Neenu Rathin: తక్కువ కాలంలోనే.. ‘సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’గా.. | Neenu Rathin CEO And Founder The Social Town | Sakshi
Sakshi News home page

Neenu Rathin: తక్కువ కాలంలోనే.. ‘సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’గా..

Published Thu, Jun 27 2024 9:32 AM | Last Updated on Thu, Jun 27 2024 9:32 AM

Neenu Rathin CEO And Founder The Social Town

కేరళకు చెందిన నీనూ రతిన్‌కు సామాజిక సేవా రంగం అంటే ఇష్టం. సోషల్‌ యాక్టివిస్ట్‌లతో కలిసి పనిచేయడం అంటే ఇష్టం. ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని గ్రహించి నిధుల సేకరణలో వారికి సహకరించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. తక్కువ కాలంలోనే ‘సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’గా పెద్ద పేరు తెచ్చుకుంది. సోషల్‌ వర్కర్‌ కావాలనుకునే వారికి సంస్థ సహకారం అందిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు వివిధ విషయాలలో పరస్పరం సహకరించుకునే వాతావరణాన్ని కల్పించింది.

కేరళలోని త్రిసూర్‌లో పుట్టి పెరిగిన నీనూ రతిన్‌ చదువులో ‘తెలివైన అమ్మాయి’ అనిపించుకుంది. క్లాసులో టీచర్‌లు చెప్పే సామాజిక సేవకు సంబంధించి విషయాలను శ్రద్ధగా వినేది. అలా... తనకు చిన్నప్పుడే సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరిగింది. చదువుకు ఎంతప్రాముఖ్యత ఇచ్చేదో సామాజిక సేవా కార్యక్రమాలకు అంతగాప్రాధాన్యత ఇచ్చేది.

ఇంజినీరింగ్‌ చేస్తున్నప్పటికీ ఆమె మనసు మాత్రం సామాజిక విషయాలపై కేంద్రీకృతమై ఉండేది. ఆమె ఫ్రెండ్స్‌కు మాత్రం ఇంజినీరింగ్‌ అంటే చాలా ఇష్టం. ఒకానొక దశలో అయితే ‘వీరి మధ్య నేను  ఉండడం సరిౖయెంది కాదేమో. నా ఆలోచనలు వేరు, వీరి లక్ష్యాలు వేరు’ అనుకునేది నీనూ.

ఇంజినీరింగ్‌ పూర్తయిన తరువాత ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందిగానీ ఏవో కారణాల వల్ల అందులో చేరలేక΄ోయింది. దీంతో ఒక చిన్న ఇంజినీరింగ్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసింది. అయితే కొంత కాలం తరువాత... ‘ఈ ఉద్యోగం నాకు కరెక్ట్‌ కాదేమో’ అనుకుంది. అదే సమయంలో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పెళ్లి తరువాత తనకు ఎప్పటి నుంచో ఆసక్తి ఉన్న సామాజిక సేవారంగంలోకి అడుగు పెట్టింది.

‘ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌’ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఇది తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో ఆధ్యాత్మిక. సామాజిక కార్యక్రమాలు ఉండేవి. నాకు రెండోదానిపై ఆసక్తి’ అంటుంది నీనూ. ఫౌండేషన్‌కు సంబంధించి ఎన్నో రకాల సామాజిక  సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ కార్యక్రమాలు భవిష్యత్‌లో తాను చేయబోయే పనులకు పునాదిగా నిలిచాయి.

తొలి అడుగుగా ఫౌండేషన్‌ తరపున ఎన్నో స్కూల్స్‌కు వెళ్లి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు చెప్పేది. మొక్కలు నాటేది. పది స్కూల్స్‌తో మొదలైన మొక్కలు నాటే కార్యక్రమం ఆ తరువాత 30కు చేరుకుంది. ఒకవైపు ఇంటిపనులు చూసుకుంటూనే పర్యావరణ విషయాలపై అవగాహన, మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొనేది నీనూ.

సామాజిక సేవా రంగంలో  పనిచేయడం వల్ల తనలాగే ఆలోచించే ఎంతోమంది పరిచయం అయ్యారు. ఎన్నో స్వచ్ఛందసంస్థలతో కలిసి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. కొంతకాలం తరువాత భర్త, పిల్లలతో  కొచ్చికి వెళ్లింది నీనూ. అక్కడికి వెళ్లిన తరువాత కూడా స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. మహిళా సమస్యలపై పనిచేయడం నుంచి రక్తదాన కార్యక్రమాల వరకు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంది.

తాను కొచ్చిలో ఉన్న సమయంలో కేరళకు భయానకమైన వరదలు వచ్చాయి. వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. సోషల్‌ మీడియా వేదికగా బాధితులకు ఎన్నో రకాలుగా అండగా నిలబడింది. అట్టాపాడి, నీలంబూర్, వయనాడ్‌లోని గిరిజన జనావాసాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ‘బాధితులకు సహాయపడే కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది  సమిష్టి కార్యాచరణ శక్తిని అర్థం చేసుకునేలా చేసింది. గతంలో మా కుటుంబ సభ్యులు ఎవరూ సామాజిక సేవా రంగంలో లేరు. నాకు కూడా కొత్త. ఎన్ని రకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొంటే నాకు అంత ఉత్సాహం వచ్చేది’ అంటుంది నీనూ రతిన్‌.

ఆ ఉత్సాహ బలమే ఆమెను ‘సోషల్‌ టౌన్‌’ అనే స్వచ్ఛంద సంస్థప్రారంభించేలా చేసింది. మొదట్లో ఇంటరాక్షన్స్‌ కోసం వాట్సాప్‌ గ్రూప్‌లు, ఈ మెయిల్స్‌ను ఉపయోగించేవారు. ఇప్పుడు ‘సోషల్‌ టౌన్‌ పరిధి విస్తరించి క్షేత్రస్థాయిలో సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని కలలు కనే ఒకేరకమైన ఆలోచనా విధానం కలిగిన వ్యక్తులుండే సంఘంలాంటిది మా సంస్థ’ అంటుంది నీనూ రతిన్‌.

ఆ బలమే వేరు..
ఒకే రకమైన ఆలోచన విధానం ఉన్న వారు ఒకే దగ్గర ఉంటే ఆ బలమే వేరు. ఇంకా ఎన్నో మంచి పనులు చేయవచ్చు. చాలామందికి సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వారికి దారి తెలియదు. అలాంటి వారికి ఒక కొత్త దారిని చూపే బాధ్యతను మా స్వచ్ఛంద సంస్థ తీసుకుంంది. స్వచ్ఛంద సేవకురాలిగా ప్రభావశీలమైన ఎన్నోప్రాజెక్ట్‌లలో పాల్గొన్నాను. వాటి గురించి గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఉత్సాహం వస్తుంది. మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలనిపిస్తుంది.

– నీనూ  రతిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement