంది. మా దగ్గర మహిళలు చేనేతతోపాటు తాటి, కొబ్బరి ఆకులతో బుట్టలు అల్లుతారు. కర్ణాటక, రాయచూర్ వాళ్లు అందమైన దండలు, ఊలు, క్రోషియో వైర్‌తో ఇంటి అలంకరణ వస్తువులు అల్లుతారు. గుజరాత్, దహోద్ వాళ్లు ముత్యాల ఆభరణాలతోపాటు వెదురుతో రకరకాల వస్తువులు తయారు చేయడంలో నిష్ణాతులు.
వాళ్లందరికీ డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ, ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్‌తోపాటు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పిస్తే అద్భుతాలు చేయగలరని నమ్మాను. అది నిజమైంది కూడా. ఇప్పుడు మొత్తం తొమ్మిది వందల మందిమి నాస్కామ్ నిర్వహించిన పదిరోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సొంతంగా అన్ని పనులూ చక్కబెట్టుకోగలుగుతున్నాం. మహిళా సాధికారత సాధనకు మా చేతిలో ఉన్న పని, సాంకేతిక పరిజ్ఞానం తోడైంది’’ అన్నది ముత్తులక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment