అంకెలపై లంకెబిందె కథలు! | TDP Spreading False Propaganda AP Govt Debt Editorial Vardhelli Murali | Sakshi
Sakshi News home page

అంకెలపై లంకెబిందె కథలు!

Published Sun, Dec 26 2021 12:56 AM | Last Updated on Sun, Dec 26 2021 12:57 AM

TDP Spreading False Propaganda AP Govt Debt Editorial Vardhelli Murali - Sakshi

నిజం నిద్ర లేచేసరికి అబద్ధం దేశాన్ని చుట్టేస్తుందంటారు. మసాలా వేసి వండిన వంటకం కనుక అబద్ధపు ఘుమఘుమలు తొందరగా వ్యాపిస్తాయని ఈ సామెత ఉద్దేశం. అటువంటి అబద్ధాలు వ్యవస్థీకృత రూపం దాల్చితే? సమస్త వనరుల్ని తమ గుప్పెట పెట్టుకున్న శక్తిమంతులే ఆ వ్యవస్థ వెనుక నిర్దేశకులుగా నిలబడితే ఏమవుతుంది? – అబద్ధాలు సూపర్‌సోనిక్‌ రెక్కల్ని తొడుక్కుంటాయి. నిజాల తరంగదైర్ఘ్యాలు నిస్సహాయపు ముద్ర దాల్చవలసి ఉంటుంది.

ఒకానొక చారిత్రక దుర్ముహూర్తంలో పాతికేళ్లకు పూర్వం సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యవస్థీకృత అబద్ధాలకు విత్తనం పడింది. రాజకీయ వ్యవస్థలో వెన్నుపోటు అనే వినూత్న పద్ధతిలో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్న రాజకీయ శక్తికి అసత్య ప్రచారాలను ఆక్సిజన్‌ మాదిరిగా ఎక్కించవలసి వచ్చింది. ఆక్సిజన్‌ సరఫరాదారుల్లోంచి ఆ రాజకీయ శక్తి ‘క్రోనీ క్యాపిటలిజా’న్ని ప్రోది చేసింది. ఇంతింతై చెట్టంతైన ‘క్రోనీ కేపిటలిజమ్‌’ ప్రజాస్వామ్య వ్యవస్థలోని అన్ని పార్శ్వాల్లోనూ తన ఊడలను దించడం ప్రారంభించింది. ఫలితంగా ఆ రాజకీయ శక్తి చుట్టూ డబ్బూ, పలుకుబడి కలిగిన ఒక ముఠా వలయం మాదిరిగా అల్లుకున్నది.

సకల వనరులతోపాటు ఈ ముఠా చేతిలో ప్రజాభిప్రాయాన్ని ‘ఉత్పత్తి’ చేసే కార్ఖానాలు కూడా ఉన్నాయి. ఈ కార్ఖానాలు పందిని తయారుచేసి నందిగా బ్రాండింగ్‌ చేయగలవు. వినియోగదారుడు నమ్మి తీరవలసిందే! తనకు లాభసాటిగా ఉన్న రాజకీయ–ఆర్థిక–సామాజిక పొందికలో ఏ చిన్న మార్పునూ ఈ క్రోనీ ముఠా సహించలేదు. వారి కర్మఫలాన రెండున్నరయేళ్ల క్రితం రాజకీయ పొందికలో ఒక మార్పు జరిగింది. ఫాదర్‌ ఆఫ్‌ ఆంధ్రా క్రోనీ క్యాపిటలిజమ్‌ అధికారానికి దూరమయ్యాడు. అధికారంలోకి వచ్చిన రాజకీయ శక్తి సామాజిక–ఆర్థిక పొందికలోనూ మార్పులు చేయడం ప్రారంభించింది. నిర్భాగ్యులనూ, నిస్సహాయులనూ సాధికారం చేసే చర్యలకు ఉపక్రమించింది. ఈ పరిణామాలను క్రోనీ ముఠా ప్రాణాంతకంగా పరిగణించింది. దీనికి చెక్‌ చెప్పడానికి తమ చేతుల్లో ఉన్న ప్రజాభిప్రాయ ఉత్పత్తి కర్మాగారాలను మూడు షిప్టుల్లో నడపడం ప్రారంభించింది.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన.. జరుగుతున్నంత ప్రచారం ఈ దేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగి ఉండలేదు. ఈ ప్రచారానికి పునాదిరాళ్లు అబద్ధాలే. నందిని పందిగా, పందిని నందిగా జనం మదిలో ముద్రించడమే ఈ ప్రచార లక్ష్యం. ఇందుకోసం అన్నిరకాల మార్కెటింగ్‌ టెక్నిక్‌లనూ రంగంలోకి దించారు. ప్రభుత్వం మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి కొంత కాలంపాటు కష్టపడ్డారు. ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మలేదు. పైగా తిప్పికొట్టారు. దాంతో అమరావతి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని శక్తులనూ ఏకం చేయడానికి ప్రయత్నించారు. పార్టీలను ఏకం చేయగలిగారు కానీ ప్రజలను ఒప్పించ లేకపోయారు.

ఇసుక దోపిడీ చేస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేలు సైతం క్వారీల్లో చొరబడి మహిళా అధికారులపై కూడా దాడులు చేసిన ఆనాటి గాయాలు సలపడంతో తోక ముడిచారు. వరసగా ఓ అరడజన్‌ ప్రచారాలు బోల్తాకొట్టిన తర్వాత అప్పులు – అభివృద్ధి, పెట్టుబడులు అనే అంశాలతో కూడిన ఒక మెగా క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. మల్టీస్టారర్‌ షోగా దీన్ని మలిచారు. కొత్త ప్రభుత్వం వేలకోట్లు అప్పులు చేసిందనీ, ఇక అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందనీ, దివాళా పరిస్థితి ఏర్పడింది కనుక ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలనీ డిమాండ్‌ చేసేదాకా ఈ ప్రచారాన్ని నడుపుతున్నారు.

ఇంత అప్పు చేసినా అభివృద్ధి జాడే రాష్ట్రంలో కన్పించడం లేదని ఊరూవాడా హోరెత్తిస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్‌ మీడియా–అనే చతురంగ బలాలను యుద్ధప్రాతిపదికపై నడిపిస్తున్నారు. ఈ దుమారంలో కొట్టుకొనిపోకుండా నిజా నిజాలను నిష్పాక్షికంగా దర్శించవలసిన అవసరం ఉన్నది. నిజాలకు నిలువుటద్దాల వంటి అంకెలన్నీ మనకు అందు బాటులోనే ఉన్నాయి.

అవును. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అప్పులు చేసిన మాట నిజం. కరోనా కాలంలో అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ది ఆరో స్థానం. తెలంగాణ ఏడో స్థానంలో ఉన్నది. ఇంతకుముందున్న ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు అప్పుచేసి, మరో 60 వేల కోట్ల బకాయిల భారాన్ని తలపై మోపి, ఏటా 20 వేల కోట్లు వడ్డీలే చెల్లించాల్సిన వారసత్వాన్ని ఏపీ కొత్త ప్రభుత్వానికి వదిలేసింది. కరోనా కాలంలో ఏపీ కంటే అధికంగా అప్పులు చేసిన ఐదు రాష్ట్రాలతో సహా దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంతటి ‘ఘనమైన’ వారసత్వ సంపద లేదు. చేసిన అప్పులతో ఆంధ్రప్రదేశ్‌ కొత్త ప్రభుత్వం ఖర్చు పెట్టిన పద్దులేమిటి? చేసిన అభివృద్ధి ఎంత? సంక్షేమం మాటేమిటి? అనే విషయాలను పరిశీలించాలి. అంతకు ముందు ఏపీ పరిణా మాలపై నిపుణులైన ఆర్థికవేత్తలు, సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.

పీఆర్‌ఎస్‌ ఇండియా అనే ఒక ప్రముఖ ఇండిపెండెంట్‌ సంస్థ ‘స్టేట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫైనాన్సెస్‌’ అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. కరోనా కష్టకాలంలో పేదవర్గాలను ఆదుకోవడానికి ఏ రాష్ట్రం ఎంతమేరకు బడ్జెట్‌ కేటాయింపులు చేసిందనే అంశాన్ని ఈ నివేదిక విశ్లేషించింది. జాబితాలో 13.1 శాతం బడ్జెట్‌ కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉన్నది. 7.9 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో, 4.8 శాతంతో మహారాష్ట్ర మూడోస్థానంలో ఉన్నాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా రాష్ట్రాల బడ్జెట్‌లపై విశ్లేషణ చేసింది. సంక్షేమానికే కాకుండా అభివృద్ధికి కూడా ఏపీ ప్రభుత్వం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నదని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం చివరి సంవత్సరం బడ్జెట్‌లో మూలధన వ్యయంగా (Capital expenditure) 35 వేల కోట్లు కేటాయిస్తే రెండేళ్లు తిరిగేసరికే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ పద్దును 45 వేల కోట్ల రూపాయలకు పెంచింది. ఇది ఆర్‌బీఐ లెక్క. ఉద్యోగుల జీతభత్యాల కింద చంద్రబాబు ప్రభుత్వం చివరి సంవత్సరంలో రూ. 32 వేల కోట్లు ఖర్చుచేస్తే, రెండేళ్లలో ఆ పద్దును వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ. 50 వేల కోట్లకు పెంచిందని ఆర్‌బీఐ వెల్లడించింది.

సమ్మిళిత అభివృద్ధి(inclusive growth)లో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలో తొలిస్థానమని ‘ఇండియా టుడే’ సర్వే (2021) తేల్చి చెప్పింది. 2003 సంవత్సరం నుంచి ప్రతియేటా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సర్వే ఇది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా గ్రామసీమలు సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని ‘నీతి ఆయోగ్‌’ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన స్వయంగా కృష్ణాజిల్లాలోని కొన్ని గ్రామాల్లో పర్యటించి ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ఏర్పాటు విప్లవాత్మకమైన ఆలోచనగా ఆయన వ్యాఖ్యానించారు.

కడప జిల్లా కొప్పర్తిలో రెండు భారీ పారిశ్రామిక పార్కుల్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన సందర్భంగా ఏఐఎల్‌ డిక్సన్‌ కంపెనీ ప్రెసిడెంట్‌ – సీఓఓ పంకజ్‌ శర్మ ఆసక్తికరమైన కామెంట్‌ చేశాడు. గతంలో ‘రావాలి జగన్‌... కావాలి జగన్‌’ అనే నినాదం రాష్ట్రమంతటా మార్మోగితే, ఇప్పుడు ‘జగన్‌ వచ్చాడు..అభివృద్ధి తెచ్చాడు’ అనే నినాదం వినిపిస్తోందని వ్యాఖ్యా నించారు. కొత్త కంపెనీలు శంకుస్థాపన సమయంలో విస్తరణ కార్యక్రమాలను వివరంగా ప్రకటించడం రాష్ట్రంలో నెలకొని ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి గుర్తు. ఇక్కడ ఫ్యాక్టరీని నడపలేక కియా మోటార్స్‌ కంపెనీ వెళ్లిపోతున్నదని మనవాళ్లు ఎంత ప్రచారం చేసినా, ఆ కంపెనీ మాత్రం రాష్ట్రంలో తన విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. సెంచురీ ప్లైవుడ్స్‌ తన పెట్టుబడిని నాలుగింతలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏటీజీ టైర్స్‌ కూడా తన పెట్టుబడిని రెండింతలకు పెంచింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

వైద్య ఆరోగ్య రంగంలో ఒక పెద్ద సామాజిక విప్లవానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని చాలామంది గుర్తించారు. ‘నాడు – నేడు’ కార్యక్రమంతోపాటు కొత్త వైద్యశాలల నిర్మాణం, ఉన్నవాటిని ఆధునీకరించడం, కొత్త సూపర్‌ స్పెషాలిటీల నిర్మాణం, వైఎస్‌ఆర్‌ విలేజి క్లినిక్స్‌ కోసం ప్రభుత్వం సుమారుగా రూ. 32 వేల కోట్లు కేటాయించింది. సగానికి పైగా ఇప్పటికే ఖర్చు చేశారు. ‘ఆరోగ్యశ్రీ’ కింద బడ్జెట్‌లో రెండువేల కోట్ల కేటాయింపు, 1,088 కొత్త అంబు లెన్స్‌ల ప్రారంభం... పైన చెప్పిన ఖర్చుకు అదనం. ఫలితంగా వైద్యరంగం వేగంగా తన స్వరూపాన్ని మార్చుకుంటున్నది. పేద – ధనిక, సామాజిక హోదా వంటి తారతమ్యాలు లేకుండా ప్రతి గడపకూ ‘ఫ్యామిలీ డాక్టర్‌’ వెళ్లే లక్ష్యం వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఒక్క సంవత్సర కాలంలోనే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే ఔట్‌ పేషంట్లు, ఇన్‌ పేషంట్ల సంఖ్యలో 25 నుంచి 30 శాతం పెరుగుదల కనిపించింది.

రెండేళ్ల కిందటి దాకా సుదూరంగా వుండే గిరిజన గూడేల్లోని మహిళలు కాన్పుకు వెళ్లాలంటే డోలీలే శరణ్యం. భగవంతునిపైనే భారం. ఇప్పుడు గర్భం దాల్చిన దగ్గర్నుంచీ క్రమం తప్పకుండా 104 వాహనం ఆమె ఇంటి ముందు ఆగి, మందులిస్తున్నది. కాన్పు సమయంలో అదే వాహనంలో తీసుకెళ్లి కాన్పు తర్వాత ఇంటికి తీసుకొచ్చి దింపుతున్నారు. గిరిజన జీవితాలలో 104 అంబు లెన్స్‌ పెనుమార్పును తెచ్చింది.

విద్యారంగంలో ‘నాడు–నేడు’కు 16 వేల కోట్ల రూపా యలు కేటాయించారు. ఇప్పటికే తొలిదశ పూర్తయింది. ఇప్పుడు నాణ్యమైన విద్య, ఇంగ్లిష్‌ మీడియం విద్య ప్రతి విద్యార్థికీ ధనిక–పేద తేడా లేకుండా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ రెండేళ్లలో ఐదున్నర లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లు వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిపోయారు. వారు ఏటా ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం వగైరాల కోసం చేసే కోట్లాది రూపాయలు తల్లిదండ్రులకు మిగిలిపోయాయి. ఈ సొమ్మును వారు మెరుగైన జీవితం కోసం ఉపయోగించుకోగలుగుతారు.

మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకురూ. 3,600 కోట్లతో 9 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాన్ని జగన్‌ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కొత్త హార్బర్లలో 10 వేల మెకనైజ్డ్‌ బోట్లను నిలుపుకొనే అవకాశం ఉంటుంది. ఫలితంగా మూడు లక్షల టన్నుల అదనపు మత్స్య సంపద లభిస్తుందని అంచనా ఉన్నది. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే ఎనిమిది నుంచి పదివేల కోట్ల అదనపు ఆదాయం ప్రతియేటా మత్స్యకారులకు లభిస్తుంది. గుజరాత్‌ సముద్ర తీరాల్లో పొట్టకూటి కోసం శ్రమదోపిడీకి గురయ్యే పరిస్థితి నుంచి మత్స్యకారులు సగర్వంగా నిలబడే స్థితికి చేరుకుంటారు.

31 లక్షల కుటుంబాలకు నిలువనీడ కల్పించే బృహత్తర కార్యక్రమం వైఎస్సార్‌ – జగనన్న కాలనీల ఏర్పాటు. ఏకబిగిన ఇన్ని ఇళ్లను నిర్మించిన కార్యక్రమం దేశ చరిత్రలో మరొకటి లేదు. ప్రభుత్వం యాభైవేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న మహాయజ్ఞంలో మహిళా సాధికారత అనే సామాజిక న్యాయ సూత్రం కూడా అంతర్లీనంగా ఉన్నది. ఇళ్లన్నీ పూర్తయి అక్కడ కాలనీ జీవితం మొదలైన తర్వాత వాటి విలువ అథమపక్షం రూ. 3 లక్షల కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తు న్నారు. ఈ ఒక్క పథకంలో మూడు లక్షల కోట్ల ఆస్తిని సృష్టించి మహిళల చేతిలో జగన్‌ ప్రభుత్వం ఉంచబోతున్నది.

ప్రభుత్వరంగంలో విస్తారంగా ఆస్తుల కల్పన జరుగు తున్నది. రూ. 4,200 కోట్లతో గ్రామ సచివాలయాల నిర్మాణం, 2,300 కోట్లతో ఆర్‌బీకేల నిర్మాణం, 416 కోట్లతో బల్క్‌ మిల్క్‌ యూనిట్‌ భవనాల నిర్మాణం, 690 కోట్లతో వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. 13 వేల కోట్ల ఖర్చుతో రామాయపట్నం, మచిలీపట్నం, భావన పాడు ఓడరేవుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేసిన భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. 13,885 కొత్త ఎంఎస్‌ఎంఇ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభిం చాయి. మరో 42 వేల కోట్ల పెట్టుబడులతో 72 భారీ పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. 96 వేల కోట్ల వ్యయంతో ఐదు ప్రభుత్వరంగ యూనిట్ల నిర్మాణం జరుగుతున్నది.

ఈ రెండున్నరేళ్ల పరిపాలనా కాలంలో, అందులో రెండేళ్ల సమ యాన్ని 30 వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని, ఇంకెన్నో వేల కోట్ల ప్రజాధనాన్ని కోవిడ్‌ మహమ్మారి మింగేసిన కాలంలో స్థూలంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, అప్పులు, పెట్టుబడులకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇవి. ఉద్యోగాల కల్పన పెరిగింది, పనిదినాల కల్పన పెరిగింది. వలసలు తగ్గుముఖం పట్టాయి. నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందుబాటులోకి వస్తున్నది. ఆర్‌బీకేల ఏర్పాటు వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చివేయబోతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ రెండున్నరేళ్లలో సాధించిన సమ్మిళిత అభివృద్ధితో మరే రెండున్నరేళ్ల కాలం కూడా పోటీపడలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. అంకెలు అబద్ధం చెప్పవు!


-వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement