ఉమెన్ పవర్ 2024
కాలం ముందుకు సాగుతూనే ఉంటుంది. 24 గంటలకో రోజు పుడుతుంది. కలకాలం గుర్తుండే పని చేసిన వాళ్లతో రోజుకో కొత్త చరిత్ర పుడుతుంది. చరిత్ర సృష్టించిన స్త్రీశక్తిని సాక్షి ఫ్యామిలీ నిరంతరం పట్టిచూపుతోంది. ఈ ఏడాది సాక్షి గౌరవించిన మహిళామణుల్లో మరికొన్ని ఆణిముత్యాలు.
మండే కండలు
గుంటూరు జిల్లా, వేమూరుకి చెందిన ఎస్తేర్‌రాణికి తల్లిదండ్రులు లేరు. అండదండలు లేవు. నానమ్మ ఆకుకూరలు అమ్ముతుంది. ఇవేవీ ఆమెను పెద్ద కల కనకుండా ఆపలేకపోయాయి. బాడీ బిల్డర్ కావాలనే ఆకాంక్ష ఆమెతోపాటు పెరిగి పెద్దదైంది. హైదరాబాద్‌లో జిమ్‌లో ట్రైనర్‌గా ఉద్యోగం చేస్తూ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటోంది. చెన్నైలో జరిగిన మిస్టర్ అండ్ మిసెస్ హిందూస్థానీ పోటీలో పాల్గొని మెడల్ సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో బాడీ బిల్డింగ్ చేసిన మహిళలు లేరు. ఆ రికార్డును తాను సాధించాలనే పట్టుదల ఆమెను విజేతను చేసింది.
శవాల గదిలో ఉద్యోగమా?!
పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు.ప్రాణం పోవడం ఒక వేదన అయితే మార్చురీ నుంచి తన వాళ్ల పార్థివ దేహాన్ని తీసుకువెళ్లే వాళ్ల దుఃఖానికి అంతే ఉండదు. మార్చురీలో ఉద్యోగం చేయడం అంటే రోజుకు ఐదారుసార్లు గుండెను చిక్కబట్టుకోవాల్సిందే. అలాంటిది రామ్ ప్రసన్న అనే మహిళ మార్చురీలో ఉద్యోగం చేస్తోంది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రితో పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్‌గా పని చేస్తోందామె. ‘ఆడవాళ్లు ఈ ఉద్యోగం చేయడమేమిటి’ అనే వెక్కిరింతలను పట్టించుకోలేదామె. ‘చేయడానికి నీకు ఈ ఉద్యోగమే దొరికిందా’ అనే మాటలకు వెనక్కి తగ్గలేదు. వృత్తిమీద గౌరవాన్ని తగ్గించుకోనూలేదు.
అమ్మ గీసిన బొమ్మ
ఆంధ్రప్రదేశ్, సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, నిమ్మలకుంట గ్రామానికి చెందిన దళవాయి శివమ్మ తోలుబొమ్మల చిత్రకారిణి. తోలు మీద అపురూపమైన చిత్రాలను గీస్తారు. ఆమె ఈ ఏడాది ‘శిల్పగురు’ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇది వందల ఏళ్ల నుంచి పరంపరగా వస్తున్నప్రాచీన కళ. తోలు బొమ్మలాటలు తగ్గిపోయాయి. కానీ బొమ్మలను చిత్రించేకళ కొత్త రూపు సంతరించుకుంది. రామాయణఘట్టాలు, శ్రీకృష్ణలీలల చిత్రాలను ల్యాంప్‌సెట్‌లు, వాల్ పెయింటింగ్స్, డోర్ హ్యాంగర్స్ మీద చిత్రిస్తూ అనేక రాష్ట్రాల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్‌లలో ప్రదర్శిస్తున్నారు. యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ కళ అంతరించిపోకూడదనే ఆకాంక్షతో కొత్త తరానికి శిక్షణనిస్తున్నారు శివమ్మ.
యాంటీ రెడ్ ఐ
అది ఆగస్టు 29. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరా పట్టుబడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అసాంఘిక కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తున్నది విద్యావంతులే. సభ్యసమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి దారుణాలను అరికట్టడానికి పోలీస్ డిపార్ట్‌మెంట్, షీ టీమ్స్, భరోసా టీమ్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ ఉమెన్ క్యాడెట్‌లు విద్యాసంస్థల్లో వర్క్‌షాపులు నిర్వహించాలి. షాపింగ్ మాల్స్, హోటళ్లు, సినిమా థియేటర్‌లలో తనిఖీలు జరగాలి. అలాగే స్పై కెమెరాల కొనుగోళ్ల మీద నిఘా ఉంచాలని సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నారు యాంటీ రెడ్ ఐ యాక్టివిస్ట్ అడపా వరలక్ష్మి.
కిడ్స్‌కు పాఠం క్వీన్ స్విమ్మర్
గంధం క్వీనీ విక్టోరియా ఆరేళ్ల కిందటి వరకు సాధారణ గృహిణి. లండన్‌లోని ఇంగ్లిష్ చానెల్ ఈది రికార్డు సాధించారు. పిల్లలు స్మిమ్మింగ్ క్లాసులకు సరిగ్గా వెళ్లక పోవడం, ‘స్విమ్మింగ్ చేస్తే తెలుస్తుంది’ అని నిష్ఠూరంగా మాట్లాడడంతో ఈదడం అంత కష్టమా అనుకున్నారామె. ‘అంత కష్టమా! సరే చూద్దాం పదండి’ అని తల్లిగా పిల్లల ప్రశ్నలకు సమాధానం వెతకడంలో కోసం నీటిలో దిగారు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ తన పిల్లలకే కాదు మహిళాలోకానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు.
తెలుగు నేల మీద తుళు అడుగులు
హైదరాబాదులో నివసిస్తున్న మైత్రీరావుది దక్షిణ కర్నాటకలోని ధర్మస్థల. మాతృభాష తుళు. ఆమె ఇన్‌ఫర్మేషన్ సైన్స్ గ్రాడ్యుయేట్. నోకియా కంపెనీలో ఉద్యోగం చేశారు. నాట్యం మీద అభిరుచితో భరతనాట్యం, కలరిపయట్టు, అట్టక్కలరి, వ్యాలికవర్ నాట్యరీతులను సాధన చేశారు. నాట్యం ఇతివృత్తంగా ఆమె చిత్రీకరించిన రెండు సినిమాలకు అంతర్జాతీయ పురస్కారం లభించింది. శాస్త్రీయ నాట్యం అంటే పౌరాణిక ఇతిహాసాల ప్రదర్శన అనే పరిధిని చెరిపివేశారామె. స్త్రీ శక్తిని సమాజానికి చాటి చెప్పడానికి తాను ఎంచుకున్న మాధ్యమం నాట్యమే అంటారు స్త్రీశక్తి పురస్కార గ్రహీత, ప్రముఖ నాట్యకారిణి మైత్రీరావు.
కథల అమ్మమ్మ
కోరుపోలు కళావతి రచయిత్రి. ఆమెది విజయనగరం జిల్లా. నాగరకత ముసుగులో ఆదివాసీ బిడ్డలకు పెట్టే పరీక్షలు, అడవి బిడ్డల చుట్టూ ఊహకందని ప్రమాదాలు, పల్లెపదాలు, జానపద జావళులకు అక్షరం ఆమె. అలాగే అమెరికా ప్రకృతి అందాలు, అక్కడ మనవాళ్ల ప్రగతి సుమగంధాలకు అక్షరరూపమిచ్చారామె. ఆధునిక సమాజంలో పిల్లలకు కథలు చెప్పే అమ్మమ్మలు, నానమ్మలు కరవయ్యారని గ్రహించిన కళావతి కథల పుస్తకాలు రాస్తూ కథల అమ్మమ్మ అయ్యారు.
సరళ వైద్యం... ఇంటింటా డాక్టర్
డాక్టర్ సరళది కాకినాడ. ఆమె హోమియో డాక్టర్. ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ కూడా ఉండాలంటారు. తల్లే ఆ డాక్టర్ అయితే ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారామె. ఇందుకోసం వారం రోజుల హోమియో కోర్సులు నిర్వహిస్తున్నారు. కోర్సులో భాగంగా సాధారణంగా వచ్చే 24 రకాల అనారోగ్యాల గురించి, వాటికిప్రాథమికంగా తీసుకోవాల్సిన ఔషథాలగురించి శిక్షణనిచ్చి హెల్త్ అడ్వైజర్‌లను తయారు చేస్తున్నారు. ఆమె స్వయంగా 76 రుగ్మతలకు మందులు కనుక్కున్నారు. డాక్టర్లు ఆరోగ్యవంతమైన సమాజం కోసం తమ వంతు బాధ్యతగా పనిచేయాలన్నారు డాక్టర్ సరళ. ఇప్పటికీ గ్రామాల్లో తగినంత మంది డాక్టర్‌లు అందుబాటులో లేని గ్యాప్‌ను ఇలా భర్తీ చేస్తున్నారామె.
స్వావలంబనకు చుక్కాని
హైదరాబాద్. దారుల్‌షిఫాలో మహిళలు, బాలికల సంక్షేమం కోసం స్వచ్ఛందసేవ అందిస్తున్నారు రుబీనా నఫీస్ ఫాతిమా. మిలిటరీ కుటుంబంలో పుట్టిన రుబీనా అభ్యుదయపథంలో పెరిగారు. మహిళలు చదువుకోవాలని, ఎవరి మీదా ఆధారపడకూడదని నమ్మిన కుటుంబం కావడంతో ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆమె బాడ్మింటన్‌ప్లేయర్ కూడా. పెళ్లి తర్వాత భర్తతోపాటు సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ మంత్రిత్వశాఖలో ఉద్యోగం చేశారు. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత జీవితాన్ని సమాజసేవకి అంకితం చేశారు. సఫా సంస్థ ద్వారా 2008 నుంచి ముస్లిం మహిళల ఆర్థిక సామాజిక పురోగతి కోసం పని చేస్తున్నారు. అభివృద్ధి అనేది పరిపూర్ణంగా ఉండాలని, ఆడపిల్లలకు చదువుతోపాటు ఆటలు కూడా అవసరమంటారామె. అయితే ఆడపిల్లలను ఆటలకు పంపించడానికి కూడా నిషేధం ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రులను చైతన్యవంతం చేసి, బాల్‌షెట్టీ ఖేత్ గ్రౌండ్‌లో ఆడపిల్లలు ఆడుకోవడానికి ఒక టైమ్ స్లాట్ కేటాయించి క్రీడలను ప్రోత్సహిస్తున్నారు రుబీనా నఫీస్ ఫాతిమా.
యర్రంపల్లి నుంచి దిల్లీకి
మహిళల ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించిన మినీ వేలంలో శ్రీ చరణిని ఎంపిక చేసుకోవడానికి ఫ్రాంచైసీలు పోటీ పడ్డాయి. దిల్లీ క్యాపిటల్స్ 55 లక్షలతో శ్రీ చరణిని ఎంపిక చేసుకుంది. కడప జిల్లా యర్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి సామాన్య కుటుంబంలో పుట్టింది. జిల్లాలోని వీరనాయుని పల్లెలోని వీఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తున్న శ్రీచరణి తల్లిదండ్రులప్రోత్సాహంతో ఆటల్లో రాణిస్తోంది. 2021లో అండర్ 19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా– సి జట్టుకిప్రాతినిధ్యం వహించిన శ్రీ చరణి నాలుగు వికెట్‌లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర వహించింది. ఉమెన్ టీ ట్వంటీలో ఆంధ్రాజట్టుకుప్రాతినిధ్యం వహించి తన బౌలింగ్ తీరుతో సెలెక్టర్‌ల దృష్టిని ఆకర్షించింది.
ఇదీ చదవండి: భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment