సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలకు తక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే సాధారణంగానే వారు ఆ ఫలితాలను తప్పుపడతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీనిపై మాదవ్ స్పందిస్తూ.. ‘‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విపక్షాలకు అనుకూలంగా వస్తే అవి సరైనవి. వారికి వ్యతిరేకంగా వస్తే సరైనవి కావు అనే విధంగా ప్రతిపక్ష పార్టీల సభ్యులు వ్యవహరిస్తున్నారు. ఓటమిని అంగీకరించలేక ఎన్నికల సంఘం, ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. ఫలితాలు వారికి అనుకూలంగా వస్తే ఎవరినీ ప్రశ్నించరు. వారికి వ్యతిరేకంగా వస్తే వ్యవస్థనే తప్పుపడతారు.
మమతా బెనర్జీ, చంద్రబాబు నాయడు, కూమరస్వామి వీరంతా ఎగ్జిట్ పోల్స్‌ను ప్రశ్నిస్తున్నారు. గతంలో వారు కూడా ఇవే ఈవీఎంలతో గెలిచిన విషయాన్ని మర్చిపోయారు. గతంలో కంటే ఈసారి తమకు మెరగైన ఫలితాలు వస్తాయి. మోదీ నాయకత్వంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మే 23న వచ్చే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. 300లకు పైగా స్థానాలకు గెలుచుకుంటాం’’ అని అన్నారు. కాగా హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment