సమన్వయమే కీలకం | Editorial On Coronavirus Fight Against Of Central And State Governments Coordination | Sakshi
Sakshi News home page

సమన్వయమే కీలకం

Published Thu, Jun 25 2020 12:03 AM | Last Updated on Thu, Jun 25 2020 12:04 AM

Editorial On Coronavirus Fight Against Of Central And State Governments Coordination - Sakshi

కరోనా వైరస్‌ కేసుల్లో మహారాష్ట్ర ఇప్పటికీ అగ్రభాగానే వున్నా అక్కడ కొత్తగా బయటపడే కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్న సూచనలు కనబడటం ఊరటనిస్తుండగా... దేశ రాజధాని నగరం ఢిల్లీ మాత్రం ఇంకా భయపెడుతూనే వుంది. ఆ మహా నగరం గురించిన చింత మరొకటుంది. కరోనా విరుచుకుపడుతున్న ఈ దశలో కూడా ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడటం... రోగుల విషయంలో ఎలా వ్యవహరించాలన్న ప్రాథమిక అంశంలో కూడా ఏకాభిప్రాయం లేకపోవడం మరింతగా ఆందోళన కలిగిస్తోంది.  దేశంలో బుధవారంనాటికి దేశవ్యాప్తంగా 4,56,183 కేసులుండగా, మహారాష్ట్రలో 1,39,010 కేసులు, ఢిల్లీలో 70,390 కేసులు న్నాయి. ఢిల్లీలోప్రభుత్వాలు రెండూ కలిసి పనిచేయకపోతే ఆ నగరం ప్రమాదకరంగా మారుతుం దని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పాక కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఢిల్లీ లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌... ఉన్నతాధికారులు ఉమ్మడి సమావేశాలు నిర్వహిం చారు. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి అదనపు చర్యలు తీసుకోవాల్సివుంటుందో సూచిస్తూ కేంద్రం వివిధ సూచనలు చేసింది. వీటన్నిటి పర్యవసానంగా కరోనా కట్టడి మెరుగవుతుందని అందరూ ఆశించారు. కానీ జరుగుతున్నది వేరు. నాలుగు రోజులక్రితం అనిల్‌ బైజాల్‌ జారీ చేసిన ఆదేశాలు గమనిస్తే ఈ సంగతి అర్థమవుతుంది. 

ప్రస్తుతం కరోనా వ్యాధిగ్రస్తుల్ని గుర్తించాక వారిలో స్వీయ నిర్బంధం సరిపోతుందనుకున్న వారిని ఇంటికే పరిమితం చేస్తున్నారు. వారి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అవస రమైన మందులిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువున్నవారిని మాత్రం ఆసుపత్రుల్లో చేరుస్తున్నారు. అయితే బైజాల్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా కరోనా బారిన పడినవారంతా కనీసం అయిదు రోజులు ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య కేంద్రాల్లో వుండాలి. వైద్యుల పర్యవేక్షణలో వారు అన్ని రకాల పరీక్షలూ చేయించుకున్నాక ఆ రోగులకు స్వీయ నిర్బంధం సరిపోతుందో లేదో నిర్ణయిస్తారు. అదే సమయంలో మరో బృందం ఆ రోగుల ఇంటికిపోయి అక్క డున్న సౌకర్యాలేమిటో చూస్తుంది. స్వీయ నిర్బంధంలో వుండదల్చుకున్నవారికి ఇంటిదగ్గర విడిగా ఒక గది, వాష్‌రూం వున్నాయో లేదో పరిశీలిస్తుంది. అలాంటి అవకాశం వున్నవారిని మాత్రమే ఇళ్లలో వుండేందుకు పంపుతారు. తగిన సౌకర్యాలు లేకపోతే వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా వారు ఆసుపత్రులకే పరిమితం కావలసివుంటుంది. కరోనా వ్యాధి విస్తృతి క్రమంలో తీవ్రత అధికంగా వున్నచోట్ల అమలు చేస్తున్న విధానాలు కొన్నివున్నాయి.

మందకొడి లక్షణాలున్నవారిని ఇంట్లోనే వుంచి, ఎప్పటికప్పుడు వారికి సలహాలిస్తూ అవసరమైన మందులు వాడించడం, లక్షణాలు ముదు రుతున్న సూచనలు కనిపిస్తే ఆసుపత్రులకు తరలించడం అక్కడ అనుసరించే విధానం. కానీ బైజాల్‌ తాజా ఆదేశాలు కొత్త విధానాన్ని తీసుకొచ్చాయి. కరోనా లక్షణాలున్నవారందరినీ అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలించడం, అక్కడ అందరినీ పరీక్షించడం, అయిదురోజులపాటు వారు అక్కడే వుండటం వంటివి అందులో కొన్ని. అయితే ఢిల్లీ ప్రభుత్వం నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమ య్యాక అయిదురోజులు ఆసుపత్రుల్లో వుండాలన్న నిబంధన నిలిపివేశారు. ఆరోగ్యకేంద్రానికొచ్చి తగిన పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధన పాటించితీరాలంటున్నారు. వ్యాధివున్నా దాని లక్ష ణాలు బయటపడనివారిని, ఆ వ్యాధి తీవ్రత ఎక్కువున్నవారిని ఒకేచోట వుంచితే రోగుల సంఖ్య అమాంతం పెరిగిపోయే అవకాశం వుండదా? తీవ్ర జ్వరంతో బాధపడే రోగులు తమ వంతు వచ్చే వరకూ ఆసుపత్రుల్లో గంటల తరబడి బారులు తీరి నిలబడవలసి రావడం ఇబ్బంది కాదా? ఇంత మందిని పరీక్షించడానికి అవసరమైన వైద్య సిబ్బంది అందుబాటులో వుండటం సాధ్యమేనా? వ్యాధి తీవ్రత అధికంగా లేనివారిని ఇళ్లకు పరిమితం చేస్తున్నా, తీవ్రత వున్నవారిని చేర్చుకుని వైద్య సౌక ర్యాలు కల్పించడంలోనే ఆసుపత్రులు తలకిందులవుతున్నాయి.

ఢిల్లీ పరిధిలో 11 జిల్లాలుంటే అందులో కనీసం మూడు జిల్లాల్లో కరోనా జోరు అధికంగా వుంది. ఢిల్లీలో ఇప్పుడు రోజూ బయటపడుతున్న కేసుల సంఖ్య 3,000 దాటింది. ఇంతమందిని ఆసు పత్రులకు తరలించడానికి అవసరమైన అంబులెన్స్‌లు సమకూర్చడం, వచ్చిన రోగులకు అవసర మైన పరీక్షలు జరపడం, మరోపక్క తీవ్రత వున్నవారికి చికిత్స అందిస్తుండటం అయ్యేపనేనా? ఒక లెక్క ప్రకారం ఢిల్లీలో కరోనా రోగుల సేవకు 163 అంబులెన్స్‌లు ప్రత్యేకించారు. ఈ వాహనాలు ఒక్కొక్కటి 18 ట్రిప్పులు నడిపితే తప్ప 3,000మంది రోగుల్ని తరలించడం అసాధ్యం. పైగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాల్లో కూడా తగిన సదుపాయాలు లేవు. వైద్యుల సంగతలావుంచి అక్కడ తగినన్ని ఏసీలు, మరుగుదొడ్లు వంటివి లేకపోవడం రోగులకు సమస్యగా వుందంటున్నారు.

వైద్య బృందాలు అనుమానితుల ఇళ్లకు వెళ్లడం, వారికి పరీక్షలు జరిపి వ్యాధి నిర్ధారణ చేయడం, తక్షణం చికిత్స అవసరమైనవారిని ఆసుపత్రులకు తరలించడం... అంతగా తీవ్రత లేనివారిని ఇళ్లకే పరిమితం చేయడం అనే ప్రస్తుత విధానం ఉన్నంతలో మంచిది. అదీగాక రోజూ వేలాది కేసులు బయటపడుతున్న తరుణంలో వున్న విధానాన్ని మార్చడం వల్ల వ్యవస్థ తల కిందులవుతుంది. కరోనా వైరస్‌ పరీక్షల్ని నిర్వహించడంలో ఇప్పటికే దేశంలో అందరికన్నా ముందున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... వచ్చే మూడు నెలల్లో ప్రతి కుటుంబానికీ సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సంకల్పించింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా అదే బాటలో వెళ్లాలని నిర్ణయించుకుంది. ఢిల్లీలో కరోనా కట్టడికి అనుసరించాల్సిన విధివిధానాలపై అటు కేంద్ర ప్రభుత్వమూ, ఇటు ఢిల్లీ ప్రభుత్వమూ ప్రతిష్టకు పోకుండా సమష్టిగా పనిచేస్తేనే సమస్య మటు మాయం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement