వీధుల్లో వీరంగం! | Article On 2019 Lok Sabha And Assembly Elections In Sakshi | Sakshi
Sakshi News home page

వీధుల్లో వీరంగం!

Published Thu, May 16 2019 1:21 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Article On 2019 Lok Sabha And Assembly Elections In Sakshi

బాధ్యతాయుతంగా మెలగాల్సిన పార్టీలు విలువలకు తిలోదకాలొదలి, బలప్రదర్శనకు దిగితే ఏమవుతుందో మంగళవారం కోల్‌కతాలో జరిగిన హింస, విధ్వంసం నిరూపించాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ర్యాలీ సందర్భంగా జరిగిన తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం తన్నులాడుకుని సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్థం చేశారు. కోల్‌కతా పరిణామాలు గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) అసాధారణ రీతిలో రాజ్యాంగంలోని 324 అధి కరణాన్ని ప్రయో గించి ప్రచారపర్వాన్ని 24 గంటల ముందే నిలిపివేసింది. హింసను నివారిం చడంలో విఫలమయ్యా రన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(హోం)ని, సీఐడీ విభాగం అధిపతిని వారివారి పదవుల నుంచి తప్పించింది.

వచ్చే ఆదివారం జరగాల్సిన ఆఖరి దశ పోలింగ్‌ ప్రచారానికి వాస్తవా నికి శుక్రవారంతో తెరపడాలి. కానీ తాజా ఆదేశాల పర్యవసానంగా గురు వారం రాత్రి 10 గంట లతో ఇది నిలిచిపోతుంది. అధికార యంత్రాంగం సహాయనిరాకరణ చేస్తున్నందువల్ల ఈ నిర్ణయా నికొచ్చామని ఎన్నికల సంఘం చెబుతోంది. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో హింస, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయనుకుంటే, వాటిని నివారించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనుకుంటే పార్టీల ప్రచారాన్ని తక్షణమే నిలిపేసి ఉంటే వేరుగా ఉండేది. ఆఖరికి 19న జరగాల్సిన తుది దశ పోలింగ్‌ను వాయిదా వేసినా ఎంతో కొంత అర్ధముండేది. కానీ ఇందుకు బదులు గురువారం రాత్రి వరకూ ప్రచారానికి ఎందుకు అనుమతించారో సీఈసీయే చెప్పాలి. పార్టీలన్నీ ముందుగా నిర్ణయించుకున్న విధంగా రేపటి సభలూ, సమావేశాలు యధాతథంగా జరు పుకోనివ్వడమే ప్రజాస్వామికమనుకున్న ప్పుడు నిబంధనల ప్రకారం ఆ మర్నాడు కూడా దాన్ని కొనసాగించనీయడమే సరైంది అవుతుంది.

ఎన్నికల సంఘం నిర్ణయంలోని హేతుబద్ధత సంగతలా ఉంచితే బెంగాల్‌లో తృణమూల్, బీజే పీల తీరుతెన్నులు జనం హర్షించదగ్గవిగా లేవు. అమిత్‌ షా ర్యాలీకి, ఆ మాటకొస్తే మరికొందరు ఇతర నేతల ర్యాలీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయో ఆ పార్టీ నేతలకు తెలుసు. అటువంటప్పుడు మంగళవారం నాటి ర్యాలీ అదుపు తప్పకుండా బీజేపీ ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. పొంచి ఉన్న ప్రమాదాల గురించి, సంయమనం పాటించాల్సిన అవసరం గురించి తమ కార్యకర్తలకు చెప్పి ఉండాలి. బాధ్యతాయుతమైన పార్టీగా బీజేపీ ఆ పని చేసి ఉంటే అందరూ దాన్ని ప్రశంసించేవారు. కానీ యుద్ధరంగానికెళ్తున్న రీతిలో ర్యాలీ నిర్వహిం చడం, తీరా ఎవరినీ అదుపు చేసే స్థితిలో లేకపోవడం సరైంది కాదు. అవతలి పార్టీ కార్యకర్తలు రాళ్లు రువ్వి ముందుగా తమ కార్యకర్తల్ని కవ్వించారని... తృణమూల్‌ కార్యకర్తలే తమ జెండాలు పట్టు కుని ఈ విధ్వంసాన్నంతటినీ సాగించారని చెప్పినంతమాత్రాన జరిగిందంతా మాసిపోదు. ర్యాలీ జరుగుతున్న క్రమంలోనే ఇదంతా చోటు చేసుకుంది గనుక నాయకులు సకాలంలో జోక్యం చేసు కుని నివారించి ఉంటే ఇలాంటి సంజాయిషీలు చెప్పుకునే బాధ తప్పేది.

కోల్‌కతాలో జరిగిన హింస, విధ్వంసం సాధారణమైనవి కాదు. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు, ఇటుకలతో పరస్పరం దాడులకు దిగడం మాత్రమే కాదు... వాహనాలకు నిప్పెట్టి, కళాశాల కార్యా లయాన్ని ధ్వంసం చేసి జనాన్ని భయభ్రాంతుల్ని చేశారు. అన్నిటికీ మించి బెంగాలీలు ఎంతో ప్రాణప్రదంగా చూసుకునే సంఘ సంస్కర్త, తత్వవేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని దుండ గులు ధ్వంసం చేశారు. ఆయన కేవలం బెంగాల్‌కు పరిమితమైన వ్యక్తి మాత్రమే కాదు. భిన్న రంగాల్లో ఆయన ఆచరణ 170 ఏళ్లక్రితమే దేశం మొత్తాన్ని కదిలించింది.

ఎన్నో సంస్థలు సమష్టిగా సాధించలేనివి కూడా ఆయన వ్యక్తిమాత్రుడిగా కృషి చేసి అమల్లోకి తీసుకురాగలిగారు. మన కందు కూరి వీరేశలింగంవంటి ఎందరెందరికో ఆదర్శనీయుడయ్యారు. బాల్యవివాహాలకూ, బహుభార్య త్వానికి వ్యతిరేకంగా పోరాడారు. వితంతు పునర్వివాహాలు హిందూ శాస్త్రాలకు విరుద్ధం కాదని అలుపెరగని ప్రచారం చేసి విజయం సాధించారు. బ్రిటిష్‌ పాలకులను ఒప్పించి చట్టాలు తీసుకొ చ్చేలా చేశారు. బెంగాలీ భాష సంస్కరణకు నడుం కట్టారు. ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. దీన్ని బెంగాలీ ప్రజలపై, సంస్కృతిపై బీజేపీ చేస్తున్న దాడిగా అభివర్ణిస్తున్నారు.

రాజకీయ పార్టీలు తమ విధానాలను ప్రకటించుకోవడానికి, చేసింది చెప్పుకోవడానికి, మున్ముందు చేయదల్చుకున్నవాటిని వివరించడానికి ఎన్నికలు ఒక సందర్భం. కానీ ఆచరణలో ఇదంతా తారుమారవుతోంది. 42 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో ఏడు దశల్లోనూ పోలింగ్‌ నిర్వ హించబోతున్నామని ఎన్నికల సంఘం ప్రకటించినప్పుడు అభ్యంతరం చెప్పినవారున్నారు. ముఖ్యంగా తృణమూల్‌ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే హింసాత్మక వాతావరణాన్ని అదుపు చేయడానికి ఇది ఏదో మేరకు తోడ్పడుతుందని చాలామంది భావించారు.

ఇందువల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడటం భద్రతా బలగాలకు వీలవుతుందనుకున్నారు. కానీ అదేమీ లేకపోగా, సుదీర్ఘమైన పోలింగ్‌ షెడ్యూల్‌ ఉండటంతో పార్టీలు అదుపు తప్పినట్టు కనిపిస్తోంది. అవతలి పార్టీల విధానాలను విమర్శించడానికి, పాలనలోని లోపాలను చూపడానికి బదులు నేతలు పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగి ప్రశాంతమైన వాతావరణాన్ని భగ్నం చేశారు. ఎన్నికలొస్తున్నాయంటే సామాన్య జనం హడలెత్తే స్థితి కల్పించారు. ఏదో ఒక దశలో ఎన్నికల సంఘం చొరవ తీసుకుని దీన్నంతటినీ సరిదిద్దవలసింది. ఏవో అరకొర చర్యలు మినహా ఇంతవరకూ అది చేసిందేమీ లేదు. చివరి దశలో ఇప్పుడు తీసుకున్న చర్య అయినా హేతుబద్ధంగా  లేదు. కోల్‌కతాలో చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలకు అందరూ బాధ్యులే. కనీసం మున్ముందైనా ఈ పార్టీలన్నీ  ఆత్మవిమర్శ చేసుకుని తమ లోపాలు సరిదిద్దుకుంటాయని ఆశించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement