పసిమనసుల్లో విషబీజం! | Editorial On Hijab Controversy In Shivamogga Karnataka | Sakshi
Sakshi News home page

పసిమనసుల్లో విషబీజం!

Published Thu, Feb 10 2022 1:28 AM | Last Updated on Thu, Feb 10 2022 1:52 AM

Editorial On Hijab Controversy In Shivamogga Karnataka - Sakshi

బేటీ పఢావో, బేటీ బచావో అని చెబుతున్న దేశంలో ఒక ఆడపిల్ల తను చదువుకుంటున్న చోటుకు స్వేచ్ఛగా వెళ్ళలేకపోవడం ఎంత దురదృష్టం? తోటి విద్యార్థిని ఒంటరిగా కాలేజీలోకి వెళుతుంటే, వెనకాల గుంపుగా వెంటబడి వేధింపుగా నినాదాలు చేయడం ఎంత ఘోరం? విద్యాబుద్ధులు నేర్పా ల్సిన ప్రదేశం విద్వేషానికి ఆలవాలమైతే, ఎంత బాధాకరం? అవును... అదుపు తప్పిన భావోద్వే గాలు, అల్లరి మూకలు రాళ్ళు రువ్వడాలు, తల పగిలి రక్తం ఓడిన టీచర్లు, జాతీయజెండా స్తంభం పైకెక్కి కాషాయ ధ్వజం ఎగరేసే తుంటరితనాలు, శివ మొగ్గలో రాళ్ళదాడులు, లాఠీఛార్జీ, దావణగెరెలో బాష్పవాయు ప్రయోగం... కలత రేపుతున్న కర్ణాటక దృశ్యాలివి. 

ఉడుపిలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆరుగురు ముస్లిమ్‌ విద్యార్థినులు హిజాబ్‌ ధరించి రావడాన్ని అధికారులు తప్పుబట్టడంతో కోస్తా కర్ణాటకలో మొదలైన వివాదం దేశవ్యాప్తమైంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌ గురువారం జరగనున్న వేళ రాజకీయ అంశంగానూ మారింది. పరపురుషుల ముందు తల, ఛాతీని కప్పి ఉంచేలా వస్త్రాన్ని వేసుకొనే ‘హిజాబ్‌’ ధారణ కొత్తదేమీ కాదు. దానిపై విద్యార్థుల్లో వివాదమే కొత్త. కాలేజీకి హిజాబ్‌తో వస్తామని పట్టుబడుతున్న స్టూడెంట్లను క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (సీఎఫ్‌ఐ) వెనక ఉండి నడిపిస్తోందని ఒక ఆరోపణ. వారికి వ్యతిరేకంగా తోటి విద్యార్థులతో కాషాయ తలపాగాలు, శాలువాలు ధరింపజేయడం వెనుక ఏబీవీపీ లాంటి సంఘ్‌ పరివార్‌ శక్తులున్నాయని ప్రత్యారోపణ.

ఆరోపణల్లో నిజానిజాలెలా ఉన్నా, స్థానికంగా ఆ విద్యాసంస్థ స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశం ఇంత పెద్దది కావడంలో కర్ణాటకలోని బీజేపీ సర్కారు తప్పూ కనిపిస్తూనే ఉంది. కర్ణాటక విద్యా చట్టం–1983లోని 133(2)వ సెక్షన్‌ కింద ఈ నెల మొదట్లో బొమ్మై ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ ఆదేశాలిచ్చింది. ‘సమానత్వానికీ, సమగ్రతకూ, పౌర శాంతిభద్రతలకూ భంగం కలిగించే దుస్తులు ధరించరాదు’ అని పేర్కొంది. హిజాబ్‌ ధారణ అనేది సమానత్వం, శాంతి భద్రతలకు ఏ రకంగా భంగకరం అంటే జవాబివ్వడం కష్టమే. పైపెచ్చు, రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కు, విద్యాహక్కు, మతస్వాతంత్య్ర హక్కులకు ఈ ఆదేశాలు విరుద్ధమనిపిస్తాయి. 

పిల్లల హిజాబ్‌ ధారణ చిన్న విషయమనిపించినా అనేక కోణాలున్నాయి. ఈ వస్త్రధారణ ఛాంద సవాదమని నిరసించేవాళ్ళూ, ఇష్టపూర్వకంగా ధరిస్తుంటే అది స్వీయ నిర్ణయ హక్కు అనేవారూ – ఇద్దరూ ఉన్నారు. అలాగే, హిజాబ్‌ ధారణ రాజ్యాంగపరమైన హక్కు అవునా, కాదా? దాన్ని అడ్డుకోవడం మహిళల స్వీయనిర్ణయ హక్కుకూ, వ్యక్తిగత గోప్యతకూ భంగకరమా? అవతలి వారికి ఇబ్బంది కలగని రీతిలో ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరించకూడదా? ఇలా ఎన్నో ప్రశ్నలు. అందుకే, ఇది కేవలం రిట్‌ పిటిషన్‌ వేసిన ఆరుగురు విద్యార్థినుల అంశంగా కోర్టు చూడట్లేదు. హిజాబ్‌ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని కర్ణాటక హైకోర్ట్‌ బుధవారం నిర్ణయించింది. అదే సమయంలో ఎలాంటి వ్యాఖ్యలూ చేయకుండా, కేసు వేసిన విద్యార్థినుల పక్షాన మధ్యంతర ఉపశమన ఉత్తర్వులేమీ ఇవ్వకుండా జాగ్రత్త పడింది. ఇప్పటికే హిజాబ్‌ను సమర్థిస్తూ, 2017 నాటి కేరళ హైకోర్ట్‌ తీర్పు, 2018 బాంబే హైకోర్ట్‌ తీర్పు లాంటివి ఉన్నా, తొందరపడకూడదనుకుంది. 

65 మెడికల్‌ కాలేజీలు, 250 ఇంజనీరింగ్‌ కాలేజీలతో విద్యాకేంద్రంగా, వేలమందిని విదేశాలకు పంపిన సాఫ్ట్‌వేర్‌ కూడలిగా వినుతి కెక్కిన కర్ణాటకలో కోస్తాప్రాంతం సున్నితం. అక్కడ ముస్లిమ్, క్రైస్తవ వ్యతిరేక ప్రచారాస్త్రం చేపట్టిన బీజేపీ తనకు అనుకూలంగా మెజారిటీ వర్గాన్ని ఏకం చేయాలని భావిస్తోంది. ఆ అజెండాకు తాజా పరిణామాలు తోడ్పడవచ్చు. కానీ, దాని పర్యవసానాలే దారుణం కావచ్చు. విద్యాపరంగా చూస్తే, ఇప్పటికే దేశంలో 57 శాతం మంది ఆడపిల్లలు మధ్యలో చదువు మానేస్తున్నారు. ముస్లిమ్‌ యువతులైతే 21.9 శాతం మంది చదువుకే దూరంగా ఉన్నారనీ లెక్క. కరోనాతో 24 కోట్ల మంది పిల్లల చదువుపై ప్రభావం పడిందని పార్లమెంటరీ స్థాయీ సంఘమే తేల్చింది. ఇప్పుడీ అనవసర వివాదాలతో ఒక మతం ఆడపిల్లలు పూర్తిగా చదువుకే దూరమయ్యే ప్రమాదమూ ఉంది. అదే జరిగితే ‘బేటీ పఢావో’ ఎవరో అన్నట్టు ‘బేటీ హఠావో’ అయిపోతుంది. 

ఇప్పటికే రెండేళ్ళుగా కరోనా కాలంతో చదువులు దెబ్బతిన్నాయి. భౌతిక తరగతులకు దూరమై, విద్యార్థులు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ప్రవర్తన ధోరణులూ మారాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడీ వివాదం అగ్నికి ఆజ్యం. ఘర్షణలతో ఇచ్చిన 3 రోజుల సెలవుల తర్వాతైనా కాలేజీలు తెరవాల్సి ఉంది. రెండు నెలల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. వివాదం ఇలాగే కొనసాగితే దెబ్బతినేది విద్యార్థులు, వారి చదువులు. సామాజికంగా చూస్తే, సున్నితమైన ఈ వ్యవహారంలోకి రాజకీయ పార్టీలు చొరబడడం, రాజకీయ లబ్ధికి గేలం వేయడం అవాంఛనీయం. హిజాబ్‌ వేసుకొమ్మని బలవంతం చేయడమే కాదు... వద్దని నిషేధించడమూ కచ్చితంగా అణచివేతే! సామరస్యాన్ని చెడగొట్టి, మత విద్వేషాగ్నిని రగిలించే ఏ చర్యలనూ సమర్థించలేం. విద్వేషం వల్ల జరిగేది నష్టమేనన్నది తరతరాలుగా యుద్ధభూమి నేర్పిన పాఠం. మరి, పాఠాలు చెప్పాల్సిన బడినే వైమనస్యాల యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుంటే ఏమనాలి? పసిమనసుల్లో కులమతాల విద్వేషపు విషబీజం నాటితే, అది మొత్తం జాతికే నష్టం. శతాబ్దాల సామరస్య పునాదిపై నిలిచిన లౌకికవాద ప్రజాస్వామ్య భారతావనిలో ఆ ప్రయత్నం ఎవరు చేసినా... అక్షరాలా వారే అసలు దేశద్రోహులు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement