భారత్‌లో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న ‘కులం’ ఖండాంతరాలు దాటిందని, అది తమ దేశంలో ప్రవేశించి ఏపుగా ఎదుగుతున్నదని అమెరికా నగరాల్లో ఒకటైన సియాటల్ నగర కౌన్సిల్ గుర్తించింది. కుల వివక్షను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ మంగళవారం ఆర్డినెన్సు జారీచేసింది. దీని ప్రకారం ఉపాధి, హౌసింగ్, రీటెయిల్, ప్రజా రవాణా తదితర రంగాల్లో కుల వివక్ష ప్రదర్శించినట్టు తేలితే శిక్షలుంటాయి. అంతక్రితం మాటేమోగానీ సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలు రావటం మొదల య్యాక మన దేశంనుంచి దళితులు పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్లటం మొదలైంది.
ఆ తర్వాతే కుల వివక్ష గురించిన ఆరోపణలు వెల్లువెత్తాయి. అదంతా నిజం కాదని, హిందూమతాన్ని కించపరచటం కోసం ఈ ప్రచారం చేస్తున్నారని ఆక్రోశించేవారూ లేకపోలేదు. ఈ సందర్భంలో అసాధారణ ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు సంబంధించిన ఒక ఉదంతాన్ని గుర్తు తెచ్చుకోవాలి. జర్మనీలో హిట్లర్ అధికారం పీఠం ఎక్కడానికి నెలముందు.. అంటే 1932 డిసెంబర్‌లో ఆయన అమెరికా వచ్చేశాడు.
అయితే తాను ఒక యూదుగా ఇన్నేళ్లూ జర్మనీలో చవిచూసిన వివక్షే అక్కడి ఆఫ్రికన్ అమెరికన్లు కూడా ఎదుర్కొనటం చూసి నిర్ఘాంతపోయాడు. వివక్ష ఎదుర్కొనటంలో ఆయనకున్న అనుభవమే అమెరికాలో దాన్ని గుర్తించేలా చేసింది. బహుశా మన దేశంనుంచి వెళ్లిన దళితులు, ఇతర అట్టడుగు కులాలవారూ అలాంటి కారణం చేతనే కుల వివక్ష గురించి ఆరోపణలు చేసే పరిస్థితి ఏర్పడివుండొచ్చు. కాలిఫోర్నియాలోని ఈక్విటీ లాబ్స్ సంస్థ 2018లో ఒక నివేదిక వెలువరించింది.
దాని ప్రకారం 67 శాతంమంది దళితులు పని ప్రదేశాల్లో తమను అనుచితంగా చూస్తున్నారని ఆరోపించారు. కులం కారణంగా దాడులు, దుర్భాషలు ఎదుర్కొన్నామని 25 శాతంమంది చెప్పారు. తమ కులాన్ని ఎత్తిచూపుతారని నిరంతరం భయపడుతుంటామని 50 శాతంమంది దళితులు తెలియజేశారు. 1,500మందిని సర్వే చేసి ఈ నివేదిక రూపొందించారు. సిస్కో సిస్టమ్స్ సంస్థలో కుల వివక్ష కారణంగా తనకు న్యాయబద్ధంగా రావలసిన పదోన్నతులనూ, వేతన పెంపునూ అడ్డుకున్నారని రెండేళ్లక్రితం ఒక యువతి కోర్టుకెక్కటం అందరికీ తెలుసు.
ఆధిపత్య కులా నికి చెందిన ఇద్దరు మేనేజర్లు తనను అనేకరకాలుగా వేధించారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత కొన్ని విశ్వవిద్యాలయాలు, యాపిల్ సంస్థ, డెమాక్రటిక్ పార్టీ వంటివి తమ వివక్ష వ్యతిరేక విధానంలో కుల వివక్షను కూడా చేర్చాయి. ఈ పరిణామాలన్నీ అమెరికాలో కులవివక్ష పెరగటాన్నీ, దాన్ని అరికట్టే ప్రయత్నాలనూ పట్టిచూపుతున్నాయి. ఒక్క అమెరికా అనేమిటి...మన దేశ పౌరులు, మరి కొన్ని దక్షిణాసియా దేశాల పౌరులు వెళ్లిన ప్రతి దేశంలోనూ కులవివక్ష ఆరోపణలు తరచు వినబడు తూనే ఉన్నాయి.
ఏ దేశానికైనా పోవాలంటే ఎన్నో అవరోధాలుంటాయి. ముఖ్యంగా అమెరికా వెళ్లేందుకు వీసా రావాలంటే సవాలక్ష ప్రశ్నలకు జవాబివ్వాలి. ఇక ఆ గడ్డపై అడుగుపెట్టాక ఎదుర్కొనాల్సిన తనిఖీల గురించి చెప్పనవసరం లేదు. అయితే ఈ క్రమంలో ఎక్కడా కనబడనిదీ, ఎవరికీ దొరకనిదీ కుల తత్వం. మన దేశంలో ఈ కులతత్వం కనబడని చోటంటూ ఉండదు. ఇదొక నిచ్చెనమెట్ల వ్యవస్థ.
ప్రతి కులమూ వివక్షను ఎదుర్కొంటూనే తాను అణచడానికి కింద మరో కులం ఉందని తృప్తిపడు తుంటుంది. కింది కులాల శ్రమను దోచుకోవటానికి పనికొస్తుంది గనుక రాచరిక, భూస్వామ్య వ్యవస్థలు ఆ కుల వ్యవస్థను చెక్కుచెదరకుండా కాపాడాయి. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలకులు ‘విభజించు పాలించు’ అనే తమ సిద్ధాంతానికి అక్కరకొస్తుందని గ్రహించి దీని జోలికి పోలేదు. నిజానికి వలసపోయిన భారతీయుల్లోని కుల వివక్షను గుర్తించి దాన్ని కూకటివేళ్లతో పెకిలించటానికి రెండు దశాబ్దాలనాడే దళిత సంఘాల నాయకులు, మేధావులు గట్టి ప్రయత్నం చేశారు.
జాత్యహంకారానికి వ్యతిరేకంగా 2001లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ సదస్సులో కుల వివక్షను కూడా జాతివివక్షతో సమానంగా పరిగణించాలని వారు డిమాండ్ చేశారు. కానీ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం దాన్ని అడ్డుకో గలిగింది. అమెరికాలోని భారతీయులనూ, భారతీయ అమెరికన్లనూ ‘ఆదర్శనీయ మైనారిటీ’గా అభివర్ణి స్తుంటారు. ఎందుకంటే ఇతర దేశాలనుంచి అక్కడికి వలసవచ్చినవారితో పోలిస్తే ఈ ‘ఆదర్శనీయ మైనారిటీ’లో ఉన్నత చదువులు చదువుకునేవారూ, ఉన్నత స్థానాల్లో స్థిరపడినవారూ, రెండు చేతలా సంపాదించేవారూ, క్రమం తప్పకుండా ఆరోగ్య బీమా తీసుకునే స్తోమత గలవారూ అధికం.
అనేక బహుళజాతి సంస్థల సారథులు భారతీయులే. ‘స్టెమ్’(సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమే టిక్స్) విభాగాల్లో ఇతర గ్రూపులతో పోలిస్తే వీరి హవా ఎక్కువ. ఈమధ్యకాలంలో రాజకీయాల్లో సైతం సత్తా చాటే స్థితికి చేరుకున్నారు. అయితే అంతా బాగానే ఉందిగానీ... ఎవరూ వేలెత్తి చూపక ముందే అమెరికాలోని హిందూ మత సంస్థలు మేల్కొని కులవివక్షను రూపుమాపేందుకు తగిన కార్యాచరణకు పూనుకొనివుంటే ఈ ప్రతిష్ట మరింత ఇనుమడించేది.
అందుకు బదులు బుకాయింపులే వారి ఆయుధాలయ్యాయి. ఎంతకాలం ఈ నాటకం రక్తికడుతుంది? ఇవాళ సియాటల్ ఆలోచించినట్టే రేపన్నరోజున మరిన్ని నగరాలు, రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకోవచ్చు. వేరే దేశాలకూ విస్తరించవచ్చు. వివక్ష ఉన్నచోటల్లా ఎవరి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా దానికి ప్రతిఘటన సాగుతూనే ఉంటుంది. పరిణతితో ఆలోచిస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.
Comments
Please login to add a commentAdd a comment