న్యూఢిల్లీ : గత నెలలో దాదాపు 19 వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎలక్ట్రానిక్ వస్తువులు, టెలికాం పరికరాలపై కూడా దిగుమతి సుంకాలను పెంచుతున్నట్టు ప్రకటించింది. చారిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోతున్న రూపాయిని కాపాడేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీంతో కరెంట్ అకౌంట్ లోటును పూడ్చాలని ప్రభుత్వం భావిస్తోంది. నేటి నుంచి పెరిగిన ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. గతనెలలోనే హై-ఎండ్ కన్జ్యూమర్ వస్తువులు అంటే వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషర్, ఫుట్‌వేర్, డైమాండ్స్, జెట్ ఫ్యూయల్‌పై దిగుమతి సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా పెంచిన దిగుమతి సుంకాలతో మరికొన్ని వస్తువులపై కూడా ధరలు పెరగనున్నాయి.
ఇక నుంచి ఏయే వస్తువుల ఖరీదైనవిగా మారబోతున్నాయో ఓసారి చూద్దాం...
మొబైల్ ఫోన్లు : బేస్ స్టేషన్లు, ఆప్టికల్ ట్రాన్స్‌పోర్ట్ ఇక్విప్‌మెంట్, ఆప్టికల్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ ప్రొడక్ట్‌లు, ఐపీ రేడియోలు వంటి టెలికాం ఉత్పత్తులపై దిగుమతి సుంకం ప్రస్తుతమున్న 10 శాతం నుంచి 20 శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులపై కూడా లెవీని పెంచింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు మరింత పెరగనున్నాయి.
ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు : ఈ రెండు వస్తువులపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. వేసవికాలం అయిపోవడంతో, ఈ డ్యూటీ పెంపుతో ఎయిర్ కండీషనర్లపై అంత పెద్ద ప్రభావేమీ పడదని తెలుస్తోంది.
వాషింగ్ మిషన్లు : 10 కేజీల సామర్థ్యం కంటే తక్కువ బరువున్న వాషింగ్ మిషన్లపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 20 శాతానికి ఎగిసింది. దాదాపు వాషింగ్ మిషన్ల ధరలు పెరగనున్నాయి.
విమానాలు : సెప్టెంబర్27న ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై 5 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. ఈ సుంకం విధింపుతో, విమాన టిక్కెట్ల ధరలు ఖరీదైనవిగా మారబోతున్నాయి. మరోవైపు జెట్ ఫ్యూయల్‌పై ఎక్సైజ్ డ్యూటీని 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గింది. ఇది ఏవియేషన్ ఇండస్ట్రీకి కాస్త ఊరట.
జువెల్లరీ : జువెల్లరీ ఆర్టికల్స్‌పై కూడా దిగుమతి సుంకాన్ని 5 శాతం పెంచింది. దీంతో ఇవి కూడా ధరలు పెరగనున్నాయి.
శానిటరీ వేర్ : ప్లాస్టిక్‌తో రూపొందే బాత్, షవర్ బాత్, సింక్, వాషింగ్ బేసిన్‌లపై కూడా దిగుమతి సుంకాలను 10 శాతం నుంచి 15 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది.
ట్రావెల్ గేర్ : ట్రంకులు, సూట్‌కేసులు, ఎగ్జిక్యూటివ్ కేసులు, బ్రీఫ్‌కేసులు, ట్రావెల్ బ్యాగులపై కూడా దిగుమతి సుంకం 10 శాతం నుంచి 15 శాతం పెరిగింది.
ప్లాస్టిక్ మెటీరియల్: బాక్సులు, కేసు, కంటైనర్లు, బాటిళ్ల డ్యూటీ 10 శాతం నుంచి 15 శాతం పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇదే విధమైన పెంపును టేబుల్‌వేర్, కిచెన్‌వేర్, ఇతర గృహోపకర ప్లాస్టిక్ వస్తువులపై కూడా పెంచింది. ఆఫీసు స్టేషనరీ, ఫర్నీచర్ ఫిట్టింగ్, డెకోరేటివ్ షీట్లు, బ్యాంగిల్స్ వంటి వాటిపై కూడా సుంకాలను కేంద్రం పెంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment