నిరుపేదల ఆశాకిరణం | Gabriel Boric Chile Youngest President Editorial Vardhelli Murali | Sakshi
Sakshi News home page

నిరుపేదల ఆశాకిరణం

Published Wed, Dec 22 2021 12:16 AM | Last Updated on Wed, Dec 22 2021 12:16 AM

Gabriel Boric Chile Youngest President Editorial Vardhelli Murali - Sakshi

విజయం ఊహించినదే అయినా, అనూహ్య మెజారిటీతో గెలుపు దక్కితే ఉండే ఉత్సాహం వేరు. చిలీ దేశపు రాజధాని శాంటియాగో వీధుల్లో ఆదివారం నాటి జనసందోహం, సంబరాలే అందుకు నిదర్శనం. చిలీకి అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా యువ నేత గ్యాబ్రియెల్‌ బోరిక్‌ భారీ విజయంతో ఆ దక్షిణ అమెరికా దేశంలో నవ శకానికి నాందీ ప్రస్తావన జరిగింది. ప్రపంచంలోనే అసమానతలు అధికంగా ఉన్న దేశాల్లో ఒకటైన ఈ లాటిన్‌ అమెరికా దేశంలో మాజీ విద్యార్థి నేత∙35 ఏళ్ళ బోరిక్‌ ‘సంక్షేమ రాజ్య’ వాగ్దానంతో అధిక సంఖ్యాకుల మనసు దోచారు. చిలీ కమ్యూనిస్టు పార్టీ సహా కొన్ని ఇతర పార్టీల సంకీర్ణ అభ్యర్థిగా ఈ వామపక్ష వాది బరిలో నిలిచారు, గెలిచారు. ఓటర్లు రెండు వర్గాలుగా కేంద్రీకృతమైన వేళ, మితవాద ప్రత్యర్థి 55 ఏళ్ళ జోస్‌ ఆంటోనియో కస్ట్‌పై యువ బోరిక్‌ భారీ విజయం లాటిన్‌ అమెరికా దేశాల్లో వామపక్ష వాదానికి మరింత బలం చేకూర్చింది. ఇంకా చెప్పాలంటే, ఈ ఏడాది వివిధ లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో జరిగిన 5 అధ్యక్ష ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలకు ఇది నాలుగో గెలుపు. ఆ రకంగానూ తాజా చిలీ ఎన్నికలు ప్రత్యేకమే. 

నవంబర్‌ 21న జరిగిన మొదటి రౌండ్‌ ఎన్నికలలో సంప్రదాయవాద కస్ట్‌కు కాస్తంత ఎక్కువ పాయింట్లు వచ్చాయి. అయితే, డిసెంబర్‌ 19 ఆదివారం నాటి తుది రౌండ్‌లో విశేష జనాదరణతో బోరిక్‌ తిరుగులేని ఆధిక్యం కనబరిచారు. చివరకు పోల్‌ అయిన ఓట్లలో 44.1 శాతం కస్ట్‌కు వస్తే, ఏకంగా 55.9 శాతం ఓట్లతో బోరిక్‌ నెగ్గారు. అలా 1973 నాటి కుట్రలో ఆత్మహత్యకు పాల్పడిన చిలీ అధినేత అలెండి తర్వాత అత్యంత ఉదారవాద అధ్యక్షుడయ్యారు. స్వలింగ సంపర్కుల వివాహాలు, గర్భనిరోధం, గర్భస్రావం లాంటి వాటికి కస్ట్‌ వ్యతిరేకి. ఒక దశలో మహిళా వ్యవహారాల శాఖను సైతం రద్దు చేస్తానని, ఆనక వెనక్కి తగ్గిన చరిత్ర ఆయనది. తద్విరుద్ధంగా బోరిక్‌ ఉదారవాది. యువకులు, పట్టణ ప్రాంత ఓటర్లు ఆయనకు జై కొట్టింది అందుకే. చివరి రౌండ్‌లో గ్రామీణ ఓటర్లూ ఆయన వైపే మొగ్గడంతో భారీ గెలుపు సాధ్యమైంది. ఓటేయడం స్వచ్ఛందమైన 2012 నాటి నుంచి ఎన్నడూ లేనంతగా 56 శాతం పోలింగ్‌ నమోదైంది. 

అధిక భాగం లాటిన్‌ అమెరికా దేశాల్లో రాజకీయాలు, తత్ఫలితంగా ఆర్థిక వ్యవస్థ – రెండూ అస్థిరమే. కానీ, చిలీ దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వంతో, నియంత జనరల్‌ పినోఛెట్‌ సైనిక పాలనలో పెట్టిన పాత కాలపు నిరంకుశ రాజ్యాంగానికే కట్టుబడింది. సామాజిక వ్యయం, సబ్సిడీల లాంటి ఊసే లేకుండా లాభసాటి వ్యాపార వాతావరణంతో సంపన్న వర్గాల స్వర్గమైంది. చివరకు 2019 అక్టోబర్‌ 18న మెట్రో టికెట్‌ రేట్లపై పన్నులు పెంచడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అలా మొదలై, చిలీలో అనేక నెలలుగా సాగుతున్న నిరసనలు ఆధునిక విప్లవానికి ప్రతీకలు. వెరసి, పాత రాజ్యాంగానికి పాతరేసి, సమాజంలోని విభిన్నతనూ, దశాబ్దాలుగా దూరం పెట్టబడిన అణగారిన వర్గాలనూ ప్రతిబింబించే కొత్త రాజ్యాంగం దిశగా అడుగులు పడ్డాయి. ఈ ఏడాది జూలైలో ‘చిలీ రాజ్యాంగ సభా కూటమి’ ఏర్పాటు అందులో ఓ మైలురాయి. తాజాగా దేశాధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష బోరిక్‌ విజయం ప్రజలు కోరుకుంటున్న మార్పుకు పడ్డ రాజముద్ర. 

చరిత్ర చూస్తే, అలెండి తర్వాత 1973లో వచ్చిన నియంత పినోఛెట్‌ ప్రభుత్వ నిరంకుశ పాలన ప్రసిద్ధం. ఆపైన 1990లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలొచ్చినా, లాభం లేకపోయింది. రాగి ఉత్పత్తిలో ప్రపంచంలోకెల్లా ముందుండే రెండు కోట్ల జనాభా చిలీలో ధనిక, పేద తేడాలు పెచ్చరిల్లాయి. ఆ తేడా పోగొట్టి, పేదల అనుకూల కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో నడిపిస్తానని వామపక్ష సంకీర్ణ అభ్యర్థిగా బోరిక్‌ ప్రచారం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను ఆరాధించే కోటీశ్వరుడు కస్ట్‌ను బహుళ జాతి సంస్థలు, మీడియా, అమెరికా బలపరిచాయి. కానీ, రైతులు, కార్మిక సంఘాలు, నిరుపేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు కలసికట్టుగా బోరిక్‌ వెంట నిలిచి, ప్రత్యర్థిని ఓడించాయి. 

కానీ, రెండేళ్ళ క్రితం జనాన్ని వీధుల్లోకి రప్పించిన అనేక అంతర్లీన సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆర్థిక అసమానతలు, మితిమీరిన విశ్వవిద్యాలయ ఫీజులు, నూటికి 80 మందికి నెలవారీ కనీస వేతనం (418 డాలర్ల) కన్నా తక్కువ పింఛను – ఇలా ఎన్నో. ఆర్థిక వ్యవస్థ ఆధారపడ్డ రాగి ఎగుమతులకు కొత్త రాజ్యాంగం పెట్టే కఠిన పర్యావరణ నిబంధనలతో ఇబ్బంది తలెత్తవచ్చు. కరోనా దెబ్బతో ఇప్పటికే కుటుంబాలు కుదేలయ్యాయి. వార్షిక ద్రవ్యోల్బణం ఏడేళ్ళ గరిష్ఠానికి చేరింది. అయితే, ఆర్థికంగా బాధ్యతాయుతంగా ఉంటూనే, దేశంలో సాంఘిక హక్కులను విస్తరిస్తామన్నది బోరిక్‌ మాట. అందుకే, వచ్చే మార్చిలో ఆయన పాలన చేపట్టాక, శ్రామిక వర్గాలకు తోడ్పడే మార్పులు వస్తాయని జనం భావిస్తున్నారు. వాగ్దాన పాలనకై యువతరం నుంచి ఒత్తిడీ తప్పదు. 

ఈ సమస్యలు అటుంచితే, మొత్తం మీద లాటిన్‌ అమెరికాలో రాజకీయాలు మలుపు తిరిగాయి. ఆ ప్రాంత ప్రజాస్వామ్యాలు రాజీ లేని భావాలతో ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి. పెరూ, నికరాగ్వా, హోండూరస్, ఇప్పుడు చిలీ – నాలుగింటా వామపక్ష అభ్యర్థులే అధ్యక్షులయ్యారు. వచ్చే మేలో కొలంబియాలో, అక్టోబర్‌లో బ్రెజిల్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లోనూ లెఫ్ట్‌దే విజయమని సర్వేల అంచనా. వామపక్ష భావజాలానికి అక్కడి ప్రజల్లో సానుకూలత పెరుగుతున్నట్టు అర్థమవుతోంది. వెరసి, చిలీ సహా లాటిన్‌ అమెరికా ప్రాంతమంతా ఇప్పుడు ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించే, ప్రగతిశీల ‘నూతన సహస్రాబ్ది వామపక్షవాద’ విజృంభణను వీక్షిస్తోంది. సాదరంగా స్వాగతిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement