కనీవినీ ఎరుగని రీతిలో నువ్వా నేనా అన్నట్టు సాగిన సార్వత్రిక సమరంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అసాధారణ రీతిలో దూసుకెళ్తూ ఘన విజయాన్ని నమోదు చేయబోతోంది. ఫలితాల హోరు చూస్తుంటే బీజేపీకి 2014 సార్వత్రిక ఎన్నికలకు మించిన రీతిలో 300 స్థానాలు దాటి రాబోతున్నాయని అర్ధమవుతోంది. ఆ పార్టీ ఓటింగ్ శాతం సైతం గణనీయంగా పెరగబోతోంది. గతంలో అది 31 శాతం కాగా, ఇప్పుడది దాదాపు 50 శాతానికి చేరుకునే అవకాశం కనబడుతోంది. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల నేతృత్వంలో సాగించిన ఎన్నికల ప్రచారం పర్యవసానమే. కాంగ్రెసేతర పక్షం ఒకటి వరసగా రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రావడమే కాక, తన మెజారిటీని గణనీయంగా పెంచుకోవడం ఇదే ప్రథమం.
ఒడిశా, పశ్చిమ బెంగాల్ వగైరాల్లో బీజేపీ స్థానాలు బాగా పెరిగాయి. గత అయిదేళ్ల పాలనలో పెద్ద నోట్ల రద్దుతో సహా ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలు బీజేపీని ఎడాపెడా దెబ్బతీస్తాయని అంచనా వేసిన కాంగ్రెస్‌ను, ఇతర విపక్షాలను ఈ ఫలితాలు దిగ్భ్రమపరిచాయి. అంతేకాదు... ఊహించని రీతిలో అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓటమిపాలయ్యారు. సంప్రదా యంగా ‘కుటుంబ నియోజకవర్గం’గా ఉంటూ వస్తున్న అమేథీలో ఓడిపోవడం కాంగ్రెస్‌కు నైతి కంగా శరాఘాతం. కేరళలోని వయనాడ్ విజయాన్ని అందించకపోయి ఉంటే ఆయనకు ఈసారి లోక్‌సభలో అడుగుపెట్టే అవకాశం కూడా ఉండేది కాదు. ఉత్తరప్రదేశ్‌లో మహా కూటమిగా ఏర్పడి, అజిత్‌సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ)ని దరిచేర్చుకుని బీజేపీ దూకుడుకు కళ్లెం వేద్దామనుకున్న ఎస్‌పీ–బీఎస్‌పీ కలలు కల్లలయ్యాయి. ఆ కూటమి విశాల దృక్పథంతో వ్యవ హరించి కాంగ్రెస్‌ను కూడా కలుపుకొని ఉంటే బీజేపీ మెజారిటీని తగ్గించడం వీలయ్యేది. అజిత్ సింగ్ వల్ల వస్తాయనుకున్న జాట్ ఓట్లు పెద్దగా రాకపోగా కాంగ్రెస్ చీల్చిన ఓట్లు ఆ కూటమిని దెబ్బతీశాయని చెప్పాలి.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటికి చాలామందికి ఉన్న అంచనాలు వేరు. ఎన్‌డీఏ అతి పెద్ద కూటమిగా అవతరిస్తుందని, దానికి కొన్ని ఇతర పార్టీల మద్దతు అవసర మవుతుందని పలు సర్వేలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకపక్క కాంగ్రెస్‌తో అంటకాగుతూనే మోదీ మినహా మరెవరినైనా ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతిస్తామని ఆరెస్సెస్ సారథులకు సందేశం పంపారన్న కథనాలు వెలువడ్డాయి. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ బాపతు నేతల అంచనాలను తలకిందులు చేశాయి. ఎన్‌డీఏకు 300కుమించి స్థానాలు వస్తాయని దాదాపు ప్రతి సంస్థా చెప్పింది. అయితే యూపీఏకు వందకుమించి వస్తా యన్న వాటి జోస్యం నిజం కాలేదు. అది 90 దగ్గరే ఆగిపోతోంది. పైగా గతంతో పోలిస్తే కాంగ్రెస్‌కు కేవలం పదంటే పది స్థానాలు మాత్రమే పెరిగాయి!
కేవలం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సాగించే ప్రచారం సత్ఫలితాలనివ్వకపోగా అది ఆ వ్యక్తిని మరింత బలోపేతం చేస్తుందని తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయి. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ రాహుల్‌గాంధీ సాగించిన ప్రచారం, మోదీనే లక్ష్యంగా చేసుకుని మమతా బెనర్జీ నిప్పులు చెరగడం ఏమాత్రం ఉపయోగపడలేదు. తాము వ్యతిరేకించే బీజేపీకి, తమకూ మౌలికంగా ఉన్న వ్యత్యాసాలేమిటో చెప్పడంలో, కనీసం ఆచరణలో చూపడంలో కాంగ్రెస్, ఇతర విపక్షాలు విఫలమయ్యాయి. ప్రధాన సమస్య ముంగిట్లో వాలినప్పుడు ఈ పార్టీలు నీళ్లు నమిలే ధోరణిని, గోడ మీది పిల్లివాటాన్ని ప్రదర్శించాయి. ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు కేరళలో తలెత్తిన శబరిమల వివాదం మొదలుకొని ఏ సమస్య విషయంలోనైనా తాము బీజేపీతో ఎక్కడ విభేది స్తున్నామో అవి తేల్చుకోలేకపోయాయి. మమతా బెనర్జీ, చంద్రబాబు వంటివారు తాము నియం తలుగా వ్యవహరిస్తూ, ఏకపక్షంగా ప్రవర్తిస్తూ మోదీ పాలనలో నియంతృత్వ పోకడల్ని వెదికితే జనం నవ్విపోరా? తమలో ఉన్న ఒంటెత్తు పోకడలను సరిచేసుకోకుండా, ఏ అంశంపైనా నిర్దిష్ట మైన అభిప్రాయం లేకుండా గాలివాటుగా వ్యవహరించేవారిని జనం ఎలా విశ్వసిస్తారని ఈ నాయ కులు భావించారో అర్ధం కాదు.
నిరుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకుంది. సార్వత్రిక ఎన్నికల సమయానికి ప్రచారసరళిని పూర్తిగా మార్చేసింది. గత అయిదేళ్లలో సాధించిన విజయాల గురించిన ప్రస్తావనను తగ్గించి, దేశ భద్రతను ఎజెండాలోకి తెచ్చింది. జాతీయవాదంపై కేంద్రీకరించింది. పుల్వామా ఉగ్రవాద దాడి, పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై మన సైన్యం చేసిన సర్జికల్ దాడులు వగైరాలు బీజేపీ నేతల ప్రసంగాల్లో ప్రధానాంశాలయ్యాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌కు ‘గుణపాఠం’ చెప్పిందన్న భావన కలిగించడంలో బీజేపీ సఫలమైంది. ప్రతిపక్షాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ప్రవ ర్తించాయి.
కూటమి పేరు పెట్టుకున్నా, విడివిడిగా పోటీచేసినా అందరికందరూ తామే కాబోయే ప్రధానులమన్నట్టు ప్రవర్తించారు. రాహుల్‌గాంధీ, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ, బీఎస్‌పీ అధినేత మాయావతి తదితరులు ఎవరికి వారు ఆశల పల్లకిలో ఊరేగారు. బాహాటంగా చెప్పలేదు గానీ... జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ కూడా ఆ పదవి మళ్లీ దక్కవచ్చునన్న ఆశాభావంతో ఉన్నారన్న కథనాలు వెలువడ్డాయి. చివరికొచ్చేసరికి కాస్త జ్ఞానోదయం కావడం వల్ల కావొచ్చు... అటు మమతా బెనర్జీ, ఇటు రాహుల్‌గాంధీ చేతులెత్తేశారు. తమకు ఎవరు ప్రధానైనా అభ్యంతరం లేదని చెప్పారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఓటమిని హుందాగా, విజయాన్ని నమ్రతగా స్వీకరించడం పరిణతికి చిహ్నం. గెలుపు తెచ్చిన ఉత్సాహంతో కట్టుదాటకుండా కర్తవ్యనిష్టతో, జవా బుదారీతనంతో పనిచేయాలని...ఓడిన పక్షాలను సైతం కలుపుకుని వెళ్లి సుపరిపాలన అందించేం దుకు కృషి చేయాలని విజయం సాధించిన పక్షాలు గుర్తుంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment