దేశమంతా గజగజ వణుకుతోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా డిసెంబర్ నాటికే చలి పులి చేతికి చిక్కి, జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన శీతల గాలులతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తత్ఫలితంగా తలెత్తుతున్న అనారోగ్య పరిణామాలు ఆందోళన రేపుతున్నాయి. దేశరాజధానిని చలి గాలి బలంగా తాకింది. ఢిల్లీలో ఈ సీజన్‌లోకెల్లా అతి తక్కువ ఉష్ణోగ్రత (3.1 డిగ్రీలు) సోమవారం నమోదైంది. కొద్దిరోజులుగా శ్రీనగర్‌లో వరుసగా రెండు రాత్రుళ్ళు మైనస్ 6 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయింది. రాజస్థాన్‌లోని చురూలో ఏకంగా మైనస్ 0.5 డిగ్రీలకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలు చలితో గడగడలాడుతున్నాయి.
శీతల, అతి శీతల గాలుల గుప్పెట్లో ఉత్తర భారతావని ఉందని భారత వాతావరణ శాఖ శనివారం ప్రకటించింది. కొద్ది రోజుల పాటు బాధలు తప్పవని హెచ్చరించింది. ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ము – కాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్ – బాల్టిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లు ఇప్పటికే తీవ్రమైన చలి గాలుల్లో చిక్కుకున్నాయి. మార్గశిర, పుష్య మాసాల హేమంత ఋతువులో శీతల పవనాలు, హిమ శీకరాలు సాధారణమే. కానీ, ప్రకృతి కోపించినట్లు ఇంతలేసి చలి మాత్రం ఇటీవలి అసాధారణం. 1991 నుంచి 2019 మధ్య మూడు దశాబ్దాల్లో శీతల గాలులు విజృంభిస్తున్నాయనీ, గత రెండు దశాబ్దాల్లో 4,712 మంది చనిపోయారనీ అధికారిక లెక్క. మానవ తప్పిదాల వల్ల ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన, శీతకాలంలో చలి – మూడూ దుర్భరస్థాయికి ఎగబాకడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఆందోళనకర పరిణామం.
ఉష్ణోగ్రతల్లోని భారీ మార్పులు వ్యవసాయం, పశుసంపద, జీవనోపాధి, పర్యావరణం, ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. సాక్షాత్తూ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఆ మాట చెప్పింది. వర్ధమాన దేశాల్లో ఏటా పెద్ద సంఖ్యలో మరణాలూ సంభవిస్తున్నాయి. ఉత్తర భారతావనిలో కొండ ప్రాంతాలు, వాటిని ఆనుకొన్న మైదానాలతో 17 రాష్ట్రాలలో ‘ప్రధానమైన శీతల గాలుల జోన్’ విస్తరించి ఉంది. దాదాపు 90.90 కోట్ల జనాభా ఈ జోన్‌లోనే జీవిస్తోంది. వీరిని బాధిస్తున్న శీతల గాలులపై ఎక్కడికక్కడ యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేసుకొనేందుకు ‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ (ఎన్‌డీఎంఏ) ఈ ఏప్రిల్‌లో మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని ఎవరు, ఎంత వరకు ఆచరణలో పెట్టారో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే.
కనిష్ఠ ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాల్లో 10 డిగ్రీల కన్నా తగ్గినా, పర్వత ప్రాంతాల్లో సున్నా డిగ్రీల కన్నా తగ్గినా అది ‘శీతల గాలి’ పరిస్థితి అని భారతీయ వాతావరణ శాఖ లెక్క. మరోలా చెప్పాలంటే, సాధారణ ఉష్ణోగ్రత కన్నా 4.5 నుంచి 6.4 డిగ్రీలు తగ్గితే – కోల్డ్ వేవ్. 6.4 డిగ్రీలకు మించి తగ్గితే, తీవ్రమైన కోల్డ్ వేవ్. దేశంలో అనేక చోట్ల ఇప్పుడీ పరిస్థితే ఉంది. తలదాచుకొనే గూడు, ఒంటి నిండా వస్త్రాలు లేని అధిక శాతం మందికి జీవన్మరణ సమస్యగా పరిణమించింది. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ వైద్య సంస్థలో వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబాలు పడకలు ఖాళీ లేక, చలిలో రోడ్డు మీద తాత్కాలిక గుడారాలు వేసుకొని, కాలక్షేపం చేస్తున్న దయనీయ దృశ్యాలు జాతీయ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. కొన్నేళ్ళుగా ప్రతి ఏటా దర్శనమిస్తున్న ఈ దృశ్యాలు ఈసారీ షరా మామూలు కావడం విషాదం. ప్రభుత్వాలు, పాలకుల పాత్ర ఇక్కడే కీలకం. తలదాచుకొనేందుకు నీడ లేని నిర్భాగ్యులను ఎముకలు కొరికే చలికి వదిలేయడం ఏ రకంగా చూసినా ధర్మం కాదు.
నిజానికి, నిరాశ్రయులకు దేశంలో మరే నగరంలోనూ లేనన్ని షెల్టర్లున్నది దేశ రాజధానిలోనే! ఈసారి కూడా నిరాశ్రయులను చలి కోరల నుంచి కాపాడేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ నవంబర్‌లోనే యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. మొన్న నవంబర్ 7 నుంచి వచ్చే మార్చి 15 వరకు ఆ ప్లాన్‌ను అమలులో పెడతామంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న 206 షెల్టర్లలో 7092 మందికి ఆశ్రయమిచ్చే అవకాశం ఉంది. కొత్తగా మరో 2 వేల మందికి, 250 తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ సర్కార్ సంకల్పించింది. చాపలు, దుప్పట్లు, లాకర్లు, కాలకృత్యాలకు వసతులు – అన్నీ కల్పిస్తా మన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో అనేక లోటుపాట్లున్నట్టు జాతీయ మానవ హక్కుల సంఘం సహా అనేక ఎన్జీఓల పరిశీలనలో వెల్లడైంది. నిరాశ్రయుల సంఖ్యకు తగ్గట్టు షెల్టర్లు లేవు. ఉన్నవి కూడా దయనీయావస్థలో ఉన్నాయి. అవసరార్థులకు సమీప షెల్టర్ల సమాచారం చెప్పే పరిస్థితి లేదు. తెలిసి వెళ్ళినా, రాత్రి 8 గంటల వేళకే జనంతో నిండిపోతున్నాయి. చాలామందికి జాగా లేని దుఃస్థితి.
దాదాపుగా దేశంలోని ప్రతి నగరంలోనూ నిర్భాగ్యులకు ఎదురవుతున్నది ఇలాంటి నిర్లక్ష్యమే! అసలు ఇలాంటి అభాగ్యులకు నిలువ నీడ కల్పించడానికి ‘జాతీయ పట్టణప్రాంత జీవనోపాధి ప్రణాళిక – పట్టణప్రాంత నిరాశ్రయులకు ఆవాసం’ పేరిట ఓ జాతీయ ప్రణాళిక ఉంది. సుప్రీమ్ కోర్టు మార్గదర్శకాల ప్రకారమైతే, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిరాశ్రయుల కోసం గౌరవప్రదమైన, శాశ్వత షెల్టర్లను నిర్మించడం చట్టప్రకారం విధాయకం. కానీ, స్థానిక, రాష్ట్ర సర్కార్లు ఏ మేరకు చొరవ చూపుతున్నాయి? ఇప్పటికైనా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రభుత్వాలు కాగితంపై ఉన్న కేంద్రీయ విధానాన్నీ, కోర్టు మార్గదర్శకాలనూ తు.చ. తప్పక కార్యాచరణలో పెట్టాలి. అప్పుడే ఈ చలి పులి పంజా విసురు నుంచి నిర్భాగ్యులు తప్పించుకోగలుగుతారు.
Comments
Please login to add a commentAdd a comment