టీవీ ధరలు దిగొస్తాయ్‌! | Government Scraps Import Duty On Open Cell TV Panel | Sakshi
Sakshi News home page

టీవీ ధరలు దిగొస్తాయ్‌!

Published Thu, Sep 19 2019 2:26 AM | Last Updated on Thu, Sep 19 2019 2:27 AM

Government Scraps Import Duty On Open Cell TV Panel - Sakshi

న్యూఢిల్లీ : దేశీయంగా టీవీల తయారీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఓపెన్‌ సెల్‌ టీవీ ప్యానెళ్లపై 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. దీంతో వీటి దిగుమతుల ఆధారంగా దేశీయంగా తయారీ మరింత పెరుగుతుందని కేంద్రం అంచనా. దిగుమతి సుంకం రద్దుతో టీవీ తయారీ ఖర్చులు 3 శాతం వరకు తగ్గుతాయి. అలాగే, ఓపెన్‌ సెల్‌ టీవీ ప్యానెళ్ల తయారీలో వినియోగించే చిప్‌ ఆన్‌ ఫిల్మ్, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్‌ (పీసీబీఏ), సెల్‌ (గ్లాస్‌బోర్డు/సబ్‌స్ట్రేట్‌)పైనా దిగుమ తి సుంకాన్ని రద్దు చేస్తు్నట్టు  ఆర్థిక శాఖ ప్రకటించింది.

డిమాండ్‌ తగ్గడంతో దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని పరిశ్రమ కొంత కాలంగా కోరుతోంది. 15.6 అంగుళాలు అంతకుమించిన కూడిన ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీ ప్యానళ్లలో ఓపెన్‌ సెల్‌లపై ప్రస్తుతం 5% దిగుమతి సుంకం అమల్లో ఉండగా, ఇకపై ఉండదని బుధవారం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రముఖ జపనీస్‌ కంపెనీ ప్యానాసోనిక్‌ మాత్రం ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తామని ప్రకటించింది. 3–4% వరకు ధరలు తగ్గుతాయని ప్రకటించింది. ఎల్‌ఈడీ టీవీల తయారీ వ్యయంలో 60–70% ఓపెన్‌సెల్‌ ప్యానళ్లకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేశంలోని టీవీ తయారీ కంపెనీలు చాలావరకు వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. 2017 జూన్‌లో టీవీ ప్యానెళ్లపై కేంద్రం ఈ దిగుమతి సుంకాన్ని ప్రవేశపెట్టింది. దేశీ టీవీ మార్కెట్‌ రూ.22,000 కోట్లుగా ఉంటుంది. 

సానుకూల ఫలితాలు.. 
కేంద్రం నిర్ణయం సానుకూలమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ ఎల్రక్టానిక్స్‌ గతేడాది భారత్‌లోని తన టీవీల తయారీ యూనిట్‌ను మూసేసి, వియత్నాంకు తరలిపోయింది. దీనికి ప్రధాన కారణం ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీయే. దేశీయంగా తగ్గిన వినియోగ డిమాండ్‌ టీవీ సెట్లపైనా ప్రభావం చూపిస్తోంది. ఒకవైపు మందగమనం, మరోవైపు పెరిగిన పోటీ, పెద్ద టీవీలపై జీఎస్టీ రేటు ప్రతికూలతలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం తయారీదారులకు ఉపశమనం ఇచ్చేదే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. 

పరిశ్రమ హర్షాతిరేకం 
సరిగ్గా పండుగల సీజన్‌కు ముందు టీవీ ప్యానెళ్లపై దిగుమతి సుంకాన్ని కేంద్రం తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం పరిశ్రమను సంతోషానికి గురి చేసింది. ప్రభుత్వ నిర్ణయం టీవీల తయారీ వ్యయాన్ని తగ్గించడంతోపాటు దేశీయ తయారీని పెంచేందుకు సాయపడుతుందని పేర్కొంది. ‘‘పరిశ్రమ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. టీవీ తయారీపై ఒత్తిళ్లను ఇది తగ్గిస్తుంది. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసినట్టయితే పరిశ్రమలో డిమాండ్‌ పుంజుకుంటుంది. గతేడాది టీవీల అమ్మకాలు ఫ్లాట్‌గా నమోదైన తర్వాత సరైన సమయంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచి్చంది. టీవీల తయారీ వ్యయంలో అధిక భాగం ఓపెన్‌ సెల్స్‌పైనే వెచి్చంచాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పరిశ్రమ వినియోగదారులకు ఈ ప్రయోజనాన్ని బదిలీ చేయగలదు. ధరలు 3–4 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది’’ అని ప్యానాసోనిక్‌ ఇండియా దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్‌ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం టీవీల ధరలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 32 అంగుళాలపైన టీవీలపై జీఎస్టీ రేటును ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని మనీష్‌ శర్మ కోరారు. అయితే, పండుగల సమయానికి రేట్ల తగ్గింపు అందుబాటులోకి రాకపోవచ్చన్నారు. పండుగల కోసం ఇప్పటికే స్టాక్స్‌ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. నూతనంగా దిగుమతి చేసుకునే వాటిపైనే దీని ప్రభావం 3 శాతం వరకు ఉంటుందన్నారు.

మేకిన్‌ ఇండియాకు ఊతం..
ప్రభుత్వ నిర్ణయం భారత్‌లో తయారీని పెంచుతుందని ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌ ఇండియా పేర్కొంది. ‘‘ఇది ఎంతో సానుకూల పరిణామం. ఇది భారత్‌లో తయారీ (మేకిన్‌ ఇండియా)కి ఎంతో ప్రోత్సాహంగా నిలుస్తుంది’’ అని ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌ ఇండియా డైరెక్టర్‌ యూంచల్‌పార్క్‌ అన్నారు. ప్రభుత్వం దిగుమతి సుంకాలను తొలగించడం భారత్‌లో టీవీల తయారీని పెంచాలన్న తమ ప్రయత్నాలకు సాయపడుతుందని సోనీ ఇండియా సైతం అభివరి్ణంచింది. ‘‘ప్రభుత్వ మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి సోనీ ఇండియా చాలా కాలంగా కట్టుబడి ఉంది. టీవీ ఓపెన్‌సెల్‌ ప్యానళ్లపై దిగుమతి సుంకాన్ని ఉపసంహరించడం స్థానిక తయారీకి బలమైన ఊతమిస్తుంది. ఈ దిశగా మేం మరిన్ని చర్యలు తీసుకునేందుకు వీలు పడుతుంది’’ అని సోనీ ఇండియా ఎండీ సునీల్‌ నయ్యర్‌ తెలిపారు. పరిశ్రమ ఈ నిర్ణయం కోసం ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నట్టు హయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌బ్రగంజ అన్నారు. వృద్ధిని ప్రోత్సహించే ఏ చర్య అయినా స్వాగతించతగినదేనన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement