‘నోటా’కు ఆదరణ! | Many Votes For NOTA In 2019 election | Sakshi
Sakshi News home page

‘నోటా’కు ఆదరణ!

Published Sat, May 25 2019 12:10 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Many Votes For NOTA In 2019 election - Sakshi

ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు వెల్లడై విజేతలెవరో, కానివారెవరో నిర్ధారణయింది. ఇవి మాత్రమేకాదు... తరచి చూస్తే వాటిల్లో ఇతరేతర ఆసక్తికర అంశాలు కూడా అనేకం ఉంటాయి. అందులో వెల్లువెత్తిన ఆకాంక్షలతోపాటు ఆగ్రహం, ఆవేదన, నిరసన, తిరస్కారం వంటివి కూడా కనిపిస్తాయి. ఈవీఎంలపై పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లతోపాటు చివరిలో ‘పైన పేర్కొన్న ఎవరూ సమ్మతం కాదు’(నన్‌ ఆఫ్‌ ద అబౌ–నోటా) అని చెప్పడానికి అదనంగా బటన్‌ ఏర్పాటు చేయాలని 2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈసారి ఎన్నికల్లో ఆ ‘నోటా’కు భారీయెత్తున 64 లక్షల ఓట్లు పోలయ్యాయని వచ్చిన కథనం గమనించదగ్గది. ‘నోటా’ గురించి సుప్రీంకోర్టులో పౌరహక్కుల ప్రజాసంఘం(పీయూసీఎల్‌) ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినప్పుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసిన వాదన గుర్తు తెచ్చుకోవాలి. ఓటు హక్కు అనేది పౌరులకు ప్రాథమిక హక్కు కాదని, అది చట్టపరమైన హక్కు మాత్రమేనని వాదించింది. కానీ సుప్రీంకోర్టు ఆ వాదనను తోసి పుచ్చింది. ఎన్నికల్లో ఓటేయడం అనేది రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ హామీ ఇస్తున్న భావ ప్రకటనా స్వేచ్ఛలోనూ, 21వ అధికరణ హామీ ఇస్తున్న జీవించే హక్కులోనూ, వ్యక్తిగత స్వేచ్ఛ లోనూ భాగమని తెలియజేసింది. అయితే ‘నోటా’కు అభ్యర్థులకు మించి ఓట్లు పడితే ఏం చేయా లన్న అంశంపై సర్వోన్నత న్యాయస్థానం చెప్పలేదు. చెప్పి ఉంటే జనాగ్రహం ‘నోటా’లో వెల్లువెత్తి పదే పదే ఎన్నికలు పెట్టే దుస్థితి ఏర్పడేది.

ప్రజలెదుర్కొంటున్న పలు రకాల ఇబ్బందులు, వారికుండే సమస్యలు ఎన్నికల ప్రచార ఘట్టంలో ప్రస్తావనకొస్తే పాలకులకు తమ లోటుపాట్లు తెలిసివస్తాయి. కొత్తగా ప్రభుత్వంలో కొచ్చేవారికి వాటిపై దృష్టి పెట్టాలన్న ఆలోచన కలుగుతుంది. మౌలిక సదుపాయాలు కొరవడటం, అధిక ధరలు, ఉపాధి లేమి, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలు ప్రస్తావనకు రావడం లేదు. ప్రజల అవగాహనకు అందని రీతిలో ప్రత్యర్థులపై ఇష్టానుసారం నిందారోపణలు చేయడం, దూషించడం ముదిరిపోయింది. తాజా సార్వత్రిక ఎన్నికలను అధ్యయనం చేసిన ప్రజాతంత్ర సంస్కరణల సంఘం(ఏడీఆర్‌) దేశంలోని ప్రజాస్వామ్య ప్రక్రియపై పౌరుల్లో ఒకవిధమైన నైరాశ్య భావన ఏర్పడుతున్నదని, అందువల్లే ఎన్నికల సమయంలో ఉండే ఉద్వేగమూ, ఉత్సాహమూ ఈసారి కొడిగట్టిన సూచనలు కనబడ్డాయని తెలిపింది.

ఓటర్లలో 46.8 శాతంమంది మెరుగైన ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తే, ఆ తర్వాత వైద్యం, మంచినీటి సదుపాయం గురించి మాట్లా డారని... వీటిని ప్రధాన పార్టీలేవీ ప్రస్తావించకపోవడాన్ని ఎత్తిచూపారని వివరించింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసినవారి శాతం గతంతో పోలిస్తే స్వల్పంగానైనా పెరిగింది. 2014లో అది 66.4 శాతం ఉంటే... ఈసారి అది 66.6 శాతానికి చేరుకుంది. కానీ ఎన్నికల సమయంలో ఒకరిని మించి ఒకరు ప్రసంగాలు చేయడం... ఆ తర్వాత తమ గోడు పట్టించుకోకపోవడం మామూలేనన్న అభిప్రాయం ఎక్కువమందిలో ఏర్పడుతోంది. తెలుగుదేశం పార్టీ 2014 మేనిఫెస్టోలో 600కు పైగా హామీలిచ్చింది. కానీ వాటిల్లో వేళ్లపైన లెక్కించదగ్గ సంఖ్యలోనైనా వాగ్దానాలను అమలు చేయలేక పోయింది.

అయిదేళ్లు గడిచి మళ్లీ ఎన్నికలొచ్చేసరికి వీటన్నిటిపైనా జనం ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో  పార్టీ వెబ్‌సైట్‌ నుంచి ఆ మేనిఫెస్టోనే గల్లంతు చేసింది. పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు పాక్షిక మాఫీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారేమని చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తే అప్పట్లో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. నేనెప్పుడు చెప్పానంటూ దబా యించారు. ఇలా అవసరాన్నిబట్టి మాట మార్చడం, ఇష్టానుసారం పాలించడం, ఎన్నికలు ముంచు కొస్తున్నాయనేసరికి ఏదో ఒకటి చేసినట్టు కనబడాలని ఆదరా బాదరాగా ఏదో పథకం పేరిట వివిధ వర్గాలకు డబ్బు వెదజల్లడం ఆంధ్రప్రదేశ్‌లో బాహాటంగా చేశారు. ఇలాంటి పనులు సహజంగానే నాయకులపై అపనమ్మకాన్ని పెంచుతాయి. ఆగ్రహం తెప్పిస్తాయి. ప్రత్యామ్నాయం ఉన్నచోట ఇలాంటి నేతలకు జనం గట్టిగానే బుద్ధి చెబుతారు. ఆ పరిస్థితి లేదనుకున్నప్పుడు ఓటేయడంపైనే అనాసక్తి ఏర్పడుతుంది. కొందరు ‘నోటా’కు వేసి తమ నిరసన తెలియజెప్పాలనుకుంటారు. 

బిహార్‌లో ఈసారి 8 లక్షలమంది ‘నోటా’కు ఓటేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్రంలోనే ‘నోటా’కు అధికంగా ఓట్లు పడ్డాయి. అక్కడున్న 40 స్థానాల్లో జేడీ(యూ)–బీజేపీ కూటమికి 33 స్థానాలు జనం కట్టబెట్టినా వారిలో చెప్పుకోదగ్గ స్థాయిలో అసంతృప్తి ఉన్నదని ఈ పరిణామం చెబుతోంది. ఆరు నెలలక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాదని కాంగ్రెస్‌కు పట్టంగట్టిన రాజస్తాన్‌ ఓటర్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి బీజేపీవైపు మొగ్గు చూపారు. ఆ రాష్ట్రంలోని 25 స్థానాలనూ ఆ పార్టీ చేజిక్కించుకుంది. కానీ అక్కడ ‘నోటా’కు పడిన ఓట్లు 3.27 లక్షలు! ఈ రెండు రాష్ట్రాల్లోనూ సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీ వంటి పార్టీల కంటే ‘నోటా’కే అధికంగా ఓట్లు పడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే స్థితి పంజాబ్, హర్యానావంటిచోట్ల ఉంది.

నేతల బూటకపు వాగ్దానాలు మాత్రమే కాదు... ఓటర్ల జాబితా రూపొందించడం దగ్గర నుంచి అడుగడుగునా అవక తవకలు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నేతలు టెక్నాలజీ సాయంతో తమ పార్టీకి వ్యతిరేకులనుకున్నవారి ఓట్లు తొలగించడం, నకిలీ ఓటర్లతో జాబితాలు నింపడం వంటి అక్ర మాలకు పాల్పడ్డారని ఇటీవలికాలంలో బయటపడింది. ఓటర్ల జాబితా రూపకల్పనలో అవకతవక లకు పాల్పడినా, వాటిని తారుమారు చేయడానికి ప్రయత్నించినా కఠినంగా శిక్షించేలా...ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలను ఉల్లంఘించిన∙పార్టీలను అభిశంసించేలా చర్యలు తీసుకుంటే కొంతవరకైనా ఎన్నికల ప్రక్రియ గాడిన పడుతుంది. అలాగే నేతల వదరుబోతు ప్రసంగాలపై కఠి నంగా వ్యవహరించడం అవసరం. ఇవన్నీ అమలైనప్పుడే ఎన్నికలంటే ప్రజల్లో కలిగే ఏవగింపును, నిరాసక్తతతను నివారించడం సాధ్యమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement