డిజిటల్‌ ఆదాయ స్వప్నం | Editorial On Digital Currency In India | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ఆదాయ స్వప్నం

Published Fri, Feb 4 2022 1:14 AM | Last Updated on Fri, Feb 4 2022 12:14 PM

Editorial On Digital Currency In India - Sakshi

నిజాలెంత నిష్ఠూరంగా ఉన్నా, కనీసం కలలైనా కమ్మగా ఉండాలంటారు. నిరుద్యోగం పెరిగి, మధ్య, దిగువ మధ్యతరగతి నడ్డి విరిగిన కరోనా కష్టకాలంలో... తాజా కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం చూపిన భవిష్యత్‌ డిజిటల్‌ చిత్రం రకరకాల రంగులీనుతోంది. కాగితంతో పని లేకుండా డిజిటల్‌ ఉపకరణం సాయంతో ప్రసంగాన్ని చదువుతూ డిజిటల్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్థికం.. అన్ని రంగాలనూ డిజిటల్‌ బాట పట్టించే ప్రతిపాదనలు చేశారు. కొత్తగా వర్చ్యువల్‌ డిజిటల్‌ కరెన్సీ తెస్తామంటూ ‘డిజిటల్‌ భారతావని’ని అరచేతిలో చూపారు. క్రిప్టో మార్కెట్‌ పెరుగుతున్న నేపథ్యంలో వర్చ్యువల్‌ డిజిటల్‌ ఆస్తుల (వీడీఏల) లావాదేవీలపై 30 శాతం పన్ను ప్రతిపాదించారు. తద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం చర్చంతా వీడీఏలతో జనం గడించే ఆదాయంపై 30 శాతం పన్ను వేయడం మీదే! కొన్నేళ్ళుగా దేశంలో క్రిప్టో పరిశ్రమ ప్రాచుర్యానికి ఈ ప్రతిపాదన ఓ తార్కాణం. ఇటీవల వీడీఏలపై వాణిజ్యం భారీయెత్తున సాగుతుండడాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఒక వీడీఏను బదలాయించి నందుకు చెల్లింపులు కూడా అలాంటి మరో వీడీఏ రూపంలోనే సాగేలా మార్కెట్‌ ఆవిర్భవించడాన్ని గమనించింది. వెరసి, ఈ డిజిటల్‌ ఆస్తుల వ్యవహారం పన్ను రాబడికి వనరు అని గ్రహించింది. అందుకే, బడ్జెట్‌లో  వీడీఏల లావాదేవీలపై 30 శాతం మేర పన్ను వేసింది. అలాంటి అమ్మకాలు ఒక నియమిత పరిమితి దాటితే, 1 శాతం మేర టీడీఎస్‌ (మూలం దగ్గరే పన్ను మినహాయింపు) కూడా విధించింది. ఇలా క్రిప్టో కరెన్సీలు, నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్ల (ఎన్‌ఎఫ్‌టీ) వ్యాపారంలో లాభాలు రానున్న ఏప్రిల్‌ 1 నుంచి దేశంలోకెల్లా అత్యధిక పన్ను శ్లాబ్‌లోకి వస్తున్నాయి. 

డిజిటల్‌ కరెన్సీలకు ఆమోదముద్ర కోరుతున్నవారికి ఇది తీపి, చేదు అనుభూతుల సమ్మిశ్రమం. క్రిప్టో లాంటి డిజిటల్‌ ఆస్తులకు అధికారికంగా గుర్తింపు ఉన్నదీ, లేనిదీ తేల్చకుండానే ప్రభుత్వం పన్ను విధింపునకు దిగడం గమ్మల్తైన విషయమే. 2018లో రిజర్వ్‌ బ్యాంక్‌ క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్‌ను నిషేధించడం, ఆ తర్వాత రెండేళ్ళకు సుప్రీమ్‌ కోర్ట్‌ ఆ నిషేధాన్ని ఎత్తేయడం తెలిసిందే. అది జరిగీ మరో రెండేళ్ళవుతున్నా కేంద్రం ఈ క్రిప్టోలపై ఒక కచ్చితమైన విధాన నిర్ణయానికి రాలేకపోవడం విడ్డూరం. లాటరీ, జూదం, ఇతర గేమింగ్‌ల లాంటి స్పెక్యులేషన్‌ కార్యకలాపాలతో సమానంగా 30 శాతం భారీ పన్ను క్రిప్టో వ్యాపారాన్ని నిరుత్సాహపరచడానికేనని కొందరి అభిప్రాయం. అది కొంత నిజమే. లాభాలకు పన్ను కట్టినా, డిజిటల్‌ ఆస్తుల బదలాయింపులో నష్టాలు ఎదురైతే మాత్రం ఇతర ఆదాయంతో దాన్ని సమం చేస్తూ లెక్కలు చూపడానికి లేదన్న నిబంధన అందుకు నిదర్శనం. అయితే, అసలంటూ పన్ను విధింపు ద్వారా పరోక్షంగా డిజిటల్‌ ఆస్తుల్ని గుర్తిస్తున్నట్టు సర్కారు సంకేతాలిచ్చిందని ఇంకొందరు నిపుణుల మాట.

ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మన దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించాలని ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ తాజా చర్యలు అందులో భాగమే. మోదీ సర్కార్‌ 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి తగ్గట్లే ఇప్పుడు కొత్త డిజిటల్‌ కరెన్సీ ప్రతిపాదన తెచ్చింది. పొరుగున ఉన్న చైనా డిజిటల్‌ యువాన్‌ తేవడంపై మల్లగుల్లాలు పడు తుండగానే, రిజర్వ్‌ బ్యాంక్‌ సారథ్యంలో డిజిటల్‌ రూపీ తేనున్నట్టు మనం ప్రకటించడం పెద్ద విషయమే. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, మైనింగ్‌లను నిషేధించిన చైనా ఈ నెలలో శీతకాలపు ఒలింపిక్స్‌ నాటికి డిజిటల్‌ యువాన్‌ తేవాలని ప్రయత్నిస్తోంది. బ్రిటన్‌ కూడా డిజిటల్‌ కరెన్సీ తేవాలనుకుం టోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నోట డిజిటల్‌ రూపీ మాట క్రిప్టో కరెన్సీ వ్యాపారులకు హర్షమే.  

నిజానికి, మన దేశంలో దాదాపు 1.5 నుంచి 2 కోట్ల మంది క్రిప్టో ఇన్వెస్టర్లున్నారని అంచనా. వారి మొత్తం క్రిప్టో ఆస్తుల విలువ రూ. 40 వేల కోట్లని లెక్క. కరోనా దెబ్బతో ఖజానాకు ఆదాయం తగ్గుతున్నవేళ, జనం ఎగబడుతున్న క్రిప్టో పరిశ్రమ కొత్త పన్ను రాబడి కోసం ప్రభుత్వానికి పాడి ఆవులా కనిపించింది. అందుకే, బడ్జెట్‌లో ప్రతిపాదనలు పెట్టింది. మొదటి నుంచీ క్రిప్టో పరిశ్రమ పట్ల సదభిప్రాయం లేని సర్కారు తెలివిగా బడ్జెట్‌లో క్రిప్టో కరెన్సీ అనే పదం వాడలేదు. డిజిటల్‌ ఆస్తులు అనే ప్రస్తావిస్తూ వచ్చింది. ఇంతకీ, క్రిప్టో తదితర ఆస్తుల్ని అధికారికంగా ఏ మేరకు గుర్తిస్తున్నదీ, వాటి చట్టబద్ధత ఎంత అన్నదీ ప్రభుత్వమే వివరించాలి. తీవ్రవాద సంస్థల చేతిలో క్రిప్టో కరెన్సీ దుర్వినియోగమయ్యే ప్రమాదానికి నివారణ చర్యలనూ ఆలోచించాలి. 

రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్‌ కరెన్సీల మార్కెట్‌లో ప్రధాన వాటా కోసం డిజిటల్‌ రూపీ ఆలోచన బాగుంది. కానీ, ఇవాళ్టికీ దేశంలో సగానికి సగం మందికి డిజిటల్‌ నగదు లావాదేవీలు తెలియని చోట, కొత్తగా తెచ్చే అధికారిక డిజిటల్‌ రూపీ ప్రయోజనాలను పరిచయం చేసే బాధ్యత చేపట్టాలి. ఇక, క్రిప్టోతో ఈ డిజిటల్‌ రూపీ ఏ మేరకు పోటీపడుతుందన్నది మరో ప్రశ్న. రెండూ బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ మీద ఆధారపడినా, క్రిప్టోలో లాగా ఇక్కడ ఇన్వెస్టర్ల వివరాలు అజ్ఞాతంగా ఉండడం కుదరదు. ఒక్కమాటలో పరిశ్రమలో అగ్రభాగంలో నిలవడానికి డిజిటల్‌ రూపీ ఇంకా చాలా దూరమే ప్రయాణించాలి. క్రిప్టో ట్రేడింగ్‌పై పూర్తి నిషేధానికీ, ఇటు నియంత్రణలకూ మధ్యేమార్గంలో ప్రభుత్వం రెండు వ్యవస్థలూ సామరస్యంగా కొనసాగే చర్య చేపడుతుందేమో వేచి చూడాలి. అది ఎంత త్వరగా స్పష్టతనిస్తే అమాయక ఇన్వెస్టర్లకు అంత మేలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement