import duty increase
-
పాక్ వస్తువులపై 200% పన్ను పెంపు
న్యూఢిల్లీ: ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై మరిన్ని కఠిన చర్యలను కేంద్రం ప్రకటించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నట్లు ప్రకటించింది. 2017–18 సంవత్సరంలో ఆ దేశం నుంచి దిగుమతుల విలువ రూ.3,482.3 కోట్లు. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వాటిలో ముఖ్యంగా తాజా పండ్లు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ముడి ఖనిజాలు తదితరాలున్నాయి. తాజా చర్యతో భారత్‌లో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ‘పుల్వామా దాడికి ఆ దేశమే కారణమని భావిస్తూ అత్యంత ప్రాధాన్యం గల దేశం (ఎంఎఫ్ఎన్) హోదాను ఉపసంహరించుకున్నాం. దీంతోపాటు పాక్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నాం. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది’ అని ఆర్థిక మంత్రి జైట్లీ ట్విట్టర్లో ప్రకటించారు. పాక్ నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో ప్రధానమైన తాజా పండ్లపై ప్రస్తుతం 50% వరకు, సిమెంట్‌పై 7.5% కస్టమ్స్ డ్యూటీ ఉంది. -
మరోసారి దిగుమతి సుంకం పెంపు : ఇక ఆ వస్తువులు కాస్ట్లీ!
న్యూఢిల్లీ : గత నెలలో దాదాపు 19 వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎలక్ట్రానిక్ వస్తువులు, టెలికాం పరికరాలపై కూడా దిగుమతి సుంకాలను పెంచుతున్నట్టు ప్రకటించింది. చారిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోతున్న రూపాయిని కాపాడేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీంతో కరెంట్ అకౌంట్ లోటును పూడ్చాలని ప్రభుత్వం భావిస్తోంది. నేటి నుంచి పెరిగిన ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. గతనెలలోనే హై-ఎండ్ కన్జ్యూమర్ వస్తువులు అంటే వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషర్, ఫుట్‌వేర్, డైమాండ్స్, జెట్ ఫ్యూయల్‌పై దిగుమతి సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా పెంచిన దిగుమతి సుంకాలతో మరికొన్ని వస్తువులపై కూడా ధరలు పెరగనున్నాయి. ఇక నుంచి ఏయే వస్తువుల ఖరీదైనవిగా మారబోతున్నాయో ఓసారి చూద్దాం... మొబైల్ ఫోన్లు : బేస్ స్టేషన్లు, ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ ఇక్విప్మెంట్, ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ప్రొడక్ట్‌లు, ఐపీ రేడియోలు వంటి టెలికాం ఉత్పత్తులపై దిగుమతి సుంకం ప్రస్తుతమున్న 10 శాతం నుంచి 20 శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులపై కూడా లెవీని పెంచింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు మరింత పెరగనున్నాయి. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు : ఈ రెండు వస్తువులపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. వేసవికాలం అయిపోవడంతో, ఈ డ్యూటీ పెంపుతో ఎయిర్ కండీషనర్లపై అంత పెద్ద ప్రభావేమీ పడదని తెలుస్తోంది. వాషింగ్ మిషన్లు : 10 కేజీల సామర్థ్యం కంటే తక్కువ బరువున్న వాషింగ్ మిషన్లపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 20 శాతానికి ఎగిసింది. దాదాపు వాషింగ్ మిషన్ల ధరలు పెరగనున్నాయి. విమానాలు : సెప్టెంబర్27న ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై 5 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. ఈ సుంకం విధింపుతో, విమాన టిక్కెట్ల ధరలు ఖరీదైనవిగా మారబోతున్నాయి. మరోవైపు జెట్ ఫ్యూయల్‌పై ఎక్సైజ్ డ్యూటీని 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గింది. ఇది ఏవియేషన్ ఇండస్ట్రీకి కాస్త ఊరట. జువెల్లరీ : జువెల్లరీ ఆర్టికల్స్‌పై కూడా దిగుమతి సుంకాన్ని 5 శాతం పెంచింది. దీంతో ఇవి కూడా ధరలు పెరగనున్నాయి. శానిటరీ వేర్ : ప్లాస్టిక్‌తో రూపొందే బాత్, షవర్ బాత్, సింక్, వాషింగ్ బేసిన్లపై కూడా దిగుమతి సుంకాలను 10 శాతం నుంచి 15 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. ట్రావెల్ గేర్ : ట్రంకులు, సూట్‌కేసులు, ఎగ్జిక్యూటివ్ కేసులు, బ్రీఫ్‌కేసులు, ట్రావెల్ బ్యాగులపై కూడా దిగుమతి సుంకం 10 శాతం నుంచి 15 శాతం పెరిగింది. ప్లాస్టిక్ మెటీరియల్: బాక్సులు, కేసు, కంటైనర్లు, బాటిళ్ల డ్యూటీ 10 శాతం నుంచి 15 శాతం పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇదే విధమైన పెంపును టేబుల్‌వేర్, కిచెన్వేర్, ఇతర గృహోపకర ప్లాస్టిక్ వస్తువులపై కూడా పెంచింది. ఆఫీసు స్టేషనరీ, ఫర్నీచర్ ఫిట్టింగ్, డెకోరేటివ్ షీట్లు, బ్యాంగిల్స్ వంటి వాటిపై కూడా సుంకాలను కేంద్రం పెంచేసింది. -
బంగారం కాదు..ఎలక్ట్రానిక్ వస్తువులపై
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా-చైనా ట్రేడ్‌వార్, రోజు రోజుకూ క్షీణిస్తున్న రూపాయి విలువ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో విదేశీ వస్తువుల దిగుమతులను అడ్డుకునేందుకు కొన్నివస్తువులపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచాలనే ప్రతిపాదను పరిశీలిస్తోంది. ముఖ్యంగా విలువైన మెటల్ బంగారంపై ఈ పెంపు ఉండవచ్చని ఎనలిస్టులు అంచనావేశారు. అయితే ఇపుడు దీనికి భిన్నంగా బంగారాన్ని దిగుమతి సుంకం పెంపు నించి మినహాయింపునిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బంగారంపై కుండా విలువైన రాళ్లను, కొన్ని రకాల ఉక్కు, ఎలక్ర్టానిక్ వస్తువులపై దిగుమతి సుంకం వేయాలని కేంద్ర నిర్ణయించింది. అక్రమ రవాణాను నివారించడానికి బంగారంను ఈ పెంపు నుంచి మినహాయించనున్నాని ఆర్థిక శాఖ అధికారి సోమవారం విలేకరులకు చెప్పారు. వీటితో పాటు విలువైన రాళ్ళపై కూడా ఈ పన్ను విధించే అవకాశముందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి ఒకరు తెలిపారు. జాబితా తయారవుతోందని, త్వరలోనే తుది రూపం ఇచ్చి విడుదల చేస్తామని ఈ వర్గాలు తెలిపాయి. డాలర్‌తో రూపాయి విలువ పడిపోతున్న నేపథ్యంలో కొన్ని రకాల వస్తువులు అంటే నిత్యావసరం కాని విలువౌన వస్తువులపై దిగుమతి సుంకం వేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇదే సమయంలో బంగారంపై కూడా సుంకం వేయాలని ప్రతిపాదనను పరిశీలించింది. మరోవైపు చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఈరోజు(సెప్టెంబరు 24, 2018) నుంచి అమెరికా సుంకం అమలువుతున్న సంగతి తెలిసిందే. -
రూపీ కోసం వాటిపై సుంకాలు పెంపు
న్యూఢిల్లీ : రోజు రోజుకు అంతకంతకు క్షీణిస్తున్న రూపాయిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. కొన్ని స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 15 శాతం పెంచాలని స్టీల్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఈ రేట్లు 5 శాతం నుంచి 12.5 శాతం మధ్యలో ఉన్నాయి. దీంతో రూపాయికి కాస్త మద్దతు ఇవ్వొచ్చని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనతో అవసరం లేని దిగుమతులను తగ్గించి, డాలర్లు తరలి వెళ్లడాన్ని ఆపివేయొచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయంపై వాణిజ్య మంత్రిత్వ శాఖతో నేడు చర్చోపచర్చలు జరుపనున్నారు. దేశీయ స్టీల్ ఉత్పత్తిని ప్రోత్సహించి, మేకిన్ ఇండియాకు ఊతమిచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడనున్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై వెంటనే స్పందించేందుకు స్టీల్, ట్రేడ్ మంత్రిత్వ శాఖలు అంగీకరించలేదు. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో, నికర స్టీల్ దిగుమతులు రెండేళ్లలో తొలిసారి 2.1 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇవి 15 శాతం పెంపు. మార్చితో ముగిసిన 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్టీల్ దిగుమతులు 8.4 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. వీటిలో 45 శాతం జపాన్, దక్షిణ కొరియా నుంచి వచ్చినవే. ఆయా దేశాలతో భారత్‌కు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలున్నాయి. నార్త్ ఆసియన్ దేశాల నుంచి స్టీల్‌ను దిగుమతి చేసుకుంటే, ఎలాంటి సుంకాలు వర్తించవు. కానీ ఇతర స్టీల్ సరఫరా దేశాలు చైనా, దక్షిణాఫ్రికా, మలేషియా, రష్యా, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మాత్రం సుంకాలను భరించాల్సి ఉంటుంది. స్టీల్‌తో పాటు ప్రభుత్వం బంగారం, హై-ఎండ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆంక్షలు విధించేందుకు చూస్తోంది. భారత్, ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం కొనుగోలుదారు. ఆగస్టులో దీని దిగుమతులు 90 శాతం పెరిగి, 3.64 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
సుంకాల యుద్ధం
అమెరికా ప్రారంభించి స్వపర భేదం లేకుండా ఎడాపెడా సాగిస్తున్న సుంకాల రణం రోజులు గడుస్తున్నకొద్దీ ముదిరే సూచనలు కనబడుతున్నాయి. తమ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న అద నపు సుంకాలకు ప్రతీకారంగా చైనా అదే భాషలో జవాబివ్వడం మొదలుపెట్టింది. 28 సభ్య దేశా లున్న యూరొపియన్ యూనియన్ కూడా అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాల విధింపును ప్రకటించింది. తాజాగా మన దేశం కూడా ఈ రణ రంగంలోకి దూకింది. అమెరికా నుంచి దిగుమ తయ్యే పప్పులు, ఉక్కు, ఇనుము తదితర 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచుతూ నోటి ఫికేషన్ విడుదల చేసింది. మనం ఎగుమతి చేసే ఉక్కుపై 25 శాతం, అల్యూ మినియం ఉత్పత్తు లపై 10శాతం చొప్పున అమెరికా సుంకాలు పెంచినందుకు ప్రతిగా మన దేశం ఈ నిర్ణయం తీసు కుంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి మొదలైనప్పటినుంచీ ఇతర దేశాలతోపాటు మన దేశంపై కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా హార్లే–డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై అధిక సుంకాలు విధించడాన్ని ప్రస్తావిస్తున్నారు. అమెరికాకు నష్టం కలిగిస్తున్న ఈ ధోరణిని విడ నాడాలని చెప్పినా ప్రధాని నరేంద్ర మోదీ వినిపించుకోవడంలేదని ఒక సందర్భంలో ఆయన్ను హేళన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడారు. మన దేశం ఇచ్చే సబ్సిడీలపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ముందు అమెరికా ఫిర్యాదులు చేస్తూనే ఉంది. నిజానికి అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తులపై మన దేశం నిషేధం విధించినప్పుడు, ఇక్కడి సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తిదారు లకు సబ్సిడీలిచ్చి నప్పుడు అప్పటి ఒబామా ప్రభుత్వం డబ్ల్యూటీఓ ముందు పంచాయతీ పెట్టింది. ఆ రెండు కేసుల్లోనూ మన దేశం వాదన వీగిపోయింది. అనంతరకాలంలో మన దేశం కూడా అమెరికా అను సరిస్తున్న విధానాలపై ఫిర్యాదు చేసింది. అదింకా తేలవలసి ఉంది. కేంద్ర వాణిజ్యమంత్రి సురేశ్ ప్రభు నెలాఖరులో అమెరికా పర్యటించినప్పుడు సుంకాల పెంపు అంశంపై రెండు దేశాల మధ్యా చర్చలు జరిగే అవకాశం ఉంది. బహుశా అందుకే కావొచ్చు... హార్లే–డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై ఉన్న సుంకాలను కూడా పెంచబోతున్నట్టు డబ్ల్యూటీఓకు మన దేశం తెలియజేసినా నోటిఫికేష న్లో దాని ప్రస్తావన లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా, భారత్‌లపైన మాత్రమే కాదు... పొరుగునున్న మెక్సికో, కెనడా, యూరప్‌లోని వివిధ దేశాలనూ లక్ష్యంగా చేసుకుని సుంకాలు పెంచారు. వారూ తమకు చేతనైన రీతిలో ఎదురు దాడులు చేస్తున్నారు. హార్లే–డేవిడ్సన్ మోటార్ సైకిళ్లతోసహా కొన్ని అమెరికా ఉత్పత్తులపై శుక్రవారం నుంచి 25 శాతం అదనపు సుంకాలు విధిస్తామని యూరొపియన్ కమిషన్ రెండురోజులక్రితం ప్రకటించింది. ఒకప్పుడు ఇదే అమెరికా స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాన్ని తలకెత్తుకుని, తన ప్రయోజనాలకు అనుగుణంగా ఇతర సంపన్న రాజ్యాలను కూడగట్టి ప్రపంచీకరణ మత్తులో ముంచెత్తితే వర్థమాన దేశాల అధినేతలందరూ దానికి సాగిల బడ్డారు. ప్రపంచీకరణ పేదరికాన్ని పారదోలుతుందని, ప్రతి ఒక్కరూ సంపన్నులు కావడానికి దోహదపడుతుందని ప్రజానీకాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అందుకు విరుద్ధంగా దేశదేశాల్లోని సంపద అగ్రరాజ్యాల వద్ద పోగుబడింది. చెప్పాలంటే అగ్రరాజ్యాల్లోని కార్పొరేట్ సంస్థల ఖజానాలకు చేరింది. సాధారణ కార్మికులు, చేతివృత్తులవారు, మధ్యతరగతి ప్రజానీకం పూటగడవడమెలాగో తెలియక అవస్థలకు లోనయ్యారు. కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక అసమా నతలు పెరిగిపోయాయి. పర్యావరణం దెబ్బతింది. సామాజిక సంబంధాలు, కుటుంబ సంబం ధాలు విచ్ఛిన్నమయ్యాయి. ప్రభుత్వాలు సామాజిక భద్రత పథకాలను క్రమేపీ తగ్గించుకుంటూ పోతున్నాయి. ఇంతకాకపోయినా అమెరికాతో సహా సంపన్నదేశాల్లోనూ కింది స్థాయి ప్రజానీకం ఇబ్బందులకు లోనయ్యారు. వారి ఆగ్రహావేశాలే డోనాల్డ్ ట్రంప్ వంటి నేతలను అధికార పీఠా నికెక్కించాయి. అందుకే చైనా, భారత్, కొన్ని యూరప్ దేశాల ఉక్కు ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించి స్వదేశీ పరిశ్రమలకు ఊపునివ్వాలని ట్రంప్ భావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో భాగంగానే తాను వివిధ దేశాలతో అమెరికాకున్న వాణిజ్య లోటును సరిచేయడానికి ప్రయత్నిస్తున్నానని, అందుకు సిద్ధపడని దేశాలకు సంబంధిం చిన ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నానని ట్రంప్ చెప్పుకుంటున్నారు. కానీ ఈ చర్యల పర్యవసానంగా ఆ దేశాలనుంచి ఎదురయ్యే ప్రతిఘటన అమెరికాను కూడా దెబ్బతీస్తుందన్న సంగతిని ఆయన గుర్తించడం లేదు. ఇంతవరకూ ట్రంప్ చైనాకు చెందిన 1,102 ఉత్పత్తులపై 5,000 కోట్ల డాలర్ల మేర సుంకాలు పెంచారు. అందుకు ప్రతీకారంగా చైనా కూడా అదే స్థాయిలో సుంకాలు పెంచగా, దానికి జవాబుగా మరికొన్ని చైనా ఉత్పత్తులపై 20,000 కోట్ల డాలర్లమేర సుంకాలు పెంచడానికి ట్రంప్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సుంకాల పెంపు వ్యవహారం పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధంగా వెనువెంటనే మారక పోయినా ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను క్రమేపీ మాంద్యంలోకి దించే ప్రమాదం ఉంది. ప్రపంచాన్ని ప్రస్తుతం అనిశ్చితి అలుముకుంది. యూరొపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం, ఇతర సభ్య దేశాలు కూడా ఊగిసలాడటం, యూరో కరెన్సీ సంక్షోభం, వచ్చిపడుతున్న వలసలు పాశ్చాత్య ప్రపం చానికి కునుకులేకుండా చేస్తున్నాయి. తనను గెలిపించిన వర్గాలకు ఎంతో కొంత ప్రయోజనం కలి గించి అమెరికా రాజకీయ రంగంలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవాలని ట్రంప్ ఉబలాటపడుతు న్నారు. రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచు కునే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి ఇన్నేళ్లుగా రాజ్యమేలుతున్న నయా ఉదారవాద విధానాలు పెను కుదుపునకు లోనవుతున్నాయి. పర్యవసానంగా వెంటనే కాకపోయినా దేశాలన్నీ మున్ముందు తమ తమ వాణిజ్యబంధాలను పునర్నిర్వచించుకుని, కొత్త దోవలు వెదుక్కోక తప్పకపోవచ్చు. -
బంగారం దిగుమతి సుంకం పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ఇప్పటి వరకు ఉన్న సుంకం 8 శాతంను 10 శాతానికి పెంచింది. వెండిపై కూడా దిగుమతి సుంకాన్ని పెంచింది. వెండిపై 6 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. రెండేళ్లలో బంగారంపై సుంకంను 2 నుంచి 10 శాతానికి పెంచారు. బంగారం వాడకం తగ్గించడంతోపాటు రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే చర్యలలో భాగంగా ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచింది. సుంకం పెంపు వార్తతో పసిడి ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం ఎంసిఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 28,963 రూపాయలు ఉంది. కేజీ వెండి ధర 46,480 రూపాయలకు చేరింది.