పెరుగుతోంది! పారాహుషార్‌! | Sakshi Editorial On Covid 19 Situation Especially On Delta Omicron | Sakshi
Sakshi News home page

పెరుగుతోంది! పారాహుషార్‌!

Published Fri, Dec 31 2021 12:35 AM | Last Updated on Fri, Dec 31 2021 12:39 AM

Sakshi Editorial On Covid 19 Situation Especially On Delta Omicron

సునామీ గురించి విన్నాం... చూశాం. కానీ కోవిడ్‌ సునామీ గురించి? గత వారంగా రోజూ సగటున 9 లక్షల ప్రపంచ కేసుల ట్రెండ్‌ చూస్తుంటే, అటు డెల్టా, ఇటు కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్లతో రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలపై కోవిడ్‌ కేసులు సునామీలా విరుచుకుపడే ప్రమాదం ఉందంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. భారీగా కేసులొచ్చి, ఆస్పత్రిలో చేరేవాళ్ళు, మృతులు పెరిగితే, ఇప్పటికే రెండేళ్ళుగా పరిమితికి మించి శ్రమిస్తున్న ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పడే ముప్పుంది. డబ్ల్యూహెచ్‌ఓ బుధవారం చేసిన ఈ హెచ్చరిక ఓ పెను ప్రమాదఘంటిక. అసలే ఆరోగ్య సిబ్బంది కొరత కాగా, వారిలో అనేకులు కరోనా బారినపడడం కష్టాలను మరింత పెంచుతోంది. ప్రపంచ దేశాల్లో అంతకంతకూ పెరుగుతున్న కేసుల సంఖ్య... పండుగల వేళ మన దేశాన్ని పారాహుషార్‌ అంటోంది. 

ప్రపంచవ్యాప్తంగా గత వారంలో 11 శాతం మేర కరోనా కేసులు హెచ్చాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్‌లలో రికార్డుస్థాయిలో కరోనా బారినపడుతున్నారు. 61.9 శాతం జనాభాకు పూర్తిగా టీకాలు వేసిన అమెరికాలో పరిస్థితే ఇలా ఉంటే, మిగతాచోట్ల ఏమిటో ఊహించుకోవచ్చు. నిజానికి, ఈ ఏడాది చివరి కల్లా ప్రతి దేశంలో 40 శాతం మందికి పూర్తిగా టీకా వేయాలనీ, కొత్త ఏడాది మధ్యకల్లా అది 70 శాతానికి చేరాలనీ భావించారు. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థలో సభ్యు లైన 194 దేశాల్లో 92 దేశాలు ఈ ఏటి 40 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోవట్లేదు. అదీ విషాదం. అతి కొద్ది ధనిక దేశాల చేతుల్లోనే టీకాలు, ఆరోగ్య పరికరాలు పోగుపడడంతో సమానత్వం అసాధ్యం. కరోనాపై పోరులో వర్ధమాన దేశాలు వెనకబడ్డాయి. కొత్త వేరియంట్లకూ సందు చిక్కింది. 

గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్‌ తక్కువ ప్రాణాంతకమని ప్రాథమిక స్టడీలు చెబుతున్నా, పెద్దయెత్తున ఆస్పత్రి పాలయ్యే ప్రమాదమైతే ఉంది. కరోనాతో ఉద్యోగులు క్వారంటైన్‌లో ఉంటే, వ్యాపారాలకూ దెబ్బే. ఆర్థిక రంగాన్ని దృష్టిలో పెట్టుకొనో ఏమో అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు బాధితులు 10 రోజులు ఐసొలేషన్‌లో ఉండాల్సి ఉంటే, దాన్ని తాజాగా 5 రోజులకే తగ్గిస్తున్నాయి. ఈ వివాదాస్పద నిర్ణయం ఎంతవరకు శాస్త్రీయమో చెప్పలేం. ఐసొలేషన్‌ రోజుల్ని తగ్గించడంతో బాధితుల నుంచి మరొకరికి వైరస్‌ వ్యాప్తి వేగవంతం కావచ్చని నిపుణుల అనుమానం. డాక్టర్ల మందులతో పాటు నర్సుల సేవ కీలకమైన వేళ భారత్‌ లాంటి చోట్ల నర్సుల కొరత ఉంది. ప్రతి వెయ్యిమందికీ ముగ్గురు నర్సులుండాలని ఆరోగ్యసంస్థ మాట. భారత్‌లో 1.7 మందే ఉన్నారు.

మన దేశంలోనూ రోజుకు సగటున 8 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. సగటు కరోనా పాజిటివిటీ రేటు 0.92 శాతం. గత 24 గంటల్లో 13 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 33 రోజుల తర్వాత దేశంలో తొలిసారి కేసుల సంఖ్య 10 వేలు దాటింది. భయపెడుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులూ వెయ్యికి చేరుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రల్లో కేసులు పెచ్చరిల్లుతున్నాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 1.73 శాతం దాటింది. అక్కడి కేసుల్లో 46 శాతం ఒమిక్రాన్‌వే. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌ లాంటి నగరాల్లో గత వారంగా కరోనా పెరగడం, ఢిల్లీ – ముంబయ్‌లలో ఇప్పటికే కరోనా థర్డ్‌వేవ్‌ వచ్చేసిందనీ, సామాజిక వ్యాప్తి జరుగుతోందనీ వార్తలు రావడం ఆందోళనకరం. కాగా, దేశంలోని కేస్‌లోడ్‌లో 25 శాతం కేరళ నుంచేనట. కేరళ సహా కొన్నిచోట్ల నైట్‌ కర్ఫ్యూ పెట్టేశారు. ముంబయ్‌లో 144 సెక్షన్‌ విధించారు. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్న తెలంగాణలో సైతం ఆరోగ్యాధికారులు రెండో ప్రమాద హెచ్చరిక చేశారు. రానున్న 2 నుంచి 4 వారాలు అత్యంత కీలకమనీ, జాగ్రత్తలు అవసరమనీ పదేపదే గుర్తుచేస్తు్తన్నారు. 

పరిస్థితులు ఇలా ఉంటే, వచ్చే ఏడాది మొదట్లో 15 కోట్ల మంది ఓటర్లు పాల్గొనే యూపీ సహా వివిధ రాష్ట్రాల ఎన్నికలు, ర్యాలీలు యథావిధిగా జరగనున్నాయి. గురువారం ఎన్నికల సంఘం ఆ సంగతి తేల్చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, గుంపులకూ, ఉత్సవాలకూ దూరంగా ఉండాలనీ చెబుతున్న పాలకులు, పార్టీ నేతలు ఎన్నికల వేళ తాము ఆ పని చేయడం లేదు. ముఖానికి మాస్కు, భౌతిక దూరం లేని జనప్రదర్శనలతో అన్ని పార్టీలదీ అదే తీరు. రాత్రి వేళ కర్ఫ్యూలు, పగటిపూట ర్యాలీలు– ఇదీ నేటి ద్వంద్వ నీతి. ఢిల్లీలో రెండు రోజుల క్రితమే ఎల్లో అలర్ట్‌ జారీ చేసి, స్కూళ్ళు, సినిమా హాళ్ళు మూసేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పంజాబ్‌ ఎన్నికల ర్యాలీలు మాత్రం మానుకోదలిచినట్టు లేరు. చండీగఢ్‌లో ఆయన తాజా విజయోత్సవ ర్యాలీయే అందుకు నిదర్శనం.  

యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మొదలు ప్రధాని, హోమ్‌ మంత్రి పాల్గొంటున్న ఉత్తరాది రాష్ట్రాల ర్యాలీలు సరేసరి. కుంభమేళాకు లేని అభ్యంతరం ఇప్పుడు బెంగాల్‌లో గంగా సాగర్‌ మేళాకు ఎందుకన్నది మమతా బెనర్జీ ప్రశ్న. ఇలాంటి చర్యలు సరైనవేనా అన్నది నాయకులే ఆత్మపరి శీలన చేసుకోవాలి. ప్రజారోగ్యం కన్నా పార్టీల ఎన్నికల ప్రయోజనాలే ఎక్కువ కావడం సరైనదా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే, ఈ ఏడు ఇలాగే తమిళనాడు, కేరళ, బెంగాల్‌ తదితర రాష్ట్రాల ఎన్నికల ర్యాలీలతో ఎన్ని రెట్లు కేసులు పెరిగాయో తెలిసిందే. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. పైపెచ్చు, డిసెంబర్‌ మొదట్లో రోజూ 80 లక్షల డోసులు వేస్తే, ఇప్పుడది 60 లక్షలకు పడి పోవడం పాలకుల లోపమే. కొత్తగా రెండు కొత్త వ్యాక్సిన్లు (కోవోవ్యాక్స్, కోర్బెవ్యాక్స్‌) – ఓ మాత్ర (మాల్నూపిరవర్‌)కు అనుమతిచ్చినా, వృద్ధులకు బూస్టర్లు – టీనేజర్లకు టీకాలేస్తామంటున్నా, నేటికీ వయోజనుల్లో 63 శాతానికే 2 డోసులూ పూర్తయ్యాయని మర్చిపోతే కష్టం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement