అనుకున్నంతా అయింది. నవంబర్ 24న దక్షిణాఫ్రికా అప్రమత్తం చేసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెల తిరిగేసరికల్లా 90కి పైగా దేశాలకు విస్తరించింది. మునుపటి డెల్టా వేరియంట్ కన్నా 3 నుంచి 5 రెట్లు ఎక్కువ వేగంతో విస్తరిస్తూ, ఒకటిన్నర–రెండు రోజుల్లో కేసులు రెట్టింపయ్యే సత్తా ఉన్న ఒమిక్రాన్ అమెరికా సహా అనేక దేశాలను వణికిస్తోంది. బ్రిటన్‌లో రోజువారీ కేసులు లక్షకు చేరుకున్నాయి. పలు ఐరోపా దేశాలు మళ్ళీ షరతులు పెట్టాయి. నెదర్లాండ్స్, తాజాగా చైనాలో కోటీ 30 లక్షల మందికి ఆవాసమైన షియాన్ లాక్డౌన్ పెట్టాయి. ‘చరిత్రలో మిగతా వైరస్‌లన్నిటి కన్నా వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. త్వరలోనే ప్రపంచంలో ప్రతి దేశంలో అది ఉంటుంది. రాబోయే మూడు నెలలు ప్రపంచానికి గడ్డుకాలం’ –ప్రసిద్ధ వ్యాపార దిగ్గజం బిల్ గేట్స్ మంగళవారం చేసిన ఈ భవిష్యత్ అంచనా ట్వీట్ అలసత్వం వహిస్తున్న అందరికీ మరో మేలుకొలుపు.
ఒమిక్రాన్ పూర్తి తీరుతెన్నులు, దానిపై ప్రస్తుత టీకాల సామర్థ్యం లాంటివి ఇప్పటికీ కచ్చితంగా తేలలేదు. టీకా రెండు డోసులూ వేసుకున్నవారికి సైతం ఒమిక్రాన్ బెడద తప్పట్లేదన్న డేటా మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ అనిశ్చితి మధ్యనే వివిధ దేశాల్లో ఒమిక్రాన్ కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ నలుగురూ కూడి చేసుకొనే వేడుకలను వాయిదా వేసుకోవాలన్నది ఆరోగ్య సంస్థ తాజా విజ్ఞప్తి. మన దేశంలో పండుగలకు తోడు పంజాబ్, ఉత్తర ప్రదేశ్, గోవా సహా అయిదు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలు, ర్యాలీలు ఇప్పుడే భయం పుట్టిస్తున్నాయి. భారత్‌లో మూడో వేవ్ తప్పదనీ, ఫిబ్రవరికి అది పతాక స్థాయికి చేరుతుందనీ, రోజుకు 1.5 నుంచి 1.8 లక్షల కేసుల వరకు రావచ్చనీ ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ సారథ్యంలోని ‘నేషనల్ కోవిడ్19 సూపర్ మోడల్ కమిటీ’ అంచనా.
ఈ పరిస్థితుల్లో కర్ణాటక, తాజాగా ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాలు సమావేశాలు, సామూహిక ఉత్సవాలపై షరతుల మొదలు నిషేధం దాకా చర్యలు మొదలుపెట్టాయి. ఒమిక్రాన్ కేసుల్లో భారత్ ఇప్పటికే 250 మార్కు దాటేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణలు ఈ కొత్త వేరియంట్ కేసుల్లో ముందు వరుసలో ఉన్నాయన్న సమాచారంతో ప్రజలు, ప్రభుత్వాలు మరింత అప్రమత్తం కావాల్సి వచ్చింది. డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాలను పూర్తిగా అనుమతించాలనుకొన్నా, భారత్ సహా దాదాపు 25 దేశాలు వెనక్కి తగ్గాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అవసరాన్ని బట్టి రాత్రి కర్ఫ్యూలు, షరతులతో కూడిన అనుమతులు, కంటైన్మెంట్ జోన్లు పెట్టాలంటూ కేంద్రం మంగళవారం పారాహుషార్ సందేశం పంపిన విషయం మర్చిపోలేం. దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తుండడం గమనార్హం.
ఒమిక్రాన్‌తో కోవిడ్ వ్యాపిస్తున్నా, మునుపటిలా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కాకపోవడం ఉన్నంతలో ఊరట. అలాగని అశ్రద్ధ చేయలేం. ఒకేసారి వందలు, వేల సంఖ్యలో కరోనా బారినపడ్డ వారు ఆసుపత్రి పాలైతే, పరిస్థితి ఏమిటన్నది ఊహించడం కష్టం. ప్రస్తుతం భారత్‌లో సీనియర్ సిటిజన్ల సంఖ్య 13.8 కోట్లు. వారిలో సగం మందికి కరోనా తీవ్రంగా వచ్చినా, పరిస్థితి అతలాకుతలమవుతుంది. కరోనా దెబ్బతో రెండేళ్ళ క్రితంతో పోలిస్తే, ఇప్పుడు పౌర ఆరోగ్య వసతులు కొంత మెరుగైనమాట నిజమే కానీ, పడకల మొదలు ఆక్సిజన్ దాకా ఎందరికి సరిపోతాయన్నది చెప్పలేం. ప్రపంచానికి కరోనా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటి దాకా పని ఒత్తిడితో శారీరకంగా, మానసికంగా డస్సిపోయిన వైద్య సిబ్బందికి అది మరింత భారమయ్యే ప్రమాదమూ ఉంది. మరోపక్క ప్రస్తుతం కరోనాపై అత్యంత ప్రభావశీలమైన యాంటీబాడీ కాక్‌టైల్ చికిత్సకయ్యే రూ. 60 వేల ఖర్చు సామాన్యులు భరించడమూ కష్టమే.
ఈ పరిస్థితుల్లో అనేక దేశాలు రోగ నిరోధకశక్తిని పెంచే బూస్టర్ డోస్‌గా మూడో డోస్ మార్గం పట్టాయి. ఇజ్రాయెల్ ఏకంగా 4 డోసుల విధానం వైపు నడుస్తోంది. త్వరలో ఆ పద్ధతిని ఆచరణలో పెడితే, నాలుగు డోసుల పద్ధతి అనుసరిస్తున్న తొలి ప్రపంచ దేశం ఇజ్రాయెలే అవుతుంది. మామూలుగా టీకా వల్ల కలిగే ఇమ్యూనిటీ మూడు నెలల మొదలు ఏడాది లోపల తగ్గిపోతుందని నిపుణుల మాట. అందుకే, భారత్‌లో సైతం నిర్ణీత రెండు డోసులే కాకుండా మూడోదీ వేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఒమిక్రాన్ బెడదతో కనీసం ఫ్రంట్‌లైన్ వర్కర్లకూ, ఇతర అనారోగ్యాలున్న వారికైనా ముందుగా ఈ బూస్టర్ డోస్ వేయాలనే వాదన రోజురోజుకూ బలం పుంజుకుంటోంది. ఇప్పటికైతే బూస్టర్ డోస్‌లు, పిల్లలకు టీకాలకు సర్కార్ సుముఖంగా లేదు.
మామూలు జలుబు వైరస్ నుంచి ఒమిక్రాన్ తన జన్యుద్రవ్యాన్ని తీసుకుందని ఎన్‌ఫెరెన్స్ సంస్థ అధ్యయనం. అలాగే, ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఒమిక్రాన్ చివరకు కోవిడ్ వ్యాధిగా కాక, సాధారణ కోవిడ్ ఫ్లూలా తయారవుతుందని ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ వైద్యుడు ప్రవీణ్ హిసారియా అంచనా. అదే నిజమైతే, ప్రపంచం నెత్తిన పాలు పోసినట్టే! ఆధునిక భారతావనిలో క్రికెట్, మతం, రాజకీయాలు మూడూ అతి పెద్ద విశ్వాసాలనుకుంటే, చివరి రెండింటితో ఉత్సవాలు, ఊరేగింపుల పుణ్యమా అని కరోనా వ్యాప్తి ఉదంతాలు గత రెండేళ్ళలో అనేకం. టీకాలు వేసుకోవడం, భౌతిక దూరం–మాస్కు ధారణ లాంటి కోవిడ్ జాగ్రత్తలతో కూడిన ప్రవర్తన– ఈ రెండే ఎన్ని వేరియం
ట్లొచ్చినా శ్రీరామరక్ష అంటున్న ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాటలే తారకమంత్రం.
Comments
Please login to add a commentAdd a comment