మునుముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆత్రుత, ఉత్కంఠ అందరిలోనూ ఉంటాయి. నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా ఎన్నికల యుద్ధం సాగినప్పుడు ఇవన్నీ మరిన్ని రెట్లు పెరగడంలో వింతేమీ లేదు. కనుకనే ఆదివారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంత సంచలనం సృష్టించాయి. మార్కెట్లు సైతం రెట్టించిన ఉత్సాహంతో స్పందించి పైపైకి ఎగబాకాయి. ‘చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా...’ అన్నట్టు నాయకుల నడత, నడక... వారు గతంలో ఇచ్చిన హామీలు, అధికారంలో ఉండగా నెరవేర్చిన తీరు వగైరాలన్నీ ప్రజానీకానికి తెలుసు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసి భుజాలు తడుముకుంటున్నవారు ముందుగా ఆ సంగతి తెలుసుకోవాలి. కోట్లాదిమంది పౌరుల ఆశలు, ఆకాంక్షలు ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. అవేమిటో, ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలని బడా నేతలు మొదలుకొని సాధా రణ పౌరుల వరకూ అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈసారి ఎప్పుడూ లేనట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ఏప్రిల్ 11నే ముగిసింది. అంటే... ఫలితాల వెల్లడికి తెలుగు ప్రజలు ఈ దఫా 43 రోజులపాటు నిరీక్షించవలసి వచ్చింది. కనుకనే అసలు ఫలితాలు ఎటూ రెండు రోజుల్లో వెల్లడికాబోతున్నా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం కూడా అందరూ అంతే ఆసక్తిగా ఎదురుచూశారు.
ఎన్నికల సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ మన దేశంలోకి ప్రవేశించి రెండున్నర దశాబ్దాలవుతోంది. మొదట్లో పోలింగ్ పూర్తయిన ప్రతి దశలోనూ ఫలితాలు ప్రకటించి చాలా సంస్థలు పార్టీలనూ, నేతలనూ కంగారు పెట్టేవి. కానీ వీటిల్లో అధికభాగం పార్టీలకు ప్రయోజనం కలిగించేందుకు దొంగ లెక్కలు చెబుతున్నాయన్న ఆరోపణలు రావడం మొదలయ్యాక ఆఖరి దశ పోలింగ్ పూర్త య్యాకనే ఫలితాలు వెల్లడించాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పటికీ ఆ బాపతు సంస్థలు బోగస్ సర్వేలతో మభ్యపెట్టాలని చూస్తూనే ఉన్నాయి. ఆమధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తప్పుడు ఫలితాలిచ్చి అభాసుపాలైన లగడపాటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలోనూ ఆ బాపతు ప్రయత్నమే చేశారు. ఇలాంటి సంస్థల సంగతి పక్కనబెడితే మన దేశంలో నికార్సయిన అంచనాలిచ్చి విశ్వసనీయత పొందుతున్న సంస్థలున్నాయి. ఓటర్ల మనసులో ఏముందో పసిగట్టడం, వారు ఎటు మొగ్గు చూపుతున్నారో తెలుసుకోవడం సాధారణ విషయం కాదు.
ఓటర్లలో వివిధ వర్గాల ఆలోచనలనూ, వారిని ప్రభావితం చేస్తున్న అంశాలను రాబట్టడం, వారి తీర్పు ఎలా ఉండబోతున్నదో నిర్ధారించడం కత్తి మీది సాము. అది ఒకరకంగా చీకట్లో తడు ములాట. సర్వే నిర్వహణలో శాస్త్రీయత కొరవడితే అంతా తలకిందులవుతుంది. ఓటర్లను అడగా ల్సిన ప్రశ్నల్లో... వాటిని అడిగే తీరులో... ఎంచుకున్న సామాజిక వర్గాల అమరికలో ఏమాత్రం తేడా లొచ్చినా అంచనాలు కుప్పకూలతాయి. సర్వేలు చేసిన సంస్థలు అభాసుపాలవుతాయి. ఈమధ్యే వెల్లడైన ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఇందుకొక ఉదాహరణ. అక్కడ విపక్ష లేబర్ పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలు జోస్యం చెప్పాయి. కానీ అందుకు భిన్నంగా అధికార లిబరల్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటోంది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఇలాగే జరిగింది. డెమొక్రటిక్ పార్టీకి చెందిన హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని సర్వేలు చెప్పగా, రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకొచ్చారు. ఆ రెండుచోట్లా దాదాపు అన్ని సంస్థలూ ఓటర్లను ఫోన్ ద్వారా ప్రశ్నించి జవాబులు రాబడతాయి. కానీ మన దేశంలో సర్వే నిర్వహిస్తున్న సంస్థలు నేరుగా పౌరుల దగ్గరకెళ్తాయి. వారిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తాయి.
చాలా సంస్థలు తమ అనుభవాలను సమీక్షించుకుని లోటుపాట్లు దిద్దుకుంటున్నాయి. సర్వే లకు శాస్త్రీయ ప్రమాణాలను ఏర్పరుచుకుని సరిగా అధ్యయనం చేయగలుగుతున్నాయి. మెరుగైన అంచనాలకు రాగలుగుతున్నాయి. అందుకే 2014నాటి ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత జరి గిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సరిగా జోస్యం చెప్పగలిగాయి. గతంలో ఈ పరిస్థితి లేదు. 2004లో యూపీఏ విజయం సాధించి నప్పుడు, 2009లో అది రెండోసారి అధికారం లోకొచ్చినప్పుడు చాలా సంస్థల లెక్కలు తప్పాయి. కేంద్రంలో ఎన్‌డీఏకు మరోసారి స్పష్టమైన మెజారిటీ రాబోతున్నదని ఈసారి దాదాపు అన్ని సంస్థలూ ఢంకా బజాయించి చెబుతున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి 2014నాటి సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడినా అది బలమైన పోటీ ఇవ్వలేకపోయిందని అంటున్నాయి.
ఎన్నికల ముందునాటి అంచనాలకు భిన్నంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ నిలకడగా ఎన్నికల్లో మోదీకి ప్రతికూలం కాగలవనుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, ఉపాధి లేమి, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాల ప్రభావం పెద్దగాలేదంటున్న సర్వేల జోస్యాల్లో నిజానిజాలేమిటో 23న వెల్లడయ్యే వాస్తవ ఫలితాలు నిగ్గుదేలుస్తాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధికార పీఠాన్ని అధిష్టించబోతున్నదని అత్యధిక సంస్థలు తేల్చి చెప్ప డంలో ఆశ్చర్యం లేదు. ఏపీలో బాబు అధికార పునాదులు కదలబారుతున్న వైనం చాన్నాళ్ల క్రితమే కనబడటం మొదలైంది. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో ప్రభుత్వం ఏ ఒక్కటీ నెరవేర్చక పోగా సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి ఏకంగా ఆనాటి మేనిఫెస్టోనే వెబ్‌సైట్ నుంచి మాయం చేసింది. అయిదేళ్లూ ఎలా పాలించినా చివరిలో రకరకాల పథకాల పేరిట డబ్బులు పంచి విజయం చేజిక్కించుకోవచ్చునని భావించారు. కానీ ఇదంతా బెడిసికొట్టిన వైనం ఆయనకు ముందే అర్ధ మైంది. అందుకే పోలింగ్ జరిగిన నాటినుంచి ఆయన ఈవీఎంలను తప్పుబడుతూనే ఉన్నారు. పైగా, జాతీయ స్థాయిలో ఏదో తవ్వి తలకెత్తుకుంటున్న అభిప్రాయం కలిగించడానికి ప్రయత్ని స్తున్నారు. ఇవన్నీ జనం ముందు చెల్లని కాసులయ్యాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. మరో రెండురోజుల్లో వెల్లడికాబోయే ఎన్నికల ఫలితాలు సైతం వీటినే ఎలుగెత్తి చాటుతాయి.
Comments
Please login to add a commentAdd a comment