రక్తసంబంధం
ఆగస్ట్ 15, 1975 సైనిక తిరుగుబాటులో బంగ్లాదేశ్ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్, అతడి భార్య, కుమారులు ఊచకోతకు గురయ్యారు. ఆ కల్లోల సమయంలో రెహమాన్ కుమార్తె రెహానా తన అక్క షేక్ హసీనాతో పాటు యూరప్‌లో ఉంది. అంత పెద్ద విషాదాన్ని, దుఃఖాన్ని తట్టుకోవడానికి ఎవరికి ఎవరు ధైర్యం చెప్పుకున్నారో తెలియదు.
ఇక అప్పటి నుంచి వారిది వీడని బంధం అయింది. హసీనా ‘లైఫ్‌లాంగ్ షాడో’గా రెహానాకు పేరు పడిపోయింది. కుటుంబసభ్యుల ఊచకోత జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత బంగ్లాదేశీ విద్యావేత్త అహ్మద్ సిద్దిఖీని వివాహం చేసుకుంది రెహానా. ఆర్థిక కారణాల వల్ల లండన్‌లో జరిగిన ఈ పెళ్లికి షేక్ హసీనా వెళ్లలేకపోయింది అంటారు. తమ కుటుంబ సభ్యుల కిరాతక హత్యపై నిష్పాక్షిక విచారణకు పిలుపునిస్తూ మొదటిసారిగా అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించింది రెహానా. ఈ సమావేశంలో ప్రవాసంలో ఉన్న ఆమె రాజకీయ సహచరుల నుంచి అంతర్జాతీయ న్యాయనిపుణుల వరకు ఎంతోమంది పాల్గొన్నారు.
క్రూరమైన సైనిక నియంతృత్వ నీడలో బంగ్లాదేశ్ ప్రజల దుస్థితిని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించింది రెహానా. కుటుంబ ఊచకోతకు సంబంధించిన అప్పటి విషాదం ఊహకు అందనిది. ఇప్పటి సంక్షోభం గురించి మాత్రం ఇద్దరికీ తెలుసు. నిరసనకారులు ఇంటిని చుట్టుముడుతున్నారు. మరోవైపు హసీనా సన్నిహితులు, సలహాదారులు పారిపోయే దారిలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా అక్క చెయ్యి వీడలేదు రెహానా. ‘పారిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం’ అని అత్యంత సన్నిహితులు చెబుతున్నప్పటికీ ‘అది జరిగేది కాదు’ అంటూ వెనక్కి తగ్గలేదు హసీనా. ఆ సమయంలో వారు రెహానాను ఆశ్రయించారు. హసీనా దేశం వీడడానికి ఒప్పుకోవడానికి ఆమె కుమారుడు కారణమని, కాదు రెహానే కారణమని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఏది నిజం అయినప్పటికీ రెహనా అక్కతో పాటు ఇండియాలోకి అడుగు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
రెహానా కుమార్తె తులిప్ సిద్దిఖీ లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు. యూకేలో లేబర్ పార్టీ అధికారంలో ఉండడంతో బ్రిటన్ ప్రభుత్వాన్ని హసీనా ఆశ్రయం కోరింది. అయితే బ్రిటన్ నుంచి అనుకూల స్పందన రాకపోవడంతో ఇండియాను ఆశ్రయించక తప్పలేదు. అక్క అధికారిక పర్యటనలలో రెహానా ఉండేది. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభ (2006 –2008) సమయంలో హసీనా జైలులో ఉన్నప్పుడు అక్క తరపున పార్టీ సమావేశాలు నిర్వహించింది. కార్యకర్తల్లో ధైర్యం నింపింది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే షేక్ హసీనాకు బంగ్లాదేశ్‌లో ఎంత చరిత్ర ఉందో ఆమె చెల్లెలు రెహానాకూ అంతే చరిత్ర ఉంది. ఆ చరిత్ర హసీనా వెలుగు ముందు మసక మసకగా కనిపించేది. అయితే ప్రతి కల్లోల సమయంలోనూ ఆమె పేరు మీద వెలుగు ప్రసరిస్తుంటుంది.
‘రెహానా అక్కను తప్పుదారి పట్టించింది’ అని విమర్శించిన వారూ ఉన్నారు. ‘అక్క సరిౖయెన దారిలో పయనించడానికి, బలమైన నాయకురాలిగా ఎదగడానికి రెహానానే కారణం’ అన్నవారూ ఉన్నారు. ఈ వాదోపవాదాలు, నిజానిజాలతో సంబంధం లేకుండా ఒక్కమాట మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు... అక్కకు చెల్లి కొండంత అండగా నిలిచింది. నిలుస్తోంది.
"షేక్ హసీనా పేరు వినిపించగానే ప్రతిధ్వనించే మరో పేరు... రెహానా. అలనాటి కల్లోల కాలం నుంచి అధికార పర్యటనల వరకు అక్క హసీనాతోనే ఉన్నది రెహానా. అక్క జైలుపాలైనప్పుడు పార్టీ క్యాడర్‌లో ధైర్యాన్ని నింపింది. ఒకప్పుడు కుటుంబాన్ని కోల్పోయి... ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి అక్కాచెల్లెళ్లు మన దేశంలో తలదాచుకోవడానికి శరాణార్థులుగా వచ్చారు..."
Comments
Please login to add a commentAdd a comment