ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించడం, అవతలి పక్షాన్ని అసంతృప్తికి గురిచేసే చర్యలు మానుకోవడం దౌత్య రంగంలో కీలకమైన అంశాలు. ఇరుగుపొరుగు దేశాలౖకైనా, సుదూరంలో ఉండే దేశాల మధ్య అయినా ఇది తప్పనిసరి. అలాగైతేనే ఆ దేశాల మధ్య స్నేహసంబంధాలు వికసిస్తాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. టర్కీ ఇలాంటి మౌలిక అంశాలను విస్మరించినందువల్లే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 27, 28 తేదీల్లో ఆ దేశంలో జరపాల్సిన పర్యటన రద్దయింది. నిరుడు జూలైలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మన దేశంలో పర్యటించారు. అంతక్రితం 2015లో ఆ దేశంలో జరిగిన జీ–20 సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ వెళ్లారు. మొన్న జూన్‌లో ఒసాకాలో జరిగిన జీ–20 సమావేశాల సందర్భంగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ చర్చల సందర్భంగానే ఇరు దేశాల మధ్యా రక్షణ రంగంలో సహకరించుకోవాలన్న అంశంలో అంగీ కారం కుదిరింది. దానికి అనుగుణంగా నావికా దళానికి తోడ్పడే అయిదు యుద్ధ నౌకలను టర్కీ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం రూపొందింది. 230 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పం దంపై మోదీ పర్యటన సందర్భంగా సంతకాలు జరగాల్సి ఉంది. ఈలోగా కశ్మీర్ పరిణామాలపై ఎర్డోగాన్ సెప్టెంబర్ నెలాఖరున జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ వాతావరణాన్ని కాస్తా చెడగొట్టారు. కశ్మీర్‌లో వేలాదిమంది బలగాలను దించి 80 లక్షలమంది ప్రజానీకాన్ని దిగ్బంధించారని ఆయన ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై ఆ వెంటనే మన దేశం టర్కీకి అసంతృప్తి వ్యక్తం చేసింది.
వాస్తవానికి భారత్–టర్కీల మధ్య మొదటినుంచీ సంబంధాలు ఏమంత మెరుగ్గా లేవు. 1965, 1971ల్లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధాల్లో పాకిస్తాన్‌కు టర్కీ అమెరికా తయారీ సైనిక సామగ్రిని సరఫరా చేసింది. చెప్పాలంటే అప్పట్లో సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్‌కు సాయ పడింది. కానీ అనంతర కాలంలో దాని తీరు మారింది. కానీ గత మూడు దశాబ్దాలుగా భారత్, టర్కీ అధినేతలు పలుమార్లు కలుసుకున్నారు. ఒకరి దేశంలో మరొకరు పర్యటించారు. ద్వైపాక్షిక చర్చల్లో కశ్మీర్ అంశాన్ని మన దేశం టర్కీకి వివరిస్తూనే ఉంది. ఎర్డోగాన్‌కు ముందున్న నేతలు ఇతర విషయాల్లో ఎలా ఉన్నా కశ్మీర్‌పై ఏదోమేరకు సమాధానపడి ఆ అంశాన్ని లేవనెత్తడం మాను కున్నారు. ఎర్డోగాన్ వచ్చాక ఈ తీరు మారింది. భారత్‌ను ఇరకాటంలో పెడితే పాకిస్తాన్ సంతోషి స్తుందనుకున్న ప్రతి సందర్భంలోనూ ఆయన మనకు వ్యతిరేకంగానే వ్యవహరించారు. అణు సరఫ రాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం ఇవ్వడానికి అమెరికా తదితర దేశాలు సిద్ధపడినా టర్కీ మాత్రం వ్యతిరేకించింది. చైనా సరేసరి. 48మంది సభ్యులున్న ఆ బృందంలో ఏ ఒక్కరు వ్యతి రేకించినా తీర్మానం ఆగిపోతుంది. అందులో సభ్యత్వం వల్ల మనకు ఒరిగేదేమిటన్నది వేరే చర్చ. ఎన్‌ఎస్‌జీకి భారత్‌ను రానీయకుండా చూసి పాక్‌ను సంతృప్తిపరచాలన్నదే టర్కీ ధ్యేయం.
గత వారం జరిగిన ఫైనాన్షియల్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) సమావేశంలో ఉగ్రమూకలకు నిధులు మళ్లడాన్ని నిరోధించలేకపోతున్న పాకిస్తాన్‌పై చర్య తీసుకోవాలన్న ప్రయత్నాన్ని టర్కీయే అడ్డు కుంది. నిధుల వరదను ఆపడానికి పాకిస్తాన్ మొత్తం 27 అంశాల్లో చర్యలు తీసుకోవాలని రెండు నెలల క్రితం ఎఫ్‌ఏటీఎఫ్ నిర్దేశించింది. కానీ కేవలం అయిదు అంశాల్లో మాత్రమే పాక్ చర్యలు తీసుకుందని సమావేశం తేల్చింది. అయినా పాకిస్తాన్‌కు మరింత గడువు విధించి, అది తప్పిం చుకునేందుకు టర్కీ తోడ్పడింది. దీనికితోడు గత కొంతకాలంగా అది పాకిస్తాన్‌తో రక్షణ ఒప్పం దాలు కుదుర్చుకుంటోంది. వందకోట్ల డాలర్ల విలువైన మధ్యతరహా యుద్ధ నౌకలను అమ్మడానికి అది పాక్‌తో అవగాహనకొచ్చింది. గత ఏడాది 30 సైనిక హెలికాప్టర్లను అమ్మడానికి ఒప్పందం కుదిరింది. ఒక దేశంతో రక్షణపరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటూ, అదే సమయంలో దానితో పొసగని మరో దేశంతో అలాంటి ఒప్పందాలకు సిద్ధపడటం సరికాదు. టర్కీ ఒకపక్క మనతో వాణిజ్య, రక్షణ సంబంధాలు నెలకొల్పుకోవాలనుకుంటూనే పాకిస్తాన్‌తో రక్షణ ఒప్పందాలకు దిగు తోంది. ఇతరత్రా ఆ దేశానికి మేలు చేస్తోంది.
ఎర్డోగాన్ అనుసరిస్తున్న ఈ పాక్ అనుకూల విధానం వెనక ఆయన ప్రయోజనాలు ఆయన కున్నాయి. ఆధునిక టర్కీ నిర్మాత ముస్తఫా కెమల్ అటాటుర్క్ ప్రజాజీవన రంగాల్లో ఇస్లాం పాత్ర పరిమితంగా ఉండేలా తీర్చిదిద్దినా, అది రోజులు గడుస్తున్నకొద్దీ టర్కీలో పెరిగిందే తప్ప తగ్గలేదు. 70వ దశకంలో రాజకీయాలకు కూడా విస్తరించింది. ఆమేరకు దాని సెక్యులర్ విలువలు క్షీణిస్తూ వచ్చాయి. కనుకనే యూరప్ యూనియన్‌లో దానికి వస్తుందనుకున్న సభ్యత్వం చేజారింది. చివ రకు 2002లో మతత్వ సంస్థలతో సాన్నిహిత్యం ఉన్న ఎర్డోగాన్ అధికారంలోకి రావడంతో టర్కీ రూపురేఖలు మారిపోయాయి. రెండో ప్రపంచయుద్ధానికి ముందు అటోమాన్ సామ్రాజ్యంగా తన దేశానికున్న వైభవప్రాభవాలను పునరుద్ధరించాలని, దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని అప్పటినుంచీ ఎర్డోగాన్ కలగంటున్నారు. ఈ క్రమంలో దేశం ఏమైనా ఆయనకు పట్టడం లేదు. అందులో భాగంగానే పాక్‌ను భుజాన వేసుకుంటున్నారు.
ఎర్డోగాన్ పీఠం ఎక్కేనాటికి టర్కీ ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. ఆయన ఏలుబడిలో అది నీరసించడం మొదలైంది. అవినీతి, ఆర్థిక అసమానతలు, ఉపాధి లేమి పెరగడం, వృద్ధిరేటు క్షీణించడం వంటి పరిణామాలతో ఆయ నపై వ్యతిరేకత పెరిగింది. దాన్నుంచి కాపాడుకునేందుకు మతం పేరిట భావోద్వేగాలు రెచ్చ గొట్టారు. సైనిక తిరుగుబాటు బూచి చూపి లక్షలమందిని జైళ్లలో కుక్కారు. న్యాయమూర్తులు, టీచర్లతోసహా వేలాదిమందిని ఉద్యోగాల్లోనుంచి తొలగించి ఖైదు చేశారు. వీరంతా తనకు వ్యతి రేకంగా జరిగిన కుట్రలో పాలుపంచుకున్నారన్నది ఆయన అభియోగం. ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన ఎన్నికలను ఏడాది ముందుకు జరిపారు. ఆ ఎన్నికల్లో ఎర్డోగాన్ గెలుపు ప్రశ్నార్థక మైంది. ఇరుగుపొరుగు దేశాలైన సైప్రస్, గ్రీస్ తదితర దేశాలతో ఆయనకు పడదు. ఇలా స్వదే శంలో నియంతగా వ్యవహరిస్తూ, ఇరుగుపొరుగుతో కయ్యానికి దిగుతూ, దేశంలో ప్రజాస్వామ్య సంస్థలను భ్రష్టుపట్టించిన ఎర్డోగాన్ కశ్మీర్ ప్రజానీకం గురించి కన్నీరు కార్చడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాకిస్తాన్‌ను నెత్తినెక్కించుకోదల్చుకుంటే అది ఆయన ఇష్టం. అందుకోసం మనకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తే స్పందించడం తప్పనిసరవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment