దాదాపు రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచమంతటికీ చెబుతున్న పాఠం! తాజా వైవిధ్యం ‘ఒమిక్రాన్’ విషయంలో పొల్లుపోని అక్షర సత్యం. వైరస్ బారినపడి భంగపోకుండా విరుగుడు కార్యాచరణకు తిరుగులేని బ్రహ్మాస్త్రం! తూర్పు దేశాల్లో వాతావరణం చూశాక, ఇక్కడ అనుసరించాల్సిన విధానం, పాటించాల్సిన జాగ్రత్తలపై అందరూ చేస్తున్న హెచ్చరిక ఇదే! ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల్ని వాయిదా వేయాలన్న అలహాబాద్ హైకోర్టు సూచనని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ర్యాలీల్ని, సభల్ని రద్దు చేయించాలని న్యాయస్థానం ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్నీ కోరింది.
వచ్చేవారం క్షేత్ర పర్యటన చేసి నిర్ణయిస్తామని ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు. ఎన్నికలు వాయిదా పడ్డా ఆశ్చర్యం లేదు. రాత్రి పూట కర్ఫ్యూని యూపీ ప్రభుత్వం అప్పుడే ప్రకటించేసింది. క్రిస్టమస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి వంటి పండుగల దృష్ట్యా ఎంతో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలిచ్చాయి. దేశంలో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులతో పాటు పాలకులు, న్యాయస్థానాలు పౌరసమాజాన్ని ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తం చేస్తున్నాయి. గడచిన 24 గంటల్లో, ఈ దిశలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. తూర్పులోని అమెరికా, ఐరోపా దేశాలలో కేసుల ఉధృతి పెరిగిన క్రమంలోనే మన దేశంలోనూ కేసుల సంఖ్య పెరగడం గడచిన రెండేళ్లుగా రివాజయింది. ఆఫ్రికాలో మొదలై అత్యంత వేగంగా నూరు దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ వ్యాప్తి అమెరికా, ఐరోపాను వణికిస్తోంది. రోజువారీ కోవిడ్ కొత్త కేసులు అమెరికాలో 2.65 లక్షలకు చేరాయి.
కిందటి వారం రోజుల సగటు 1.88 లక్షల కేసులుగా నమోదయింది. ఇక బ్రిటన్ (యునైటెడ్ కింగ్‌డమ్)లో రోజువారీ కొత్త కేసులు 1.22 లక్షలు కాగా, కిందటి వారం సగటు 96 వేల కేసులు. ఇప్పటివరకు వచ్చిన కరోనా అన్ని వైవిధ్యాల కన్నా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండి, కొత్త కేసుల్లో వాటి శాతం రమారమి పెరుగుతోంది. మన దేశంలో కోవిడ్ రెండో అల ఉధృతి తీవ్రంగా ఉన్నపుడు జరిగిన భారీ నష్టం మనందరికీ గుర్తుంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కేసులు సంఖ్య ఇబ్బడి–ముబ్బడిగా పెంచి, ఇపుడు మూడో అలను మనమే రేపిన వాళ్లమౌతాం! ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి అసాధారణమని, అత్యంత వేగవంతమని అన్ని అధ్య యనాలూ తేల్చాయి. ఆఫ్రికా, అమెరికా, బ్రిటన్‌లతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే ధృవీకరించింది. దాన్ని నిజం చేస్తూ, దేశంలో కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.
ప్రపంచమంతటా, ముఖ్యంగా భారత్‌లో తీవ్ర ప్రభావం చూపిన డెల్టా వైవిధ్యంతో పోలిస్తే ఒమిక్రాన్ ‘అంత ప్రమాదకారి కాదు’ అనే నివేదికలు వస్తున్నాయి. వైరస్ సోకినా, ఆస్పత్రికి వెళ్లి ఐసీయూలో ఉండాల్సిన అవసరం వచ్చేది తక్కువ కేసుల్లోనే! అలా అని నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్–19 తొలి అల తీవ్రత మందగిస్తున్నపుడు ప్రజానీకం చూపిన అలసత్వానికి దేశం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. కోవిడ్ నిబంధనల్ని పాటించ కుండా, ‘ఇంకెక్కడి కోవిడ్...?’ అని పౌరులు చూపిన విచ్చలవిడితనం, నిర్లక్ష్యం నికర ఫలితం... రెండో అల ఉధృతి! దేశం అల్లాడిపోయింది.
నెల వ్యవధిలో లక్షమందిని కోల్పోయిన పాడు కాలం, కళ్ల జూశాం! ఇపుడైనా... నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శరీరంలోకి జొరబడ్డ వైరస్ పరిమాణం–ఉధృతి పెరిగితే ఎవరికైనా ప్రమాదమే! అప్పటికే ఇతరేతర జబ్బులున్న వాళ్లకు ఇది అత్యంత ప్రమాదకరం. ఏ టీకా తీసుకోని వారూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు 140 కోట్ల టీకా డోసులు ఇచ్చారు. దేశ జనాభాలో అర్హులైన (18 ఏళ్లు పైబడ్డ) వారిలో 60 శాతం మందికి రెండు డోసుల టీకాలు పడగా, మొత్తమ్మీద 89 శాతం మంది అర్హులకు కనీసం ఒక డోసైనా టీకా ఇచ్చినట్టయింది. ఈ కార్యక్రమాన్ని వేగిరపరచాలని, త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రధాని మోదీ అధికార యంత్రాంగానికి నిర్దేశించారు.
‘జనం బతికుంటే, ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాలు తర్వాతైనా పెట్టుకోవచ్చు’అంటూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయం నూరుపాళ్లు సత్యం! అధికరణం 21 ద్వారా రాజ్యాంగం భరోసా ఇచ్చిన మనిషి జీవించే హక్కును ఉటంకిస్తూ ఆయనీ వ్యాఖ్య చేశారు. విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టే రాష్ట్రాల సరిహద్దుల్లో, బస్‌స్టేషన్లలో, రైల్వేస్టేషన్లలోనూ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ స్ఫూర్తిని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పౌరసమాజం కూడా చిత్తశుద్దితో స్వీకరించాలి. కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ) కనబరచాలి.
న్యాయస్థానాలు నిర్దేశించినట్టు, ప్రభుత్వాలు ఆదేశిస్తు న్నట్టు, మనమంతా గ్రహిస్తున్నట్టు... చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం, మూతి ముసు గులు ధరించడం, భౌతిక దూరం పాటించడం విధిగా చేయాలి. పండుగలు, పబ్బాల గురించి మతాలకతీతంగా ఆలోచించాలి. ఏ పండుగలైనా ప్రజల ప్రాణాలకన్నా మిక్కిలి కాదు. సభలు, సమావేశాల్లో కోవిడ్ నిబంధనల్ని పాటించడం కష్టమౌతుంది కనుక వాటిని నిలువరించాలి. ఈ విషయం నిర్లక్ష్యం చేస్తే, న్యాయస్థానమే చెప్పినట్టు... పరిస్థితులు రెండో అల విపరిణామాల్ని మించే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment