అయిదు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు ఈ వేసవిలో మళ్లీ పరీక్షా కాలం వచ్చింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలకు సంబంధించిన ఎన్ని కల షెడ్యూల్‌ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) విడుదల చేసింది.
పశ్చిమబెంగాల్‌లో ఏప్రిల్ 4 నుంచి మే 5 వరకూ నెల రోజుల వ్యవధిలో ఆరు దశలుగా...అస్సాంలో ఏప్రిల్ 4, 11 తేదీల్లో రెండు దశలుగా ఎన్నికలుంటాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒకే రోజు- మే 16న ఎన్నికలు జరుగుతాయి. అయిదు రాష్ట్రాల ఫలితాలు మే 19న వెలువడతాయి. ఇవి ఒకరకంగా మినీ సార్వత్రిక ఎన్నికలని చెప్పాలి. ఇందులో దాదాపు 17 కోట్లమంది ఓటర్లు 824 అసెంబ్లీ స్థానాలకు ప్రతినిధులను ఎన్నుకుంటారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని చెప్పడానికి వీలిచ్చే ‘నోటా’ మీటకు ఈ ఎన్నికల్లో తొలిసారిగా గుర్తును కేటాయించబోతున్నారు. అభ్యర్థుల గురించి ఓటర్లలో గందరగోళం లేకుండా చూడటం కోసం పార్టీ గుర్తులతోపాటు వారి ఫొటోలను కూడా ఈవీఎంలపై ఉంచబోతున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమికి నేతృత్వం వహించి అధికారాన్ని చేపట్టిన బీజేపీ... మహారాష్ట్ర, హరియాణా వంటి రాష్ట్రాల్లో విజయపరంపరను కొన సాగించి అక్కడ అధికారం కైవసం చేసుకుంది. కానీ నిరుడు ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, నవంబర్‌లో జరిగిన బిహార్ ఎన్నికల్లో ఊహించనివిధంగా పరాజయంపాలైంది. ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో సైతం ఒక్క అస్సాంలో మినహా మిగిలినచోట్ల బీజేపీ పరిస్థితి అంతంతమాత్రమే. ముఖ్యమైన పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆ పార్టీ పెద్దగా పోటీ ఇచ్చే అవకాశం లేదు. కేరళలో ఈసారి బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఉన్నదన్న సంకేతాలు వెలువడు తున్నాయి.
అస్సాంలో ప్రాంతీయ పార్టీ అసోం గణ పరిషత్(ఏజీపీ)తో ఇప్పటికే అవగాహనకొచ్చిన బీజేపీ ఈసారి అధికార పక్షంగా అవతరించవచ్చునన్న అంచనాలున్నాయి. అక్కడి 126 స్థానాల్లో బీజేపీ 57 స్థానాలు గెల్చుకుంటుందని ఒక సర్వేలో తేలింది. వరసగా మూడు దఫాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి 44కు పరిమితం కాగలదని ఆ సర్వే చెబుతోంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో నష్టజా తకురాలు కాంగ్రెసే. ఆ పార్టీకి అటు అస్సాంలోనూ, ఇటు కేరళలోనూ అధికారం కోల్పోక తప్పనిస్థితి ఏర్పడింది.
అయిదేళ్లనాడు పశ్చిమబెంగాల్, కేరళలో వామపక్ష కూటములు అధికారంలో ఉండేవి. ప్రతి దఫాలోనూ అధికార పక్షాన్ని మార్చే ఆనవాయితీని కొనసాగిస్తున్న కేరళలో అప్పడు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ను కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఓడించింది. అయితే రెండు కూటములకూ మధ్య కేవలం 4 స్థానాలు మాత్రమే వ్యత్యాసం ఉందని గమనిస్తే ఆ రాష్ట్రంలో వామపక్షాల ప్రభావం పెద్దగా తగ్గలేదని అర్ధమవుతుంది. ఈసారి అక్కడ ఎల్‌డీఎఫ్‌దే విజయ మని ఒక సర్వే వెల్లడించింది. బెంగాల్‌కు సంబంధించినంతవరకూ ఆ రాష్ట్రాన్ని 34 ఏళ్లు అవిచ్ఛిన్నంగా పాలించిన వామపక్షాలకు గత ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. తమ అధికారం శాశ్వతమన్న భ్రమల్లో కూరుకుపోయిన వామపక్షాలు తప్పుల మీద తప్పులు చేసి చేతులారా ఓటమిని కొనితెచ్చుకున్నాయి.
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఊహించనివిధంగా తిరుగులేని మెజారి టీని సాధించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సైతం వామపక్షాల రాత మారలేదు. తృణమూల్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జనంలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే అయినా ఆ పార్టీని అధికారంనుంచి దించేంతగా అది పెరగలేదని ఈమధ్య నిర్వహించిన ఒక సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్, వామ పక్షాలు జతగడితే ఆ కూటమికి 107 స్థానాలు వస్తాయని... తృణమూల్ 182 స్థానాలతో అధికారంలోకొస్తుందని ఆ సర్వే చెబుతోంది. వామపక్షాలు ఒంటరిగా పోటీ చేస్తే వాటికి 74 స్థానాలు, కాంగ్రెస్‌కు 16 సీట్లు మించకపోవచ్చునంటున్నది. అప్పుడు తృణమూల్‌కు 197 సీట్లు లభించే అవకాశం ఉందని సర్వే లెక్కగట్టింది.
ఈ రెండు రకాల పరిస్థితుల్లోనూ బీజేపీకి ఒరిగేదేమీ ఉండదని అంటోంది. గత ఎన్నికల వరకూ బెంగాల్‌లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న వామపక్షాలు, కాంగ్రెస్ తృణమూల్ ధాటికి కూటమిగా జనం ముందుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బెంగాల్‌లో మిగిలిన పార్టీలు ఇంకా మంతనాల్లో తలమునకలై ఉండగా...ఎన్నికల షెడ్యూల్ వెలువడిన కొద్దిసేపటికే అభ్యర్థుల జాబితా ప్రకటించి మమతా బెనర్జీ అందరినీ ఆశ్చర్యపరిచారు. 2011 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసిన తృణమూల్ ఈసారి ఒంటరిగా బరిలోకి దిగుతోంది.
తమిళనాట ఈసారి రసవత్తరమైన పోటీ ఉంటుంది. ఆనవాయితీకి భిన్నంగా జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే ప్రభుత్వం వరసగా రెండోసారి కూడా విజయకేతనం ఎగరేసి రికార్డు బద్దలు కొడుతుందా లేక డీఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది. సర్వే మాత్రం డీఎంకే కూటమి కన్నా అన్నాడీఎంకే పార్టీకే ఆధిక్యత లభిస్తుందని, అయితే అధికారం నిలబెట్టుకోవడానికి అవసరమైన మెజారిటీ దక్కకపోవచ్చునని సూచి స్తోంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నా డీఎంకేకు 116(ప్రస్తుత స్థానాలు 203), డీఎంకేకు 101(ప్రస్తుతం 31) రావొచ్చునని అంచనా. జయలలిత ప్రభుత్వం అమలు చేస్తున్న జనాకర్షక విధానాల మాటెలా ఉన్నా ఇటీవల వరసగా రెండుసార్లు చెన్నై నగరాన్ని ముంచెత్తిన వరదలు, అప్పుడు కొట్టొచ్చినట్టు కనబడిన ప్రభుత్వ వైఫల్యం ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. బహుశా అందువల్లే కావొచ్చు రాజీవ్‌గాంధీ హంతకులకు యావజ్జీవ శిక్షనుంచి విముక్తి కలిగించేందుకు అనుమతించమంటూ జయలలిత కేంద్రానికి లేఖరాసి తమిళనాట కొత్త చర్చకు తెరతీశారు. మొత్తానికి ఈ మినీ సార్వత్రిక సమరం ఆద్యంతమూ ఆసక్తికరంగా ఉండబోతోంది.
మినీ సార్వత్రిక సమరం
Published Sat, Mar 5 2016 12:15 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement