అనుజా గుప్తా
ప్రతాంక్షా గుప్తా
ప్రతి కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఇది నూటికి నూరుపాళ్లు నిజమని నిరూపిస్తున్నారు అనుజా గుప్తా, ప్రతాంక్షా గుప్తా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఢిల్లీవాసులైన వీరిద్దరూ ఐదేళ్ల క్రితం లక్షరూపాయలతో చికన్‌కారీ కుర్తీల వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పుడు 45 మంది ఉద్యోగులతో, ఐదుకోట్ల టర్నోవర్‌తో వ్యాపారాన్ని నడుపుతున్నారు. ఒడిదొడుకులను అధిగమిస్తూ వ్యాపారంలో మైలురాళ్లను అధిగమిస్తున్నారు.
అనుజా గుప్తా మాట్లాడుతూ ‘‘మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పెరిగిన అక్కాచెల్లెళ్లం. మా వ్యాపారం ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి మొదలైంది. 2020లో కోవిడ్ కారణంగా మా వ్యాపార కలలు కూడా కనుమరుగవుతాయనుకున్నాం. చాలా వ్యాపార సంస్థలు లాక్‌డౌన్ సమయంలో మూలనపడ్డాయి. మేం మా వ్యాపారాన్ని నలభై చికన్‌కారీ కుర్తీలు, పలాజోలు, చీరలతో మొదలు పెట్టాం. మా వెంచర్ పేరు ‘చౌకట్’. కోవిడ్ కాలంలో చాలామంది వద్ద డబ్బులేదు. కాబట్టి మా దుస్తులు అమ్ముడవుతాయన్న గ్యారెంటీ మాకు లేదు. అలాగని మా వ్యాపారాన్ని మూసేయడానికి మేం సిద్ధంగా లేం. మా నిర్ణయం సరైనదేనని ఆ తర్వాత అర్ధమైంది.
పెరిగిన ఆర్డర్లు..
అమ్మకానికి ఉంచిన డ్రెస్సులు హాట్‌కేక్‌లుగా అమ్ముడయ్యాయి. మొదటి నెలలోనే 34 ఆర్డర్లు వచ్చాయి. దాంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. మరిన్ని ఆర్డర్లు వచ్చిన తర్వాత ఒక లాజిస్టిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. చికన్‌కారీ కుర్తీలు ఖరీదైనవి అనే అభి్రపాయాన్ని వారితో మాట్లాడి, మార్చగలిగాం.
నాణ్యత విషయంలో రాజీపడకుండా తక్కువ ధరకే చికన్‌కారీ కుర్తీలు అందించ వచ్చని నిరూపించాం. ఈ నమ్మకం వల్లనే లాక్‌డౌన్ ప్రకటించిన ఇరవై రోజుల తర్వాత నుంచి కూడా మా ‘చౌకట్’ నుంచి దుస్తులు అమ్ముడు పోవడం పెరిగింది. కోవిడ్ కారణంగా డిజైనర్ల దగ్గరకు వెళ్లి, సరైనవి ఎంచుకునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మేమిద్దరం సొంతంగా డిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది కూడా మరో మైలురాయిలా నిలిచింది.
‘చౌకట్’ టీమ్
అభిరుచులు వేరైనా సృజన ఒక్కటే..
ఇప్పుడు మా సంస్థలో 45 మంది ఉద్యోగులు ఉన్నారు. దేశంలో 5 వేల మంది నేత కార్మికులతో భాగస్వామ్యం కలిగి ఉన్నాం. మా సంస్థకు విదేశాలలో కూడా క్లయింట్లు ఉన్నారు. డెబ్బైశాతానికి పైగా ఆర్డర్లు ఆన్‌లైన్‌లో డెలివరీ చేయబడతాయి. అక్కచెల్లెళ్లమే అయినా ఇలా కలిసి వ్యాపారం చేస్తామని కలలో కూడా అనుకోలేదు.
మా ఇద్దరు చదువులు వేరు, అభిరుచులు వేరు. కానీ, మా ఇద్దరి ఆలోచన ఒక్కటిగా ఉన్నది ‘చౌకట్’ సృష్టించడంలో. నేను జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. ప్రతాంక్షా గుప్తా ఫ్యాషన్/అప్పేరల్ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మా అమ్మానాన్నలు మాకు పూర్తి సహకారం అదించడంతో నేడు మా కంపెనీ ఐదుకోట్ల టర్నోవర్‌కు చేరుకుంది’’ అని వివరిస్తారు ఈ సోదరీమణులు.
ఇవి చదవండి: Gaming: శతకోటి సూర్యప్రభా భాసిత... వీరాధివీరా!
Comments
Please login to add a commentAdd a comment