మీడియా ముందుకు మోదీ! | Editorial On Narendra Modi Press Meet | Sakshi
Sakshi News home page

మీడియా ముందుకు మోదీ!

Published Sat, May 18 2019 12:38 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Editorial On Narendra Modi Press Meet - Sakshi

ఏడు దశల సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆదివారం 59 స్థానాలకు జరగబోయే చివరి దశ పోలిం గ్‌కు ప్రచార ఘట్టం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఒకందుకు ఈసారి లోక్‌సభ ఎన్నికలు అందరికీ గుర్తుండిపోతాయి. ఎవరూ ఊహించనివిధంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలి సారి మీడియా సమావేశంలో పాల్గొని అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. అంతేకాదు... అలా పాల్గొని కూడా ప్రశ్నలకు జవాబులిచ్చే బాధ్యతను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు వదిలిపెట్టి మరింత ఆశ్చర్యపరిచారు. మొత్తం 17 నిమిషాల ఈ సమావేశంలో మోదీ తాను చెప్పదల్చుకున్నవి క్లుప్తంగా చెప్పారు. తాము మరింత గొప్ప మెజారిటీ సాధిస్తామని ప్రకటించారు. ఇది పార్టీ అధ్య క్షుడు నిర్వహిస్తున్న సమావేశం గనుక జవాబులిచ్చే బాధ్యతను ఆయనకే విడిచిపెడుతున్నాన న్నారు.

ఆ తర్వాతంతా అమిత్‌ షాయే మాట్లాడారు. సామాజిక మాధ్యమాల ద్వారా, ‘మన్‌ కీ బాత్‌’ ద్వారా, బ్లాగ్‌ ద్వారా తన మనోభావాలు చెప్పడం... ముఖ్యమైన సందర్భాల్లో ఎంపిక చేసు కున్న పాత్రికేయులతో సంభాషించడం తప్ప మోదీ ఈ అయిదేళ్లకాలంలో ఏ రోజూ మీడియా ప్రతి నిధుల సమావేశంలో మాట్లాడలేదు. ఆమాటకొస్తే 2013 అక్టోబర్‌లో ఆయన్ను ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించాక ఆయన మీడియా సమావేశాలకు రాలేదు. ఈ ధోరణిని విపక్షాలు తరచు విమ ర్శించినా ఆయన పట్టించుకోలేదు. అంతక్రితం ప్రధానులుగా ఉన్నవారెవరూ ఇలా చేయలేదు కనుక మొదట్లో మోదీ ధోరణి వింతగానే ఉండేది. కానీ రాను రాను అందరూ అలవాటు పడి పోయారు. శుక్రవారం నాటి మీడియా సమావేశం కోసం బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న పాత్రికేయులను ఎన్‌ఎస్‌జీ బృందం తనిఖీ చేసినప్పుడు మోదీ వస్తారేమోనన్న సందేహం అందరికీ కలిగింది. 

పాత్రికేయుల సమావేశంలో ప్రభుత్వాధినేతలు మాట్లాడితీరాలన్న నిబంధనేదీ లేదు. అది పూర్తిగా వారి ఇష్టం. పాలనాక్రమంలో ప్రభుత్వంపై పౌరులకు ఏర్పడే సందేహాలకు సమాధానమి వ్వడం, వివిధ రంగాలకు సంబంధించి తాము అమలు చేస్తున్న విధానాల్లోని ఆంతర్యాన్ని, తమ చర్యల వెనకున్న ఉద్దేశాలను వివరించడం కోసమే అధికారంలో ఉన్నవారు మీడియాకు చేరువగా ఉంటారు. మోదీ మంత్రివర్గ సహచరులు తరచు పాత్రికేయుల సమావేశాల్లో ఈ అయిదేళ్లుగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ పాలనకు సంబంధించి మాత్రమే కాదు... జాతీయంగా, అంతర్జాతీ యంగా ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరుల వెనకున్న దృక్పథంపై సాధికారికంగా వివరించడం ప్రధానికి మాత్రమే సాధ్యమవుతుంది. తమ పాలన పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉంటుం దని 2014లో అధికారం చేపట్టాక మోదీ ప్రకటించారు. ఈ రెండు అంశాల్లోనూ అంతా సవ్యంగా సాగుతున్నదన్న అభిప్రాయం కలగాలంటే మీడియా సమావేశాలు తరచు నిర్వహించడమే మార్గం.

ఈ సమావేశాల్లో ప్రతి జవాబునూ ప్రశ్నించే ధోరణి వల్ల పౌరులకుండే సందేహాలన్నీ తీరతాయి. ప్రతిపక్షాలు తరచు చేసే విమర్శలూ, ఆరోపణల్లోని నిజానిజాలేమిటో వారు తెలుసుకోగలుగు తారు. ఈ అయిదేళ్లలో తరచు ‘మన్‌ కీ బాత్‌’ద్వారా ప్రజలతో ఆయన జరిపిన సంభాషణల్లో ఇలా నిశితమైన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉండదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు అక్కడి మీడియాపై తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఆ సంగతిని ఆయనెప్పుడూ దాచుకోలేదు. దాన్ని ఆయన ‘ఫేక్‌ మీడియా’ అని కూడా అంటుంటారు. అలాగని మీడియా సమావేశాలకు ఆయనెప్పుడూ దూరంగా లేరు. మరీ ఇరకాటంలో పడేలా ప్రశ్నించినప్పుడు ఆయన ఆగ్రహించిన సందర్భా లున్నా, మీడియా సమావేశాలను విరమించుకోలేదు. నిజానికి ఇలా సమావేశాలు  నిర్వహించి పాత్రికేయుల ప్రశ్నలకు జవాబివ్వడం ప్రజలకు గల ‘తెలుసుకునే హక్కు’ను గుర్తించడం, గౌర వించడం కూడా. 

ఈసారి జరిగిన ఎన్నికల ప్రచారం గత రికార్డులన్నిటినీ తలదన్నింది. 38 రోజుల విస్తృతమైన ప్రచార ఘట్టం ఆద్యంతం పరస్పర దూషణలతో వేడెక్కింది. నెహ్రూ మొదలుకొని కన్నుమూసిన అనేకమంది నేతలకు సైతం ఈ క్రమంలో బాగా అక్షింతలు పడ్డాయి. ఆఖరికి ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు బలై మరణానంతరం అశోక్‌చక్ర పురస్కారం పొందిన పోలీసు ఉన్నతాధికారి హేమంత్‌ కర్కరే కూడా వీరి వాచాలత నుంచి తప్పించుకోలేకపోయారు. రిఫరీగా ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఎన్నికల సంఘం ఏమైందన్న సందేహం అందరిలోనూ తలెత్తింది. చివరకు ‘మీరు నిద్రపోతున్నారా...?’అని సుప్రీంకోర్టు నిలదీసేవరకూ వెళ్లాక అది జూలు విదిల్చింది. ఆద రాబాదరాగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వగైరాలను ప్రచా రానికి ఒకటి రెండురోజులు దూరంగా ఉంచింది. పశ్చిమబెంగాల్‌లో అయితే ప్రచారఘట్టాన్ని 24 గంటలముందు ముగిసేలా ఆదేశాలిచ్చింది. కానీ ఒరిగిందేముంది... జాతిపితను పొట్టనబెట్టు కున్న నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ ప్రజ్ఞాసింగ్‌ కితాబునిచ్చి అందరినీ దిగ్భ్రాంతిపరిచారు. అయితే బీజేపీ లోటుపాట్లను విపక్షం ఏ మేరకు సొమ్ము చేసుకోగలిగిందో అనుమానమే. 

సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో బాధ్యతారహి తంగా విద్వేషపూరిత ప్రచారం నిర్వహించిన ఘనత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డుకు దక్కుతుంది. తన పాలన ఘనత గురించి ఒక్క మాటా చెప్పుకోలేని బాబు... ప్రతిపక్ష నాయ కుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఎన్నికల సంఘాన్ని దుయ్యబట్టారు. లేనిపోని ఆరోపణలు చేశారు.  తననెవరూ విశ్వసించడంలేదని అర్ధమ య్యాక రోడ్‌ షోల్లో జనానికి వంగి వంగి దండాలు పెట్టారు. చివరకు అమరావతిలోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికిపోయి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని వేలు చూపుతూ బెదిరింపులకు దిగారు. ఏదేమైనా ఒక సుదీర్ఘ నిరీక్షణకు అయిదు రోజుల్లో తెరపడబోతోంది. ప్రజాతీర్పు ఏమి టన్నది ఈనెల 23న వెల్లడికాబోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement