అధికారాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి కమల్‌నాథ్ శుక్రవారం రాజీనామా చేయకతప్పలేదు. ఆరుగురు మంత్రులతోసహా 23మంది ఎమ్మెల్యేలు కర్ణాటకలోని రిసార్ట్‌కు వలసపోయి, కమల్‌నాథ్ నాయకత్వంలో తమకు విశ్వాసం లేదని పదిరోజులక్రితం ప్రకటించినప్పటినుంచీ రాష్ట్రం రాజకీయ సంక్షోభంలో పడిపోయింది. వారితో మాట్లాడటానికి, వెనక్కు తీసుకురావడానికి దిగ్విజయ్‌సింగ్ మొదలుకొని కొందరు కాంగ్రెస్ నాయ కులు చేసిన ప్రయత్నం ఫలించకపోగా...రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను నేరుగా కలిసి తమ నిర్ణయం ఇష్టపూర్వకమైనదని, దాని వెనక ఎవరి ఒత్తిళ్లూ లేవని చెప్పే సంప్రదాయంనుంచి సుప్రీం కోర్టు మినహాయింపు ఇవ్వడంతో కమల్‌నాథ్ ప్రభుత్వ పతనం ఖాయమైపోయింది. వారు నేరుగా రాలేకపోతే వీడియో కాల్ ద్వారా వారి అభిప్రాయాలు తీసుకోమని సుప్రీంకోర్టు సూచించగా స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి నిరాకరించారు.
రాజీనామాలను ధ్రువీకరించడానికి భోపాల్‌లో అడుగుపెట్టిన ప్పుడు ఆ ఎమ్మెల్యేలను ఒప్పించవచ్చని కాంగ్రెస్ భావించింది. తిరుగుబాటు చేసిన చాలామందిలో అంతర్మథనం మొదలైందని, సభలో ఓటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ సత్తా ఏమిటో తేలుతుందని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అంతకు కొన్ని రోజుల ముందు చెప్పడంలోని అంతరార్థం ఇదే. కానీ ధర్మాసనం నుంచి వచ్చిన వీడియో కాల్ ప్రతిపాదనతో కాంగ్రెస్ ఆశలు కల్లలయ్యాయి. ఆరుగురు మంత్రులూ శాసనసభ్యత్వాలకు చేసిన రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. మిగిలిన వారిపై ఒత్తిళ్లు లేవని స్పీకర్ వ్యక్తిగతంగా సంతృప్తి చెందాల్సివుంటుందని ఆయన తరఫు న్యాయ వాది చేసిన వాదనను ధర్మాసనం అంగీకరించలేదు. సభకు రావాలా వద్దా అనేది ఎమ్మెల్యేల ఇష్ట మని, హాజరుకావాలనుకున్నవారికి రక్షణ కల్పించాలని కర్ణాటక, మధ్యప్రదేశ్ డీజీపీలను ఆదేశిం చింది. పైగా సభలో ఓటింగ్ తప్ప మరేదీ చేపట్టడానికి వీల్లేదని, అది కూడా చేతులెత్తడం ద్వారా మాత్రమే జరగాలని, దీన్నంతటినీ వీడియో తీయాలని ఆదేశించింది.
అధికార పక్షాలనుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం, ప్రభుత్వాలను కూల్చడం మన దేశంలో కొత్తేమీ కాదు. అలా ఫిరాయించినవారిని వెనక్కు తీసుకురావడానికి అధికార పక్షాలనుంచి ప్రయత్నాలూ రివాజే. కానీ మధ్యప్రదేశ్ డ్రామాలో మొదటి సగం మాత్రమే జరిగింది. వెళ్లిన వారంతా కర్ణాటక విడిది నుంచి వెనక్కు రావడానికి, కాంగ్రెస్ పెద్దల్ని కలవడానికి నిరాకరించారు. రాజీనామాల సంగతిని ధ్రువీకరించడానికి స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు కూడా సిద్ధపడలేదు. ఫిరాయింపులకు పాల్పడితే శాసనసభ్యత్వం కోల్పోయేవిధంగా చట్టం తీసుకొచ్చిన కాంగ్రెసే అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించింది. ప్రభుత్వాల భవిత వ్యాన్ని రాజ్‌భవన్‌లే తేల్చే సంప్రదాయాన్ని కూడా ఆ పార్టీయే మొదలుపెట్టింది. ఇలా ప్రభుత్వాలను ఇష్టానుసారం బర్తరఫ్ చేయడానికి వీల్లేదని, బలాబలాలు చట్టసభల్లోనే తేలాలని ఎస్‌ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేశాక ఈ ధోరణి తగ్గింది.
అయితే పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇప్పుడు కేంద్రంలో ఎన్‌డీఏ కూటమికి నాయకత్వంవహిస్తున్న బీజేపీ ఆ ఎత్తుగడలకే కొత్త పద్ధతులు జోడించింది. 60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 42 స్థానాలు గెల్చుకున్న కాంగ్రెస్‌ను నాలుగేళ్లక్రితం సునాయాసంగా అధికారం నుంచి దించేయగలిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు తగి నన్ని స్థానాలు గెల్చుకోని గోవాలో కూడా అది అధికారం తెచ్చుకోగలిగింది. కర్ణాటకలో సరేసరి. అక్కడ 14 నెలలపాటు కొనసాగిన కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని నిరుడు జూలైలో కూల్చడంలోనూ ఈ కొత్త ఎత్తుగడలే అక్కరకొచ్చాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో సైతం బీజేపీ ఈ ఎత్తుగడలనే అనుసరించింది.
మధ్యప్రదేశ్ సంక్షోభం హఠాత్తుగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల పర్యవసానంగా జరిగినట్టు కనబడినా 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఇందుకు సంబంధించిన బీజాలు పడ్డాయి. అక్కడ ముగ్గురు నేతలు–దిగ్విజయ్‌సింగ్, కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా శిబి రాలుగా కాంగ్రెస్ చీలిపోయింది. ఎన్నికల సమయంలో కాబోయే సీఎం జ్యోతిరాదిత్యేనని రాహుల్ గాంధీ అందరిలోనూ అభిప్రాయం కలిగించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు గెల్చుకోగా, బీజేపీ 109కి పరిమితమైంది. సీఎం పీఠంపై ఎవరుండాలో మీరే నిర్ణయించాలని రాహుల్‌గాంధీని లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవంగా కోరినా, ఆయన ఆ పని చేయలేకపోయారు. కమల్‌నాథ్ వైపే సోనియా గాంధీ మొగ్గు చూపడం, అందుకోసం రాహుల్‌పై ఒత్తిడి తీసుకురావడం పర్యవసానంగానే ఇలా జరిగింది.
రాజీ మార్గంగా ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని జ్యోతిరాదిత్యను ఒప్పించినా, అయితే తమ వర్గంనుంచి కూడా మరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని దిగ్విజయ్‌సింగ్ డిమాండ్ చేశారు. దీంతో జ్యోతిరాదిత్య వెనకడుగు వేశారు. ఆయనకు కనీసం రాజ్యసభ స్థానాన్ని ఇస్తామని కూడా పార్టీ హామీ ఇవ్వలేకపోయింది. ముగ్గురు నేతల తీరువల్ల ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వున్నా అధిష్టానం మేల్కొనలేదు. ఈ పరిస్థితిని తనకనుకూలంగా మలుచుకోవడంలో బీజేపీ విజయం సాధించింది. ఆయన్ను తమ పార్టీలో చేర్చుకుని ఎంపీగా అవకాశమిచ్చింది.
ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు గనుక ఆ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం వుంది. అయితే వాటిల్లో ఎన్నిటిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోగలదన్నదాన్ని బట్టి మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ భవితవ్యం ఆధారపడివుంటుంది. పార్టీలో ఉన్నన్నాళ్లూ జ్యోతిరాదిత్యకు పొగబెట్టిన ఇద్దరు సీనియర్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్‌సింగ్‌లు ఆ ఉప ఎన్నికల్లో ఏమేరకు తమ సత్తా చాటుతారో చూడాల్సివుంది. అంతకన్నా ముందు మరింతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు పోకుండా చూడటం వారికి పెద్ద పరీక్ష.
Comments
Please login to add a commentAdd a comment