
ప్రతీకాత్మక చిత్రం
అటు ఆర్థిక వ్యవస్థలో చురుకుదనం తెచ్చేందుకు ప్రయత్నించడంతోపాటు ఇటు బ్యాంకు ఖాతా దార్లకు ఊరట కలిగించేలా గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయాలు ఉన్నంతలో మెచ్చదగినవే. కానీ దాన్నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించినందువల్ల కావొచ్చు... మార్కెట్ల నుంచి పెద్దగా స్పందన లేదు. రెపో రేటును ఆర్‌బీఐ పావు శాతం తగ్గిస్తూ, దాన్ని 5.75 శాతానికి పరిమితం చేసింది. రివర్స్ రెపో రేటు 5.5 శాతంగా ఉంది. 2013 తర్వాత ఆర్‌బీఐ వరసగా మూడో దఫా రెపో రేటు తగ్గించడం ఇదే మొదటిసారి. అంతేకాదు... రెపో రేటు 5.75 శాతానికి పరిమితం కావడం తొమ్మిదేళ్ల కనిష్టం. అలాగే ద్రవ్య విధానాన్ని ‘తటస్థత’ నుంచి ‘అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు’ చేసుకునే విధంగా మార్చింది.
కనుక సమీప భవిష్యత్తులో రెపో రేటు పెరుగుదల ఉండదని భావించాలి. మన ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటం, చాన్నాళ్లుగా చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెరగకపోవడం, ద్రవ్యకొరత ఏర్పడటం కనబడు తూనే ఉంది. పైగా రుతుపవనాలు ఆశించినంతగా ఉండబోవని వాతావరణ విభాగం ఇప్పటికే ప్రకటించింది. ముడి చమురు ధరలు ప్రస్తుతానికి తగ్గుముఖంలో ఉన్నా అంతర్జాతీయ పరిణామా లరీత్యా ఇదిలాగే కొనసాగుతుందన్న విశ్వాసం ఎవరికీ లేదు. ఫైనాన్షియల్ మార్కెట్లు సైతం ఒడిదుడుకుల్లో ఉన్నాయి. కనుకనే రెపో రేటు తగ్గినప్పుడు సాధారణంగా కనబడే ఉత్సాహం ఈసారి లేదు. మన ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులెలా ఉన్నాయో గతవారం వెల్లడైన అధికార గణాం కాలు వెల్లడిస్తున్నాయి.
పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ధోరణి పూర్తిగా ఆగిపోయింది. మొన్న మార్చిలో ఇది క్షీణ దశకు కూడా పోయింది. ఈ ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 6.8 శాతం మించలేదు. ఇది అయిదేళ్ల కనిష్టం. పైగా వచ్చే ఏడాది వృద్ధి రేటు గతంలో ప్రకటించినట్టు 7.2 శాతం కాక, 7 శాతమే ఉండొచ్చునని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. వినియోగం మందగించటం, ఎగుమతులు కూడా ఆశించినంతగా లేకపోవడం, నిరుద్యోగిత ఆందోళన కలిగించే అంశాలు. ఏతా వాతా మన దేశాన్ని ‘ప్రపంచంలో శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’గా ఇప్పటికైతే ఎవరూ పరిగణించరు.
తన నియంత్రణలోలేని ఇతర అంశాల సంగతలా ఉంచి, ఏదోమేరకు చేయడానికి అవకాశము న్నచోట సైతం ఆర్‌బీఐ దృఢంగా వ్యవహరించలేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని గుర్తిం చాలి. ఈ విషయంలో అది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గి స్తున్నా దానికి అనుగుణంగా బ్యాంకులు స్పందించడం మానుకుని చాన్నాళ్లయింది. రెపో రేటు ఇలా తగ్గడం ఏడాదిలో ఇది మూడోసారి. ప్రతిసారీ ఈ తగ్గింపు వృద్ధికి ఊతమిస్తుందని గంభీరంగా ప్రకటించడం తప్ప బ్యాంకులు తమ వంతుగా వడ్డీ రేట్లు తగ్గించి ఆ ప్రయోజనాలను ఖాతాదార్లకు బదలాయించడం లేదు. అలా చేయమని కోరుతూ ఆర్‌బీఐ సూచనలిస్తున్నా వాటికి పట్టడం లేదు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఆర్‌బీఐ రెపో రేటును అరశాతం తగ్గించింది. ఖాతా దార్లకు అదే నిష్పత్తిలో అందాల్సిన ప్రయోజనానికి బ్యాంకులు గండికొట్టాయి. ఖాతాదార్లకు వడ్డీ రేట్లలో 0.21 శాతం మాత్రమే కోత పడిందని నిపుణులు చెబుతున్న మాట. పైగా ఈ తగ్గింపైనా కొత్త రుణ గ్రహీతలకు వర్తింపజేస్తున్నారు తప్ప పాతవారికి అందజేయడం లేదు. వాస్తవానికి ఖాతాదార్లకు ఇలా ప్రయోజనాన్ని బదలాయిస్తే వచ్చే ఫలితాలు బహుముఖంగా ఉంటాయి. అది వస్తు వినిమయాన్ని పెంచుతుంది. అందువల్ల తయారీ రంగం మెరుగవుతుంది. గృహ కొనుగోళ్లు పెరిగి రియాలిటీ రంగం ఊపందుకుంటుంది. వాహన కొనుగోళ్లకు డిమాండ్ ఉంటుంది.
ఆర్‌బీఐ నేరుగా బ్యాంకు ఖాతాదార్లకు ప్రయోజనం చేకూర్చే మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ(నెఫ్ట్)ల ద్వారా జరిపే ఆన్‌లైన్ లావాదేవీలకు వసూలు చేస్తున్న చార్జీలను తొలగించాలన్న నందన్ నిలేకని నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది. రూ. 2 లక్షల వరకూ నగదును బదిలీ చేయ డానికి వినియోగించే నెఫ్ట్, అంతకు పైబడిన లావాదేవీలకు వినియోగించే ఆర్‌టీజీఎస్‌లపై వసూలు చేసే చార్జీలు ఇకపై ఉండవు. వాస్తవానికి ఆన్‌లైన్ లావాదేవీల సదుపాయం ఖతాదార్లకు 24 గంటలూ అందుబాటులో ఉంచాలని కూడా నిలేకని కమిటీ సూచించింది. కానీ ఆ విషయంలో ఆర్‌బీఐ ఎందుకనో మౌనంగా ఉండిపోయింది.
డిజిటల్ లావాదేవీలపై వసూలు చేస్తున్న చార్జీల తొలగింపు నిర్ణయాన్ని బ్యాంకులు వెనువెంటనే అమలు చేస్తాయా అన్నది చూడాల్సి ఉంది. డిజి టల్ లావాదేవీలతోపాటు సాధారణ జనం సైతం గణనీయంగా వినియోగిస్తున్న ఏటీఎంల విష యంలోనూ ఆర్‌బీఐ సరైన విధానాన్ని ప్రకటించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అటు డిజి టల్ లావాదేవీలైనా, ఇటు ఏటీఎం వినియోగమైనా బ్యాంకులపై ఒత్తిళ్లను గణనీయంగా తగ్గిస్తున్నా యన్నది కాదనలేని సత్యం. ఈ వెసులుబాటు వల్ల అవి సిబ్బందిని తగ్గించుకోగలిగాయి. ఆ మేరకు బ్యాంకుల వ్యయం సైతం తగ్గింది. ఏటీఎంలు వినియోగించకతప్పని స్థితిని ఆసరా చేసుకుని ఖాతా దార్లనుంచి బ్యాంకులు వసూలు చేస్తున్న చార్జీలు తక్కువేమీ కాదు.
ఖాతా తెరిచేటపుడు ఇచ్చే డెబిట్ కార్డుకు రూ. 130 నుంచి 300 వరకూ బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. పరిమితికి మించి లావాదేవీలు జరిపారని, మా బ్యాంకు ఏటీఎంను కాక, వేరే బ్యాంకు ఏటీఎంను లెక్కకు మించి ఉప యోగించారని బ్యాంకులు ఖాతాదార్లను ఉసురుపెడుతున్నాయి. అసలు లావాదేవీలు జరపక పోయినా తప్పుగా పరిగణించి సర్‌చార్జీల మోతమోగిస్తున్నాయి. ఇన్ని రూపాల్లో వాటికొస్తున్న వార్షికాదాయం వేల కోట్లలో ఉంటోంది. కనుక ఏటీఎం లావాదేవీల విషయంలోనూ ఆర్‌బీఐ సాను కూల నిర్ణయం తీసుకోవాలి. తన చర్యల వల్ల కలిగే ఏ ప్రయోజనమైనా అంతిమంగా ఖాతాదారుకు చేర్చగలిగినప్పుడే దానివల్ల సత్ఫలితాలు వస్తాయని రిజర్వ్‌బ్యాంక్ గ్రహించాలి.