ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంగళవారం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఆవిష్కృతమైంది. బడుగువర్గాల, మహిళల అభ్యున్నతిని కాంక్షించే అత్యంత కీలకమైన అయిదు బిల్లుల్ని శాసనసభ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పినట్టు ఈ బిల్లులన్నీ చరిత్రాత్మకమైనవి, అసాధారణమైనవి. రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారికి అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు... నామినేషన్లపై ఇచ్చే పనుల్లో సైతం 50 శాతం రిజర్వేషన్లు... నామినేటెడ్ పోస్టుల్లో, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో మహిళలకు 50 శాతం కోటా ఇవ్వడానికి ఈ బిల్లుల్ని ఉద్దేశించారు. స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లయినా అట్టడుగు వర్గాలు, మహిళల స్థితిగతులెలా ఉన్నాయో అందరికీ తెలుసు.
డాక్టర్ అంబేడ్కర్ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం చట్టసభల్లో, ఉద్యోగావకాశాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది. అనంతర కాలంలో కేంద్రంతోపాటు కొన్ని రాష్ట్రాలు బీసీలకు, మహిళలకు విద్య, ప్రభుత్వోద్యోగాల్లో కోటా కల్పించాయి. కానీ అంత మాత్రాన ఆ వర్గాలకు సంపూర్ణమైన ప్రయోజనం దక్కదు. ఇతర స్థాయిల్లో సైతం ఆ విధానం అమలైనప్పుడే ఆ వర్గాలకు మేలు కలుగుతుంది. వారికి కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించినట్టవుతుంది. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు తర్వాత ఆ స్థాయిలో బీసీలకు లబ్ధి చేకూర్చడం ఇదే తొలిసారి.
మన నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో కొన్ని ఉన్నతమైన కులాలుగా చలామణి అవుతున్నాయి. ఇతర కులాలను సామాజికంగా అణచివేస్తున్నాయి. ఇలా కొన్ని వర్గాలు మాత్రమే ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం గుప్పెట్లో పెట్టుకున్నచోట ప్రజాస్వామ్యం నేతి బీర చందమే అవుతుంది. సామాజిక అసమానతలు చెక్కుచెదరకుండా నిలుస్తాయి. మన దేశంలో ఇన్ని దశాబ్దాలుగా జరిగింది అదే. వాస్తవానికి వీటిని సమూలంగా తుడిచిపెట్టాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో అన్ని వర్గాల భాగ స్వామ్యం ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారు. చట్టసభలను దేశంలో జరగాల్సిన సామాజిక, ఆర్థిక మార్పులకు ఉపకరణాలుగా వారు భావించారు. ఇందులో విఫలమైతే దేశంలో అశాంతి ప్రబలుతుందని హెచ్చరించారు. దురదృష్టమేమంటే ఏ పార్టీ అధికారంలోకొచ్చినా అట్ట డుగు వర్గాలను ఓటు బ్యాంకులుగానే చూశాయి. వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన నిజమైన చర్యల విషయంలో మౌనంగా ఉండిపోయాయి. ఆ వర్గాలను మభ్యపెట్టడంలోనే పొద్దుపుచ్చాయి.
చిత్తశుద్ధి లేని నేతలు, సృజనాత్మకత కొరవడిన నేతలు రాజ్యమేలుతున్నప్పుడు పరిస్థితులు ఇలాగే ఉంటాయి. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో, చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో తనకెవరూ సాటిరారని ఇప్పటికే నిరూపించుకున్న జగన్ అటువంటి నేతలకు భిన్నం. 14 నెలలపాటు సాగించిన ‘ప్రజా సంకల్ప యాత్ర’లో తాను స్వయంగా చూసిన జీవితాలను, లక్షలాదిమంది ప్రజలు తనతో పంచుకున్న అనుభవాలను గుండెల్లో పొదువుకొని వారి అభ్యున్నతికి అవసరమైన చర్యలను అమలు చేయడం ప్రారంభించారు. కేబినెట్‌లో దాదాపు 60 శాతం మంత్రి పదవులు, అత్యంత కీలకమైన శాఖలు ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇవ్వడంతోపాటు స్పీకర్ పదవిని కూడా బీసీ వర్గానికే కేటాయించారు. కేబినెట్ సమావేశాల్లో స్వేచ్ఛగా సలహాలు, సూచనలు చేయొచ్చునని... అభ్యంతరాలున్నా తెలపాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు.
ఇప్పుడు అదే ప్రజాస్వామిక సంస్కృతిని ఆయన కింది స్థాయికి కూడా విస్తరింపజేయదల్చుకున్నారు. పై స్థాయిలో అమలవుతున్న ఈ విధానాన్ని సుస్థిరపరచాలంటే, బడుగువర్గాలు, మహిళల స్థితిగతులు మెరుగుపడాలంటే ఇదే మార్గమని ఆయన విశ్వసించారు. పర్యవసానంగానే ఈ కీలక బిల్లులు రూపొందాయి. సమాజంలో బీసీ వర్గాలపట్ల అమలవుతున్న వివక్ష ఎవరికీ తెలియనిది కాదు. ఆ వర్గాలకు చిన్నచూపు ఎదురవుతున్నా, దౌర్జన్యాలు సాగుతున్నా, న్యాయబద్ధంగా దక్కాల్సినవాటిని తొక్కి పెడుతున్నా ఎవరికీ ఫిర్యాదు చేయలేని నిస్సహాయత వారిది.
విద్య, ఉద్యోగాల్లో అమలు కావాల్సిన కోటా సంగతలా ఉంచి... చివరకు ధ్రువీకరణ పత్రాలు పొందడం కూడా కొన్ని సందర్భాల్లో వారికి కష్టమవుతోంది. అలాంటి సమస్యలకు శాశ్వత స్థాయి బీసీ కమిషన్ ఒక సమాధానం. నామినేటెడ్ పోస్టులనూ, నామినేషన్లపై ఇచ్చే పనులనూ ఆధిపత్య కులాలే తన్నుకుపోతున్న దశలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవి చట్టబద్ధంగా దక్కేందుకు 50 శాతం కోటా ఇచ్చే యోచన చేయడం... మహిళలకు సైతం ఈ లబ్ధి అందేలా చూడటం ఎంతో ప్రశంసనీయం. ఇది నిస్సందేహంగా ఆయా వర్గాల అభ్యున్నతికి తోడ్పడుతుంది. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా స్వశక్తితో ఎదిగే స్థితి వచ్చినప్పుడే వారి ఉన్నతి సాధ్యమని జగన్ మొదటినుంచీ చెబుతున్నారు. దానికి అనుగుణంగానే వారికి కూడా నామినేటెడ్ పోస్టుల్లో, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో సగభాగం కేటాయిస్తూ బిల్లు తీసుకొచ్చారు. ఇంతటి విప్లవాత్మక చర్యలకు సర్కారు శ్రీకారం చుట్టినప్పుడు ప్రతిపక్షం తన వంతు సహకారం అందజేయాలి. చర్చల్లో పాల్గొని, బిల్లుల్లో లోటుపాట్లుంటే తెలియజేయాలి. కానీ చంద్ర బాబు, ఆయన అనుచరగణం అందుకు భిన్నంగా ప్రవర్తించారు.
ఒక అవాస్తవమైన అంశాన్ని ఆసరా చేసుకుని సభలో గందరగోళం సృష్టించి ఈ బిల్లులపై చర్చ జరగనీయకుండా, అవి ఆమోదం పొందకుండా చూడాలని విఫలయత్నం చేశారు. అన్ని వర్గాలకు బండెడు వాగ్దానాలు చేస్తూ మేనిఫెస్టో నింపడం, అందలం ఎక్కిన తర్వాత విస్మరించడం అలవాటైనవారి నుంచి ఇంత కంటే మెరుగైన ప్రవర్తన ఆశించలేం. అట్టడుగు వర్గాల శ్రేయస్సును కాంక్షించి బిల్లులు రూపొం దించినప్పుడు చర్చల ప్రక్రియలో పాలుపంచుకోవడం మానుకుని, వాకౌట్ చేసే దుస్థితికి తెలుగు దేశం దిగజారింది. ఈ విషయంలో ఆ పార్టీ మున్ముందు సంజాయిషీ ఇచ్చుకోక తప్పదు. ఇలాంటి వినూత్నమైన, సృజనాత్మకమైన బిల్లులు తీసుకొచ్చిన జగన్ అట్టడుగువర్గాల హృదయాల్లో చిర స్థాయిగా నిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment