ఈసీపై ఎన్నదగిన తీర్పు | Editorial Column Central Election Commission News | Sakshi
Sakshi News home page

ఈసీపై ఎన్నదగిన తీర్పు

Published Sat, Mar 4 2023 3:44 AM | Last Updated on Sat, Mar 4 2023 5:10 AM

Editorial Column Central Election Commission News - Sakshi

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటం, వాటికి విశ్వసనీయత కల్పించటం ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు అత్యంత కీలకం. ఈ కర్తవ్యనిర్వహణలో తలమునకలు కావాల్సిన ఎన్నికల సంఘం(ఈసీ) స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆ పని పూర్తిచేస్తున్నదన్న అభిప్రాయం ప్రజల్లో కలిగిస్తే విశ్వస నీయత దానంతటదే ఏర్పడుతుంది. అందుకే ఎన్నికల సంఘం కూర్పు విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. ఈ తీర్పు ప్రకారం ఇకపై ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండే త్రిసభ్య కమిటీ ఎన్నికల కమిషనర్‌ల నియామకాలను ఖరారు చేయాల్సివుంటుంది.

ఇంతవరకూ అనుసరిస్తున్న విధానం వేరు. కేంద్ర పాలకుల ఇష్టారాజ్యంగా ఆ నియమాకాలుంటున్నాయి. ఎన్నికల సంఘం విధులు, అధికారాల విషయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు స్పష్టమైన అభిప్రా యాలున్నాయి. విస్తృతాధికారాలుండే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని, అందుకు అనుగుణమైన అధికారాలు దానికుండాలని రాజ్యాంగ నిర్ణాయక సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, అవసరమైన మార్గదర్శకాల ఖరారు కోసం ఎన్నికల సంఘం ఉండాలని రాజ్యాంగంలోని 324 అధికరణ మొదలుకొని 329వ అధికరణ వరకూ నిర్దేశిస్తున్నాయి. 

అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్‌లను ఏవిధంగా ఎంపిక చేయాలన్న అంశంలో రాజ్యాంగం ఏమీ చెప్పలేదు. ఈ అధికరణలపై రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చ జరిగి నప్పుడు ఎంపిక ప్రక్రియను పార్లమెంటుకే విడిచిపెట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. నిర్దిష్టంగా ఉండే నిబంధనలకే తూట్లుపొడవటం అలవాటైన దేశంలో స్పష్టత కొరవడితే చెప్పేదేముంది? ఇది సహజంగానే అధికారంలో ఉండేవారికి వరమైంది. తమకు అనుకూలురైనవారిని ఆ సంఘంలో నియమించటం ఒక సంప్రదాయంగా స్థిరపడింది.

అందువల్లే ఎన్నికలు ముంచుకొచ్చినపుడల్లా అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధాలు రివాజుగా మారాయి. ఎన్నికలు ప్రకటించటం దగ్గర్నుంచి ఎన్నికల తేదీల ఖరారు, ఎన్నికల నిర్వహణ వరకూ అన్నీ వివాదాస్పదమే అవుతున్నాయి. పార దర్శకత లోపించటమే ఇందుకు కారణం. గడువు పూర్తయిన రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి మాత్రమే ఎన్నికల ప్రకటన వెలువరించి, మరో రాష్ట్రం గురించి మౌనం పాటించారన్న విమర్శలు ఒకపక్క... ప్రచారసభల్లో అవతలి పార్టీ నేతలు ఏం మాట్లాడినా మౌనంవహిస్తూ తమపై మాత్రం దూకుడుగా చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు మరోపక్క తరచు ఈసీ ఎదుర్కొనాల్సివస్తోంది.

కొన్ని సందర్భాల్లో అదిచ్చే వివరణలు అసంబద్ధంగా ఉండటం కూడా కనబడుతూనే ఉంది. కేంద్రంలోని పాలకపక్షం తన విధేయులను ఎన్నికల సంఘంలో నియమించటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని విపక్షాలు ఆరోపించటం కూడా మామూలే. యూపీఏ పాలనలో ప్రధానంగా బీజేపీనుంచి ఇలాంటి ఆరోపణలు వినిపిస్తే ఇప్పుడు బీజేపీయేతర పక్షాలు ఆ పాత్ర పోషిస్తున్నాయి. ఎవరు అధికారంలోకొచ్చినా కమిషనర్ల ఎంపిక ప్రక్రియ మార్చాలన్న ఆలోచనకే దూరంగా ఉంటున్నారు. కొత్త చట్టం తీసుకొస్తే అది తమకే గుదిబండవుతుందని, తమ పాచికలు పారవని భావిస్తున్నారు. వాస్తవానికి జస్టిస్‌ ఏపీ షా నేతృత్వంలోని 20వ లా కమిషన్‌ ఎన్నికల సంఘం కూర్పు, ఎన్నికల సంస్కరణల గురించి లోతుగా పరిశీలించి నివేదిక ఇచ్చింది. కమిషనర్‌ల ఎంపికకు ఒక ప్రత్యేక కమిటీ ఉండాలని సూచించింది. కానీ ఇంతవరకూ దాని ఊసే లేదు. 

ఎన్నికల సంఘం తటస్థ పాత్ర పోషిస్తున్నదని పార్టీలకు పూర్తి నమ్మకం కుదిరినప్పుడే ఆ ఎన్ని కలపై ప్రజానీకంలో కూడా విశ్వసనీయత ఏర్పడుతుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలకు అవకాశం ఉండదు. ఎన్నికల సంఘం తాను సర్వస్వతంత్రంగా, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నానన్న భరోసా అందరిలోనూ కలగజేస్తే మెజారిటీ ప్రజానీకం నిర్భయంగా ఓటేయగలుగుతారు. మొదట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) ఒక్కరే ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యంవహిస్తే 1987 నాటి రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో అప్పటి సీఈసీ ఆర్‌వీఎస్‌ పేరిశాస్త్రి వ్యవహరించిన తీరుతో ఆందో ళనపడ్డ నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ 1989 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీని ఇద్దరు సభ్యుల కమి షన్‌గా మార్చారు.

కానీ ఎన్నికల అనంతరం వీపీ సింగ్‌ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం దాన్ని తిరగదోడింది. ఆ తర్వాత పదవి కోల్పోయిన కమిషనర్‌ ధనోవా సుప్రీంకోర్టుకెళ్లినా లాభం లేక పోయింది. తదనంతరకాలంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం అప్పటి సీఈసీ శేషన్‌ దూకుడు చూసి కీడు శంకించి త్రిసభ్య కమిషన్‌గా దాన్ని మార్చింది. కొత్తగా ఎంఎస్‌ గిల్, జీవీజీ కృష్ణ మూర్తిలను తీసుకుంది. ఎన్నికల సంఘం చట్టాన్ని సవరించి ముగ్గురికీ ఒకే రకమైన అధికారాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా కల్పించారు. అయితే అంతా మారినట్టేనా? లేదని ఇన్ని దశాబ్దాల అనుభవాలు పదే పదే నిరూపించాయి.

ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఈసీకి నిందలు తప్పటం లేదు. నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత కూడా అంతంతమాత్రం. సుప్రీంకోర్టు చెప్పడానికి ముందే ప్రభుత్వాలు దీన్ని గ్రహిస్తే బాగుండేది. కమిషనర్‌ల ఎంపిక ప్రక్రియపై కొత్త చట్టం తీసుకు రావాలని, అంతవరకూ తమ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తాజాగా ధర్మాసనం ప్రకటిం చింది. ఈ తీర్పు స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చట్టం తీసుకొస్తుందని, ఇకపై ఎన్నికల సంఘం తటస్థత విషయంలో అనుమానాలకూ, అపోహలకూ ఆస్కారం ఉండదని ఆశించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement