సాక్షి, అమరావతి : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సంబంధించి ప్రభుత్వం పలు బిల్లులను సభ ముందుంచే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో విపక్ష తెలుగుదేశం పార్టీ వాటిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ప్రతిపక్షం ప్రశ్నలకు అధికార పక్షం ఓపికగా బదులిచ్చినా గందరగోళం సృష్టించడమే అజెండాగా పెట్టుకుంది. చివరకు సభా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభలో వీడియో ద్వారా వాస్తవాలు వెల్లడించినా విపక్షం వినిపించుకోలేదు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి, సభాపతిని అవమానించే రీతిలో వ్యవహరించారు. దీంతో ముగ్గురు టీడీపీ సభ్యులను స్పీకర్ స్థానంలో ఉన్న ఉప సభాపతి కోన రఘుపతి ప్రస్తుత సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు.. మంగళవారం ఉ.9 గంటలకు మొదలైన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ గురించి టీడీపీ పక్ష సభ్యుడు రామానాయుడు ప్రశ్నించారు. దీనికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బదులిస్తూ.. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే తాము రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో దశల వారీగా ఇస్తామని చెప్పారు.
వీడియో క్లిప్పింగుల ప్రదర్శన
అనంతరం వైఎస్సార్ ఆసరా పథకాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సహా అధికార పార్టీ సభ్యులు వివరణ ఇచ్చారు. ‘మాట తప్పడం, అబద్ధాలు చెప్పడం ఇంటా వంటా లేదు’ అని చెబుతూ నాటి తన ప్రసంగాన్ని సభలో ప్రదర్శించాలని స్పీకర్‌ను కోరారు. ఈ సమయంలోనూ అచ్చెన్నాయుడు సహా ఇతర టీడీపీ సభ్యులు గందరగోళానికి దిగారు. ఆ తర్వాత సభలోకి వచ్చిన చంద్రబాబు ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన వాస్తవాలు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు కోసం మరోసారి వీడియో ప్రదర్శించారు.
ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
అయినా, టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు. సభాపతి సీటును పట్టుకుని, మైక్‌కు అడ్డుపడుతూ గందరగోళానికి దిగారు. ఈ దశలో సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జోక్యం చేసుకున్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా తమ ప్రభుత్వం చట్టాలు చేస్తోందని తెలిపారు. ఇవన్నీ జీర్ణించుకోలేకే కొన్ని రోజులుగా సభా కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోందన్నారు. టీడీపీ పక్ష సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరిని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీంతో ఆ ముగ్గురిని సభాపతి స్థానంలో ఉన్న కోన రఘుపతి ప్రస్తుత సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సభను వీడి వెళ్లాలని ఎంత చెప్పినా విన్పించుకోకపోవడంతో మార్షల్స్‌తో వారిని బయటకు పంపారు. అయినప్పటికీ చంద్రబాబుతో సహా ఇతర సభ్యులు తిరిగి అదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్, వైసీపీ సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
అసెంబ్లీ నుంచి వాకౌట్
టీ విరామం తర్వాత సభ తిరిగి 12.34 గంటలకు ప్రారంభమైనప్పుడు కూడా టీడీపీ సభ్యులు తమ సీట్లలో నుంచి లేచి సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు. ఇలా సుమారు గంటా 15 నిమిషాల పాటు సభా కార్యక్రమాలకు అడ్డుతగిలి న వారు మ.1.47 గంటల ప్రాంతంలో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. బీసీ శాశ్వత కమిషన్ ఏర్పాటుపై కనీసం ఒక్క టీడీపీ సభ్యుడు కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు బీసీ నేతలు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment